‘కెనడా వెళ్లడం అవసరమా’ అనే ప్రశ్న ఎందుకు వినిపిస్తోంది? భారతీయ విద్యార్థుల వలసలు ఎందుకు తగ్గుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
దేశ రాజధాని దిల్లీలోని ఓ విదేశీ విద్య కన్సల్టెన్సీలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కూర్చుని ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా యూనివర్సిటీల బ్రోషర్లను తిరగేస్తున్నారు.
అయితే వాటిలో ఒకప్పుడు విదేశీ విద్యకు అత్యంత ప్రాధాన్యం పొందిన కెనడా మాత్రం కనిపించడం లేదు.
"2023 వరకు మా వద్ద నుంచి వెళ్లే దరఖాస్తుల్లో ఎక్కువ భాగం కెనడాకే ఉండేవి" అని కన్సల్టెన్సీ నడుపుతున్న శోభిత్ ఆనంద్ చెప్పారు. ఈ కన్సల్టెన్సీ విద్యార్థులకు విదేశీ వర్సిటీలలో ప్రవేశాలు, వీసా దరఖాస్తుల విషయంలో సాయం చేస్తుంది.
"కానీ ఇప్పుడు వాటిలో దాదాపు 80 శాతం తగ్గిపోయాయి" అని చెప్పారు శోభిత్ ఆనంద్.
"ఇప్పుడు చాలామంది కెనడాకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. పైగా వీసా తిరస్కరణ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది" అన్నారు శోభిత్.


ఫొటో సోర్స్, AFP via Getty Images
భారతీయ విద్యార్థుల సంఖ్య ఎందుకు పడిపోయింది?
కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయుల వాటా 2023లో 51.6శాతంగా ఉండగా, 2025 సెప్టెంబర్ నాటికి అది కేవలం 8.1శాతానికి పడిపోయిందని కెనడా ఆడిటర్ జనరల్ గత నెల పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వీసా, వలసల ఆంక్షలు, పెరిగిన జీవన వ్యయం, 2023లో ఏర్పడిన దౌత్య సంక్షోభం ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీశాయి (ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగైంది).
చాలా ఏళ్లపాటు కెనడా భారత్‌లోని మధ్య తరగతి కుటుంబాలకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉండేది. సాధారణ విద్యార్థులు కూడా విదేశీ విద్యను అభ్యసించి, చివరకు అక్కడే స్థిరపడేందుకు కెనడాలోని ప్రైవేటు కళాశాలలు నమ్మదగిన మార్గంగా కనిపించేవి.
ఇందుకు ఒక సరళమైన మార్గం ఉండేది. రెండు లేదా మూడు సంవత్సరాల వృత్తివిద్యా కోర్సులో చేరడం, గ్రాడ్యుయేషన్ తరువాత ఉద్యోగం పొందడం, ఆ తరువాత కొన్నేళ్లలోనే శాశ్వత నివాసం (పర్మినెంట్ రెసిడెన్సీ-పీఆర్) కోసం దరఖాస్తు చేయడం. ఈ మొత్తం ప్రక్రియ సాధారణంగా ఐదేళ్ల వరకు పట్టేదని నిపుణులు చెబుతున్నారు.
అది ఒక దశ వరకు బాగా పనిచేసింది. తరువాత పరిస్థితి మారిపోయింది.
విధానపరమైన మార్పులు, ఆర్థిక ఒత్తిళ్లు ఈ పరిణామానికి కారణమయ్యాయి.
అండర్ గ్రాడ్యుయేట్, డిప్లోమా ప్రోగ్రామ్స్‌లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలకు రెండేళ్ల పరిమితి విధిస్తూ, ఏడాదికి సుమారు 3.5 లక్షల స్టడీ పర్మిట్స్కే అనుమతి ఇస్తామని 2024 ప్రారంభంలో కెనడా ప్రకటించింది (పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులకు ఇది వర్తించదు).
ఇది భారతీయ విద్యార్థులకు పెద్ద దెబ్బగా మారింది.
అదే సమయంలో జీవన వ్యయం పెరిగిపోవడం, ఉద్యోగాలు దొరకడం కష్టమవడం పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా మార్చాయి. ప్రధాన నగరాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయి. దీనికితోడు ఆర్థిక నిబంధనలు కూడా కఠినతరం అయ్యాయి.
కెనడాలో చదవడానికి, జీవించడానికి అవసరమైన నిధుల ధృవీకరణగా భావించే గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ (జీఐసీ) మొత్తాన్ని కూడా రెండింతలు చేశారు. గతంలో పదివేల కెనడా డాలర్లుగా ఉన్న ఈ మొత్తం 2024లో 20,000 కెనడా డాలర్లకుపైగా పెంచారు.
"చాలా కుటుంబాలకు అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం కష్టమే. పైగా వీసా తిరస్కరణ ప్రమాదం ఉండటంతో వారు వెనకాడుతున్నారు. ఇది ఒక పెద్ద అడ్డంకిగా మారింది’’ అని ఎడ్వైజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి చెందిన సుశీల్ సుఖ్వాని అన్నారు.
స్టడీ వీసా పొందడం కూడా కష్టంగా మారిందని కన్సల్టెంట్లు చెబుతున్నారు.
కెనడాలో స్టడీ పర్మిట్ తిరస్కరణలు 2023లో 38శాతం ఉండగా, 2024లో 52 శాతానికి పెరిగాయని అంతర్జాతీయ విద్యార్థుల ప్రవాహంపై దృష్టి సారించే ఐసీఈఎఫ్ మానిటర్ తెలిపింది. ఖర్చులపై జాగ్రత్తగా వ్యవహరించే భారత్ వంటి దేశాల్లో విదేశీ విద్య అనేది జాగ్రత్తగా చేసే ఆర్థిక ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకోవడానికి కుటుంబాలు అంత సిద్ధంగా లేవు.
దీంతో ఇప్పుడు కెనడాకు ఎలా వెళ్లాలి అనే ప్రశ్న , అసలు వెళ్లాలా వద్దా అన్న ప్రశ్నగా మారింది.
"నిజంగా భయం ఉంది. అక్కడికి వెళ్లగలిగినా, స్థిరపడగలరా అన్న సందేహం ఉంది" అని ఆనంద్ చెప్పారు.
స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (ఎస్డీఎస్)గా పిలిచే వేగవంతమైన వీసా విధానం గురించి కూడా కెనడా ఆడిటర్ జనరల్ నివేదిక ఆందోళనలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేశారు. భారతీయ దరఖాస్తుదారుల్లో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇందులో నిర్దిష్ట ఆర్థిక, భాషా అర్హతలు కలిగిన వారికి వీసా దరఖాస్తులు త్వరగా ప్రాసెసయ్యే అవకాశం ఉండేది.
మోసపూరిత దరఖాస్తులు, తరగతులకు హాజరు కాకపోవడం, ఆశ్రయం కోసం దరఖాస్తులు పెరగడం వంటి సమస్యలను అధికారులు గుర్తించినప్పటికీ, భారతీయుల కోసం ఎస్డీఎస్ కింద ఆమోద శాతం 2022లో 61 శాతం నుంచి 2024లో 98 శాతానికి పెరిగింది. అయితే 2024 చివరినాటికి ఈ పథకాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి పరిశీలన మరింత కఠినతరమైంది.
''కెనడాలోకి ప్రవేశించడానికి నిజమైన విద్యార్థులు కానివారు ఈ పథకాన్ని లక్ష్యంగా చేసుకున్నారు'' అంటూ ఆ నివేదిక చెప్పింది. అయితే ఇందులో ఏ దేశం పేరు ప్రస్తావించనప్పటికీ దాదాపుగా ఆమోదం పొందిన ఎస్డీఎస్ దరఖాస్తులన్నీ భారత్ నుంచి వచ్చినవే అని గుర్తించింది.

ఫొటో సోర్స్, Getty Images
గ్రాడ్యుయేట్లు ఎక్కువ - ఉద్యోగాలు తక్కువ
కరోనా మహమ్మారి తరువాత అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో భారీ పెరుగుదల మొదలైంది. దీనిని ''అంతర్జాతీయ విద్యార్థుల బూమ్''గా నిపుణులు వర్ణించారు. ఆ సమయంలో అనేక ప్రైవేటు కళాశాలలు విస్తరించాయి. ఆ సమయంలో కెనడాలోకి రికార్డుస్థాయిలో విదేశీ విద్యార్థులు వచ్చారు.
కానీ ఈ విద్యాసంస్థల్లో ఎక్కువ సంస్థలు పరిమితమైన విద్యావిలువలు అందిస్తూ, భారీగా ఆదాయంపై ఆధారపడిన వ్యాపారంగా మారాయి అని నిపుణులు చెప్పారు.
గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరిగినంతగా, ఉద్యోగ అవకాశాలు పెరగలేదు. దీంతో అనేకమంది విద్యార్థులు విదేశాలలో చదువుకోసం చేసిన భారీ ఖర్చును తిరిగి పొందలేకపోయారు.
రెండేళ్ల కిందట కెనడాకు వెళ్లిన ఓ విద్యార్థి తన కోర్సు పూర్తయిన తరువాత ఓ స్థిరమైన ఉద్యోగం పొందేందుకు తీవ్రంగా కష్టపడినా, ఫలితం లేకపోవడంతో ఆ 24 ఏళ్ల కుర్రాడు పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవాల్సి వచ్చిందని దిల్లీలోని ఆనంద్ గుర్తు చేసుకున్నారు.
''అతను తన ఖర్చులను కూడా సంపాదించుకోలేని పరిస్థితి'' అని ఆనంద్ చెప్పారు. భారత్‌కు తిరిగొచ్చిన ఆ విద్యార్థి ఇప్పుడు పనికోసం ఎదురుచూస్తున్నాడు.
ఆ విద్యార్థి కథ ఓ విస్తృత కోణాన్ని ప్రతిబింబిస్తోంది. వీసా పరిమితి అండర్ గ్రాడ్యుయేట్ కళాశాలలను తీవ్రంగా దెబ్బతీసింది. అత్యున్నత విద్యాసంస్థలు, యూనివర్సిటీలు తక్కువగా ప్రభావితమయ్యాయి.
మెక్‌గిల్ యూనివర్సిటీ అధ్యక్షుడు దీప్ సైనీ బీబీసీతో మాట్లాడుతూ, భారతీయ విద్యార్థులు సాధారణంగా రెండు వర్గాలుగా ఉంటారని చెప్పారు.
"ఒక వర్గం పూర్తిగా విద్యాపరమైన లక్ష్యాలతో ఉంటుంది. వారు నాణ్యమైన విద్య కోసం కెనడా, అమెరికా లేదా యూరప్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేస్తారు. మరో వర్గం విద్యను ప్రధానంగా వలస మార్గంగా చూస్తుంది. వారు సాధారణంగా చిన్న కళాశాలల్లో చేరుతారు" అని ఆయన తెలిపారు.
ఈ తేడా వల్లే కఠిన చర్యల ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడిందో అర్థమవుతుంది. కెనడా వీసా ఆంక్షలు ప్రధానంగా తక్కువ ఖర్చుతో, సులభ మార్గంగా స్థిరనివాసం పొందాలనే ఉద్దేశంతో చిన్న, అంతగా ప్రసిద్ధి లేని కళాశాలల్లో చేరే విద్యార్థులపై దృష్టి సారించాయి. కేవలం చదువు కోసమే వచ్చే వారిపై కాదు.
అకడమిక్ లక్ష్యాలతో వచ్చే విద్యార్థులను ఆకర్షించే మెక్ గిల్ యూనివర్సిటీ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఈ ప్రభావానికి ఎక్కువగా గురికాలేదు.
కఠినమైన వీసా నియమాలు, దౌత్య ఉద్రిక్తతల కారణంగా తమ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాల్లో 2023 తరువాత స్వల్ప తగ్గుదల కనిపించిందని సైనీ తెలిపారు. అయితే దీనిని ఆయన "ప్రత్యక్ష ప్రభావం కంటే పరోక్ష ప్రభావం"గా పేర్కొన్నారు.
ప్రస్తుతం మెక్‌గిల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య, ముఖ్యంగా భారతీయుల సంఖ్య, మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, EPA
దౌత్య సంబంధాల మెరుగుదల
కెనడా,భారత్ మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో కొంత ఆశ కనిపిస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నే భారత్‌ను సందర్శించారు. ఆయనతో పాటు కెనడాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు కూడా వచ్చారు.
కొత్త విద్యా భాగస్వామ్యాలు, స్కాలర్షిప్ కార్యక్రమాల ద్వారా ఇరుదేశాల మధ్య సంబంధాలను పునర్నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే తనిష్క్ ఖురానా వంటి విద్యార్థులకు ఈ నిర్ణయం ఇక అంత సులభంగా ఉండడం లేదు.
తనిష్క్ గత వేసవిలో దరఖాస్తు చేయాలని భావించారు. ఆయన వయసు 17 ఏళ్లు. కానీ ఒక కన్సల్టెంట్‌తో మాట్లాడిన తరువాత తన నిర్ణయాన్ని వాయిదా వేశాడు.
"వీసా తిరస్కరణలు పెరుగుతున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలను పరిమితం చేస్తున్నారని చెప్పారు. దీంతో పునరాలోచన చేయాల్సి వచ్చింది" అని తనిష్క్ చెప్పారు.
ఒక దశలో తనిష్క్ తన అండర్ గ్రాడ్యుయేట్ చదువును భారత్‌లోనే పూర్తి చేసి, తర్వాత విదేశాలకు వెళ్లాలని భావించారు. కానీ కెనడాపై ఉన్న ఆకర్షణ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం క్లినికల్ సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ కోసం మళ్లీ దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నారు.
"నేను కెనడాను ఎంచుకోవడానికి కారణం సింపుల్. నా సోదరి అక్కడే స్థిరపడింది. నా బంధువుల్లో చాలామంది అక్కడే ఉన్నారు. అందుకే ఆ దేశం నాకు పరిచయం. అలాగే అక్కడి విద్యా, ఉద్యోగ అవకాశాలు భారత్‌తో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి" అని అతను చెప్పాడు.
కెనడా ఇప్పటికీ గ్రాడ్యుయేషన్ అనంతరం మూడేళ్ల వరకు పని చేసే అనుమతిని ఇస్తోంది. ఇది ఒక పెద్ద ఆకర్షణగా ఉంది. కానీ అది మాత్రమే భవిష్యత్తుకు హామీ ఇవ్వడం లేదు.
జీవన వ్యయం పెరగడం, ఉద్యోగాలు దొరకడం కష్టమవడం వల్ల చాలా మంది గ్రాడ్యుయేట్లు అనిశ్చిత పరిస్థితిలో నిలిచిపోయారు. చట్టపరంగా అక్కడ ఉండటానికి అనుమతి ఉన్నా, ఆశించిన జీవితం నిర్మించుకోవడం కష్టమవుతోంది.
ఒకప్పుడు కెనడా స్టడీ పర్మిట్‌తో అంటే ఉద్యోగం, జీవితం, విదేశాల్లో స్థిరపడే అవకాశం కానీ ఇప్పుడు ఇదంతా సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు.
చాలామంది భారతీయ విద్యార్థులకు ఒకనాడు ఓ ప్లాన్‌లా ఉన్నది ఇప్పుడో రిస్క్‌గా మారింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































