తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది. "ప్రభుత్వం మన డిమాండ్లు అన్నింటినీ అంగీకరించింది. దీక్ష ముగిసింది, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి" అని సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విజ్ఞప్తి చేశారు.
సారాంశం
ప్రభుత్వంతో చర్చల అనంతరం తమ ఆందోళనలను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు.
తమ మిగిలిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని సీజేపీ తెలిపింది.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సోషల్ మీడియా వేదికగా రాజీనామాను ప్రకటించారు. రాజీనామా లేఖను గౌరవ ప్రధాన మంత్రికి సమర్పించినట్లు తెలిపారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ఇది యువత నేతృత్వంలో సాగిన ఉద్యమ విజయంగా అభివర్ణించారు.
యుక్రెయిన్ రాజధాని కీయేవ్ సమీపంలో డ్రోన్ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌పై రష్యా చేసిన దాడుల్లో 10 మంది చనిపోయారు. ఈ దాడిలో వందమంది గాయపడ్డారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ చెప్పారు. దాడిని రష్యా ధ్రువీకరించింది. రష్యాలో పౌర లక్ష్యాలపై దాడికి ఉపయోగించే డ్రోన్లను ఇక్కడ ప్రదర్శించారని రష్యా రక్షణశాఖ ఆరోపించింది.
జంతర్ మంతర్ పరిసరాల్లో దిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు బ్యారికేడ్లను ఏర్పాటుచేయడంతో పాటు వాటిని భారీ గొలుసులతో ఒకదానికొకటి అనుసంధానించి, వెల్డింగ్ చేసి మరింత పటిష్టంగా ఏర్పాటుచేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో తాగునీటి సరఫరా వ్యవస్థత తీవ్రంగా దెబ్బతింది. జిల్లాలో 102 తాగునీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయని, వాటిలో 27 పథకాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయని జల్ శక్తి శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది.
లక్షలాదిమంది భక్తుల మధ్య పూరీ జగన్నాథుడి బహుడా యాత్ర వైభవంగా జరిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి తిరుగు రథయాత్ర అయిన బహుడా యాత్ర సందర్భంగా మూడు భారీ రథాలు గుండిచా ఆలయం నుంచి 2.6కిలోమీటర్లు ప్రయాణించి పూరీ జగన్నాథ ఆలయం సింహద్వారం చేరుకున్నాయి.
లైవ్ కవరేజీ
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ బాధ్యతలు
ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, ప్రహ్లాద్ జోషి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆ శాఖ బాధ్యతలను జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రధాన మంత్రి మోదీ సూచనల మేరకు, విద్యా శాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
జోషి ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు.
ఆయన వద్దే పునరుత్పాదక ఇంధన శాఖ పోర్ట్‌ఫోలియో కూడా ఉంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ముర్ము అధికారికంగా ఆమోదించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఫొటో క్యాప్షన్, తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది.
తమ మిగిలిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది.
మూడో విడత చర్చల అనంతరం, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో కలిసి సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మీడియా సమావేశంలో మాట్లాడారు.
"ప్రభుత్వం మన డిమాండ్లు అన్నింటినీ అంగీకరించింది. దీక్ష ముగిసింది, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి" అని వారు విజ్ఞప్తి చేశారు.
"ప్రభుత్వం ఇతర డిమాండ్లను కూడా అంగీకరించింది" అని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియా సమావేశంలో తెలిపారు.
"కేవలం దిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నిరసనల్లో పాల్గొన్నందుకు భవిష్యత్తులో ఏ సీజేపీ కార్యకర్తపైనా చర్యలు తీసుకోబోమని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది" అని ఆయన అన్నారు.
బాధిత కుటుంబాలకు కోటి పరిహారంపై కూడా అంగీకారం కుదిరిందని, చట్టప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని అశుతోష్ రాంకా తెలిపారు.
మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించిందని, అంగీకరించిందని అన్నారు.
"ఈ రోజు మేం సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ప్రస్తుతం నమోదైన కేసులకు సంబంధించి నాలుగు అంశాలతో కూడిన ఒక లిఖితపూర్వక ముసాయిదాను వారు తీసుకువచ్చారు. వాటితో పాటు, మిగిలిన రెండు డిమాండ్లపై కూడా మేం చర్చించాం. ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోకూడదు, పరిహారం అందించాలి, అలాగే వారి ఐదు అంశాల చార్టర్‌ను పరిగణించడం.
మేమే వారికి ఎఫ్‌ఐఆర్‌ల కాపీలను అందిస్తాం, ఎలాంటి చర్యలు తీసుకోబోం. రెండో విషయానికి వస్తే.. పరిహారంపై ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మాకు కూడా సానుభూతి ఉంది. నిబంధనల ప్రకారం పరిహారం ఉంటుందని, సాధ్యమైనంత గరిష్టంగా వారికి అందిస్తామని మేం చెప్పాం" అని పేర్కొన్నారు.
పాకిస్తానీ సోషల్ మీడియా అకౌంట్లతో తప్పుడు ప్రచారం : దిల్లీ పోలీసులు
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న దాదాపు 400 నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి, బ్లాక్ చేసినట్లు డీసీపీ రోహిత్ తెలిపారు.
పాకిస్తాన్ నుంచి నడుస్తున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఈ నిరసనలకు సంబంధించి నకిలీ వార్తలను, పూర్తిగా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని దిల్లీ సెంట్రల్ డీసీజీ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ అన్నారు.
సీజేపీ నిరసనలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు.
ఏజెన్సీల సహకారంతో అలాంటి అకౌంట్లను గుర్తించి, వాటిపై చర్యలు చేపట్టే పనిలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘‘పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఈ నిరసనలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి మరిన్ని అకౌంట్లను గుర్తించేందుకు సంబంధిత ఏజెన్సీలతో కలిసి దిల్లీ పోలీసులు పనిచేస్తున్నారు’’ అని డీసీపీ తెలిపారు.
‘‘ఇప్పటి వరకు అలాంటి 400కి పైగా సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను గుర్తించి, బ్లాక్ చేశాం. ఈ అకౌంట్లు నిరసనలకు సబంధించి ఏఐ-జనరేట్ చేసిన కంటెంట్‌ను, డీప్‌ఫేక్ వీడియోలను, ఎడిట్ చేసిన చిత్రాలను, ఇతర తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నాయి’’ అని చెప్పారు.
'ఆపరేషన్ సింధూర్' సమయంలో కూడా ఈ హ్యాండిల్స్‌లో కొన్ని తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో చురుగ్గా పనిచేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
‘‘ఈ సోషల్ మీడియా అకౌంట్లు పలువురు సీనియర్ అధికారుల అధికారిక ప్రకటనలను తారుమారు చేసి, వక్రీకరించాయి. అలాగే, విజువల్ కంటెంట్‌ను మార్చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాయి’’ అని ఆయన చెప్పారు.
ఫొటో క్యాప్షన్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ఇది యువత నేతృత్వంలో సాగిన ఉద్యమ విజయంగా అభివర్ణించారు.
ఇది
"దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని కోరుతూ
వీధుల్లోకి వచ్చిన మన లక్షలాది మంది యువత సాధించిన విజయం" అని కాంగ్రెస్
అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ దీనిని, "దేశ యువత సమైక్య బలంతో సాధించిన ఒక భారీ విజయంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్
పోస్టులో "అణచివేతకు భయపడకుండా అన్యాయానికి వ్యతిరేకంగా యువత బలంగా నిలబడి,
ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేలా చేసిన ఈ పోరాటం. ప్రజాస్వామ్య
బలానికి నిదర్శనంగా నిలుస్తుంది" అని రాశారు.
ఇది "యువత సాధించిన పెద్ద విజయం" అని సమాజ్‌వాదీ పార్టీ
అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే, భవిష్యత్తులో పేపర్ లీక్‌లను అరికట్టడానికి, పరీక్షా విధానాలను బలోపేతం చేయడానికి ఈ ఘటన అన్ని రాజకీయ పార్టీలకు ఒక
పాఠంగా ఉపయోగపడాలని అభిలషించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిని
"ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం"గా అభివర్ణించారు.
ఇది భారత యువత సాధించిన విజయం : ప్రియాంక గాంధీ
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, ప్రియాంక గాంధీ
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు.
‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే, నేనింత సంతోషంగా ఉండడానికి ప్రధాన కారణమేంటంటే.. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించిన, మన ప్రజల గొంతుకలను అణచివేసేందుకు, తొక్కేసేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసిన వారి నుంచి దేశ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించారని నేను బలంగా విశ్వసిస్తున్నా.
ఇది భారత యువత సాధించిన విజయమని నా ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఒక్కరి పట్ల నాకెంతో గర్వంగా ఉంది. బయటికి వచ్చి, వారు నమ్మిన దానిపై గట్టిగా నిలబడిన ప్రతి ఒక్కరూ.. మనకు మహాత్మా గాంధీ చూపిన మార్గంలోనే నడిచారు. వారు పూర్తిగా అహింసా మార్గంలోనే పోరాడారు. వారిపై పెల్లెట్ గన్‌లు ప్రయోగించారు. టియర్ గ్యాస్ వాడారు. లాఠీలతో కొట్టారు. తీవ్రంగా గాయపడినప్పటికీ.. వారెక్కడా లొంగలేదు. బదులుగా ప్రభుత్వమే వారి సంకల్పానికి తలవంచాల్సి వచ్చింది.
ఇది ఈ దేశపు పాలకులందరికీ.. ప్రస్తుత, భవిష్యత్ తరాల వారికి కూడా గుణపాఠం. ప్రజల ఆకాంక్షలను మీరు విని తీరాల్సిందే. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల సంకల్పమే అత్యున్నతమైనది. దానికంటే మించినది ఏదీ లేదు. ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క నేత, ఏ ఒక్క నియత, ఏ శక్తీ కూడా భారత ప్రజల సంకల్పాన్ని ఆపలేదు. నేడు మన యువత, విద్యార్థులు దీన్ని నిరూపించారు’’ అని ప్రియాంక గాంధీ అన్నారు.
ఇది ప్రజాస్వామ్య విజయం: సోనమ్ వాంగ్‌చుక్
ఫొటో సోర్స్, Sonam Wangchuk/X
ఫొటో క్యాప్షన్, సోనమ్ వాంగ్ చుక్
కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ అభివర్ణించారు.
ఆయన ఎక్స్ పోస్ట్‌లో “ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం.. నేరుగా వీధుల నుంచే సాధించిన విజయం. శాంతి, ఓర్పు, పట్టుదల
సాధించిన విజయమిది. సీజేపీకి, జెన్ జెడ్‌కు అభినందనలు. భయాన్ని
వీడి, దేశం నలుమూలల నుంచి కదిలివచ్చిన పౌరులందరికీ
ధన్యవాదాలు. ఇక జవాబుదారీతనంతో.. సంస్కరణల వైపు అడుగులు వేద్దాం” అని ఆయన రాశారు.
రాజీనామా లేఖను ప్రధానికి సమర్పించా : ధర్మేంద్ర ప్రధాన్
ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సోషల్ మీడియా వేదికగా ధర్మేంద్ర ప్రదాన్ తన రాజీనామాను ప్రకటించారు. రాజీనామా లేఖను గౌరవ ప్రధాన మంత్రికి సమర్పించినట్లు తెలిపారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆయన రాజీనామా డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులుగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరుగుతున్నాయి.
ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. "జంతర్ మంతర్‌తో పాటు దేశంలో నెలకొన్న పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు. దేశ సమగ్రతను కాపాడుకోవాలి. విద్యార్థులు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. మన పిల్లలు తమ సమయాన్ని చదువుకు, కెరీర్ నిర్మాణానికి కేటాయించాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, నా రాజీనామా లేఖను గౌరవ ప్రధాన మంత్రికి సమర్పించాను" అని ఆయన అందులో రాశారు.
గతం భవిష్యత్తుతో పోరాడలేదు - రాహుల్ గాంధీ
ఫొటో సోర్స్, RahulGandhi/X
విద్యార్థుల మూడు డిమాండ్లపై ఎలాంటి రాజీ ఉండబోదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థులతో సమావేశం అనంతరం టెన్ జనపథ్ వెలువల ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవినుంచి తొలగించాల్సిందేనని ఆయన అన్నారు. ధర్మేద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ నుంచి మరోశాఖకు మార్చాలని చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోందని, ఇది విద్యార్థులకుగానీ, మరెవరికి గానీ ఆమోదయోగ్యం కాదని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీకగా మారారని ఆరోపించారు.
వేలాదిమంది యువతకు గాయాలయ్యాయి. విద్యార్థులపై దాడి చేసినవారిని శిక్షించాలన్నది, వారిని బాధ్యులుగా చేయాలన్నది రెండో డిమాండ్ అని రాహుల్ గాంధీ అన్నారు.ఈ మొత్తం ఘటనలపై ప్రధాని మోదీ విద్యార్థులకు, ఈ దేశ భవిష్యత్తుతకు తాను చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పాలన్నది మూడో డిమాండ్ అని రాహుల్ గాంధీ చెప్పారు.
‘‘విద్యార్థులు, యువతపై దాడి చేస్తోంది ఈ వ్యవస్థే. ఆందోళన చెందొద్దని నేను యువతతో చెప్పా. భారత ప్రభుత్వానికి ఎంత బలమున్నా, ఏ ఒక్క వ్యక్తీ నిరసన స్థలం నుంచి మిమ్మల్ని కదిలించలేరని నేను వాళ్లతో చెప్పా. ప్రభుత్వం ఏం చేసుకుంటుందో చేసుకోనివ్వండి. అడ్డుకోవడమో, బెదిరించడమో ఏదైన సరే. మేం వెనక్కి తగ్గేది లేదు. యువత భారత భవిష్యత్తు. నరేంద్ర మోదీ భారతదేశ గతం. గతం ఎప్పుడూ భవిష్యత్తుతో పోరాడలేదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
‘‘ఒత్తిడి నుంచి బయటపడేందుకు చింపాంజీలు ముద్దు పెట్టుకుంటాయి, కౌగిలించుకుంటాయి’’
కొత్త తరం ప్రశ్నలు అడుగుతోంది, వారికి తార్కికంగా సమాధానం చెప్పాలి - మోహన్ భగవత్
ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, మోహన్ భగవత్(ఫైల్ ఫోటో)
కొత్త తరం ప్రశ్నలు అడుగుతోందని, వాటికి తార్కికంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని రాష్ట్రీయ
స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) చీఫ్ మోహన్
భగవత్ అన్నారు.
దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర, దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్న తరుణంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు
చేశారు.
"మేం
చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన విషయాలతో వాదించేవాళ్ళం కాదు. మాట్లాడొద్దు అంటే
మాట్లాడే వాళ్లం కాదు" అని అన్నారు.
‘‘కానీ ఇప్పుడు అలా లేదు, కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది, వారికి సమాధానాలు చెప్పాలి. నేటి తరానికి
మరింత ఆప్యాయత అవసరం. మనం వారితో సమయం గడపాలి. మనం వారితో మాట్లాడాలి. ఈ రోజుల్లో
కుటుంబాల మధ్య సంభాషణలు తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లతో బిజీగా
ఉన్నారు" అని ఆయన అన్నారు.
శుక్రవారం దిల్లీలో
జరిగిన 'విశ్వ మాంగళ్య సభ' కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులో ఆత్మాహుతి దాడి, 15 మంది మృతి
ఫొటో సోర్స్, Abdul BASIT / AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో 15మంది మృతి
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులోని టాంక్
జిల్లాలో ఉన్న సైన్యం, పోలీసుల
సంయుక్త చెక్ పోస్టు మాంఝీ ఖేల్‌పై గురువారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ
దాడిలో 12 మంది
సైనికులతో సహా మొత్తం 15 మంది
మరణించారు.
మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఒక అటవీ శాఖ
అధికారి ఉన్నారు. ఈ దాడి అనంతరం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పన్నెండు
మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
‘‘ఉగ్రవాదులు మొదట చెక్‌పోస్ట్ భద్రతను ఛేదించుకుని లోపలికి
ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ భద్రతా
దళాలు వారి ప్రయత్నాన్ని విఫలం చేశాయి. ఆ తర్వాత పారిపోతున్న మిలిటెంట్లను
వెంబడించి కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు’’
అని పాకిస్తానీ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్
రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) తెలిపింది.
‘‘తొలి ప్రయత్నం విఫలమైన తర్వాత ఉగ్రవాదులు పేలుడు
పదార్థాలతో నిండిన వాహనంతో చెక్‌పోస్ట్ గోడను ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు
సంభవించింది. 15 మంది చనిపోయారు. చెక్‌పాయింట్
పూర్తిగా ధ్వంసమైంది’’ అని ఐఎస్‌పీఆర్ తెలిపింది.
పేపర్ లీక్ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్లపై వివిధ పార్టీలు ఏమన్నాయి?
ఫొటో సోర్స్, David Talukdar/NurPhoto via Getty Images
ఫొటో క్యాప్షన్, నిర్మలా సీతారామన్
ప్రశ్నాపత్రాల లీకేజ్‌ను కొందరు విద్యార్థులు మరింత కష్టపడి చదవడానికి అవకాశంగా ఉపయోగించుకున్నారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
కాంగ్రెస్, కాక్రోచ్ జనతాపార్టీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా సహా పలు పార్టీలు తీవ్రంగా స్పందించాయి.
‘‘ఆ సంఘటన తర్వాత ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోతే, అరెస్టులు చేయకపోతే, మళ్లీ పరీక్ష నిర్వహించి ఉండకపోతే, ఫలితాలు వెంటనే విడుదల చేసి ఉండకపోతే ఇప్పుడు యువత ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే స్థితిలో ఉండేది కాదు’’ అని ఏఎన్ఐతో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
‘పేపర్ లీక్ అయినప్పుడు మేం బాధపడ్డాం. కానీ తర్వాత దాన్ని అవకాశంగా తీసుకుని మరింత కష్టపడి చదివాం. బాగా రాణించాం’’ అని కొందరు విద్యార్థులు చెప్పినట్టు నిర్మలా సీతారామన్ అన్నారు.
దీనిపై కాంగ్రెస్ ‘ఎక్స్‌లో స్పందించింది. ఇవి బాధ్యతారాహిత్యమైన, సున్నితత్వంలేని మాటలని కాంగ్రెస్ విమర్శించింది.
‘‘21 మందికి పైగా యువత ప్రాణాలను బలిగొని, లక్షలమంది యువత నిరసనలకు కారణమైన ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం లెక్కించుకుంటోంది. పేపర్ లీకేజ్‌లను అరికట్టడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఈ ప్రకటనే నిదర్శనం. ఈ వ్యక్తులు దేశ విద్యావ్యవస్థను నాశనం చేశారు’’ అని కాంగ్రెస్ తన పోస్ట్‌లో పేర్కొంది.
‘‘ఆర్థికమంత్రి ఇప్పుడు ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు’’ అని ఆప్ విమర్శించింది.
పేపర్ లీకేజ్‌లు తీవ్రరూపం దాల్చిన ఒక క్యాన్సర్‌లాంటివి. ఝార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం దీన్ని నిర్మూలిస్తోంది. కానీ ప్రశ్నాపత్రాల లీకుల వల్ల ప్రయోజనాలున్నాయని బీజేపీ అంటోంది’’అని ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధికారిక ‘ఎక్స్’అకౌంట్‌లో రాసింది.
‘‘ఈ తర్కం ప్రకారం దేశంలోని పత్రాలన్నీ లీకవ్వాలి’’అని కాక్రోచ్ జనతాపార్టీ అధికార ప్రతినిధి అశుతోశ్ కాంకా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
దిల్లీ నిరసనలు: పెల్లెట్ గన్ అంటే ఏంటి, ఎందుకు వివాదాస్పదంగా మారింది?
విలువైన సూచనలిచ్చినందుకు ధన్యవాదాలు - ప్రధాని మోదీ
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ
ఇన్‌స్టాగ్రామ్‌లో తాను షేర్ చేసిన వీడియోకు యువత నుంచి వచ్చిన స్పందనపై ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన వీడియోకు యువత అందించిన విలువైన సూచనలు, సానుకూల స్పందనపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
‘‘ధన్యవాదాలు మిత్రులారా. రాత్రి ఆలస్యంగా మిమ్మల్ని కలిసే అవకాశం లభించింది. నా వీడియోకు మీరు స్పందించిన తీరును, మీ సానుకూల సూచనలను అభినందిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు’’ అని ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియోలో ప్రధాని తెలిపారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్‌పై దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పేపర్‌లీక్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని గురువారం అర్ధరాత్రి సెల్ఫీ వీడియోలో ప్రధాని ప్రకటించారు.
నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.