దక్షిణ చైనా సముద్రంలో చైనా జాలర్లు ‘సైనైడ్ కలుపుతున్నారని’ ఫిలిప్పీన్స్ ఆరోపణలు, చైనా ఏమంటోంది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జెస్సికా రాన్స్‌లీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
దక్షిణ చైనా సముద్రంలో తీవ్ర వివాదాస్పద ప్రాంతమైన స్ప్రాట్లీ దీవుల సమీప జలాల్లో చైనా జాలర్లు సైనైడ్‌ను వదులుతున్నారని ఫిలిప్పీన్స్ ఆరోపించింది.
సోమవారం నాడు జరిగిన ఈ విషప్రయోగం "విధ్వంసక" చర్య అని, ‘‘స్థానిక మత్స్య వనరులను అంతం చేయడమే’’ దీని ఉద్దేశమని ఆరోపించింది. సెకండ్ థామస్ షోల్ వద్ద మోహరించిన ఫిలిప్పీన్ దళాలకు కీలక ఆహార వనరులను దూరం చేయడానికే ఈ విషప్రయోగం జరుపుతున్నారని మనీలా పేర్కొంది.
చైనా ఈ ఆరోపణను ఒక "నాటకం"గా కొట్టిపారేసింది.
వివాదాస్పద జలాల్లో ఫిలిప్పీన్, చైనా నౌకల మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అప్పుడప్పుడు చోటుచేసుకునే హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ఈ ఆరోపణలు వచ్చాయి.
దక్షిణ చైనా సముద్రం.. చైనా, ఫిలిప్పీన్స్, ఇతర దేశాల మధ్య ప్రాదేశిక వివాదానికి కేంద్రంగా ఉంది.
'ఈ ఆరోపణ నమ్మశక్యం కానిది, ఖండిచడానికి కూడా అర్హతలేనిది' అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గ్వో జియాకిన్ అన్నారు.
" సాధారణ చేపల వేటలో ఉన్న చైనా మత్స్యకారులను ఫిలిప్పీన్స్ వేధించింది" అని గ్వో జియాకిన్ అన్నారు.

‘కిందటేడాది నుంచి మొదలు’
దక్షిణ చైనా సముద్రంలోని స్ప్రాట్లీ ద్వీపసమూహంలో భాగమైన సెకండ్ థామస్ షోల్ సమీపంలో గత ఏడాది నుంచి ఈ అనుమానిత విషప్రయోగం మొదలైందని ఫిలిప్పీన్ జాతీయ భద్రతా మండలి (ఫిలిప్పీన్స్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్) తెలిపింది.
ఆ పగడపు దిబ్బపై బీఆర్పీ సియెర్రా మాడ్రే అనే ఒక చిన్న ఫిలిప్పీన్ సైనిక స్థావరం ఉంది. ఇది రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి తుప్పుపట్టిన ఓడ. ఆ భూభాగంపై మనీలా తన హక్కును నొక్కి చెప్పడానికి 1999లో దీనిని ఉద్దేశపూర్వకంగా అక్కడి ఒడ్డుకు చేర్చారు.
"స్థానికంగా ఉండే చేపలను చంపి, నౌకాదళ సిబ్బందికి కీలకమైన ఆహార వనరును దూరం చేయడమే" సైనైడ్ కలపడం వెనకున్న ముఖ్య ఉద్దేశం" అని ఎన్ఎస్సీ సహాయ డైరెక్టర్ జనరల్ కార్నెలియో వాలెన్సియా అన్నారు.
దీనివల్ల నీరు, చేపలు కలుషితమై సైనికుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తుందని, అలాగే నౌకకు ఆధారంగా ఉండే పగడపు దిబ్బలను కూడా దెబ్బతీస్తుందని ఆయన సోమవారం ఒక పత్రికా సమావేశంలో తెలిపారు.
మనీలా ఈ అంశాన్ని ఇటీవల బీజింగ్‌తో జరిగిన సమావేశంలో ప్రస్తావించిందని, కానీ అధికారిక స్పందన రాలేదని వాలెన్సియా తెలిపారు. దౌత్యపరమైన నిరసనకు ఆధారంగా నిలవగల ఒక నివేదికను విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమర్పించాలని ఎన్ఎస్సి భావిస్తోందని చెప్పారు.
ఆ ప్రాంతంలో గస్తీని పెంచాలని నౌకాదళం, తీరరక్షక దళాన్ని ఆదేశించారు.
'గతేడాది ఫిబ్రవరి, జూలై, అక్టోబరు మాసాల్లో సంపాన్ అనే చిన్న పడవల నుంచి ఫిలిప్పీన్ దళాలు 10 సీసాల సైనైడ్‌ను స్వాధీనం చేసుకున్నాయని,ఈ పడవలను చేపలవేటకు ఉపయోగించే నౌకలనుంచి అక్రమంగా పంపారని ' ఫిలిప్పీన్ నావికాదళ ప్రతినిధి రియర్ అడ్మిరల్ రాయ్ విన్సెంట్ ట్రినిడాడ్ తెలిపారు.
గత నెలలో ఆ పగడపు దిబ్బ సమీప జలాల్లో చైనా సంపాన్ సిబ్బంది విషం కలుపుతుండగా తమ సైనికులు గుర్తించారని, తర్వాత అక్కడినుంచి సేకరించిన నీటి నమూనాలలో సైనైడ్ ఉన్నట్లు పరీక్షలలో తేలిందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఏయే దేశాల మధ్య వివాదం?
ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలలో తరచుగా లైవ్ రీఫ్ (సజీవ పగడపుదిబ్బలు) వ్యాపారం కోసం, చేపలకు మత్తెంక్కించడానికి లేదా చంపడానికి చరిత్రాత్మకంగా సైనైడ్ ఫిషింగ్ చేసేవారు. ఇది ఫిలిప్పీన్స్‌లో చట్టవిరుద్ధం. సముద్ర జీవావరణ వ్యవస్థలకు తీవ్రమైన నష్టం కలిగిస్తున్న కారణంగా ఆగ్నేయాసియా అంతటా దీన్ని నిషేధించారు.
దక్షిణ చైనా సముద్రం చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్, మలేషియా, బ్రూనై దేశాల మధ్య ప్రాదేశిక వివాదానికి కేంద్రంగా ఉంది.
ఇదొక కీలకమైన నౌకా రవాణా మార్గం. ఈ ప్రాంతంలో నివసించే లక్షలాది మంది ప్రజల జీవనోపాధికి తోడ్పడే సమృద్ధమైన చేపల వేట క్షేత్రాలకు నిలయం. ప్రపంచంలోని సగానికి పైగా చేపల వేట నౌకలు ఈ ప్రాంతంలోనే పనిచేస్తాయి.
పారాసెల్, స్ప్రాట్లీ దీవుల్లో సహజ వనరుల నిల్వలు, ఇంధన నిల్వలపై ఉన్నాయని కూడా భావిస్తున్నారు.
చైనా వాదనకు చట్టపరమైన ఆధారం లేదని 2016లో ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించినప్పటికీ, ఆ సముద్రం దాదాపు మొత్తం తనదేనని చైనా వాదిస్తోంది. ఆ తీర్పును కూడా బీజింగ్ తిరస్కరించింది.
ఆ ద్వీప సమూహంలో కొంత భాగానికి తమకు హక్కు ఉందని వాదించడానికి, ఫిలిప్పీన్స్ స్ప్రేట్లీ దీవులకు భౌగోళికంగా దగ్గరగా ఉండటమే ప్రధాన కారణంగా పేర్కొంటోంది.
ఫిలిప్పీన్స్, చైనా రెండూ స్కార్బరో షోల్ (చైనాలో హువాంగ్యాన్ దీవి అని పిలుస్తారు) పై హక్కును కోరుతున్నాయి. ఇది ఫిలిప్పీన్స్‌కు సుమారు160 కిలోమీటర్ల దూరంలో ఉండగా, చైనాకు సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గత కొన్నేళ్లుగా మనీలా, బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి .
కత్తులు, కర్రలతో సాయుధులైన చైనా తీరరక్షక సిబ్బంది 2024 జూన్‌లో సెకండ్ థామస్ షోల్ సమీపంలో ఫిలిప్పీన్ నావికాదళ పడవలపై దాడి చేశారు. ఈ హింసాత్మక ఘర్షణలో పలువురు ఫిలిప్పీన్ నావికులు గాయపడ్డారు .
తుప్పు పట్టిన సియెరా మాడ్రే యుద్ధ నౌకకు సరఫరాలు పంపకుండా ఫిలిప్పీన్స్‌ను అడ్డుకునేందుకు చైనా అనేకసార్లు ప్రయత్నించింది.
గత వారం ఫిలిప్పీన్స్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాతో కలిసి వివాదాస్పద జలాల్లో సంయుక్త సముద్ర సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఇది వార్షిక బాలికతాన్ యుద్ధ విన్యాసాలకు ముందు జరిగింది. ఈ ఏడాది జపాన్ కూడా పూర్తి స్థాయి భాగస్వామిగా పాల్గొననుంది.
ఇటువంటి విన్యాసాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతాయని బీజింగ్ పదేపదే విమర్శించింది.
మార్చిలో, ఫిలిప్పీన్స్ ఫ్రాన్స్‌తో ఒక సైనిక ఒప్పందంపై సంతకం చేసింది. ఈమేరకు ఏప్రిల్ 20న జరిగే బాలికతాన్ విన్యాసాలలో పాల్గొనడానికి పారిస్ 15 నుంచి 20 మంది సైనికులతో కూడిన బృందాన్ని పంపనుంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































