పాకిస్తాన్ :'నా బిడ్డను నాకివ్వకపోతే ఇక్కడి నుంచి కదలను'

ఫొటో సోర్స్, Reuters/Getty Images
(ఈ కథనంలో కలచివేసే అంశాలు ఉన్నాయి)
'నా బిడ్డను నాకివ్వండి, లేదంటే ఇక్కడ నుంచి కదలను. ఎక్కడికీ వెళ్లను, ఇక్కడే ఉంటా. నా బిడ్డను నాకు ఇవ్వండి...'
ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది నవజాత శిశువులు చనిపోయారు. దీంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో పీఐఎంఎస్ మాతా-శిశు ఆరోగ్య కేంద్రం భవనం వద్దకు చేరుకున్నారు.
బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు విలపిస్తూ కనిపించారు.
రెండు రోజుల క్రితమే సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి ఆసుపత్రి బయట బైఠాయించారు. తన బిడ్డను ఇచ్చే వరకు అక్కడి నుంచి కదలనని ఆమె మొరాయించారు.

మరో తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ "నా బిడ్డ మృతదేహాన్నైనా నాకివ్వండి" అని వేడుకుంటున్నారు.
ఆసుపత్రి సిబ్బందిపై చాలామంది తల్లిదండ్రులు, బంధువులు ఫిర్యాదు చేశారు.
ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని, సిబ్బంది ప్రవర్తన సరిగా లేదని వారు ఆరోపించారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రమాదం జరిగిన సమయంలో పిల్లల వార్డులో సిబ్బంది ఎవరూ లేరని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. నర్సరీ తలుపు కూడా మూసి ఉందని తల్లిదండ్రులు తెలిపారు.
పీఐఎంఎస్ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రానా ఇమ్రాన్ సికందర్ బీబీసీతో మాట్లాడారు. వార్డు తలుపు మూసి ఉందని, సిబ్బంది ఎవరూ లేరనే వార్తలను ఆయన ఖండించారు.
ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఆరోగ్య కార్యదర్శి అస్లం గౌరీని సస్పెండ్ చేశారు. ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
తాను ఎనిమిది రోజులుగా ఆసుపత్రికి వస్తున్నానని, ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని అగ్నిప్రమాదంలో బిడ్డను పోగొట్టుకున్న ఓ తండ్రి రాయిటర్స్‌తో చెప్పారు.
'ఈ భవనంలో అగ్ని ప్రమాదాలను నివారించే భద్రతా చర్యలు లేవు. సరైన అత్యవసర ద్వారాలు కూడా లేవు. పిల్లలను చూడటానికి ఒక్క తలుపే తెరిచి ఉంది. మిగతావన్నీ తాళం వేసి ఉన్నాయి' అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం పీఐఎంఎస్ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆసుపత్రి లోపల కూడా గస్తీ కాస్తున్నారు.
అగ్నిమాపక వాహనాలు ఇంకా ఆసుపత్రి వద్దే ఉన్నాయి. మాతా, శిశు ఆరోగ్య కేంద్రం అద్దాలు పగిలిపోయాయి. మాస్కులు, పగిలిన అద్దాల ముక్కలు రోడ్డుపై కనిపించాయి.

ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు?
ఆసుపత్రిలో ఉన్న ప్రత్యక్ష సాక్షి ఆలమ్ జెబ్ ఖాన్ బీబీసీతో మాట్లాడారు.
'ఆసుపత్రి బయట లాన్‌లో నిద్రపోతున్నా. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే లోపలికెళ్లా. అక్కడంతా దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఏమీ కనిపించలేదు. అందరూ ప్రాణాలు కాపాడుకోడానికి పరుగులు తీస్తున్నారు. మా కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చి, మళ్లీ లోపలికి వెళ్లా. అగ్నిప్రమాదంలో గాయపడిన పిల్లలను ఒక తండ్రి బయటకు తీసుకురావడం కనిపించింది. ఈ ఘటన సాయంత్రం 6 గంటల నుంచి 6:30 గంటల మధ్య జరిగింది' అని ఆయన తెలిపారు.
ఆసుపత్రి బయట చాలా మంది తల్లిదండ్రులు, బంధువులు ఉన్నారని, ఘటన జరిగిన వెంటనే పీఐఎంఎస్ అధికారులు అక్కడికి రాగా... అరగంట తర్వాత పోలీసులు వచ్చారని, అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్లు 15 నుంచి 20 నిమిషాల్లో వచ్చాయని ఆయన చెప్పారు.
తన కుమార్తెకు రెండు రోజుల క్రితం మగబిడ్డ పుట్టిందని మరో మహిళ బీబీసీతో చెప్పారు.
'బిడ్డ పుట్టినప్పటినుంచి అక్కడే ఉంది. తెల్లవారుజామున 4 గంటలకు నా కుమార్తెతో కలిసి బిడ్డను చూడటానికి వెళ్లా. తర్వాత తిరిగి వార్డుకు వచ్చేశాం. కొద్దిసేపటికి ఓ మహిళ కేకలు వినిపించాయి. బయటకు వచ్చి చూస్తే నర్సరీలో మంటలు కనిపించాయి. నర్సరీ ప్రధాన ద్వారం తాళం వేసి ఉంది' అని ఆమె చెప్పారు.
తలుపు పగలగొట్టేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని, నర్సింగ్ స్టేషన్‌లో నర్స్ ఎవరూ లేరని, అక్కడ ఒక్క సిబ్బంది కూడా లేరని ఆమె చెప్పారు.
"ఆ సమయంలో సిబ్బంది ఎక్కడ ఉన్నారు? సమాధానం చెప్పండి" అని చనిపోయిన బిడ్డ అమ్మమ్మ ప్రశ్నించారు.
'మా బంధువు ఇక్కడే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అందుకే ఇక్కడున్నా. సుమారు 6:30 గంటలకు పెద్ద శబ్దం వినిపించడంతో పరుగెత్తుకుంటూ వెళ్లా. నర్సరీ భవనంలో మంటలు చెలరేగడంతో ఇతరులతో కలిసి లోపల చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకురావడానికి సాయం చేశా. అప్పుడు ఓ మహిళ తన బిడ్డను ఎత్తుకుని భవనం నుంచి బయటకు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత రెస్క్యూ సిబ్బంది వచ్చారు' అని మరో ప్రత్యక్ష సాక్షి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
నర్సరీలోని ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఆక్సిజన్ కనెక్షన్ల వల్ల వేగంగా వ్యాపించాయని పీఐఎంఎస్ ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు.
పీఐఎంఎస్ డైరెక్టర్ ఇమ్రాన్ సికందర్ బాధిత కుటుంబాల ఆరోపణలను ఖండించారు.
'నర్సరీ తలుపు తాళం వేసి ఉంది. సిబ్బంది అక్కడే ఉన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలను ఎత్తుకుపోయిన ఘటనలు జరిగాయి. అందుకే నర్సరీలోకి వెళ్లడానికి కఠిన నిబంధనలు పెట్టాం. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మంటలను ఆర్పేందుకు ఆసుపత్రిలో నీటి సౌకర్యం లేదు' అని ఇమ్రాన్ సికందర్ చెప్పారు.
మంటలను ఆర్పడానికి మొత్తం 24 అగ్నిమాపక పరికరాలు ఉపయోగించామని చెప్పారు.
పీఐఎంఎస్ మాతా-శిశు వార్డులోని మూడో అంతస్తులో మంటలు చెలరేగి, 14 మంది చిన్నారులు చనిపోయారని ఇస్లామాబాద్ జిల్లా యంత్రాంగం తెలిపింది.
'ఉదయం 6:45 గంటలకు సమాచారం అందింది. ఏడు నిమిషాల్లో ఫైర్ బ్రిగేడ్, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు' అని సీడీఏ తెలిపింది.
దీనికి కారణం తెలుసుకోవడానికి, సహాయక చర్యలను సమీక్షించడానికి, ఆసుపత్రిలోని ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను పరిశీలించడానికి విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు సీడీఏ తెలిపింది.
మరోవైపు అగ్నిప్రమాదంలో నవజాత శిశువులను కోల్పోయిన కుటుంబాలు ఆసుపత్రిలోనే బైఠాయించాయి. తమ పిల్లల మృతదేహాలను అప్పగించాలని వారు కోరుతున్నారు. శిశువులు గుర్తుపట్టలేని విధంగా మృతిచెందడంతో వారిని గుర్తించడం కష్టంగా ఉందని, డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాలను కుటుంబాలకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.
వెంటనే పూర్తి స్థాయి విచారణ జరపాలని, ఈ ఘటనకు కారణాలను తెలుసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























