పంచదార ధరలు ఎందుకు తగ్గడం లేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
పంచదారను అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది. గత రెండు నెలల్లో భారత్‌లో చక్కెర ధరలు 40 శాతానికి పైగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
సోమవారం(ఆగస్టు 24) ఇంట్రాడే ట్రేడింగ్‌లో చక్కెర కంపెనీల షేర్లలో 12 శాతం వరకు భారీ పెరుగుదల కనిపించింది. చక్కెర రంగంలో భవిష్యత్ అంచనాలు మెరుగుపడతాయనే అభిప్రాయాల మధ్య ఈ పెరుగుదల నమోదైంది.
బజాజ్ హిందుస్థాన్ షుగర్, అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ, దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్, ధాంపూర్ షుగర్ మిల్స్, ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్, మగధ్ షుగర్ అండ్ ఎనర్జీ, మవానా షుగర్స్, పొన్ని షుగర్స్ (ఈరోడ్), ఉగర్ షుగర్ వర్క్స్, ఉత్తమ్ షుగర్ మిల్స్ షేర్లు ఇంట్రాడే ట్రేడింగ్‌లో తమ 52 వారాల గరిష్ఠ స్థాయిలను తాకాయి.
దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి భారత్ 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. అంటే ధరలను అదుపులో ఉంచడానికి విదేశాల నుంచి చక్కెరను సుంకం లేకుండా భారత్ దిగుమతి చేసుకుంటోంది.
కొన్ని రాష్ట్రాల్లో పంచదార ధరలు 50 శాతం వరకు పెరిగాయని, ఉత్తరాఖండ్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశాతో సహా ఎనిమిది రాష్ట్రాల్లో చక్కెర ధరలు కిలోకు 65 రూపాయలు దాటాయని మీడియా రిపోర్ట్ చేస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
పంచదార ధరపై రాజకీయాలు
ఒడిశాలో అత్యధికంగా చక్కెర ధర ఆగస్టు 23న కిలోగ్రాముకు 67.4రూపాయలుగా నమోదైంది. వారం క్రితం ఇది 55రూపాయలు, నెల క్రితం 50.78రూపాయలు కాగా, 2025 ఆగస్టు 23న కేజీ 46.89రూపాయలు ఉంది.
భారత్‌లో చక్కెర చాలా కాలంగా రాజకీయంగా సున్నితమైనది. ఎందుకంటే ఇది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన చక్కెర ఉత్పత్తి రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తోంది.
రాబోయే ఎనిమిది నెలల్లో పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌ల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో చక్కెర దిగుమతి నిర్ణయం కూడా రాజకీయ రంగు పులుముకుంది.
ఇంత సుదీర్ఘ విరామం తర్వాత చక్కెర దిగుమతికి అనుమతి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలతో సహా ప్రధాన ప్రతిపక్షాలు కొద్ది రోజులుగా బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దిగుమతులను పెంచడం ద్వారా గానీ లేదా ఇథనాల్ కోసం చక్కెర మళ్లింపును తగ్గించడం ద్వారా గానీ చక్కెర ధరలను తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకున్నప్పటికీ దానికి ఒక పరిమితి ఉందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.
అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2026-27 సీజన్లో చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు పెరగడం ప్రారంభమవుతుంది.
"పరిశ్రమ కోణం నుంచి చూస్తే కేజీకి సుమారు 50రూపాయలు ధర సాధారణంగా అనిపిస్తుంది. చక్కెర ఉత్పత్తి వ్యయం కేజీకి సుమారు 42-43రూపాయలు ఉంటుందని అంచనా. కొన్నేళ్లగా చాలా సందర్భాల్లో మిల్లులు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకే చక్కెరను విక్రయించాయి. ఇది వారి ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడిని పెంచింది" అని చక్కెర పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ అధికారి బిజినెస్ స్టాండర్డ్‌తో చెప్పారు.
'' మిల్లు నుంచి బయటకు వచ్చే చక్కెర ధర కేజీకి సుమారు 50రూపాయల వద్ద స్థిరంగా ఉంటే అది చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కొన్ని సంవత్సరాలుగా మిల్లులకు అలాంటి స్థితిని సాధించడం కష్టంగా మారింది'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ధరలను ఎందుకు నియంత్రించలేకపోతోంది?
చక్కెర రంగంలో వినియోగదారులు, రైతులు, మిల్లు యజమానుల మధ్య సమతుల్యతపై మాట్లాడుతుంటారు. వినియోగదారులు పంచదార చౌకగా ఉండాలని కోరుకుంటారు. రైతులు తమ చెరకు పంట ఎక్కువ ధర పలకాలని కోరుకుంటారు. మిల్లు యజమానులు గరిష్ఠ లాభాలను ఆశిస్తారు.
ఈ ముగ్గురు (వినియోగదారులు, రైతులు, మిల్లు యజమానులు) మధ్య సమతుల్యతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆర్థికవేత్త ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అంటున్నారు. కానీ ఈసారి అది జరుగుతున్నట్టు కనిపించడం లేదు.
"పరిస్థితి అదుపు తప్పిన తర్వాతే ప్రభుత్వం చర్యలు తీసుకుంది కాబట్టి ఆ చర్యలు ప్రస్తుతం ఎలాంటి ప్రభావం చూపవు. ప్రభుత్వం పంచదార ఎగుమతులను ఎందుకు అనుమతించింది? చక్కెరను ఇథనాల్ వైపు ఎందుకు మళ్లించింది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవు" అని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా చక్కెర డీలర్లపై 400 టన్నుల నిల్వల పరిమితిని కూడా విధించింది. మరోవైపు సెప్టెంబర్ 1 నుంచి హోల్‌సేల్ వినియోగదారులు 15 రోజులకు మించి చక్కెరను నిల్వ చేసుకోవడానికి అనుమతించరు.
అయితే "ప్రభావం వెంటనే కనిపించదు. ధరలు స్థిరపడటానికి కనీసం రెండు నెలల సమయం పట్టొచ్చు" అని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
చక్కెర ధర ఎందుకు పెరుగుతోంది?
"పండుగల సమయంలో పెరిగే డిమాండ్‌ను తీర్చడానికి చక్కెర నిల్వలు, సరఫరా పుష్కలంగా ఉన్నాయి, ఎలాంటి సమస్యా ఉండదు" అని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అధ్యక్షుడు నీరజ్ షిర్గాంకర్ సోమవారం మీడియాకు తెలిపారు.
ఆగస్టు నుంచి నవంబర్ మధ్య వినాయకచవితి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సమయంలో సంప్రదాయ స్వీట్లు, ఇతర మిఠాయిల వినియోగం పెరగడంతో సాధారణంగా చక్కెర డిమాండ్ ఎక్కువగాఉంటుంది.
చక్కెర కొరత కృత్రిమమైనదని, ఊహాగానాల వల్ల ఏర్పడుతోందని షిర్గాంకర్ అన్నారు. మార్కెట్లో ఆందోళన తగ్గించేందుకు పది లక్షల టన్నుల చక్కెర దిగుమతికి అనుమతించడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన అన్నారు.
సెప్టెంబరు 30తో ముగిసిన మార్కెటింగ్ సంవత్సరంలో భారత్ 2.79కోట్ల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేసిందని ఆయన అన్నారు. దేశంలో ఏడాదికి 2.8 నుంచి 2.85కోట్ల టన్నుల వరకు వార్షిక వినియోగం ఉంటుందని గత ఏడాది 2.61కోట్ల టన్నుల ఉత్పత్తి కంటే ఈ ఏడాది ఉత్పత్తి ఎక్కువగా ఉందని చెప్పారు.
చక్కెర మిల్లులు సుమారు 30 లక్షల టన్నుల పంచదారను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించాయని అందులో ఈ ఏడాది సుమారు ఎనిమిది లక్షల టన్నులను ఎగుమతి చేశాయని, ప్రభుత్వం మొత్తం 20 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతిచ్చిందని తెలిపారు.
కొత్త మార్కెటింగ్ సంవత్సరం ప్రారంభమయ్యేనాటికి భారత్‌లో సుమారు 35లక్షల టన్నుల చక్కెర ప్రారంభ నిల్వ ఉంటుందని ఆయన చెప్పారు.
ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని గట్టిగా లేవనెత్తుతున్నప్పటికీ ఇప్పటివరకు ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం సఫలం కాలేదు.
చక్కెరను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడమే ధరల పెరుగుదలకు కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు పండుగ సీజన్‌కు ముందు పెద్ద వ్యాపారులు కృత్రిమంగా చక్కెర ధరలను పెంచారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ప్రభుత్వం మాత్రం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని చెబుతోంది దేశీయ ఉత్పత్తి అంచనా కంటే తక్కువ ఉండడం, పండుగ సీజన్‌కు ముందు పెరిగిన డిమాండ్, వాతావరణం కారణంగా చెరకు పంట దెబ్బతినడం, ప్రపంచవ్యాప్తంగా చక్కెర సరఫరా కొరత, అలాగే ఊహాగానాలు, నిల్వలతో సహా చక్కెర ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయని ప్రభుత్వం అంటోంది.
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ 2026 అక్టోబర్ 31 వరకు 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతికి అనుమతిస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
2025 ఆగస్టు 23న దేశవ్యాప్తంగా పంచదార సగటు చిల్లర ధర కిలోకు రూ. 46.30 ఉండగా, 2026 ఆగస్టు 23 నాటికి అది కిలో రూ. 62.47కు చేరింది. ఒక ఏడాదిలో 34.92 శాతం పెరిగినట్టు.
ఈ ఏడాది జూలై 23న కిలో చక్కెర ధర 48.62రూపాయలుగా ఉంది. అంటే కేవలం 30 రోజుల్లోనే ధర 28.49 శాతం పెరిగింది. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏడాది కాలంలో చక్కెర ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిపక్షానికి ఒక పెద్ద సమస్య
ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం చక్కెర ధరలను పెంచుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చెరకును ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం వల్ల చక్కెర ఉత్పత్తి తగ్గిందని దీని ఫలితంగా కేవలం 17 రోజుల్లోనే చక్కెర ధర కిలోకు 20 రూపాయలు పెరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఇ20 విధానాన్ని వెంటనే సమీక్షించాలని వినియోగదారులకు కల్తీలేని పెట్రోల్‌ను అందించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న అహంకారపూరిత నిర్ణయాలకు ప్రజలు ఖరీదైన ఆహారం, ఖరీదైన ప్రయాణాల రూపంలో మూల్యం చెల్లిస్తున్నారని ఆయన అన్నారు.
అయితే, తాము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, వినియోగదారులకు తగినంత చక్కెర లభ్యతతో పాటు ధరల స్థిరత్వాన్ని నిర్ధరించడానికి అనేక చర్యలు తీసుకున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆగస్టు 20న జారీ చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది.
ఇటీవలి చక్కెర ధరల పెరుగుదలకు, ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడమే కారణమని చెప్పడం సరికాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
‘‘ఇటీవలి చక్కెర ధరల పెరుగుదలకు కారణం, పంచదారను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడమే అని చెప్పడం సరికాదు. వాస్తవానికి ఇథనాల్ కోసం మళ్లించే చక్కెర వాటా 2022-23లో సుమారు 12 శాతం నుంచి 2025-26 నాటికి సుమారు తొమ్మిది శాతానికి తగ్గింది. అంతేకాకుండా దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో సుమారు ముప్పావు వంతు ఇప్పుడు ధాన్యాల నుంచి, ప్రధానంగా మొక్కజొన్న నుంచి వస్తోంది" అని ఆ ప్రకటనలో పేర్కొంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































