మత మార్పిడి నిరోధక చట్టం: చర్చిలో ప్రార్థన‌ చేయడానికి హామీ పత్రాల మీద సంతకం ఎందుకు తీసుకుంటున్నారు?

క్రైస్తవ మతం, మత మార్పిడి నిరోధక చట్టం, మహారాష్ట్ర, ముంబయి, చర్చి, ప్రార్థన
ఫొటో క్యాప్షన్, మహారాష్ట్రలో కొత్తగా వచ్చిన మత మార్పిడి నిరోధక చట్టంతో క్రైస్తవుల్లో ఆందోళన పెరిగింది.
    • రచయిత, జాహ్నవీ మూలే, జోయా మటీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

"నేనిక్కడ ప్రార్థన చేయడానికి స్వచ్ఛందంగానే వచ్చాను"

భారత ఆర్థిక రాజధాని ముంబయి, దాని పరిసర ప్రాంతాలలోని చర్చిలు ఇలా లిఖిత పూర్వక హామీ తీసుకోవడం ప్రారంభించాయి. చర్చిలో ప్రార్థనకు వస్తున్న వారు తమ పేర్లతో పాటు కొన్నిసార్లు గుర్తింపు కార్డు నంబర్‌ కూడా రాస్తున్నారు. తమను ఎవరూ బలవంతం చేయలేదని లేదా ఎలాంటి ప్రలోభాలు, ఆశ చూపలేదని సంతకం చేస్తున్నారు.

అధికారికంగా ఎలాంటి చట్టపరమైన గుర్తింపులేని ఈ హామీ పత్రాలను బీబీసీ పరిశీలించింది.

ఒకవేళ ప్రార్థనా సమావేశాలపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా లేదా లోపల ఉన్నవారిని మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారని నిర్వాహకులపై ఆరోపణలు చేసినా రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో చర్చిలు ఈ పత్రాలను భద్రపరుస్తున్నాయి.

మహారాష్ట్రలో మత మార్పిడికి వ్యతిరేకంగా కొత్త చట్టం అమలులోకి రావడానికి ముందు ఆగస్టు చివరి వారంలో కొన్ని చర్చిలలో ఇది మొదలైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్రైస్తవ మతం, మత మార్పిడి నిరోధక చట్టం, మహారాష్ట్ర, ముంబయి, చర్చి, ప్రార్థన
ఫొటో క్యాప్షన్, ముంబయిలోని మౌంట్ మేరీ చర్చిని అన్ని మతాలకు చెందిన వారు సందర్శిస్తుంటారు,

మతమార్పిడి నిరోధక చట్టంలో ఏముంది?

బలవంతం, మోసం, ప్రలోభాలు లేదా బెదిరింపుల ద్వారా జరిగే మత మార్పిళ్లను ఈ చట్టం నిషేధిస్తుంది.

స్వచ్ఛందంగా మతం మారాలనుకునే వారు కూడా అధికారులకు ముందుగానే సమాచారం అందించడం తప్పనిసరి.

చట్టవిరుద్ధమైన మత మార్పిడికి పాల్పడితే గరిష్ఠంగా 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

అదే తప్పు రెండోసారి చేస్తే శిక్ష 10 ఏళ్ల వరకు పెరుగుతుంది.

సామాజికంగా లేదా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలను మోసగించి బలవంతంగా మతం మార్చకుండా రక్షించడానికే ఈ చట్టాన్ని తెచ్చినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

కానీ విమర్శకులు మాత్రం, ఈ చట్టంలోని అస్పష్టమైన నిర్వచనాలు, కఠినమైన శిక్షల వల్ల ఒక వ్యక్తి కి సంబంధించిన అత్యంత వ్యక్తిగతమైన నిర్ణయాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై స్పందన కోసం బీబీసీ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.

క్రైస్తవ మతం, మత మార్పిడి నిరోధక చట్టం, మహారాష్ట్ర, ముంబయి, చర్చి, ప్రార్థన
ఫొటో క్యాప్షన్, ముంబయిలో జరిగే వినాయక చవితి వేడుకల్లో అన్ని మతాల వారు పాల్గొంటారు.

మైనారిటీలలో పెరుగుతున్న ఆందోళన

ఈ చట్టం అన్ని మతాలకు వర్తించినప్పటికీ మైనార్టీలలో ముఖ్యంగా క్రైస్తవుల ప్రార్థన స్థలాలలో ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రయోజనాలను ఆశ చూపి ప్రజలను మతం మారుస్తున్నారని క్రైస్తవుల మీద రైట్ వింగ్ గ్రూపులు చేసే ఆరోపణల చుట్టూ ఈ వివాదం నడుస్తోంది.

ఈ ఆందోళనను దగ్గర నుంచి చూసినవారిలో దేవ్‌దన్ త్రిభువన్ ఒకరు. ఆయన తన కుటుంబంలో నాలుగోతరం క్రిస్టియన్. ముంబయిలోని తన కమ్యూనిటీకి న్యాయ సహాయం అందించే సంస్థలో ఆయన భాగస్వామి.

ఇటీవల కాలంలో కోర్టు కేసుల గురించి కాకుండా తమకు ప్రార్థన చేసుకునే స్వేచ్ఛకు జరుగుతున్న ఆటంకాలపై ప్రజలు తమను సంప్రదిస్తున్నారని ఆయన చెప్పారు.

కొందరు అపరిచితులు చర్చిల్లోకి ప్రవేశించి, లోపల ఉన్న భక్తులను పేర్లు అడుగుతూ "మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా? ఎవరైనా ఏదైనా ఆశ చూపించారా?" అని ప్రశ్నిస్తున్నట్టు వారు తెలిపారు.

ప్రార్థన కోసం వచ్చిన వ్యక్తి పేరు క్రైస్తవంపేరులా అనిపించకపోతే ప్రశ్నలు మరింత సూటిగా మారుతాయని త్రిభువన్ చెప్పారు.

ఆయనను సంప్రదిస్తున్నవారిలో ఎక్కువమంది న్యాయపరమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నవారు కాదు. కానీ కేవలం ప్రార్థన చేయడానికి సమావేశమవడం వల్ల, తాము మతమార్పిడి చేస్తున్నామనే ఆరోపణలకు ఏమైనా గురవుతామో లేదో తెలుసుకోవడానికే సంప్రదిస్తున్నారు.

ఏప్రిల్- జూలై మధ్య ముంబయి పరిసరాల్లో క్రైస్తవ ప్రార్థనా సమావేశాలకు సంబంధించి 5 సార్లు ఇలాంటి అలజడులు జరిగినట్లు జూలైలో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనలో తేలింది.

దీని తర్వాత తొమ్మిది పోలీసు కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ప్రార్థనకు వచ్చిన ఏడుగురు వ్యక్తులు, ఇద్దరు నిర్వాహకులు కాగా, మరో ఇద్దరు హిందూ జాతీయ వాద సంస్థ బజరంగ్ దళ్ సభ్యులు ఉన్నారు.

ఈ కేసుల్లో ఏం చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని కోరినప్పుడు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

క్రైస్తవ మతం, మత మార్పిడి నిరోధక చట్టం, మహారాష్ట్ర, ముంబయి, చర్చి, ప్రార్థన
ఫొటో క్యాప్షన్, మత మార్పిడి నిరోధక చట్టం ప్రకారం మతాంతర వివాహాలపై అభ్యంతరాలను లేవనెత్తుతూ దాఖలైన అనేక పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

విమర్శకుల ఆరోపణలు

"ప్రార్థన కోసం చర్చికి రావడమే మత మార్పిడి అవుతుందా?" అని త్రిభువన్ ప్రశ్నిస్తున్నారు.

ముంబయి లాంటి బహుళ సంస్కృతులు ఉన్న నగరంలో ఈ ప్రశ్నకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

ఎందుకంటే ఇక్కడ అన్ని మతాల ప్రజలు పరస్పరం ఒకరి ప్రార్థనా స్థలాలకు ఒకరు వెళుతుంటారు.

అనేక మతాల ప్రజలు ముస్లింలకు చెందిన హాజీ అలీకి వెళతారు. ముంబయిలోని కాథలిక్ బాసిలి మౌంట్ మేరీ వద్ద హిందువులు కొవ్వొత్తులను వెలిగిస్తారు.

వినాయక చవితికి లాల్‌బాగ్ చుట్టూ ఉండే వీధులు జనంతో నిండిపోతాయి. ఏడాది పొడవునా సిద్ధివినాయక ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.

మత మార్పిడిని నియంత్రించే చట్టం చేసిన డజనుకు పైగా రాష్ట్రాలలో తాజాగా మహారాష్ట్ర చేరింది.

చట్టాలు భిన్నంగా ఉన్నప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వాటి పరిధి విస్తరించింది. వీటిలో కొన్నింటిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

దీని వెనుక హిందూ జాతీయవాద గ్రూపులు చాలా కాలంగా చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి.

క్రైస్తవులు, పేద గిరిజన వర్గాలను హిందూ మతం నుండి దూరం చేయడానికి డబ్బు, విద్య లేదా వైద్య సంరక్షణను ఉపయోగిస్తున్నారని ముస్లింలు హిందూ మహిళలను మతం మార్చడానికి ప్రేమిస్తున్నారని దీనిని వారు "లవ్ జిహాద్" అని పిలిచే ఒక కుట్రగా ఆరోపిస్తున్నారు.

ఇలాంటి ఆరోపణలు క్రైస్తవ ప్రార్థనా సమావేశాలు, మతాంతర జంటల వేధింపులకు ఆజ్యం పోశాయని, ప్రార్థన, వివాహం, విశ్వాసం వంటి అంశాల్లోకి పోలీసులను లాగడానికి ఆరోపణలు చేస్తున్న వారికి ఈ చట్టాలు అవకాశంగా మారుతున్నాయని విమర్శకులు అంటున్నారు.

క్రైస్తవ మతం, మత మార్పిడి నిరోధక చట్టం, మహారాష్ట్ర, ముంబయి, చర్చి, ప్రార్థన
ఫొటో క్యాప్షన్, వివిధ రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మతాంతర వివాహాలకు సంబంధించి కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి.

ప్రలోభ పెట్టడం గురించి చట్టం ఏం చెబుతోంది?

ఈ కొత్త చట్టం ప్రజలను స్వచ్ఛందంగా మతం మారడానికి స్వేచ్ఛనిస్తుందని అదే సమయంలో బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకుంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

బలవంతానికి - స్వచ్ఛంద ఎంపికకు మధ్య ఈ చట్టం ఎక్కడ గీత గీస్తుందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

చట్టంలో 'ప్రలోభపెట్టడం' అనే పదానికి ఇచ్చిన నిర్వచనంపై విమర్శలు వస్తున్నాయి.

తాము బలవంతపు మతమార్పిళ్లకు మద్దతు ఇవ్వడం లేదని కానీ చట్టం దేన్ని ప్రలోభంగా పరిగణిస్తోందన్నదే ఆందోళనకరమని ముస్లిం సత్యశోధక్ మండల్ అధ్యక్షుడు శంషుద్దీన్ తాంబోలి అన్నారు.

చట్టంలో పేర్కొన్న మేరకు ఉద్యోగం కల్పించడం, ధార్మిక సంస్థలలో ఉచిత విద్య అందించడం, వివాహ ప్రతిపాదన చేయడం, "మెరుగైన జీవనశైలి" ఆశ చూపడం,"దైవిక స్వస్థత" కల్పిస్తామనడం.. చివరకు ఒక మతాన్ని మరొక మతం కంటే గొప్పగా చూపడం కూడా ఈ చట్టం పరిధిలోకి రావచ్చు.

"ఈ నిర్వచనాన్ని చాలా అస్పష్టంగా ఉంచారు. దీనివల్ల ఒక వ్యక్తికి లభించే ఏ చిన్న ప్రయోజనాన్నైనా ప్రలోభంగా వాదించవచ్చు" అని ముంబయి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అభయ్ థిప్సే పేర్కొన్నారు.

"ఒక వ్యక్తి ఏదైనా ప్రయోజనాన్ని పొంది, మనస్ఫూర్తిగా మతం మారాలనుకుంటే దాన్ని తప్పుగా ఎలా చూస్తాం?" అని ఆయన ప్రశ్నించారు.

క్రైస్తవ మతం, మత మార్పిడి నిరోధక చట్టం, మహారాష్ట్ర, ముంబయి, చర్చి, ప్రార్థన
ఫొటో క్యాప్షన్, కొత్త చట్టం వల్ల ఇతర మత విశ్వాసాలపై ఇష్టం ఉన్న వాళ్లకు కుటుంబాలు, రైట్ వింగ్ గ్రూప్స్ నుంచి సమస్యలు ఎదురవుతాయని విమర్శకులు ఆందోళన చెందుతున్నారు.

మతాంతర వివాహాలపై ప్రభావం

ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా ఇతర బంధువులు కూడా చట్టవిరుద్ధమైన మత మార్పిడిపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.

అప్పుడు నిందతుడే తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఇది మతాంతర వివాహాలు చేసుకునే జంటలకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతుందని న్యాయవాది లారా జెసాని భయపడుతున్నారు. భారతదేశంలో మతం మారకుండానే పెళ్లి చేసుకోవడానికి ఒక నెల ముందే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ కాలంలోనే అమ్మాయి తరపు బంధువులు లేదా రైట్ వింగ్ సంస్థలు జోక్యం చేసుకుని వివాహాలను అడ్డుకుంటున్న ఘటనలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం వల్ల, ఇద్దరిలో ఎవరికీ మతం మారే ఉద్దేశం లేకున్నా ఒక భాగస్వామి మరొకరిని మారుస్తున్నారనే తప్పుడు ఆరోపణలతో బంధువులు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ చట్టం విషయంలో కొందరి ఆందోళనల గురించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.

ఈ చట్టాన్ని ఆమోదించినప్పుడు ఇది మతం మారే హక్కును అడ్డుకోదని రాష్ట్ర మంత్రి పంకజ్ భోయర్ చెప్పారు.

మోసం, దౌర్జన్యం లేదా ప్రలోభాల ద్వారా జరిగే మత మార్పిళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సాయపడుతుందని ఆయన అన్నారు.

అయితే త్రిభువన్ ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. చర్చి దూర ప్రాంతంలో ఉండటంతో ఇంటిలో జరిగే ప్రార్థనా కూటములకు కూడా ఈ ఆందోళన చేరుతోందని ఆయన చెప్పారు. ఒకోసారి ఈ ప్రార్థనలకు 50మంది లేదా 100మంది వస్తారు. వారిలో క్రైవస్తవులు కాని వారు కూడా ఉండొచ్చు. ‘‘క్రిస్టియన్ కానివారు కూడా ప్రార్థనంలో పాల్గొనాలనుకుంటే మేం వారిని ఆపలేం. అది వారి హక్కుగా మేము భావిస్తాం" అని ఆయన చెప్పారు.

ఈ చట్టం విషయంలో రిటైర్డ్ జడ్జి థిప్సే ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తారు.

"ఒక వయోజనుడికి ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ, ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు, తన మతాన్ని ఎంచుకునే అధికారం ఎందుకు ఉండకూడదు?" అన్నదే ఆ ప్రశ్న.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)