లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని ఇద్దరు బాలికలు ఎలా పట్టించారంటే..

బాలికలపై లైంగిక వేధింపులు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

ప్రకాశం జిల్లాలోని ఒక ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌కి చెందిన ఇద్దరు విద్యార్థినులపై ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఘటన కలకలం రేపింది.

హాస్టల్‌ నుంచి ఆ విద్యార్థినులను నిబంధనలకు విరుద్ధంగా బయటకు పంపడంతో పాటు, ఆ రిటైర్డ్‌ ఉద్యోగి వద్దకు వెళ్లాలని వారికి సూచించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్టల్‌ వంట మనిషిని సస్పెండ్‌ చేసినట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎస్‌ నిర్మల జ్యోతి బీబీసీతో చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన ఒంగోలు టూటౌన్‌ సీఐ వీరానాయక్‌తో పాటు బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ జ్యోతి బీబీసీకి వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

''9వ తరగతి, పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు సెప్టెంబర్‌ 29న అంటే మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో హాస్టల్‌ వంట మనిషి ప్రోద్బలంతో బయటకు వచ్చారు. అక్కడి నుంచి ఆటోలో ఒంగోలులో నివాసముండే వెంకట్రావు అనే రిటైర్డ్‌ డీఆర్‌డీఏ ఉద్యోగి ఇంటికి వెళ్లారు. మూడేళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఆయన ఒంటరిగా ఉంటున్నారు.

గతంలో పరిచయం ఉన్న నేపథ్యంలోనే వారు ఆయన వద్దకు వెళ్లగా బిర్యానీ తెప్పించి.. సెల్‌ఫోన్‌ ఇచ్చి అందులోని వీడియోలను చూడాలని వెంకట్రావు సూచించారు.

ఆ తర్వాత ఆయన పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాలని చూశారు. దీంతో బాలికలు ఆందోళనకు గురయ్యారు. ఈలోగా తొమ్మిదో తరగతి చదివే విద్యార్థిని, వెంకట్రావు సెల్‌ఫోన్‌ నుంచే పదో తరగతి విద్యార్థిని సోదరుడికి ఫోన్‌ చేసి విషయాన్ని చెప్పారు.

వెంటనే ఆ బాలిక సోదరుడు తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి వెంకట్రావును నిలదీసి బాలికలను బయటకు తీసుకువచ్చారు. ఈలోగా సమాచారం అందుకున్న ఒంగోలు టూటౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకుని వెంకట్రావును అదుపులోకి తీసుకున్నారు'' అని బీబీసీకి ఒంగోలు టూటౌన్‌ సీఐ వీరా నాయక్‌ వివరించారు.

ఇద్దరిలో ఓ విద్యార్థిని బంధువు ఇటీవల చనిపోయారు. డెత్‌ సర్టిఫికెట్‌ ఇప్పించడంలో సహాయం చేస్తామని చెప్పడంతోనే అతని ఇంటికి వెళ్లినట్లు ఆ ఇద్దరు బాలికలు చెబుతున్నారని సీఐ తెలిపారు.

అమ్మాయిలు మైనర్లు కావడంతో వారి పేర్లు, ఇతర వివరాలను ఈ కథనంలో ప్రస్తావించడం లేదు.

బాలికలపై లైంగిక వేధింపులు

వెంకట్రావుతో పాటు వంట మనిషిపైనా కేసు

వెంకట్రావుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, విద్యార్థినుల ఫిర్యాదు మేరకు అతనిపై పోక్సో కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు తెలిపారు.

ఇద్దరు బాలికలు సురక్షితంగా ఉన్నారని, ‘వెంకట్రావు దురాలోచన’ను పసిగట్టిన వెంటనే బాలికలు వేగంగా స్పందించి బంధువులకు, పోలీసులకు ఫోన్‌ చేయడంతో వారు సురక్షితంగా బయటపడ్డారని ఆయన తెలిపారు.

కాగా, వెంకట్రావుతో పాటు హాస్టల్‌ వంట మనిషిపై కూడా కేసు నమోదు చేశామని, నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్‌ నుంచి బయటకు పంపడంతో పాటు విద్యార్థినులను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే చర్యలకు ప్రోత్సహిస్తున్నారన్న అభియోగంపై కేసు నమోదు చేశామని ఒంగోలు టూటౌన్‌ సీఐ వీరా నాయక్‌ తెలిపారు.

వంట మనిషి సస్పెన్షన్‌.. వార్డెన్‌ పై విచారణ

విద్యార్థులను నిబంధనలకు విరుద్ధంగా బయటికి పంపించిన వంట మనిషిని ఇప్పటికే సస్పెండ్‌ చేశామని బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ నిర్మల తెలిపారు. అదేవిధంగా హాస్టల్‌ వార్డెన్‌పై కూడా శాఖాపరమైన విచారణ జరుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

తాను మూడు నెలల కిందటే ఈ హాస్టల్‌కు వచ్చానని, తనకు తెలియకుండా ఇలా పిల్లలను బయటకు పంపుతున్న విషయం ఇప్పటివరకు తన దృష్టికి అస్సలు రాలేదని బీబీసీతో మాట్లాడుతూ హాస్టల్ వార్డెన్ విలపించారు. జరిగిన ఘటన చాలా దారుణమని అన్నారు. అదృష్టవశాత్తూ పిల్లలకు ఎటువంటి అపాయం జరగలేదని, మరోమారు ఇలాంటి ఘటన జరగకుండా చూసుకుంటామని చెప్పారు.

ఫిర్యాదు చేసిన అమ్మాయి సోదరుడిని బీబీసీ సంప్రదించింది.

జరిగిందేదో జరిగిపోయింది.. ఇక దాని గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఏమీ లేదని ఆయన బీబీసీతో అన్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్రావుతో పాటు వంట మనిషితో మాట్లాడేందుకు కూడా బీబీసీ యత్నించింది. అయితే వారు పోలీసుల అదుపులో ఉండటంతో సాధ్యపడలేదు. వెంకట్రావు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. వారు అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి వివరణను అప్‌డేట్‌ చేస్తాం.

మరోవైపు, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌. సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇద్దరు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడిని శిక్షిస్తామని, ఇందుకు కారణమైన హాస్టల్‌ కుక్‌ను విధుల్లో నుంచి తొలగించడమే కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై తక్షణమే నివేదిక అందించాలని, రాత్రి సమయాల్లో హాస్టళ్లలో వార్డెన్‌లు తప్పనిసరిగా ఉండాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)