విమానంలో పైలట్‌ను కత్తితో పొడిచిన మరో పైలట్.. కూల్చేయడానికి ప్రయత్నించారని ఆరోపించిన నెతన్యాహు.. దుబయి-ఇజ్రాయెల్ ఫ్లైట్ ఘటనలో అసలు ఏం జరిగింది?

సారాంశం
  • దుబయి నుంచి టెల్‌ అవీవ్ వెళ్తోన్న ఫ్లైదుబయి విమానం ఎఫ్‌జడ్103 బుధవారం టేకాఫ్ అయిన రెండు గంటల్లోనే సౌదీ అరేబియా వైపుకు దిశ మార్చుకుంది.
  • దారి మళ్లించిన తర్వాత వేగంగా కిందకి దిగడం ప్రారంభించి, ఎమర్జెన్సీ సిగ్నల్ జారీ చేసింది. ఆ తర్వాత హైజాక్ వార్నింగ్ వచ్చింది.
  • కేవలం రెండు నిమిషాల్లోనే 17 వేల అడుగులు కిందకి దిగింది.
  • ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ప్రమాద సంకేతం పంపిన తర్వాత, ఆ విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:44 గంటలకు సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
  • విమాన కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్‌ను ఆస్పత్రికి తరలించారు.
  • కాక్‌పిట్‌లో ఒక పైలట్, మరొక పైలట్‌పై కత్తితో దాడి చేశారు.
  • ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
  • ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు.
    • రచయిత, హఫ్సా ఖాలిల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు
బెంజమిన్ నెతన్యాహు

దుబయి నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబయి ప్రయాణికుల విమానాన్ని బుధవారం ఉదయం సౌదీ అరేబియాకు మళ్లించి, అక్కడే బలవంతంగా దించారు.

విమాన సిబ్బంది తమను సాయం కోరారని, ఆ తర్వాత పైలట్లలో ఒకరిని అదుపులోకి తీసుకుని కట్టేయడానికి తాము సాయం చేశామని విమానంలోని ఒక ఇజ్రాయెలీ ప్రయాణికుడు విలేఖరులకు చెప్పారు.

ఫ్లైదుబయి విమానం బుధవారం ఉదయం బయలుదేరింది. టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత.. ఎమర్జెన్సీ కోడ్‌ను ఈ విమానం జారీ చేసిందని విమానాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ 24 పేర్కొంది.

కొన్ని నిమిషాల తర్వాత విమానం దానిని హైజాక్ కోడ్‌గా మార్చింది. తర్వాత దాన్ని తిరిగి సాధారణ అత్యవసర సంకేతంగా మార్చారు.

ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'కత్తితో దాడి చేసిన పైలట్‌ను అరెస్ట్ చేశారు'

ఫ్లైదుబయి విమాన ఘటనపై ఒక ప్రకటన విడుదల చేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ''కత్తితో దాడి చేసిన పైలట్‌ను అరెస్ట్ చేశారు. సౌదీ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు'' అని తెలిపారు.

''విమానం ఇజ్రాయెల్‌కు సమీపిస్తున్న సమయంలో, విమానంలో ప్రయాణికులు ఉండగా పైలట్లలో ఒకరు మరొక పైలట్‌పై కత్తితో దాడి చేసి, విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. నేను ఒక ఇజ్రాయెలీ ప్రయాణికుడితో మాట్లాడాను. విమానం గిరగిరా తిరుగుతూ (స్పిన్‌లోకి వెళ్తూ) కిందికి దిగడం ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఏదో విధంగా తాను, ఒక సిబ్బందితో కలిసి కాక్‌పిట్‌లో ప్రవేశించానని, విమాన వ్యవస్థలను పాడుచేయడానికి ప్రయత్నిస్తున్న ఆ పైలట్‌ను ఇద్దరూ కలిసి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విమానంలో ఉన్న మరో విమాన సిబ్బంది కాక్‌పిట్‌లోకి ప్రవేశించి విమానాన్ని అదుపులోకి తెచ్చి సురక్షితంగా నడిపారు''

''అసాధారణమైన చొరవ, ధైర్యాన్ని ప్రదర్శించిన ఈ వీరులకు నేను సెల్యూట్ చేస్తున్నాను. వారు అనేక ప్రాణాలను కాపాడారు. ఒక పెద్ద విపత్తును నివారించారు''

''సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరూ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు'' అని నెతన్యాహు తెలిపారు.

ఆ పైలట్ విమానాన్ని హైజాక్ చేయడానికో లేదా కూల్చివేయడానికో ప్రయత్నించి ఉండవచ్చని అంతకుముందు పేరు చెప్పడానికి ఇష్టపడని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. అయితే, దాడి చేసిన పైలట్ ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది.

ఫ్లైట్ ఎఫ్‌జెడ్1073 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అందులో సుమారు 150 నుంచి180 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్ పౌరులే.

విమాన ప్రయాణ సమయంలో పైలట్ల మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత విమానం అత్యవసర కోడ్‌ను పంపడంతో హైజాక్ అయిందనే భయాందోళనలు కొద్దిసేపు తలెత్తాయని తొలుత ఇజ్రాయెల్ మీడియా నివేదించింది.

ఈ విమానం టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత తొలుత స్క్వాక్ కోడ్ 7700 పంపింది. ఇది జనరల్ ఎమర్జెన్సీని సూచిస్తోంది. ఆ తర్వాత, విమానంలోకి అనధికారిక జోక్యాన్ని లేదా హైజాక్‌ను సూచిస్తూ ఆ కోడ్‌ను 7500కు మార్చారు. అనంతరం ఆ విమానం తిరిగి తన ప్రారంభ కోడ్ 7700ను పంపింది.

ఈ సంఘటనతో, అత్యవసర పరిస్థితికి సన్నద్ధతగా ఇజ్రాయెల్ వైమానిక దళం తన అప్రమత్తత స్థాయిని పెంచిందని జెరూసలేం పోస్ట్ నివేదించింది.

ఫ్లైదుబయ్ ప్రమాదం
ఫొటో క్యాప్షన్, గాయపడిన వ్యక్తి

విమాన కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్‌కి గాయాలు

ఈ ఘటనలో కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్‌ ఇద్దరికీ గాయాలు అయినట్లు ఫ్లైదుబయి కంపెనీ తెలిపింది. వారిని ఆస్పత్రిలో చేర్చినట్లు పేర్కొంది.

కంపెనీ జారీ చేసిన ప్రకటనలో.. స్థానిక సమయం ప్రకారం ఉదయం 8.44 గంటలకు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌కు సిగ్నల్ వచ్చింది.

ఆ తర్వాత గంటకు రన్‌వేపై విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.

సౌదీ అరేబియాకు విమానం దారి మళ్లించడానికి ముందు.. ఒక పైలట్‌ను కత్తితో దాడి చేసి గాయపరిచారని ఇజ్రాయెల్ మీడియాకు ప్రయాణికులు తెలిపారు.

ఇజ్రాయెల్ మీడియాలో షేర్ అయిన వీడియోను.. ప్రామాణికమైనదిగా బీబీసీ ధ్రువీకరించింది.

దీనిలో ఒక వ్యక్తి సెల్ఫీ మోడ్‌లో వీడియో చేశారు. ''మేం ఇక్కడ ఉన్నాం. విమానంలోని ఉగ్రవాదులను ఇప్పుడే అదుపులోకి తీసుకున్నాం. త్వరలో ల్యాండ్ కాబోతున్నాం. పైలట్ తప్ప, విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా, ఎటువంటి గాయాలు కాకుండా ఉన్నారు. మాకు సాయం కావాలి" అని చెబుతూ కనిపించారు.

సౌదీ అరేబియా వైపు అకస్మాత్తుగా దిశ మార్చుకుని కిందికి దిగిన కొద్దిసేపటికే ఆ విమానం సుమారు ఏడు నిమిషాల పాటు అత్యవసర సంకేతాన్ని జారీ చేసిందని ఫ్లైట్ రాడార్24 నుంచి అందిన డేటాలో తెలిసింది.

విమాన ప్రయాణికులు
ఫొటో క్యాప్షన్, విమానం దిగాల్సి ఉన్న టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ప్రయాణికులు వరుసలో నిలబడ్డారు.

రక్షించిన పైలట్.. బ్రిటన్‌కు చెందిన సంతతి

ప్రమాదంలో ఉన్న విమానాన్ని స్వాధీనం చేసుకుని, బాధ్యతలు చేపట్టిన ఆ ఇద్దరు పైలట్లు రిలీఫ్ పైలట్లని, వారు తదుపరి విమానాన్ని నడపాల్సి ఉందని ఎల్మోగ్ ఇతాలి అనే ప్రయాణికుడు మీడియాతో చెప్పారు.

"వారిలో ఒకరు బ్రిటీష్ పైలట్" అని ఇతాలి చెప్పారు. మరొక పైలట్ యూరోపియన్ అని, కానీ ఆయన జాతీయతను వెల్లడించలేదని తెలిపారు.

కాక్‌పిట్‌లో అసలేం జరిగిందో తెలియదని, అయితే సహాయక పైలట్లు విమానాన్ని స్టెబిలైజ్ చేసి సౌదీ అరేబియాలో దించారని ఇతాలి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)