‘‘మా షిప్ మీదుగానే క్షిపణులు దూసుకెళ్లేవి’’-హార్ముజ్ జలసంధిలో నెలల తరబడి చిక్కుకుపోయిన నావికుల భయానక అనుభవాలు

హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ముకిముల్ అహ్సన్, మొహమ్మద్ జుబేర్ ఖాన్, గ్రేస్ త్సోయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

సముద్రం కొన్నిసార్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, తన ఓడ మూడు నెలలుగా యుద్ధ క్షేత్రం మధ్యలో చిక్కుకుపోయిందన్న విషయాన్ని కెప్టెన్ హసన్ ఖాన్ మర్చిపోయేంత ప్రశాంతంగా ఉంటుంది.

"బయట చూస్తే అంతా మామూలుగానే ఉంది. కానీ లోపల ఉన్నవాళ్లు మాత్రం ప్రశాంతంగా లేరు. ఇది చాలా విచిత్రంగా ఉంది" అని తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని పాకిస్తానీ నావికుడు చెప్పారు.

గల్ఫ్‌లోని ఈ ప్రాంతం బయటకు సాధారణంగానే కనిపించవచ్చు, కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఖాన్‌తో పాటు మరో 20,000 మంది నావికులు హార్ముజ్ జలసంధిలో, దాని సమీపంలో చిక్కుకుపోయారు. ప్రపంచంలోని చమురు, సహజ వాయువులో ఐదోవంతు రవాణా జరిగే అత్యంత రద్దీ జలమార్గాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన హార్ముజ్ జలసంధి ఇప్పుడు పూర్తిగా స్థంభించిపోయింది. ఒకవైపు ఆకాశంలో క్షిపణులు దూసుకెళ్తున్నాయి... మరోవైపు సముద్రపు అలల కింద మైన్లు అమర్చి ఉన్నాయి.

ఇటువంటి పరిస్థితుల మధ్య కూడా కెప్టెన్ ఖాన్, ఓడలోని సిబ్బంది తమ విధులు నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడప్పుడు అనుమతి లభించే విరామాలకు కూడా ఓడను విడిచి వెళ్లాలని ఎవరూ కోరుకోవడం లేదు. ఒకప్పుడు నవ్వులు, సరదా మాటలతో కళకళలాడిన వాతావరణం ఇప్పుడు ఆందోళనతో నిండిన నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడప్పుడు ఫోన్ రింగ్‌టోన్ మాత్రమే ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తోంది. నిద్రపోతున్నప్పుడు చిన్న శబ్దం వినిపించినా కూడా వాళ్లు ఉలిక్కిపడుతున్నారు.

"ఆ ఒత్తిడి ఎప్పుడూ మా మనసులోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయారు" అని ఖాన్ చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

క్షిపణులు, మందుపాతరల వల్ల ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేకపోయినా, హార్ముజ్ జలసంధి అవతలి వైపు చిక్కుకుపోయిన సుమారు 1,600 నౌకలు అక్కడి నుంచి బయటకు వెళ్లలేకపోతున్నాయని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్(ఐఎంఓ) అంచనా వేసింది.

యుద్ధం మొదలైన కొన్ని రోజులకే గల్ఫ్ ప్రాంతం నుంచి బయటకు వెళ్లడానికి ఉన్న ఏకైక జలమార్గాన్ని ఇరాన్ మూసేసింది.

అనుమతి లేకుండా ఏ నౌక దాని ద్వారా ప్రయాణించకూడదని ప్రకటించింది.

బంగ్లాదేశ్‌కు చెందిన బంగ్లార్ జోయ్‌జాత్రా అనే నౌకకు షఫీకుల్ ఇస్లాం కెప్టెన్‌‌గా వ్యవహరిస్తున్నారు.

"మేం చెరువులో చిక్కుకుపోయిన్నట్టుంది. బయటకు వెళ్లడానికి ఉన్న ఒకే ఒక మార్గం హార్ముజ్ జలసంధి" అని కెప్టెన్ షఫీకుల్ ఇస్లాం అన్నారు.

దక్షిణాఫ్రికాకు తరలించాల్సిన సుమారు 37,000 టన్నుల ఎరువును రవాణా చేస్తున్నారు. గడచిన కొన్ని నెలల్లో తన నౌకను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లడానికి రెండుసార్లు ప్రయత్నించారు.

కానీ రెండు ప్రయత్నాలూ విఫలమయ్యాయి.

ఏప్రిల్ 8న కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ప్రకటించిన తర్వాత, హార్ముజ్ జలసంధి దాటేందుకు ఒక నౌకకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) అనుమతి ఇచ్చిందనే సమాచారం ఇస్లాంకు అందింది. దీంతో ఆయన తన నౌకతో పాటు మరో నాలుగు నౌకలను కూడా ఆ జలమార్గం వైపు నడిపించారు.

కానీ కొద్దిసేపటికే ముందుకు వెళ్లవద్దని హెచ్చరిక వచ్చింది. దాంతో వారి ప్రయత్నం మరోసారి విఫలమైంది.

తొమ్మిది రోజుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా అన్ని వాణిజ్య నౌకల కోసం హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచుతామని ఇరాన్ ప్రకటించడంతో ఇస్లాం మరోసారి ప్రయత్నించారు. కానీ తన ఓడరేవులపై అమెరికా దిగ్బంధనాన్ని కొనసాగించడంతో ఇరాన్ వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

అప్పటికే ఇస్లాం నడుపుతున్న నౌక జలసంధికి 30 నాటికల్ మైళ్ల సమీపానికి వచ్చేసింది. కానీ రేడియోలో దాడుల హెచ్చరికలు నిరంతరం వినిపిస్తుండటంతో, దాన్ని వెనక్కి మళ్లించడం తప్ప ఆయనకు మరో మార్గం కనిపించలేదు.

నౌకా సిబ్బంది

ఫొటో సోర్స్, Rashedul Hasan

ఫొటో క్యాప్షన్, బంగ్లార్ జోయ్‌జాత్రా నౌక కెప్టెన్ షఫీకుల్ ఇస్లాం (కూర్చున్నవారిలో కుడివైపు నుంచి రెండవ వ్యక్తి), ప్రధాన ఇంజనీర్ రషేదుల్ హసన్ (కెప్టెన్ ఎడమవైపు) సిబ్బందిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఒక వీడియోను రికార్డు చేస్తున్నారు.

భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని నౌకలు గల్ఫ్ ప్రాంతంలోని వేర్వేరు ఓడరేవులకు వెళ్లాయి. మరికొన్నింటిని తీరానికి కొంత దూరంలో లంగరు వేసి ఉంచారు. ఇప్పుడు అందులో ఉన్నవారికోసం ఆహారం, తాగునీరు వంటి నిత్యావసరాలు అందించడం పెద్ద సమస్యగా మారింది.

ఓడరేవుల్లోకి ప్రవేశించకుండా నిత్యావసరాలు అందించడం అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే దుబయి, అబూదాబి, కువైట్ ప్రాంతాల్లో నౌకలకు అవసరమైన సరుకులు అందించే వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. అయినప్పటికీ నిత్యావసరాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి.

నిత్యావసర వస్తువులన్నింటికన్నా తాగునీటి ధర బాగా పెరిగిందని బంగ్లార్ యాత్ర చీఫ్ ఇంజనీర్ రషీదుల్ హసన్ అన్నారు.

"రెండు రోజుల క్రితం మా నౌక కోసం సుమారు 180 టన్నుల నీటిని కొనుగోలు చేశాం. ఇంతకుముందు దీనికి 1,500 నుంచి 2,000 డాలర్ల వరకు ఖర్చయ్యేది. ఇప్పుడు అదే నీటికి 11,000 డాలర్లు చెల్లించాల్సి వచ్చింది" అని ఆయన చెప్పారు.

"ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని కొంతమంది ఆహార, నీటి సరఫరాదారులు అధిక లాభాలు ఆర్జించడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా అనిపిస్తోంది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక కొరియన్ నావికుడు అన్నారు. ఈయన వేరే ఓడలో ఉన్నారు.

వేసవి సమీపిస్తున్నందున భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నీరు అవసరమవుతుంది. మే నెలలోనే గాలి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిపోయింది. వేసవి తీవ్రత పెరిగే కొద్దీ అది 45 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు చేరుకునే అవకాశం ఉంది.

ఖాన్ ఉన్న నౌకలో ఇప్పటికైతే ఆహారం, తాగునీరు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి కాస్త అనుకూలంగానే ఉందని ఆయన అంటున్నారు.

బీఫ్, చికెన్ లభిస్తున్నప్పటికీ, కూరగాయలు, పప్పులు మాత్రం అంత సులభంగా దొరకడం లేదు.

హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Rashedul Hasan

ఫొటో క్యాప్షన్, బంగ్లార్ జోయ్‌జాత్రా నౌక జనవరి చివరిలో బంగ్లాదేశ్ నుంచి బయలుదేరింది.

పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ తాను అదృష్టవంతుడిననే షఫీకుల్ ఇస్లాం భావిస్తున్నారు. యుద్ధం రెండో రోజున ఆయన నౌక దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్ట్‌కు కేవలం 200 మీటర్ల (656 అడుగులు) దూరంలో ఉంది. అది మధ్యస్థ పరిమాణం గల ట్యాంకర్ పొడవుకంటే కూడా తక్కువ దూరం. అదే సమయంలో ఆ పోర్ట్‌పై ఇరాన్ దాడి చేసింది.

అప్పటి నుంచి ఇస్లాంతోపాటు ఆ ఓడలోని 30 మంది సిబ్బంది చూసిన దాడులకు లెక్కే లేదు.

"కొన్నిసార్లు ఒక నౌకపైనుంచి క్షిపణులు దూసుకెళ్తాయి, మరికొన్నిసార్లు పక్కనే ఉన్న నౌకపై వాటి శకలాలు పడుతుండేవి" అని కెప్టెన్ చెబుతున్నారు.

"రాత్రిపూట దాడులు కొనసాగిన ప్రతిసారీ ఎవరికీ నిద్ర పట్టేదికాదు. ఆ భయానక దృశ్యాలను, విధ్వంసాన్ని మా కళ్లతో చూశాం" అని ఇంజనీర్ హసన్ చెబుతున్నారు.

ధృవీకరించిన 39 ఘటనల్లో కనీసం 11 మంది నావికులు మరణించారు, మరొకరి ఆచూకి ఇంకా తెలియలేదని ఐఎంఓ పేర్కొంది.

ఇదే వారి భయానికి కారణం.

కాల్పుల విరమణ తర్వాత కొంత ఉద్రిక్తత తగ్గినప్పటికీ, జలసంధిలో కొనసాగుతున్న సైనిక కార్యకలాపాలు...పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో గుర్తు చేస్తున్నాయి.

కొంతమంది నావికులు ఇప్పటికీ డ్రోన్లు, ఫైటర్ జెట్లను చూస్తున్నారు. మరికొందరు తరచూ యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

"ఈ నౌకలు చాలా ప్రకాశవంతమైన లైట్లు ఉపయోగిస్తాయి. అలాగే లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రకటనలు కూడా వినిపిస్తాయి. ఎవరూ ఈ మార్గం దాటకుండా ఆపేందుకే ఇరానీయులు ఇలా చేస్తున్నారు" అని ఒక ఆయిల్ ట్యాంకర్‌లో షెఫ్‌గా పనిచేస్తున్న పాకిస్తానీ వ్యక్తి సాజిద్ మసూద్ (పేరు మార్చాం) చెబుతున్నారు.

గల్ఫ్ దేశాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా, ఇజ్రాయెల్ తనపై చేస్తున్న దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది ఇరాన్. అందులో యూఏఈలోని జెబెల్ అలీ పోర్ట్ కూడా ఉంది.

బయటపడే మార్గం ఉందా?

సిబ్బంది ఖర్చులను తగ్గించుకోగలమని భారీ నష్టాలను ఎదుర్కొంటున్న షిప్పింగ్ కంపెనీలు ఆశిస్తున్నాయి.

చాలామంది నావికులకు కాంట్రాక్ట్ గడువు పూర్తవుతోంది. తర్వాత పెద్దసంఖ్యలో సిబ్బందిని మార్చాల్సి ఉంది. ఈ పరిస్థితులలో యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఈ నౌకలను నడపడానికి తగినంతమంది దొరకడం కష్టమవుతుంది.

"ఈ ఉద్యోగం ఎంత ప్రమాదకరంగా మారగలదో యుద్ధం చూపించింది. చాలామంది నావికులు ఈ వృత్తి గురించి ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించవచ్చు" అని పాకిస్తానీ నావికుడు కామిల్ అన్నారు.

భవిష్యత్తు యుద్ధాల్లో అంతర్జాతీయ జలమార్గాల వినియోగం ఒక ఆయుధంగా మారవచ్చని ఆయన ఆందోళన చెందుతున్నారు.

షెఫ్ మసూద్ కూడా తన సముద్రయాన వృత్తి గురించి పునరాలోచనలో పడ్డారు. ఆయన ఒప్పందానికి కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది.

"తొందరగా ఇంటికి వెళ్తానని అనుకున్నా. కానీ ఇక్కడే చిక్కుకుపోయాం. ఎప్పుడు వస్తావని రోజూ నా కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. కానీ వారికేం చెప్పాలో తెలియడం లేదు" అని షెఫ్ మసూద్ అంటున్నారు.

ఇరాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Rashedul Hasan

ఫొటో క్యాప్షన్, ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోగలమనే నమ్మకం ఉందని రషీదుల్ హసన్ చెప్పారు.

ఫిబ్రవరి 28 నుంచి సుమారు 750 నౌకలు హార్ముజ్ జలసంధిని దాటాయని మారీటైమ్ డాటా సంస్థ కెప్లర్ అంచనా వేసింది.

ఈ నౌకల యజమానులు ఎక్కువగా చైనా, భారత్, పాకిస్తాన్ నుంచి వచ్చారని, ఇరాన్‌తో ప్రత్యక్ష అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలపై ఆధారపడ్డారని వాషింగ్టన్ డీసీలోని లాభాపేక్షలేని పరిశోధనా సంస్థ సీఎన్ఏకి చెందిన డా. జోనాథన్ ష్రోడెన్ చెప్పారు.

అలాగే ప్రతి నౌకకు కొన్ని మిలియన్ల డాలర్ల వరకు "ఫీజు" చెల్లించినట్లు కనిపిస్తోందని ఆయన తెలిపారు.

ఇప్పుడు బంగ్లార్ జోయ్‌జాత్రా నౌకకు దౌత్యమే పెద్ద ఆశ. దాని యజమాని బంగ్లాదేశ్ షిప్పింగ్ కార్పొరేషన్‌‌తో కలిసి ఆ నౌకను బయటకు తీసుకురావడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

కానీ ఇది కూడా కష్టమే.

"మొదట ఇరాన్ కోరిన టోల్ చెల్లించేందుకు బంగ్లాదేశ్ అంగీకరించింది. కానీ తర్వాత ఆ ప్రణాళికను విరమించారు. ఎందుకంటే అలా చెల్లించిన దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది" అని బీఎస్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ కమోడోర్ మహ్మదుల్ మాలెక్ తెలిపారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)