జాతి వివక్ష పై తప్పుడు ఆరోపణలు: బ్రిటన్‌లోని సిక్కుల ఆచారాలపై మరోసారి చర్చకు దారితీసిందా?

బ్రిటన్, హెన్రీ నోవాక్

ఫొటో సోర్స్, Police handout

ఫొటో క్యాప్షన్, 2025 డిసెంబర్‌లో సౌతాంప్టన్‌లో 18 ఏళ్ల హెన్రీ నోవాక్ మరణించారు.
    • రచయిత, జేక్ లాఫామ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

హెన్రీ నొవాక్ అనే టీనేజర్ హత్య కేసులో పోలీసులు స్పందించిన తీరుకు సంబంధించిన బాడీకామ్ ఫుటేజీ విడుదలయ్యాక వారి వ్యవహార శైలిపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు.

గత సంవత్సరం డిసెంబర్ 3న నోవాక్ అనే యువకుడిని సిక్కు జాతీయుడైన విక్రమ్ విక్రమ్ దిగ్వా అనే యువకుడు కత్తితోదాడి చేశారు. ఈ కేసులో విక్రమ్ దిగ్వాకు కనీసం 21 ఏళ్ల జైలు శిక్ష పడింది.

సిక్కు మతాచారంలో భాగంగా తన దగ్గర ఉండే 21 సెంటీమీటర్ల (8 అంగుళాల) పొడవైన కత్తితో నోవాక్ ను దిగ్వా పొడిచి చంపారు. అయితే, ఈ ఘర్షణ సమయంలో తనపైనే జాత్యహంకార దాడి జరిగిందని దిగ్వా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటికే కత్తిపోట్లతో గాయపడి ఉన్న నోవాక్‌కు పోలీసులు బేడీలు వేశారు.

‘‘నాకు ఊపిరి ఆడటం లేదు’’ అని నోవాక్ అరుస్తుండటం పోలీసుల బాడీకామ్ ఫుటేజీలో కనిపిస్తోంది.

కాగా, మంగళవారం సాయంత్రం సౌతాంప్టన్‌లో వందలాది మంది ప్రజలు గుమిగూడారు. అక్కడ నిరసనకారులకు, అల్లర్ల నియంత్రించే పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్రిటన్, విక్రమ్ దిగ్వా, హెన్రీ హంతకుడు

ఫొటో సోర్స్, Police handout

ఫొటో క్యాప్షన్, విక్రమ్ దిగ్వా (23)కు 21 ఏళ్ల జైలు శిక్ష పడింది.

‘‘జాత్యహంకారం ఓ నిజమైన సమస్య’’

మైనార్టీల విషయంలో వివక్ష కూడదు, వారికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో తాము పాటిస్తున్న ‘‘జాత్యాహంకార వ్యతిరేక నిబద్ధతను’ పున:సమీక్షిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో ఎంపీలు వ్యక్తం చేసిన ఆందోళనలను తాము గమనిస్తున్నామని, అవసరమైన చోట మార్పులు చేస్తామని నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ (ఎన్‌పీసీసీ) చెప్పింది.

జాత్యహంకార వ్యతిరేక నిబద్దత పేరుతో ఎన్‌పీసీసీ నిరుడు ఓ పత్రాన్ని ప్రచురించింది. అందులో పోలీసింగ్ వ్యవస్థలో జాత్యహంకారం ఓ నిజమైన సమస్యగా పేర్కొంది. అలాగే వేర్వేరు జాతులకు చెందిన ప్రజల విషయంలో సమానత్వాన్ని సాధించడమంటే ‘‘అందరినీ ఒకేలా చూడటం’’ కాదని, వారి నిర్దిష్ట ‘‘పరిస్థితులు, అనుభవాలకు’’ అనుగుణంగా స్పందించడమని వివరించింది.

అయితే ఇది అధికారిక విధానం లేదా శిక్షణలో భాగం కానప్పటికీ, కేవలం చర్మం రంగును బట్టి ప్రజల పట్ల భిన్నంగా వ్యవహరించడం తప్పని కన్జర్వేటివ్ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.

ఎన్‌పీసీసీ పత్రంలో ఉన్న పదాలు గందరగోళంగా ఉన్నాయని, ‘‘అవసరమైన చోట మార్పులు చేస్తామని’’ ఎన్‌పీసీసీ చైర్మన్, చీఫ్ కానిస్టేబుల్ గవిన్ స్ఫీఫెన్స్ చెప్పారు.

సౌతాంప్టన్‌లో నెలకొన్న అశాంతి ‘‘ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’అని బ్రిటన్ హోం మంత్రి షబానా మహమూద్ పేర్కొన్నారు.

'హెన్రీ మరణాన్ని మరింత విభజన, ద్వేషం లేదా ఉద్రిక్తతలను సృష్టించడానికి ఉపయోగించవద్దు' అని నొవాక్ కుటుంబం సోమవారం 'పిలుపు' ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

"ఈ విషాదాన్ని ఉపయోగించుకుని హింసను, అలజడులను రేకెత్తించడాన్ని ఎంతమాత్రం సమర్థించలేం" అని హోం మంత్రి అన్నారు.

అంతకుముందు ప్రధాని సర్ కీర్ స్టార్మర్ మాట్లాడుతూ ఆ బాడీకామ్ ఫుటేజీ 'నిజంగా కలచివేసేలా ఉంది', 'దాన్ని చూసి చలించిపోయా' అన్నారు.

"జాతి వివక్ష ఆరోపణల ఆధారంగా పోలీసులు ఎలా నిర్ణయాలు తీసుకున్నారు?" అనే ప్రశ్నపై కచ్చితంగా విచారణ జరగాలని సర్ కీర్ అన్నారు.

పోలీస్ వాచ్‌డాగ్ ఇండిపెండెంట్ ఆఫీస్ ఫర్ పోలీస్ కాండక్ట్ (ఐఓపీసీ) పోలీసుల చర్యలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. రాబోయే 3 నెలల్లో ఈ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది.

ఈ విషయంపై మరింత విస్తృతమైన విచారణను తాను తోసిపుచ్చడం లేదని సర్ కీర్ స్టార్మర్ చెప్పారు. "మొదట ఐఓపీసీ తన పనిని పూర్తి చేయడం ముఖ్యం, అంతమాత్రాన విస్తృత విచారణ జరగకూడదని అనడం లేదు, కచ్చితంగా చెప్పను కూడా" అన్నారు.

హెచ్చరిక: ఈ వార్తలోని వివరాలు కొందరిని మానసికంగా కలచివేయవచ్చు.

అంతకుముందు, ఈ హత్య తర్వాత తలెత్తిన 'ప్రమాదకరమైన పరిస్థితుల' గురించి హోం మంత్రి షబానా మహమూద్ మాట్లాడారు. ఇవి బెదిరింపులకు దారితీస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు ఇంటర్నెట్‌లో ఒక పోలీస్ అధికారిని తప్పుగా గుర్తించారని, దాంతో ఆ అధికారి తనను, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి 'వేరే ప్రాంతానికి మారాల్సి వచ్చింది' అని హోంమంత్రి చెప్పారు.

ప్రతిపక్ష ఎంపీలు ఈ కేసును రాజకీయం చేయవద్దని హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడుతూ షబానా హెచ్చరించారు.

ప్రతిపక్షాల విమర్శలు

నొవాక్‌పై పోలీసులు ప్రవర్తించిన తీరు తనకు తీవ్ర ఆగ్రహం కలిగిందని రిఫార్మ్ యూకే నాయకుడు నైజెల్ ఫరాజ్ విలేఖరులతో చెప్పారు. ఇది బ్రిటన్‌లో రెండు రకాల చట్టాలు (టూ-టైర్ బ్రిటన్) ఉందనడానికి నిదర్శనమని విమర్శించారు.

"ఆ క్షణంలో ప్రాణాపాయంలో వ్యక్తి కంటే, జాతి వివక్ష గురించిన అబద్ధపు ఆరోపణకే ఎక్కువ ప్రాధాన్యం లభించింది" అన్నారు నైజెల్.

షాడో హోమ్ సెక్రటరీ క్రిస్ ఫిలిప్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో చేసిన ప్రకటనలో "పోలీసులు హెన్రీకి సహాయం చేయడం కంటే... జాతి వివక్ష ఆరోపణ గురించే ఎక్కువ ఆందోళన చెందినట్లు కనిపించారు" అని చెప్పారు.

ఈ ఫుటేజీ 'చాలా దారుణంగా ఉంది', ఇందులో 'అనేక వైఫల్యాలు' కనిపిస్తున్నాయని కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు కెమి బాడెనాక్ అన్నారు.

"ఒకవేళ ఆ హంతకుడు శ్వేతజాతీయుడు అయి ఉంటే, పోలీసులు మరికొన్ని ప్రశ్నలు అడిగి ఉండేవారేమో. కానీ, వారు నేరుగా ఒక నిర్ణయానికి వచ్చేశారు" అని ఆమె బీబీసీ న్యూస్‌నైట్‌తో చెప్పారు.

ఈ కేసులోని వాస్తవాలను తేల్చవలసిన బాధ్యత ఐఓపీసీ పైనే ఉందని హోంమంత్రి షబానా అన్నారు.

పోలీసులు కొందరి పట్ల పక్షపాతం చూపిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై ఆమె స్పందిస్తూ, "ఈ దేశంలో పోలీసులు ఎలాంటి భయం గానీ, పక్షపాతం గానీ లేకుండా తమ విధిని నిర్వహించవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ చట్టం ముందు అందరూ సమానులే" అని ఆమె స్పష్టం చేశారు.

బ్రిటన్‌లో ' టూ-టైర్ పోలీసింగ్ అంటూ ఏమీ లేదు' అని ప్రధానమంత్రి అధికారిక ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

సిక్కు సమాజానికి చెందిన లేబర్ పార్టీ ఎంపీ తన్మన్‌జీత్ సింగ్ ధేసీ మాట్లాడుతూ, ఒక హింసాత్మక హంతకుడి చర్యల ఆధారంగా, మొత్తం సిక్కు సమాజాన్ని 'బలిపశువును' చేయాలని రిఫార్మ్ యూకే, ఇతర పార్టీలు నిర్ణయించుకున్నాయని ఆరోపించారు.

‘ఇది ఒక హత్య కేసు మాత్రమే’

ఈ హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలో మంగళవారం సాయంత్రం గుమిగూడిన నిరసనకారులతో అల్లర్ల నియంత్రణ పోలీసులు ఘర్షణ పడ్డారు. ఈ నిరసనకు ఫార్ రైట్ లీడర్ టామీ రాబిన్సన్ మద్దతుగా నిలిచారు.

వీధిలో నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా, వారిపైకి చెత్తకుండీలు, కొన్ని ఇటుకలు, ఒక ఈ-స్కూటర్‌ను విసిరారు.

దిగ్వాకు విధించిన జైలు శిక్ష చాలా తక్కువగా ఉందని అనేక అభ్యర్థనలు రావడంతో 'అన్‌డ్యూలీ లీనియంట్ సెంటెన్స్' (యూఎల్ఎస్) స్కీమ్ కింద దీన్ని సమీక్షించడానికి అటార్నీ జనరల్ కార్యాలయం పరిశీలిస్తోంది.

ప్రస్తుత చట్టాల ప్రకారం, సిక్కు మతాచారాలను పాటించేవారు మతపరమైన కారణాల కోసం కృపాణం అని పిలిచే చిన్న కత్తిని తమ శరీరానికి దగ్గరగా ధరించడానికి చట్టపరమైన మినహాయింపు ఉంది.

దిగ్వా తన దుస్తుల కింద సంప్రదాయ కృపాణం ధరించినప్పటికీ, నొవాక్‌పై దాడి చేయడానికి ఉపయోగించిన ఆయుధం మాత్రం చాలా పెద్దది. దానిని ఆయన ఒక తొడుగులో ఉంచి, తన దుస్తుల పైన కనిపించేలా ధరించారు.

దిగ్వా కుటుంబ సభ్యులు నొవాక్ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. అలాగే సిక్కు సమాజానికి 'చెడ్డపేరు' తెచ్చినందుకు విచారం వ్యక్తం చేశారు.

"మేం విక్రమ్‌ను ప్రేమిస్తున్నాం" అని పేరు చెప్పడానికి ఇష్టపడని కుటుంబ సభ్యుడు ఒక ప్రకటనలో తెలిపారు.

"మేం అతన్ని ప్రేమిస్తూనే ఉంటాం. ఆ ప్రేమ నొవాక్ కుటుంబం పట్ల మాకు ఉన్న బాధకు వ్యతిరేకమైనది కాదు. ఈ రెండు భావాలు నిజమైనవి, ఇవి మా జీవితాంతం మాతోనే ఉంటాయి" అన్నారు.

"ఇది సిక్కు మతం కేసు కాదు, జాతి వివక్ష గురించిన కేసూ కాదు, కేవలం ఒక హత్యకు సంబంధించిన కేసు" అని ప్రాసిక్యూటర్ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి షబానా తన ప్రసంగంలో గుర్తుచేశారు.

నొవాక్ కుటుంబం కూడా ఈ వ్యాఖ్యలను ప్రస్తావించింది. పోలీసులు నొవాక్ పట్ల ప్రవర్తించిన తీరు 'అమానవీయం, అవమానకరం' అన్నారు. దీనిపై పోలీసు యంత్రాంగం క్షమాపణలు చెప్పింది.

నొవాక్ తండ్రి మార్క్ మాట్లాడుతూ, "తాను ఊపిరి తీసుకోలేకపోతున్నానని హెన్రీ పోలీసులకు తొమ్మిది సార్లు చెప్పాడు. తనను నాలుగు సార్లు పొడిచారని కూడా చెప్పాడు. అయినప్పటికీ హెన్రీని కంకర నేలపై ఈడ్చుకుంటూ వెళ్లారు, చేతులను వెనక్కిమడిచి సంకెళ్లు వేశారు" అన్నారు.

తన కుమారుడిని, దిగ్వాను పోలీసులు చూసిన తీరులో ఉన్న వ్యత్యాసం "భరించలేనిది" అని ఆయన అన్నారు.

యూకే, పోలీసులు
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పోలీసులు ఏమంటున్నారు?

ఈ ఘటనలో పాల్గొన్న పోలీసు అధికారులలో ముగ్గురు ఇంకా విధుల్లోనే ఉన్నారని, ఒకరు రాజీనామా చేశారని హాంప్‌షైర్ అండ్ ఐల్ ఆఫ్ వైట్ కాన్‌స్టాబులరీ ప్రతినిధి తెలిపారు.

హాంప్‌షైర్, ఐల్ ఆఫ్ వైట్ పోలీస్ అండ్ క్రైమ్ కమిషనర్ డోనా జోన్స్ స్పందిస్తూ, పోలీస్ కంట్రోల్ రూమ్ పనితీరు, సంస్కృతితో పాటు, గాయాలైనపుడు స్పందించే విషయంలో అధికారులకు ఇచ్చిన శిక్షణపై సమీక్ష జరపాలని విడిగా అభ్యర్థించారు.

బాడీకామ్ ఫుటేజీలో, ఒక పోలీసు అధికారి హెన్రీ నొవాక్‌ను చూస్తూ: 'నిన్ను పొడిచారా, ఎక్కడ?' అని అడుగుతూ, ఆ వెంటనే: 'నాకలా అనిపించడం లేదు మిత్రమా' అని అనడం వినిపించింది.

చేతులకు బేడీలు వేస్తున్న సమయంలో, నొవాక్ 'నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను' అని చాలాసార్లు చెప్పారు.

ఆ తర్వాత ఫుటేజీలో, స్పృహ కోల్పోయినట్లు కనిపిస్తున్న నొవాక్‌తో... దాడి చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పడం కనిపించింది.

జడ్జి విలియం మౌస్లీ కేసీ ఈ కేసుపై సోమవారం తీర్పునిస్తూ, నొవాక్‌కు ఎంత త్వరగా ప్రథమ చికిత్స, సీపీఆర్ లేదా నిపుణులైన వైద్య చికిత్స అందించి ఉన్నప్పటికీ, గాయాల తీవ్రత కారణంగా ఆయన బతికేవారు కాదని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఆయుధాలు కలిగి ఉన్నారనే అభియోగాలపై దిగ్వా తండ్రి మోగా సింగ్ (52), సోదరుడు గుర్ ప్రీత్ (27) మంగళవారం మధ్యాహ్నం కోర్టుకు హాజరుకాగా, వారికి షరతులు లేని బెయిల్ లభించింది.

ఈ దాడికి ఉపయోగించిన కత్తిని దాచడానికి నేరస్తుడికి సహకరించినందుకు దిగ్వా తల్లి కిరణ్ కౌర్ (53)ను అంతకుముందే దోషిగా నిర్ధరించారు. ఆమెకు జూలై 17న శిక్ష ఖరారు చేయనున్నారు.

(అదనపు రిపోర్టింగ్: కర్టిస్ లాంకాస్టర్, పీటర్ కుక్)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)