LGBTQ+: లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్‌గా తేలితే జైలుకే.. ఘనా కొత్త చట్టం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హ్యారీ సెకులిచాండ్, థామస్ నాడి
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
స్వలింగ సంపర్కాన్ని(హోమోసెక్సువాలిటీ), ఎల్జీబీటీక్యూ+ కార్యకలాపాల ప్రచారాన్ని నేరంగా పరిగణించే కొత్త బిల్లును ఘనా పార్లమెంట్ ఆమోదించింది.
లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ లేదా క్వీర్గా తేలితే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. నిషేధిత చర్యల గురించి పోలీసులకు 'రిపోర్ట్ చేసే బాధ్యత'ను కూడా ఈ బిల్లులో పొందుపరిచారు.
ఈ చట్టాన్ని ఆమోదించాలని 2025లో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు జాన్ డ్రమని మహామపై మత పెద్దలు ఒత్తిడి తెచ్చారు.
ఈ నిషేధాన్ని హ్యూమన్ రైట్స్ వాచ్‌తో సహా అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా విమర్శించాయి. ఇది ఎల్జీబీటీక్యూ+ ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టడమే కాకుండా, పౌరులు ఒకరిపై ఒకరు నిఘా ఉంచి ఫిర్యాదు చేసుకునేలా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నాయి.
బ్రిటిష్ వలసరాజ్యాల కాలం నాటి చట్టాల ప్రకారం ఘనాలో స్వలింగ సంబంధాలు ఇప్పటికే నిషేధంలో ఉన్నాయి.
ఇది ఘనా కుటుంబ, సాంస్కృతిక విలువలను కాపాడుతుందని పార్లమెంటులో ఈ బిల్లును ప్రతిపాదించిన రెవరెండ్ జాన్ న్టిమ్ ఫోర్డ్జోర్ చెప్పారు.
ఎల్జీబీటీక్యూఐ పద్ధతులను ఎదుర్కోవడంలో ప్రస్తుత చట్టాలను ఈ కొత్త నిషేధాలు మరింత బలంగా, సమగ్రంగా, కఠినంగా మారుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఎల్జీబీటీక్యూ+ ప్రజలకు మద్దతిచ్చే 'మిత్రులు' (అల్లీ) కూడా జైలు శిక్షను ఎదుర్కోవాల్సి రావచ్చు.


ఫొటో సోర్స్, Reuters
ఎవరికి మినహాయింపు?
ఎల్జీబీటీక్యూ+ అంశాలపై రిపోర్ట్ చేసే లేదా గే ప్రజలకు వైద్యం, ఇతర సేవలు అందించే న్యాయ, మీడియా, ఆరోగ్య రక్షణ నిపుణులకు దీని నుంచి మినహాయింపులు ఇచ్చారు.
రాజధాని అక్రాలో ఈ చట్టాన్ని పరిశీలిస్తున్న రాజ్యాంగ, న్యాయ వ్యవహారాల కమిటీకి హ్యూమన్ రైట్స్ వాచ్ ఒక నివేదిక సమర్పించింది. ఈ బిల్లును పూర్తిగా పక్కన పెట్టాలని అందులో సిఫార్సు చేసింది.
ఘనా 2024లో కూడా ఇటువంటి బిల్లును ఆమోదించింది. అయితే న్యాయపరమైన సవాళ్ల కారణంగా మాజీ అధ్యక్షుడు అకుఫో-అడ్డో సంతకం చేయకపోవడంతో అది చట్టంగా మారలేదు.
అధ్యక్ష పదవిని స్వీకరించిన సమయంలో మహామ మాట్లాడుతూ... "పురుషుడు, స్త్రీ అనే రెండు లింగాలు మాత్రమే ఉంటాయనే సూత్రాలు, విలువలను నేను నమ్ముతాను. వివాహం అనేది పురుషుడు, స్త్రీ మధ్య మాత్రమే జరుగుతుంది" అని పేర్కొంటూ, ఈ బిల్లు ఆమోదానికి మద్దతు ఇస్తానని చెప్పారు.
ఆఫ్రికా దేశాల్లో కఠినంగా..
ఇటీవలి సంవత్సరాలలో పలు ఆఫ్రికా దేశాలు ఎల్జీబీటీక్యూ+ హక్కులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
సెనెగల్ పార్లమెంట్ మార్చిలో ఇటువంటి చట్టాన్నే ఆమోదించింది. ఇది స్వలింగ సంపర్కుల లైంగిక చర్యలకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తుంది. స్వలింగ సంపర్క(హోమోసెక్సువాలిటీ) ప్రచారాన్ని నేరంగా పరిగణిస్తుంది.
ఉగాండా 2023లో కొన్ని రకాల స్వలింగ సంపర్క చర్యలకు మరణశిక్షను ప్రవేశపెట్టింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























