You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా - ఇరాన్ కాల్పుల విరమణలో పాకిస్తాన్ పాత్రపై ఎన్నో ప్రశ్నలు.. చాలా విషయాలు ఇజ్రాయెల్‌కు తెలియదా?
ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ చర్చలలో పాకిస్తాన్ 'మధ్యవర్తి' పాత్రపై భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ బుధవారం సందేహం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్‌ను నమ్మదగిన దేశంగా ఇజ్రాయెల్ పరిగణించదని రూవెన్ చెప్పారు.
అమెరికాకు ఉపయోగపడేందుకు పాకిస్తాన్‌కు దాని సొంత కారణాలు ఉండొచ్చు, కానీ దక్షిణ లెబనాన్‌లో హిజ్బొల్లా స్థావరాలను నాశనం చేయడమే ఇజ్రాయెల్ లక్ష్యమని ఆయన అన్నారు.
వాస్తవానికి, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణను ప్రకటించినప్పుడు.. లెబనాన్‌పై ఎలాంటి దాడులు జరగవని కూడా చెప్పారు. కానీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనలో లెబనాన్‌పై సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టంగా పేర్కొన్నారు.
దీంతో కాల్పుల విరమణ మొదటి రోజే లెబనాన్ అంశంపై ఇజ్రాయెల్, పాకిస్తాన్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.
లెబనాన్‌పై దాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ అంటోంది.
ఇజ్రాయెల్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో రూవెన్ అజార్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘‘మేం పాకిస్తాన్‌ను నమ్మదగిన దేశంగా చూడం. అమెరికా తన ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించుకుందని భావిస్తున్నా’’ అని అన్నారు.
కాల్పుల విరమణ దేశానికి పెద్ద ఎదురుదెబ్బగా ఇజ్రాయెల్ ప్రతిపక్షం చూస్తోంది.
ఈ మొత్తం విషయంలో ఇజ్రాయెల్‌పై పూర్తి విశ్వాసం కనబరచలేదని అక్కడి నిపుణులు కూడా అంటున్నారు.
పాకిస్తాన్‌కు ట్రంప్ ఏం చెప్పారు?
కాల్పుల విరమణకు అంగీకరించేలా ఇరాన్‌ను ఒప్పించాలని పాకిస్తాన్‌పై ట్రంప్ ప్రభుత్వం కొన్ని వారాలుగా ఒత్తిడి చేస్తూనే ఉందని బ్రిటిష్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది.
‘‘పాకిస్తాన్ నేతృత్వంలోని తెరవెనుక కార్యకలాపాల గురించి తెలిసిన ఐదుగురు వ్యక్తులు తెలిపిన సమాచారం ప్రకారం, పెరుగుతున్న చమురు ధరల ఆందోళన. ఇరాన్ పాలన బలపడుతుండటంతో కలవరపడిన ట్రంప్, మార్చి 21 నుంచే కాల్పుల విరమణకు మొగ్గు చూపుతున్నారు. ఆ రోజే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను 'తుడిచిపెట్టేస్తానని' ట్రంప్ మొదటిసారిగా బెదిరించారు" అని రాసింది.
అయితే, ఇంకా అనేక ఇబ్బందులు మిగిలే ఉన్నాయని పాకిస్తానీ అధికారులు భయపడుతున్నారని కూడా ఎఫ్‌టీ రాసింది.
ఇజ్రాయెల్ - హిజ్బొల్లా మధ్య పోరాటం కొనసాగుతూనే ఉంది. అలాగే ఇజ్రాయెల్ అధికారులు లెబనాన్‌ను యుద్ధ విరమణలో భాగం కాదని స్పష్టం చేశారు.
పాకిస్తాన్‌లో కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)లోని కొన్ని వర్గాలు యుద్ధ విరమణను బలహీనపరచడానికి గల్ఫ్ ప్రాంతంలోని స్థావరాలపై దాడులు కొనసాగించవచ్చన్న భయాలు కూడా పాకిస్తాన్‌లో ఉన్నాయి.
పాకిస్తాన్ గతేడాది సౌదీ అరేబియాతో పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది. ఇరాన్ సౌదీ అరేబియాలోని పలు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తుండటంతో, సౌదీ అరేబియాకు ఆగ్రహం కలిగింది.
అయినప్పటికీ సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య ఎవరి పక్షం వహించినట్లు పాకిస్తాన్ కనిపించలేదు. తటస్థ వైఖరిని కొనసాగించింది.
‘‘ఇజ్రాయెల్‌కు పాకిస్తాన్‌పై నమ్మకం లేకపోయినా, అమెరికా ఉన్నంతకాలం పాకిస్తాన్ ఇజ్రాయెల్ ప్రయోజనాలకు హాని తలపెట్టలేదు’’ అని ఆంగ్ల వార్తాపత్రిక 'ది హిందూ'కు పాకిస్తాన్ మాజీ కరస్పాండెంట్, విదేశీ వ్యవహారాల నిపుణురాలు నిరుపమా సుబ్రమణియన్ అన్నారు.
‘‘నిరుడు సౌదీ అరేబియా – పాకిస్తాన్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం వాస్తవానికి ఇరాన్‌కు వ్యతిరేకంగానే ఉంది. పాకిస్తాన్ ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాల్లో ఏకైక అణుశక్తి కలిగిన దేశం. సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందం అమెరికా, ఇజ్రాయెల్ అనుమతి లేకుండా అమలు జరగదని భావిస్తున్నా’’ అని ఆమె చెప్పారు.
"చాలామంది ఈ రక్షణ ఒప్పందం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకమని భావించారు. కానీ, అది నిజం కాదు. సౌదీ అరేబియాకు శత్రువు ఇరాన్. ఇజ్రాయెల్ కాదు. ఇరాన్ నుంచి తనను తాను రక్షించుకోవడానికి సౌదీ అరేబియాకు అణుశక్తి కలిగిన బాడీగార్డ్ అవసరం. అది పాకిస్తాన్ మాత్రమే కాగలదు. పాకిస్తాన్ నమ్మదగినది కాదని ఇజ్రాయెల్ చెబుతూ ఉండొచ్చు, అమెరికా ఉన్నంతకాలం పాకిస్తాన్ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం లేదు’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ విషయంలో ఆందోళనలు
‘‘ఈ ప్రాంతంలో తుర్కియే, ఖతార్, ఇతర ముస్లిం దేశాలు, అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్‌తో కలిసి ఒక కొత్త కూటమి ఆవిర్భవిస్తోంది" అని ఈ ఏడాది ఫిబ్రవరిలో జెరూసలెంలో జరిగిన ప్రధాన అమెరికన్ యూదు సంస్థల అధ్యక్షుల సదస్సులో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ అన్నారు.
ఈ కూటమి ఇజ్రాయెల్‌పై శత్రుత్వాన్ని పెంచుతోందని, సౌదీ అరేబియాను ప్రభావితం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని బెన్నెట్ అన్నారు.
ఇజ్రాయెల్‌కు తుర్కియే కొత్త ముప్పుగా మారుతోందని, అయితే ఆ విషయం ప్రభుత్వానికి తెలియదని బెన్నెట్ ఆ సమావేశంలో హెచ్చరించారు.
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఇరాన్‌పై తన సైనిక చర్యలను నిలిపివేయడానికి ఇజ్రాయెల్ అంగీకరించినప్పటికీ.. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం పట్ల జెరూసలేం అధికారులు అప్రమత్తంగానే ఉన్నారని ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది.
‘‘బుధవారం రాత్రి కాల్పుల విరమణ ప్రకటించకముందే, ట్రంప్ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా తాము అంగీకరిస్తామని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా ప్రభుత్వానికి సంకేతాలిచ్చారు. అయినప్పటికీ, తమ కీలక అంశాలలో కొన్ని తుది ఒప్పందంలో ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇజ్రాయెల్ ప్రస్తుతం ఇరాన్‌లో తన సైనిక కార్యకలాపాలను నిలిపివేసింది, కానీ లెబనాన్‌లో దాడులను కొనసాగిస్తోంది" అని ఇజ్రాయెల్ ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక హారెట్జ్ రాసింది.
‘‘ఇజ్రాయెల్‌కు నేరుగా సంబంధించిన నాలుగు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. మొదటిది ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించినది, ఇందులో శుద్ధి చేసిన యురేనియం గురించి స్పష్టత లేదు. అంతేకాకుండా, అస్థిత్వ ముప్పుగా నెతన్యాహు అభివర్ణించిన, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని వదిలేసేందుకు ఇరాన్ నుంచి ఇప్పటికీ ఎలాంటి హామీ లేదు" అని హారెట్జ్ పేర్కొంది.
ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యాయిర్ లాపిడ్ రెండు వారాల కాల్పుల విరమణను ఒక రాజకీయ విపత్తుగా అభివర్ణించారు.
"అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్‌కు ఎలాంటి పాత్ర లేదు. కీలకమైన జాతీయ భద్రతా అంశాలపై ఫోన్ ద్వారా ఆదేశాలు అందుకునే పరాధీన దేశంగా నెతన్యాహు మమ్మల్ని మార్చేశారు" అని బుధవారం ఒక పత్రికా సమావేశంలో లాపిడ్ అన్నారు.
"నెతన్యాహు ఇజ్రాయెల్‌ను ఒక విపత్తు నుంచి మరొక విపత్తులోకి నడిపిస్తున్నారు. గత మూడేళ్లుగా, ఆయన వైఫల్యానికి ఇజ్రాయెల్ పౌరులు భారీ మూల్యం చెల్లిస్తున్నారు" అని ఆయన ఆరోపించారు.
ఇజ్రాయెల్‌కు ముందు చెప్పలేదా?
కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఇజ్రాయెల్‌కు ఆలస్యంగా తెలియజేశారని అమెరికన్ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది.
చర్చలలో అధికారికంగా భాగస్వామ్యం కాని ఇజ్రాయెల్, తుది ఒప్పందం గురించి తమను సంప్రదించనందుకు అసంతృప్తిగా ఉందన్న విషయాన్ని మధ్యవర్తులతోపాటు ఈ విషయం తెలిసిన వైట్ హౌస్ అధికారి ఒకరు వెల్లడించినట్లు పేర్కొంది.
కాల్పుల విరమణ ప్రకటించడానికి కొద్దిసేపటి ముందే అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి చెప్పారని, కాల్పుల విరమణకు నెతన్యాహు అంగీకరించారని ఆ అధికారి చెప్పారు.
"ఇజ్రాయెల్ ఇరాన్, లెబనాన్‌లను వేర్వేరు దేశాలుగా పరిగణిస్తున్నందున, ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చాలనే ప్రణాళికలతో సహా, ఒప్పందంలోని నిబంధనలతో ఇజ్రాయెల్ అధికారులు సంతృప్తిగా లేరని మధ్యవర్తులు తెలిపారు" అని వాల్‌స్ట్రీట్ రాసింది.
"ఈ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదు. ఇది చర్చలకు మధ్యవర్తిత్వం చేస్తున్న పాకిస్తాన్ ముందుగా చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఉంది" అని నెతన్యాహు బుధవారం ఉదయం చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక 'జెరూసలేం పోస్ట్' సంపాదకులు జ్వికా క్లైన్, ఏప్రిల్ 9న ఒక కామెంట్‌లో, ‘‘ప్రస్తుత పరిస్థితికి సరైన చారిత్రక పోలిక 2003 నాటి ఇరాక్ కాదు, ప్రచ్ఛన్న యుద్ధమే. అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ బెర్లిన్ గోడను కూల్చివేయలేదు. దానిని నిలబెట్టుకోవడం అసాధ్యం చేశారు. దశాబ్దాల ఒత్తిడి సోవియట్ యూనియన్‌ను అస్థిరపరిచింది, మిగిలిన పనిని తూర్పు యూరప్ ప్రజలు చేశారు’’ అని రాశారు.
"ట్రంప్ , నెతన్యాహు ఇదే తర్కాన్ని ఇరాన్‌పై అమలు చేశారు. ఇస్లామిక్ పాలన అధికార మూలాలను విచ్ఛిన్నం చేసి, ఇరాన్ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నను ఇరాన్ ప్రజలకే వదిలివేయాలి. కానీ, అధ్యక్షుడు జార్జ్ బుష్ వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన పైనుంచి ప్రజాస్వామ్యాన్ని రుద్దడానికి ప్రయత్నించారు. ఆ గందరగోళం ఒక తరం పాటు కొనసాగింది" అని జ్వికా క్లైన్ పేర్కొన్నారు.
పాకిస్తాన్‌తో ఇజ్రాయెల్ సంబంధాలు
ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా పాకిస్తాన్ గుర్తించలేదు. దీనివల్ల ఇరుదేశాల మధ్య ఎటువంటి దౌత్య సంబంధాలు లేవు.
పాకిస్తాన్‌లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తరచూ హింసాత్మక నిరసనలు జరుగుతుంటాయి. ఇజ్రాయెల్‌తో పాకిస్తాన్‌కు నేరుగా ఎలాంటి వివాదం లేదా ఘర్షణ లేనప్పటికీ, అది ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా అంగీకరించలేదు.
అరబ్ దేశాలతో ఇస్లామిక్ ఐక్యతను ప్రదర్శించడం కోసమే పాకిస్తాన్ ఇలా వ్యవహరిస్తోంది.
అయితే, అరబ్ దేశాలే ఇజ్రాయెల్‌కు దగ్గరవుతున్నప్పుడు, పాకిస్తాన్‌కు ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఉన్న ఇబ్బంది ఏమిటి?
దీనికి సమాధానం 2020లో నాటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇచ్చారు.
‘‘మిగిలిన దేశాలు ఏం చేసినా, మా వైఖరి స్పష్టంగా ఉంది. 1948లో మహమ్మద్ అలీ జిన్నా చెప్పినట్లుగా, పాలస్తీనియన్లకు వారి హక్కులు లభించే వరకు మేము ఇజ్రాయెల్‌ను అంగీకరించలేం’’ అని ఇమ్రాన్ స్పష్టం చేశారు.
పాకిస్తాన్ గనుక ఇజ్రాయెల్‌ను గుర్తిస్తే, అమెరికాతో ఆ దేశ సంబంధాలు మెరుగుపడతాయని చాలామంది వాదిస్తారు. కానీ, పాకిస్తాన్ సామాన్య ప్రజలలో ఉన్న ఇజ్రాయెల్ వ్యతిరేక భావన తరచుగా వీధుల్లో నిరసనల రూపంలో కనిపిస్తుంది.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మాట్లాడుతూ.. ఒకవేళ ఇజ్రాయెల్, పాలస్తీనా ఏదైనా శాంతి ఒప్పందం చేసుకుంటే, ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.
2005లో నాటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరి, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి సిల్వాన్ షాలోమ్ ఇస్తాంబుల్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని ఎర్దోవాన్ ఏర్పాటు చేశారని చెబుతుంటారు. ఈ భేటీపై పాకిస్తాన్‌లో అప్పట్లో పెద్దయెత్తున దుమారం రేగింది.
ఖుర్షీద్ కసూరితో సమావేశం అనంతరం సిల్వాన్ షాలోమ్ మాట్లాడుతూ, ‘‘మా చర్చలు చాలా ముఖ్యమైనవి. ఇవి కేవలం పాకిస్తాన్‌తో మా సంబంధాలకే కాదు, మొత్తం ముస్లిం ప్రపంచానికి కూడా చాలా కీలకమైనవి. అరబ్ ముస్లిం దేశాలన్నింటితో పాటు మేము పాకిస్తాన్‌తో కూడా దౌత్య సంబంధాలను కోరుకుంటున్నాం’’ అని చెప్పారు.
ఇజ్రాయెల్‌ను పాకిస్తాన్‌లో శత్రువుగా చూసినప్పటికీ, ఇజ్రాయెల్‌లో మాత్రం పాకిస్తాన్ పట్ల అలాంటి ఆగ్రహం వీధుల్లో కనిపించదు.
2018లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో నెతన్యాహు మాట్లాడుతూ, ‘‘ఇజ్రాయెల్ పాకిస్తాన్‌కు శత్రువు కాదు, పాకిస్తాన్ కూడా మాకు శత్రువు కాకూడదు" అని అన్నారు.
ఆ తర్వాత పాకిస్తాన్‌లో ఇజ్రాయెల్ గురించి పునరాలోచించాలనే చర్చలు మెల్లగా మొదలయ్యాయి.
కానీ, అప్పటి పాకిస్తాన్ సెనేట్ చైర్మన్ రజా రబ్బానీ ముస్లిం ప్రపంచాన్ని హెచ్చరిస్తూ, ‘‘భారత్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఏర్పడుతున్న కూటమి ముస్లిం ప్రపంచానికి అతిపెద్ద ముప్పు’’ అని వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)