ఇరాన్‌ను కాల్పుల విరమణకు ఒప్పించింది చైనాయా? భారత్‌తోనూ చైనా మాట్లాడిందా?

చదివే సమయం: 4 నిమిషాలు

ఇరాన్‌, అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ కుదరడంలో పాకిస్తాన్ పాత్రపై చర్చ జరుగుతోంది. మరోవైపు చైనా పాత్ర కూడా ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

చర్చలకు ఇరాన్‌ను చైనా ఒప్పించిందని తాను నమ్ముతున్నట్టు ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో ట్రంప్ చెప్పారు.

గల్ఫ్, మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతల పునరుద్ధరణలో నిర్మాణాత్మక పాత్రను పోషిస్తూనే ఉంటామని చైనా తెలిపింది.

ఇరాన్ నాగరికత మొత్తాన్ని నాశనం చేస్తామని ఏప్రిల్ 7న ట్రంప్ బెదిరించారు.

కానీ అర్ధరాత్రి దాటాక రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించారు.

మొదట పాకిస్తాన్, ఇప్పుడు చైనా

బుధవారం(ఏప్రిల్ 8) తెల్లవారుజామున ట్రూత్ సోషల్‌లో చేసిన ఒక పోస్టులో రెండు వారాల కాల్పుల విరమణను ట్రంప్ ప్రకటించారు.

పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లతో మాట్లాడిన తర్వాత తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు.

ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో కాల్పుల విరమణలో చైనా పాత్రను డోనల్డ్ ట్రంప్ అంగీకరించారు.

ఆ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఒప్పందానికి అంగీకరించేలా ఇరాన్‌ను చైనా ఒప్పించిందా అని ట్రంప్‌ను అడగ్గా ఆ ప్రశ్నకు ట్రంప్ ‘అవును.. వారు ఒప్పించారు’ అని బదులిచ్చారు.

ట్రంప్ వచ్చే నెల చైనా పర్యటనకు వెళ్తారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమవుతారు.

ట్రంప్ ప్రకటనపై చైనా ఏమంది?

అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది.

ఒక బాధ్యతాయుతమైన ప్రధాన దేశంగా గల్ఫ్, మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడంలో చైనా నిర్మాణాత్మక పాత్రను పోషిస్తూ, తన వంతు సహకారాన్ని కొనసాగిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ బుధవారం తెలిపారు .

చైనాకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనను ధ్రువీకరిస్తారా అని ఒక విలేకరి మావో నింగ్‌ను అడిగారు.

ఒకవేళ చైనా కూడా ఇందులో భాగమైతే, ఒప్పందంలోని ఏ అంశాలపై అంగీకారం కుదిరిందని కూడా ప్రశ్నించారు.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి దీనికి ప్రత్యక్ష సమాధానం ఇవ్వలేదు. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి శాంతిని ప్రోత్సహించడానికి, యుద్ధాన్ని నివారించడానికి చైనా గట్టి కృషి చేస్తోందని అన్నారు.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి 26 దేశాల విదేశాంగ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడారని కూడా తెలిపారు. మధ్యప్రాచ్య సమస్యలపై చైనా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కూడా మధ్యప్రాచ్యం, గల్ఫ్ ప్రాంతంలో పలుమార్లు పర్యటించారు.

భారత్‌లో చైనా రాయబారి ఏం చెప్పారు?

ఇరాన్ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి తాను, విదేశాంగ మంత్రి వాంగ్ యి ఫోన్‌లో మాట్లాడుకున్నట్టు భారత్‌లో చైనా రాయబారి జు ఫీహాంగ్ చెప్పారు.

చైనా విదేశాంగ మంత్రి చర్చలు జరిపిన దేశాల గ్రాఫిక్ జాబితాను కూడా ఫీహాంగ్ పోస్ట్ చేశారు. ఈ దేశాల జాబితాలో భారత్, అమెరికా లేవు.

గల్ఫ్, మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించేందుకు చైనా, పాకిస్తాన్‌లు సంయుక్తంగా ఐదు సూత్రాల ప్రతిపాదనను సమర్పించాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది.

అయితే ఈ ఐదు అంశాలు ఏంటనేవి చైనా వెల్లడించలేదు.

అదే సమయంలో ఇరాన్ నుంచి పది సూత్రాల ప్రతిపాదన అందిందని, దానిని చర్చలకు ఆచరణాత్మక ప్రాతిపదికగా పరిగణిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా, ఇరాన్‌ మధ్య వివాదాస్పదంగా ఉన్న దాదాపు అన్ని ముఖ్యమైన అంశాలపై ఇప్పటికే అంగీకారం కుదిరిందని, అయితే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసి, అధికారికంగా అమలు చేయడానికి ఈ రెండు వారాల సమయం పడుతుందని ట్రంప్ అంటున్నారు.

హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ అంగీకరించిందని, ఆ తర్వాత కాల్పుల విరమణ జరుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)