రూపాయి విలువ బలహీనపడటానికి కారణమేంటి, దీనిని అధిగమించడానికి భారత్ ఏం చేస్తోంది?

భారతదేశం, ఆర్థిక వ్యవస్థ, రూపాయి, అమెరికా, డాలర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

భారత్ ఆర్థిక వృద్ధి రేటు బాగున్నా, 2018 నుంచి రూపాయి విలువ ఏటా బలహీనపడుతూనే ఉంది.

నరేంద్ర మోదీని 2013లో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు, రూపాయి విలువ పతనంపై ఆయన అప్పటి ప్రభుత్వంపై ఓ బలమైన ప్రచారం చేశారు.

ఆ సమయంలో బాలీవుడ్ తారలు, ఆధ్యాత్మిక గురువులు, అనేకమంది సెలబ్రిటీలు కూడా డాలర్‌తో పోలిస్తే భారత్ రూపాయి విలువ 60 స్థాయికి చేరిందని అంటుండేవారు. అయితే ప్రస్తుత బీజేపీ పాలనలో రూపాయి విలువ నిరంతరం పడిపోతూ దాదాపు 97 రూపాయిలకు చేరువైనా వీరెవరూ ఎందుకు స్పందించడంలేనే ప్రశ్న ఇటీవల తరచూ సామాజిక మాధ్యమాలలో కనిపిస్తోంది.

ఒకవేళ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 100 రూపాయలు కూడా దాటిపోవచ్చనే భయం ఏర్పడితే ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడే అవకాశం ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌లో రూపాయి విలువ బలహీనపడటమంటే దిగుమతులు ఖరీదైనవిగా మారాయని అర్థం. దీనివల్ల చమురు, వంటగ్యాస్, ఎరువులు, ఎలక్ట్రానిక్స్ వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. వీటిలో చాలావరకు భారత్ విదేశాల నుంచే కొనుగోలు చేస్తోంది.

అయితే విదేశాల్లో పనిచేసే భారతీయులు పంపే డబ్బుపై ఆధారపడే కుటుంబాలకు రూపాయి క్షీణత ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తుంది. ఎందుకంటే, ప్రతి డాలర్‌కు బదులుగా ఎక్కువ రూపాయలు లభిస్తాయి.

ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్ (విదేశీ నగదు బదిలీ) పొందుతున్న దేశాలలో భారత్ ఒకటి. 2025 మార్చి నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, ప్రవాస భారతీయులు 135 బిలియన్ డాలర్లకు మించిన నగదును భారత్‌కు పంపారు.

అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా పర్షియన్ గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న లక్షలాది మంది భారతీయుల నుంచి వచ్చే నగదుపై ప్రభావం పడొచ్చు.

భారతదేశం, ఆర్థిక వ్యవస్థ, రూపాయి, అమెరికా, డాలర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2018 నుంచి ప్రతి ఏటా రూపాయి విలువ క్షీణిస్తోంది.

ఆందోళనకర పరిస్థితులు..

రూపాయి ప్రస్తుత పరిస్థితి భారత ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరంగా మారింది. ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దాదాపు 97కి పడిపోయింది.

2026 లో ఇంకా పూర్తిగా ఐదు నెలలు కూడా పూర్తిగా గడవకముందే, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 7.5% క్షీణించింది.

రూపాయి క్షీణతను అదుపు చేయడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వాటి ప్రభావం ప్రస్తుతానికి కనిపించడం లేదు. ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను రెండింతల కంటే ఎక్కువగా పెంచింది.అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. దీంతోపాటు వంటనూనెల దిగుమతులపై ఆంక్షలు విధించే యోచనలోనూ ఉంది. మరోవైపు, ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు దేశీయ కరెన్సీ మార్కెట్లో డాలర్లను విక్రయిస్తూ పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తోంది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాల దాడి తర్వాత చమురు ధరలు విపరీతంగా పెరగడం భారత్ వాణిజ్య లోటును మరింత పెంచుతోంది. రూపాయి క్షీణత భారత షేర్ మార్కెట్‌పై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది.

విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది భారత షేర్ మార్కెట్ నుంచి రికార్డు స్థాయిలో 23 బిలియన్ డాలర్లను (దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పైమాటే) ఉపసంహరించుకున్నారు.

రూపాయి బలహీనపడటం వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు డాలర్ల రూపంలో వచ్చేలాభాలు తగ్గుతాయి. అందుకే డాలర్ ముందు బలంగా నిలబడగలిగే కరెన్సీలు ఉన్న దేశాల వైపు వారు మొగ్గు చూపుతున్నారు. రూపాయి భవిష్యత్తులో మరింత బలహీనపడే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 100 మార్కుకు చేరుకోవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఇది అసాధ్యమని భావించిన స్థాయి.

భారతీయ కంపెనీల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐల)పై కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని, అలాగే ఎగుమతిదారులు తమ విదేశీ కరెన్సీ ఆదాయాన్ని త్వరగా భారత్‌కు తిరిగి తీసుకువచ్చేలా కఠినమైన నిబంధనలను అమలు చేసే అవకాశం ఉందని సిటీ గ్రూప్ భావిస్తోంది.

భారతదేశం, ఆర్థిక వ్యవస్థ, రూపాయి, అమెరికా, డాలర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పెరుగుతున్న చమురు ధరల ప్రభావం కూడా రూపాయిపై పడుతోంది

1. పెరుగుతున్న చమురు ధరలు

భారతదేశం తన అవసరాలకు సరిపడా చమురులో దాదాపు 90 శాతాన్ని దిగుమతి చేసుకుంటోంది. ముడి చమురు ధరల పెరిగిన కారణంగా భారత్ మునుపటి కంటే ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది.

గతేడాది అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత్‌ పై టారిఫ్‌లు పెంచడంతో రూపాయి విలువ పతనం మరింత వేగవంతమైంది. ఆ తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేయడంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనివల్ల రూపాయిపై మరోసారి ఒత్తిడి పెరిగింది, ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంది.

రూపాయి బలహీనపడటానికి అసలు కారణం కేవలం బాహ్య అంశాలే కాదు, దేశీయ నిర్మాణ లోపాలు కూడా ఉన్నాయని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ ఈ లోపాలను అధిగమించలేకపోయారు.

ఆసియాలో 2025లో అత్యంత అధ్వాన్నమైన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా రూపాయి నిలిచింది, 2026 లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది.

2025 లో రూపాయి పతనానికి కారణాలు... ట్రంప్ విధించిన రెండంకెల టారిఫ్‌లు, షేర్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, ఆర్థిక వృద్ధి రేటు మందగించడం.

ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని, ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తాయని, భారత్ 'కరెంట్ అకౌంట్ లోటును' మరింత పెంచుతాయనే భయాలు ప్రస్తుత బలహీనతకు అద్దం పడుతున్నాయి.

బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ అంచనాల ప్రకారం... ఒకవేళ ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరి, గ్యాస్ ధరలు యుద్ధానికి ముందు ఉన్న స్థాయి కంటే 50 శాతం పెరిగితే, భారతదేశ దిగుమతి బిల్లు ప్రతి నెలా 5 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది.

భారతదేశం, ఆర్థిక వ్యవస్థ, రూపాయి, అమెరికా, డాలర్

ఫొటో సోర్స్, Getty Images

2. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి..

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, 2026 ఫిబ్రవరిలో 728 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత విదేశీ మారక నిల్వలు ఇప్పుడు దాదాపు 690 బిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద విదేశీ మారక నిల్వలు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. కానీ దిగుమతి బిల్లులు భారీగా పెరుగుతుండటం వల్ల ఈ నిల్వలపై ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది.

మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, భారత్ కేవలం ఇంధన దిగుమతుల కోసమే 174 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.

ఇదే కాలంలో బంగారు దిగుమతులు 72 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వెండి దిగుమతులు దాదాపు 150 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల దిగుమతి కూడా 77 శాతం పెరిగి 14.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

గమనించాల్సిన అంశమేమిటంటే, కేవలం నాలుగు సంవత్సరాల కాలంలోనే చమురు, బంగారం, వెండి, ఎరువులు... ఈ నాలుగు వస్తువులకు సంబంధించి భారత్ దిగుమతి బిల్లు రెండింతల కంటే ఎక్కువైంది.

దిగుమతి బిల్లు పెరిగినప్పుడు సహజంగానే డాలర్లు ఎక్కువగా ఖర్చవుతాయి. మన దగ్గర డాలర్ల నిల్వలు తగ్గినప్పుడు రూపాయి విలువ బలహీనపడుతుంది. అందుకే, ప్రభుత్వం ఇప్పుడు పెరుగుతున్న దిగుమతుల ఒత్తిడికి బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తోంది.

3. దిగుమతులే ఎక్కువ

భారత్ ఇప్పటికీ ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా చేసుకుంటోంది. అమెరికాకు జరిగే భారతీయ ఎగుమతులపై ట్రంప్ టారిఫ్‌ల ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది.

అయితే, దీనిని అధిగమించడానికి భారత్ ప్రస్తుతం పలు దేశాలతో 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల'ను కుదుర్చుకుంటోంది.

దేశం నుంచి పెట్టుబడులు వెలుపలికి పోతున్నప్పుడు, విదేశీ మారక ద్రవ్య ప్రవాహం మందగించినప్పుడు... ప్రభుత్వం ఇప్పుడెందుకు 'పానిక్ బటన్' నొక్కడం ప్రారంభించిందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి, బంగారు దిగుమతులను పరిమితం చేయడాన్ని మిగతా వాటితో పోలిస్తే కొంత తక్కువ ఇబ్బందికరమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఏప్రిల్‌లో భారత్ టోకు ద్రవ్యోల్బణ రేటు 8.3 శాతానికి చేరుకుంది. గత నాలుగేళ్లలో నమోదైన అత్యంత వేగవంతమైన పెరుగుదల ఇది.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం (లోటు) జనవరిలో 34.68 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 25.05 బిలియన్ డాలర్లుగా ఉంది.

భారతదేశం, ఆర్థిక వ్యవస్థ, రూపాయి, అమెరికా, డాలర్

ఫొటో సోర్స్, Getty Images

ఆర్బీఐ మాజీ గవర్నర్ ఏమన్నారంటే..

ఆంగ్ల దినపత్రిక 'హిందుస్తాన్ టైమ్స్'లో మే 20న ఆర్బీఐ మాజీ గవర్నర్ డి.సుబ్బారావు ఇలా రాశారు:

"రూపాయి బలహీనపడటం కేవలం ఇటీవలి సంక్షోభం వల్ల జరిగింది కాదు. నిజానికి, రూపాయి గత కొన్నేళ్ల నుంచి నిరంతర ఒత్తిడిలోనే ఉంది. విదేశీ, దేశీయ కారణాల వల్ల భారతదేశం నుంచి పెట్టుబడులు వెలుపలికి పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన అవకాశాల కోసం వెతుకుతూ విదేశీ పెట్టుబడిదారులు భారత్ నుంచి డబ్బును ఉపసంహరించుకుని ఇతర మార్కెట్ల వైపు మళ్లుతున్నారు."

ప్రస్తుతం అంతర్జాతీయంగా పెట్టుబడులు సాంకేతిక ఆధారిత ఆర్థిక వ్యవస్థల వైపు, ముఖ్యంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), బయోటెక్, డేటా సెంటర్ల వైపు ఆకర్షితమవుతున్నాయి. భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థే అయినప్పటికీ, ఈ అత్యాధునిక సాంకేతిక రంగాలలో దాని పాత్ర పరిమితంగానే కనిపిస్తోంది. పెట్టుబడులన్నీ ఇలాంటి ఆవిష్కరణల (ఇన్నోవేషన్) ఆధారిత ఆర్థిక వ్యవస్థల వైపు వెళ్తుండటంతో, రూపాయిపై ఒత్తిడి పెరగడం దాదాపు ఖాయం’’ అని రాశారు.

‘‘భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు 700 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారక నిల్వలు ఉన్న దేశాలలో భారత్ కూడా ఒకటి. కానీ ఇది అతి విశ్వాసానికి దారితీయకూడదు. మామూలురోజులలో ఈ మొత్తం చాలా ఎక్కువగా కనిపించవచ్చు. కానీ నిజంగా దీనిపై ఎంతవరకు ఆధారపడవచ్చో సంక్షోభ సమయాలలోనే తెలుస్తుంది’’ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)