‘కాక్రోచ్ జనతా పార్టీ’: ఈ పార్టీకి సోషల్ మీడియాలో అంతటి ఫాలోయింగ్ ఎలా సాధ్యమైంది, దీని వ్యవస్థాపకుడు ఎవరు?

ఫొటో సోర్స్, CJP
''కాక్రోచ్ జనతా పార్టీ''పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది.
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యువతను బొద్దింకలతో పోల్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన తర్వాత ఇది మొదలయింది. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పేరుతో వ్యంగ్యాత్మకంగా సోషల్ మీడియా ప్రచారం సాగుతోంది.
అయితే తన వ్యాఖ్యలపై జస్టిస్ సూర్యకాంత్ శనివారం వివరణ ఇచ్చారు. మీడియాలోని ఒక వర్గం తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆరోపించారు.
జస్టిస్ సూర్యకాంత్ ప్రకటన తరువాత ఓ వ్యంగ్య సామాజిక మాధ్యమ ప్రచారం ఊపందుకుంది. ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ ఈ ప్రచారానికి కేంద్ర బిందువుగా ఉంది.
మరోవైపు 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఫాలోవర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ )పేరు మీద ఒక వెబ్‌సైట్ క్రియేట్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి 96 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ వెబ్‌సైట్‌లో రెండు లక్షల మందికి పైగా సభ్యత్వం కోసం నమోదు చేసుకున్నారని చెబుతున్నారు.


ఫొటో సోర్స్, @abhijeet_dipke
ఏమిటీ సీజేపీ, ఎలా ప్రారంభమైంది?
అభిజిత్ దీపక్ అనే వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు, కన్వీనర్ అని ఆ పార్టీ వెబ్‌సైట్ చూపుతోంది.
తాను ఇలాంటి సామాజిక మాధ్యమ ప్రచారాన్ని ఎందుకు ప్రారంభించారో అభిజిత్ దీపక్ బీబీసీతో చెప్పారు.
‘‘యువత వ్యవస్థను విమర్శించినందుకు, అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు వారిని బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) చేసిన ఓ ప్రకటనను నేను ‘ఎక్స్’లో చూశాను. నాకది చాలా హాస్యాస్పదంగా అనిపించింది’’ అని చెప్పారు అభిజిత్.
''దేశ రాజ్యాంగానికి సీజేఐ సంరక్షకునిగా ఉండాలి. ఆ రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛను ఇస్తుంది. ఆ స్వేచ్ఛను కాపాడాల్సిన వ్యక్తే యువతను బొద్దింకలతో, పరాన్నజీవులతో ఎలా పోల్చగలరు?'' అన్నారు అభిజిత్.
''దీనిపై నాకు కోపం, నిరాశ కలిగాయి. నా అభిప్రాయాన్ని 'ఎక్స్'లో వ్యక్తం చేశాను. బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుందని ప్రశ్నించాను. దానికి జెన్ జెడ్, 25 ఏళ్లలోపు యువత నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘మనమందరం ఏకమై ఒక వేదికను సృష్టించుకోవాలి’ అని వాళ్లు అన్నారు''
‘‘దీంతో ఆన్‌లైన్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ' పేరుతో ఒక పేరడీ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. మీరు మమ్మల్ని బొద్దింకలు అని పిలిచారు కదా.. మంచిది...మేం ఆ పేరుతో పార్టీ ఏర్పాటు చేసుకుంటామని కాక్రోచ్ జనతా పార్టీ పెట్టా. ఈ పార్టీలో చేరడానికి సీజేఐ చెప్పిన, సోమరులు, నిరుద్యోగులు, నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండేవారే అర్హులనే నిబంధన పెట్టా’ అన్నారు అభిజిత్.
‘‘ఆయన (సీజేఐ) యువతను అవమానించడానికి ఏ పదాలు ఉపయోగించారో వాటినే మేం ఈ పార్టీలో సభ్యులుగా చేరడానికి అర్హతగా నిర్ణయించాం. కొన్ని గంటల్లోనే ఇది అద్భుతంగా పనిచేసింది. అనేకమంది దీనిపై స్పందించి పేర్లు నమోదు చేసుకోవడం ప్రారంభించారు.
ఆ తర్వాత ప్రజలు స్పందన గమనిస్తే, ఇది కేవలం ఒక జోక్ కాదని, యువత అసంతృప్తికి వేదికగా మారిందని అనిపించింది. దాంతో మేం ఒక వెబ్‌సైట్‌ను, ఒక పార్టీ మ్యానిఫెస్టోను తయారుచేశాం. మాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 96 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. రెండు లక్షల మందికి పైగా ప్రజలు బొద్దింక జనతా పార్టీలో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. భారత రాజకీయాల్లో సుదీర్ఘకాలం తర్వాత ఇలాంటిది జరిగింది'' అన్నారు అభిజిత్.

ఫొటో సోర్స్, www.instagram.com/cockroachjantaparty/
ఇంత ప్రచారం జరగడానికి కారణమేంటి?
చాలా మంది ప్రముఖులు కూడా అభిజిత్ దీపక్ ప్రచారానికి మద్దతు తెలిపారు.
"మాజీ క్రికెటర్, ఎంపీ కీర్తి ఆజాద్ ఆ పార్టీలో చేరాలనుకుంటున్నట్టు చెప్పారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా దీనికి మద్దతు తెలిపారు. చాలా మంది మాకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఇది రోజురోజుకూ పెరుగుతోంది" అన్నారు అభిజిత్.
ఇది డిజిటల్ మీడియాలో ఒక విప్లవాత్మక మార్పులాంటిదని డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు అన్నారు.
సోషల్ మీడియాలో లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఎలా వచ్చారు? అనే ప్రశ్నపై అభిజిత్ స్పందిస్తూ "ఇదంతా నేనే సాధించానని చెప్పను. ఈ ప్రజలందరిని ఏది ఏకం చేసిందో అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఏదైనా డిజిటల్ ఏజెన్సీ గానీ, రాజకీయ పార్టీ గానీ ఇలాంటిది చేసి ఉంటే ఇంత త్వరగా ఈ విజయాన్ని సాధించి ఉండేవారు కాదు. వారు ఎంత డబ్బు ఖర్చు చేశారన్నది ముఖ్యం కాదు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా ఇంతటి స్పందన వచ్చుండేది కాదు"
''సంవత్సరాలుగా యువతలో పేరుకుపోయిన నిరాశ, ఆగ్రహమే ఇంత భారీ స్థాయిలో ప్రతిస్పందనకు కారణం. ప్రభుత్వ వైఫల్యాల వల్ల యువత నిరుద్యోగులుగా మారారు. తమ నిరాశ, ఆగ్రహాన్ని వెళ్లగక్కడానికి వారికి ఒక వేదిక దొరికింది'' అన్నారు.

ఎవరీ అభిజిత్ దీపక్?
ఏ రాజకీయ పార్టీకైనా లేదా ఉద్యమానికైనా నాయకుడు అత్యవసరం. మరి అభిజిత్ దీపక్ ఎవరు?
"నేను మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌కు చెందినవాణ్ణి. గ్రాడ్యుయేషన్ కోసం పుణె వెళ్లాను. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ బృందంలో కొన్ని సంవత్సరాలు పనిచేసే అవకాశం నాకు లభించింది"
''ఆరోగ్యం, విద్యపై ఆ పార్టీ చేసిన కృషి నన్ను ఆకర్షించింది. భారత రాజకీయాల్లో మొట్ట మొదటిసారిగా జరుగుతున్న ఒక కొత్త విషయం అది. ఇప్పుడు బొద్దింక జనతా పార్టీ ఎంత కొత్తగా ప్రయత్నిస్తోందో అప్పుడు ఆప్ కూడా ఏదో కొత్త మార్పు తీసుకురాబోతోందని అనిపించింది. నేను ఆప్‌తో కొంతకాలం పనిచేశాను. ఆ తర్వాత ఇంకా ఎక్కువ చదువుకోవాలనిపించి ఇంట్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు ప్రిపేరవ్వడం మొదలుపెట్టాను. తర్వాత నాకు బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. నేను అక్కడ రెండేళ్ల నుంచి చదువుతూ పీజీ పూర్తి చేశాను.
బొద్దింకల జనతా పార్టీ మ్యానిఫెస్టో చాలా ఆసక్తికరంగా ఉంది.
"ఈ మ్యానిఫెస్టో భారత ప్రజాస్వామ్యం ప్రస్తుత స్థితిని, రాజకీయ పరిస్థితిని ప్రతి బింబిస్తుందని భావిస్తున్నాను. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా ఉండాల్సిన న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందడాన్ని మనం నిరంతరం చూస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి. న్యాయవ్యవస్థ కూడా ప్రభుత్వ ప్రభావంలో పడితే ఇంకేం మిగులుతుంది? అప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు?" అని ఆయన ప్రశ్నించారు.
''రెండో విషయం మహిళల ప్రాతినిధ్యం గురించి. చిన్నప్పటి నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తారని వింటూనే ఉన్నాను. కానీ ఇప్పటికీ అది జరగలేదు. మీరు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే వారికి 50 శాతం రిజర్వేషన్ ఇవ్వండి'' అని సూచించారు.

ఫొటో సోర్స్, CJP
భారత్‌లో జెన్ జెడ్ ఎలా ఉంది?
నేపాల్, శ్రీలంకల్లో జెన్ జెడ్ ఉద్యమాలు కనిపించాయి. నేపాల్‌లో నిరసనల తర్వాత ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. శ్రీలంక, నేపాల్‌లోని జెన్ జెడ్‌ను భారత్‌లోని జెన్ జెడ్‌తో పోల్చడంపై అభిజిత్ ఏమనుకుంటున్నారు?
‘‘అలా పోల్చడం 'పెద్ద అవమానం' అవుతుంది. ఎందుకంటే వారు హింసను ప్రేరేపించడం లేదని’’ అభిజిత్ అభిప్రాయపడ్డారు.
"భారతీయ జెన్ జెడ్ తమ అసంతృప్తిని వ్యంగ్యాత్మక రూపంలో వ్యక్తం చేస్తున్నారు. బొద్దింకల వేషధారణలో వారు యమునా నదిని శుభ్రం చేస్తూ చెత్తను తొలగిస్తున్నారు. దీని ద్వారా వారు వ్యవస్థను ఎగతాళి చేస్తున్నారు. వారు హింసను ప్రేరేపించడానికి వీధుల్లోకి రావడం లేదు. ఒకవేళ రేపు వీధుల్లోకి వచ్చినా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగానే వస్తారు. ఈ జెన్ జెడ్ తరం మన కేంద్ర మంత్రి వర్గం కంటే ఎక్కువ విద్యావంతులు. మనల్ని చదువులేని వారు ఎందుకు పాలిస్తున్నారని మనం ప్రశ్నించుకోవాలి" అని ఆయన బదులిచ్చారు.
బొద్దింక జనతా పార్టీ భవిష్యత్తు ఏంటి? అది కేవలం ఒక వ్యంగ్య సోషల్ మీడియా ప్రచారంగానే మిగిలిపోతుందా? అనే ప్రశ్నలకు ఇది ఆరంభం మాత్రమేనని, రేపు మరిన్ని యువజన సంస్థలు పుట్టుకొస్తాయని అభిజీత్ సమాధానమిచ్చారు.
"ప్రస్తుత రాజకీయ వ్యవస్థతో యువత విసిగిపోయింది. రాబోయే కొన్నేళ్లలో యువత మార్పును కోరడం మీరు చూస్తారు. ఎందుకంటే గత 10-12 ఏళ్లుగా యువత 'హిందూ-ముస్లిం' ప్రబోధాలు తప్ప మరేమీ వినలేదు"
యువత ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలనుకుంటోంది. సాంకేతికంగా అభివృద్ధి చెందాలి, ఉపాధి లభించాలి. ఇకపై మనం ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో మనల్ని మనం పోల్చుకోవాలి. నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో మనల్ని మనం ఇంకెంతకాలం పోల్చుకుంటూ ఉంటాం? భారతీయ జెన్ జెడ్ ఇదే కోరుకుంటోంది. తమను బొద్దింకల్లా చూడటాన్ని వారు ఇష్టపడటం లేదు.
అమెరికా నుంచి భారత్‌కు తిరిగొస్తారా అన్న ప్రశ్నకు తప్పకుండా వస్తానని ఆయన బదులిచ్చారు.
"గత వారమే నా గ్రాడ్యుయేషన్ పూర్తయింది. నేను భారత్ వచ్చి ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తాను. ఎందుకంటే ప్రజలు ఏకమవుతున్నారు. వారు మంచి మార్పును కోరుకుంటున్నారు. మా సంస్థ స్థాపించిన నాలుగో రోజే మాకు 200,000 కంటే ఎక్కువ మంది నమోదిత సభ్యులు ఉన్నారు. ఇది జెన్ జెడ్ తమకంటూ ఒక సొంత రాజకీయ వేదికను కోరుకుంటున్నారనడానికి ఓసంకేతం" అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడంతో పాటు రాష్ట్రాల వారీగా పేజీలు క్రియేట్ అవుతున్నాయి. ‘కాక్రోచ్ జనతాపార్టీ తెలంగాణ’ పేరుతో ఓ ఇన్ స్టా పేజ్ క్రియేట్ అయింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























