ఏఐ బూమ్‌తో శాంసంగ్‌కు 1800 శాతం లాభాలు.. అంచనాలు ప్రకటించిన సంస్థ

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
- రచయిత, ఆస్మండ్ చియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఏఐ మెమరీ చిప్‌లకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా తమ లాభాలు 19 రెట్లు పెరగనున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన సాంకేతిక దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అంచనా వేసింది.
ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి జూన్ నెల చివరి వరకు ఆ సంస్థ 89.4 ట్రిలియన్ వోన్‌లు (సుమారు రూ. 5.57 లక్షల కోట్లు ) లాభాన్ని నమోదు చేసినట్లు అంచనా వేసింది.
వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఇది రికార్డు స్థాయి లాభంగా నిలవనుంది.
శామ్‌సంగ్ వంటి పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడిదారులకు మార్గనిర్దేశం చేయడానికి అధికారిక ఆర్థిక ఫలితాలకు ముందుగానే ఆదాయ అంచనాలను విడుదల చేస్తుంటాయి.
జులై చివరిలో పూర్తి ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో మంగళవారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. సెమీ కండక్టర్లకు సరఫరాను మించిన డిమాండ్ కొనసాగుతుండటంతో వాటి ధరలు మరింత పెరిగాయి.

ఎర్నింగ్స్ గైడెన్స్‌గా పిలిచే ఈ ప్రాథమిక నివేదికలో త్రైమాసిక కాలంలో సంస్థ సుమారు 171 ట్రిలియన్ వోన్‌ల(సుమారు రూ.10.65 లక్షల కోట్లు) అమ్మకాలు నమోదు చేసినట్లు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ లాభాలు రెండింతలకు పైగా పెరిగాయి..
ఇవి సంస్థ చరిత్రలోనే అత్యుత్తమ త్రైమాసిక ఫలితాల్లో ఒకటిగా నిలుస్తాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ పరిశ్రమ విశ్లేషకులు మార్క్ ఐన్‌స్టీన్ తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభంలో టెక్ రంగలో ఎన్‌విడియా నెలకొల్పిన త్రైమాసిక రికార్డుకు అత్యంత సమీపంగా శాంసంగ్ లాభాలు ఉన్నాయని ఆయన అన్నారు

ఫొటో సోర్స్, Getty Images
"దీనికి ప్రధాన కారణం ఏఐ విప్లవమే. పరిమిత సరఫరా, అంతకు మించిన డిమాండ్ కారణంగా మెమరీ చిప్ తయారీ సంస్థలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి" అని ఆయన చెప్పారు.
సరఫరా కొరత కొనసాగుతున్న నేపథ్యంలో శామ్‌సంగ్ తన మెమరీ చిప్‌ల ధరలను పెంచింది.
పరిశోధన సంస్థ ఇంటర్నేష్నల్ డేటా కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం డేటా సెంటర్లు, ఇతర ఏఐ మౌలిక సదుపాయాల కోసం సెమీకండక్టర్లకు ఏర్పడిన డిమాండ్ ఇప్పటివరకు మెమరీ చిప్ పరిశ్రమ ఎప్పుడూ చూడనంత స్థాయిలో ఉంది. దీని ప్రభావం రోజువారీ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే చిప్‌ల సరఫరాపైనా పడుతోంది.
"ఏఐ డేటా సెంటర్ల నుంచి డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడంతో వచ్చే ఏడాది కూడా సరఫరా కొరత కొనసాగుతుందని భావిస్తున్నాం" అని ఐడీసీకి చెందిన టెక్నాలజీ పరికరాల పరిశోధకులు బ్రయాన్ మా తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థల్లో శామ్‌సంగ్ ఒకటి. ఇది ఎన్‌విడియా, గూగుల్ వంటి సంస్థలకు చిప్‌లను తయారు చేయడంతో పాటు తన సొంత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. చిప్‌లకు డిమాండ్ పెరగడంతో ఇటీవలి కాలంలో ప్రధాన టెక్ సంస్థల షేర్లు గణనీయంగా పెరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
అయితే సంస్థ ప్రకటించే లాభాలు మరింత ఎక్కువగా ఉంటాయని కొందరు పెట్టుబడిదారులు ఆశించిన నేపథ్యంలో మంగళవారం సీల్ స్టాక్ మార్కెట్లో శామ్‌సంగ్ షేర్లు దాదాపు 7 శాతం పడిపోయాయి.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ సంస్థ మార్కెట్ విలువ రెండింతలకు పైగా పెరిగింది. అదే సమయంలో దక్షిణ కొరియాకు చెందిన పోటీ సంస్థ ఎస్‌కె హైనిక్స్ మార్కెట్ విలువ 200 శాతానికి పైగా పెరిగింది.
ఈ రెండు సంస్థలు కనబరిచిన బలమైన పర్‌ఫార్మెన్స్ కారణంగా దక్షిణ కొరియా బెంచ్‌మార్క షేర్ ఇండెక్స్ కోస్పీ ఈ ఏడాది 80 శాతానికి పైగా పెరిగింది.
ఎన్‌విడియా జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 80 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని నమోదు చేస్తూ రికార్డు స్థాయి త్రైమాసిక అమ్మకాలు, లాభాలను మే నెలలో ప్రకటించింది.
అయితే అదే సమయంలో ఎన్‌విడియా షేర్లు పడిపోయాయి. ఈ రంగంలో పోటీ మరింత పెరుగుతుందనే ఆందోళన పెట్టుబడిదారుల్లో పెరుగుతోందనడానికి ఇది సంకేతమని కొందరు విశ్లేషకులు భావించారు.
రానున్న సంవత్సరాల్లో దేశంలోని చిప్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు శామ్‌సంగ్, ఎస్‌కె హైనిక్స్ నేతృత్వంలో కనీసం 880 బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.75.5 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టే ప్రణాళికను జూన్‌లో దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రకటించింది.
చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు జపాన్, చైనా, తైవాన్‌కు చెందిన ప్రత్యర్థి ఆసియా సంస్థలు కూడా భారీ ఎత్తున చిప్ తయారీ పరిశ్రమల్లో పెట్టుబడులు పెడుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























