SRH vs RR: ఇద్దరు కొత్త బౌలర్లు 8 వికెట్లు తీశారు.. ప్రఫుల్, సకీబ్ జోరుకు రాజస్థాన్ రాయల్స్ తొలి ఓటమి

చదివే సమయం: 5 నిమిషాలు

ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగులతో విజయం సాధించింది.

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఇది తొలి ఓటమి. ఈ మ్యాచ్‌కు ముందు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ గెలిచింది.

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.

కెప్టెన్ ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు.

తర్వాత 217 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది.

సన్‌రైజర్స్ తరఫున ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ప్రఫుల్ హింగే, సకీబ్ హుస్సేన్ చెరో 4 వికెట్లతో రాజస్థాన్ రాయల్స్‌ను దెబ్బతీశారు.

సెంచరీ మిస్సయిన ఇషాన్ కిషన్

ఇన్నింగ్స్ తొలి బంతికే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు జోఫ్రా ఆర్చర్ షాకిచ్చాడు. అభిషేక్ శర్మను సున్నా పరుగుల వద్ద అవుట్ చేశాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్‌కు బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ అవుటయ్యాడు.

హైదరాబాద్ మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. 18 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు.

ఆర్వాత హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి కెప్టెన్ ఇషాన్ కిషన్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సాధారణంగా ధాటిగా ఆడే క్లాసెన్ నుంచి ఈ సీజన్‌లో ఆ జోరు కనిపించలేదు. ఈ మ్యాచ్‌లో కూడా క్లాసెన్ ఇదే వైఖరితో ఆడగా, ఇషాన్ కిషన్ మాత్రం బౌండరీలతో చెలరేగిపోయాడు.

30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. తర్వాత ఆడిన 14 బంతుల్లో 41 పరుగులు రాబట్టాడు. ఇషాన్‌ను సందీప్ శర్మ అవుట్ చేశాడు. క్లాసెన్‌, ఇషాన్ కిషన్ జోడి మూడో వికెట్‌కు 39 బంతుల్లో 88 పరుగులు జోడించింది.

తర్వాత నాలుగో వికెట్‌గా క్లాసెన్ కూడా అవుటయ్యాడు. 26 బంతుల్లో 40 పరుగులు చేసిన క్లాసెన్‌ను తుషార్ దేశ్‌పాండే అవుట్ చేశాడు. తర్వాత వేగంగా ఆడుతూ 4 సిక్సర్లు బాదిన నితీశ్ కుమార్ రెడ్డి 13 బంతుల్లో 28 పరుగులు చేశాడు. చివర్లో వికెట్ కీపర్ సలీల్ అరోరా అజేయంగా 24 పరుగులతో నిలిచాడు.

రాజస్థాన్ బౌలర్లోల జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశాడు. సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాతో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయమైంది.

రాజస్థాన్ రాయల్స్‌ను కట్టడి చేసిన అరంగేట్ర బౌలర్లు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్న రాజస్థాన్ రాయల్స్ టాపార్డర్‌కు ఈ మ్యాచ్‌లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

సన్‌రైజర్స్ తరపున ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ ప్రఫుల్ హింగేను ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే బౌలింగ్‌కు దించింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రఫుల్ హింగే, ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు.

తొలి ఓవర్ రెండో బంతికి వైభవ్ సూర్యవంశీ, నాలుగో బంతికి ధ్రువ్ జురెల్, ఆరోబంతికి లుహాన్ డ్రి ప్రిటోరియస్‌.. ఇలా ముగ్గురిని డకౌట్ చేశాడు. ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ఒక ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడటం ఇదే మొదటిసారి.

ఈ సీజన్‌లో పేరున్న బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో తాను ఆడిన తొలి బంతికే అవుటయ్యాడు.

ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన మరో అరంగేట్ర ఆటగాడు సకీబ్ హుస్సేన్ అదే ఓవర్‌లో వికెట్ సాధించాడు. యశస్వీ జైస్వాల్ (1)ను అవుట్ చేశాడు.

తర్వాతి ఓవర్‌లో ప్రఫుల్ బౌలింగ్‌లో కెప్టెన్ రియాగ్ పరాగ్ (4) కూడా అవుటవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో రవీంద్ర జడేజా, ఫెరీరా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 72 బంతుల్లో 118 పరుగులు జోడించారు.

ఫెరీరా 69 పరుగులు, జడేజా 45 పరుగులు చేశారు. ఫెరీరాకు ఐపీఎల్‌లో ఇదే తొలి అర్ధసెంచరీ.

క్రీజులో కుదురుకున్న ఫెరీరాను అవుట్ చేసిన సకీబ్ ఆ తర్వాత మరో రెండు వికెట్లను కూడా పడగొట్టాడు.

దీంతో రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగులతో విజయం సాధించింది.

ప్రఫుల్ హింగేకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

'ప్రతీ ప్లేయర్ ఇదే కోరుకుంటాడు'

ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్నానని మ్యాచ్ అనంతరం సకీబ్ హుస్సేన్ అన్నాడు.

'ప్రతీ ప్లేయర్ ఇలాంటి అరంగేట్రాన్నే కోరుకుంటాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ మ్యాచ్ ఆడబోతున్నానని ఒకరోజు ముందు మా బౌలింగ్ కోచ్ నాకు చెప్పారు. ఎలాగైనా బాగా ఆడాలని నిర్ణయించుకున్నా. మానసికంగా అందుకు సిద్ధమయ్యాను' అని చెప్పాడు.

సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ గురించి మాట్లాడుతూ, 'గత నాలుగేళ్లుగా ఆయనతో కలిసి నేను పనిచేస్తున్నా. నా బౌలింగ్‌ మెరుగవడానికి ఆయనే కారణం. ఈ ఘనత అంతా ఆయనకే దక్కుతుంది' అని సకీబ్ వ్యాఖ్యానించాడు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)