ఇరాన్, అమెరికా.. ఇప్పుడేం చేయబోతున్నాయి?

    • రచయిత, నిక్ ఎరిక్సన్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా–ఇరాన్ చర్చలు ఏ ఒప్పందం లేకుండానే ముగియడంతో, రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక శాంతి సాధ్యమా అనే ప్రశ్నలు మళ్లీ ఉత్పన్నమవుతున్నాయి.

పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు చర్చలకు ముందు ఆశాజనక వ్యాఖ్యలు చేశారు.

ఇతరుల కంటే భిన్నంగా తమపై రెండు పక్షాలకూ నమ్మకం ఉందని అన్నారు.

అమెరికా ప్రతినిధి బృందం నాయకుడు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఆశావహంగా ఉన్నప్పటికీ, ఆదివారం రాత్రి వరకు జరిగిన చర్చల అనంతరం, ఎటువంటి ఒప్పందం కుదరలేదని ప్రకటించారు.

కాబట్టి ఈ పరిస్థితి యుద్ఘాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇందులోని ప్రధాన పాత్రధారుల ముందున్న ఎంపికలు ఏంటి?

"ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు 1979 విప్లవం తర్వాత ఇరాన్–అమెరికా మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు. ఇలాంటి దౌత్యాన్ని ఒక్క రోజులో చేయలేరు. చర్చలు మొదలయ్యే ముందు నుంచే ఇది త్వరగా ముగిసే ప్రక్రియ కాదని సంకేతాలు కనిపించాయి" అని బీబీసీ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ లీస్ డూసెట్ చెబుతున్నారు.

"అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఎప్పుడూ కఠినమైన భాషను ఉపయోగించారు. ఇరాన్ ఓడిపోయిందని, ఇరాన్ లొంగిపోవాలని ట్రంప్ అన్నారు. వాన్స్ కూడా అదే తరహాలో "తెహ్రాన్ మా షరతులకు అంగీకరించాలి" అని అన్నారు. ఎందుకంటే సంఖ్యలను పరిశీలిస్తే, ఇరాన్ గణనీయంగా సైనికులను కోల్పోయింది. వారి అగ్రనేతలు పలువురు హత్యకు గురయ్యారు" అని లీస్ అన్నారు.

అయితే ఇరాన్ అలాంటి హెచ్చరికలకు లొంగే అవకాశం చాలా తక్కువని, లొంగిపోయేందుకు సిద్ధపడి ఇస్లామాబాద్‌ చర్చలకు రాలేదని డూసెట్ చెబుతున్నారు.

"తాను ఈ యుద్ధంలో ఓడిపోయాననుకుని ఇస్లామాబాద్‌కు రాలేదు, నిజానికి తాను గెలుస్తున్నానని ఇరాన్ భావిస్తోంది. తనకు బలమైన స్థానం ఉందని నమ్ముతోంది. ఇంకా ప్రతిదాడులు చేస్తూనే ఉంది. హార్ముజ్ జలసంధిని కూడా వ్యూహాత్మకంగా ఉపయోగించగలిగింది" అని లీస్ వివరించారు.

ఇప్పుడేం జరగనుంది?

ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల నుంచి కొన్ని సానుకూల సంకేతాలు ఉన్నాయని బ్రిటన్ మాజీ ఇరాన్ రాయబారి నికోలస్ హాప్టన్ భావిస్తున్నారు.

"రెండు పక్షాలు ఈ చర్చలను నిర్మాణాత్మకంగా నిర్వహించినట్టుగా కనిపిస్తోంది. రోజులో చాలా సేపు చర్చించారు. ఆ చర్చల్లో సాంకేతిక వివరాలు, అలాగే సాధారణ అంశాలపై కూడా లోతైన చర్చలు జరిగాయి" అని ఆయన అన్నారు.

ఇస్లామాబాద్‌లో "గరిష్ఠ డిమాండ్లు" పెట్టుకున్నప్పటికీ, వాటి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరుగుతాయని రెండు పక్షాలు భావిస్తున్నట్టుగా ఆయన చెబుతున్నారు.

"చివరికి ఒప్పందం అంటూ కుదిరితే, అది 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుదుర్చుకున్న ఒప్పందం కంటే కూడా మరింత సంక్లిష్టంగా, కొత్త అంశాలతో ఉండే అవకాశం ఉంది" అని ఆయన పేర్కొన్నారు.

"అంతా ముగిసిపోయినట్టు కాదు" అని బీబీసీ పర్షియన్ ప్రత్యేక ప్రతినిధి కస్రా నాజీ అన్నారు.

ఈ దఫా చర్చల్లో ఇరాన్ విశ్వాసాన్ని పొందడంలో అమెరికా విఫలమైందని విమర్శిస్తూ, ఇంకా మరిన్ని చర్చలకు అవకాశం ఉందని ఈ చర్చల్లో పాల్లోన్న ఇరాన్ ప్రతినిధి బృందం అధిపతి మొహమ్మద్ గాలిబాఫ్ ట్వీట్ చేసినట్టు నాజీ రాశారు.

అలాగే ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య పాకిస్తాన్ ద్వారా పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయని బీబీసీకి సమాచారం లభించింది.

అయితే వీటిని అధికారికంగా అమెరికా లేదా ఇరాన్ ధ్రువీకరించలేదు. మధ్యవర్తుల ద్వారా జరిగే చర్చల స్వరూపాన్ని అర్థం చేసుకోవడం ఎప్పుడూ కష్టమే అని ఇస్లామాబాద్‌లోని బీబీసీ ప్రతినిధి అజాదే మోషిరి చెప్పారు. కానీ మధ్యవర్తిత్వానికి, బ్యాక్‌చానల్ చర్చలకు మార్గం పూర్తిగా మూసుకుపోలేదనుకోవచ్చని ఆమె అన్నారు.

ప్రస్తుతం వాషింగ్టన్ నుంచి వెంటనే ఉద్రిక్తతలు పెరుగుతాయా అనే ప్రశ్నకు కొంతమంది నిపుణులు లేదు అని సమాధానమిస్తున్నారు. గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం, నాయకత్వ నిలకడ, యురేనియం నిల్వలు వంటి అంశాల కారణంగా ఇరాన్ ఇంకా అమెరికాపై ప్రభావం చూపే బలమైన స్థితిలోనే ఉందని వారంటున్నారు.

"ఇరాన్ చర్చలకు తొందరపడటం లేదు" అని ఒక సోర్స్ చెప్పినట్టుగా వార్తా సంస్థ తస్నీమ్ పేర్కొంది.

అలాగే "బంతి ఇప్పుడు అమెరికా కోర్టులో ఉంది" అని కూడా పేర్కొంది.

"కఠినమైన ఒత్తిడి ఇరానీయులను తాము తప్పనిసరిగా షరతులు అంగీకరించాల్సిన స్థితికి తీసుకురాలేకపోయింది" అని బీబీసీ దక్షిణాసియా ప్రతినిధి అజాదే మోషిరి అన్నారు.

చర్చలు విఫలమవడంతో ట్రంప్ నేవల్ బ్లాకేడ్‌కు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇది జనవరిలో వెనెజ్వెలా మాజీ అధ్యక్షుడు నికొలాస్ మదురోను తొలగించే ముందు కనిపించిన పరిస్థితితో సమానమని అంటున్నాయి.

దీనికి సూచనగా.. చర్చలు కొనసాగుతున్న సమయంలోనే హార్ముజ్ జలసంధిని తెరవడానికి సురక్షిత సముద్ర మార్గం ఏర్పాటు చేయడం గురించి అమెరికా సైనిక ఉన్నతాధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు.

ఇది అమెరికా మళ్లీ ఇరాన్‌పై బాంబింగ్‌ మొదలుపెట్టడంతో జరుగుతుందా అన్నదానిపై స్పష్టత లేదు.

అమెరికా అధ్యక్షుడు రెండు విషయాలను గుర్తుంచుకోవాలని బీబీసీ ప్రధాన అంతర్జాతీయ ప్రతినిధి లీస్ డూసెట్ అంటున్నారు.

మొదటిది, ఇలాంటి యుద్ధాన్ని తిరిగి మొదలుపెడితే అమెరికా ప్రజలకు నచ్చని పరిస్థితి ఏర్పడవచ్చు.

దీర్ఘకాలిక యుద్ధం వల్ల దేశంలో పరిస్థితులు ఎలా ప్రభావితమవుతాయో ట్రంప్‌కు తెలుసు. ముఖ్యంగా నవంబర్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ధరలు ఇంకా పెరిగితే అది రాజకీయంగా సమస్య అవుతుంది.

రెండవ విషయం ఏంటంటే ఈ విధానం పనిచేయదు. ఎందుకంటే ఇరాన్ ప్రతిదాడి చేస్తుందని డూసెట్ చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)