‘ఇది వ్యవస్థాగత విరాళాల కుంభకోణం’: ‘పేపర్ పార్టీ’లపై బీబీసీ ఇన్వెస్టిగేషన్ తరువాత ఎఫ్ఐఆర్ నమోదు

ఫొటో సోర్స్, Deepak Jasrotia
- రచయిత, శుభాంగి మిశ్రా, తేజాస్ వైద్య
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
కాగితాలకే పరిమితమైన కొన్ని పార్టీలకు విరాళాల రూపంలో వందల కోట్ల నిధులు అందుతున్న విషయం మూడు వారాల కిందట బీబీసీ పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సీఐడీ క్రైమ్ పోలీసులు తాజాగా ఇటువంటి పార్టీలపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.
గుజరాత్‌లోని ఆరు చిన్న పార్టీలు 2023-24లో 1700 కోట్ల రూపాయల విరాళాలు అందుకున్నట్టు బీబీసీ పరిశోధనలో తేలింది. ఈ మొత్తం బీజేపీ మినహా అన్ని జాతీయ పార్టీల మొత్తం ఆదాయానికి కంటే ఎక్కువ.
భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లోని 173 సెక్షన్ ప్రకారం ఈ రాజకీయ పార్టీలపై కేసులు నమోదు చేశారు.
ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఆరు పార్టీల్లో కనీసం మూడింటిపై పోలీసు కేసులు నమోదు అయ్యాయి.
భారతీయ నేషనల్ జనతా దళ్, గరీబ్ కల్యాణ్ పార్టీ, స్వతంత్ర అభివ్యక్తి పార్టీలపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఈ మూడు ఎఫ్‌ఐఆర్‌లను బీబీసీ హిందీ స్వయంగా చూసింది.

స్థానిక గుజరాతీ వార్తా పత్రికల ప్రకారం సత్యవాది రక్షక్ పార్టీ అనే నాల్గో పార్టీపై కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. అయితే దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ బీబీసీ వద్ద లేకపోవడంతో నిర్థరించలేకపోతోంది.
'ఈ కేసులో రెండు పార్టీలు అహ్మదాబాద్‌కు చెందినవికాగా, మరొకటి గాంధీనగర్‌కు చెందింది' అని గాంధీనగర్ సీఐడీ క్రైమ్ విభాగం అధికారి ఒకరు చెప్పారు.
ఈ కేసులో అరెస్టులు ఏమైనా జరిగాయా అని అడగగా, ' ఇప్పటి వరకు ఒక్కర్ని కూడా అరెస్టు చేయలేదు, దర్యాప్తు కొనసాగుతోంది' అని చెప్పారు.
ఎఫ్‌ఐఆర్ నమోదైన పార్టీలపై మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ నేషనల్ జనతా దళ్(BNJD)
గాంధీనగర్ కేంద్రంగా నడుస్తున్న భారతీయ నేషనల్ జనతా దళ్, దానితో సంబంధం ఉన్న నలుగురిపై సీఐడీ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసింది.
ఈ పార్టీ 2019-20 నుంచి 2024-26 వరకు 1,143 కోట్ల నిధులు అక్రమ పద్ధతిలో స్వీకరించిందని, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు 343 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టు అభియోగాలు మోపారు.
‘‘నిందితులంతా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి వాటినే అసలైన పత్రాలుగా పేర్కొంటూ తప్పుడు విరాళాల నివేదికలను(ఫారం 24ఏ) ఎన్నికల సంఘానికి సమర్పించారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు 343 కోట్లరూపాయల నష్టం వాటిల్లిందని’’ ఎఫ్ఐఆర్‌లో పోలీసులు వెల్లడించారు.
‘‘ఈ కేసులో నిందితులు కుట్రపూరితంగా బోగస్ విరాళాలు చూపించి మోసానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. పన్నులు ఎగవేసే లక్ష్యంతో కమిషన్ ఏజెంట్ల ద్వారా నిధులు సేకరించి ఆర్టీజీఎస్ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా ఐదు బ్యాంకు ఖాతాలకు నిధులను బదిలీ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది’’
‘‘విరాళ దాతలకు నకిలీ డొనేషన్ స్లిప్స్, డబ్బులు డిపాజిట్ చేసినట్టు నకిలీ రసీదులు నిందితులు అందజేసేవారు. దీంతో ఆ దాతలకు ఆదాయపు పన్ను చట్టంలోని 80జీజీబీ, 80జీజీసీ కింద తప్పుడు మార్గంలో వంద శాతం పన్ను మినహాయింపును పొందే అవకాశం లభించేది’’ అని పోలీసులు తెలిపారు.
బీఎన్‌జేడీ జాతీయ అధ్యక్షుడు గజేరాతో పరిశోధనలో భాగంగా బీబీసీ మాట్లాడినప్పుడు తాము ఏ తప్పు చేయడం లేదని చెప్పారు.
'పార్టీ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవడానికి లేదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎటు వెళ్తున్నాయో ఆదాయపు పన్ను శాఖకు తెలుస్తుంది' అని పేర్కొన్నారు.
స్వతంత్ర అభివ్యక్తి పార్టీ
స్వతంత్ర అభివ్యక్తి పార్టీ 2023-2025 మధ్య 519 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్టు పై ఆరోపణలు ఉన్నాయి.
నకిలీ పత్రాలు సృష్టించి, అవే అసలైనవిగా భారత ఎన్నికల సంఘానికి నివేదికలను సమర్పించారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆ పార్టీకి వచ్చిన మొత్తం నిధుల్లో ఇది 30 శాతానికి సమానం. దీంతో ఆ పార్టీపై, ఆపార్టీతో కలిసి పని చేస్తున్న వారిపై ఆర్థిక మోసం, విశ్వాస ఘాతుకానికి పాల్పడిన ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అహ్మదాబాద్‌లోని నరోదా ప్రాంతంలో మహవీర్ నగర్ కల్యాణ్ మిల్‌కు ఎదురుగా ఉన్న షాప్ నెంబర్ 2లో స్వతంత్ర అభివ్యక్తి పార్టీ కార్యాలయం ఉంది.
స్వతంత్ర అభివ్యక్తి పార్టీకి చెందిన పన్ను సలహాదారుడు మెహుల్ కుమార్ మహేష్ కుమార్ ఖాత్రీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు సురేంద్ర పర్షోత్తం తివారీ, చార్టర్డ్ అకౌంటెంట్ మయూర్ సింగ్ రాథోడ్‌తోపాటు ఇతర కార్యనిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
విరాళాలు తిరిగి ఇచ్చినట్టు చెప్పుకుంటున్న మెహుల్‌కుమార్ మహేష్‌కుమార్ ఖాత్రి మొబైల్ ఫోన్, ల్యాప్‌ట్యాప్‌లో విరాళాలు ఇచ్చిన రాజకీయ నాయకుల పేర్లు లభించినట్టు ఎఫ్ఐఆర్‌లో తెలిపారు. ఈ జాబితాలో స్వతంత్ర అభివ్యక్తి పార్టీకి లభించిన నకిలీ విరాళాల వివరాలు ఉన్నాయి.
‘‘ప్రాథమిక దర్యాప్తులో నిందితుల నుంచి తీసుకున్న వాంగ్మూలాల ద్వారా అతిపెద్ద, వ్యవస్థాగత రాజకీయ విరాళాల కుంభకోణం బయటపడింది’’ అని ఎఫ్ఐఆర్‌లో తెలిపారు.
‘‘ఈ స్వతంత్ర అభివ్యక్తి పార్టీ దేశంలోని వివిధ పన్ను చెల్లింపులదారుల నుంచి చెక్కు లేదా బ్యాంకింగ్ బదిలీ ద్వారా రాజకీయ విరాళాలను స్వీకరించింది. ఈ విరాళాల ఆధారంగా సెక్షన్ 80 జీజీబీ ప్రకారం చాలా మంది పన్ను చెల్లింపుదారులు తప్పుడు మార్గంలో పన్ను మినహాయింపు పొందారు. 8 నుంచి 9 శాతం కమీషన్‌గా తీసుకున్న తర్వాత మిగతా సొమ్మును క్యాష్ రూపంలో విరాళం ఇచ్చిన వారికి అందజేస్తారు.’’ అని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు లేవని, కేవలం కమీషన్ల కోసం, తప్పుడు లెక్కల కోసమే పార్టీ ఏర్పాటు చేసినట్టు స్వతంత్ర అభివ్యక్తి పార్టీ అధ్యక్షుడు సురేంద్ర తివారీ వాంగ్మూలం ఇచ్చినట్టు ఎఫ్ఐఆర్‌లో తెలిపారు.
సురేంద్ర తివారీ నేతృత్వంలోని పార్టీ 2023-24లో 219 కోట్ల రూపాయలను విరాళాల రూపంలో స్వీకరించారు. పార్టీకి వచ్చిన విరాళాల గురించి తనకు తెలియదని, సీఏ, మయూర్ సింగ్ తనను తప్పుదారి పట్టించారని సురేంద్ర తివారీ బీబీసీతో చెప్పారు.
ఈ ఆరోపణలను మయూర్ సింగ్ ఖండించారు. తాను ఏ పార్టీనీ నడపడం లేదని, వివిధ పార్టీలకు ఎన్నికల సంఘం వద్ద ట్యాక్స్ ఫైలింగ్ మాత్రమే చేస్తున్నట్టు చెప్పారు. అందులో న్యూ ఇండియన్ యూనైటెడ్ పార్టీ కూడా ఉందని పేర్కొన్నారు.
'అంతా ఒకేరకమైన మనుషులే, మీకు అర్థమవుతోంది కదా, ఇక్కడ పార్టీలు ఇళ్లలోనే నడుస్తాయి'అని ఆయన అన్నారు.
స్వతంత్ర అభివ్యక్తి పార్టీసహా సురేంద్ర తివారీ, మయూర్ సింగ్, మెహుల్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.

ఫొటో సోర్స్, Deepak Jasrotia
గరీబ్ కల్యాణ్ పార్టీ
గరీబ్ కల్యాణ్ పార్టీ, అందులో పని చేస్తున్న 8 మందిపై సీఐడీ క్రైమ్ విభాగం కేసు పెట్టింది. ఈ పార్టీ అహ్మదాబాద్‌లోని నానా చిలోదా ప్రాంతం ఉన్న శ్రీనాథ్ షాపింగ్ సెంటర్ ఏ-203లో నడుస్తోంది.
ఈ పార్టీ 2022- 2026 మధ్య 206 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నిధులు స్వీకరించి అక్రమాలకు పాల్పడినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
దీని వల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు 62 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నష్టం వాటిల్లింది. ఇది ఆ పార్టీ స్వీకరించిన మొత్తం నిధుల్లో 30 శాతం. దీంతో ఆ పార్టీ, ఆ పార్టీలో పని చేస్తున్న వారిపై ఆర్థిక మోసానికి పాల్పడారనే కేసు నమోదు అయ్యింది.
గరీబ్ కల్యాణ్ పార్టీ అక్రమ విరాళాలు స్వీకరించించినట్టు సేకరించిన గణాంక సమాచారం ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ ఆ పార్టీ కార్యాలయంలో తనిఖీలు చేసింది. దీని ఆధారంగా లభించిన ఆధారాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
‘‘ప్రాథమిక దర్యాప్తు, నిందితులు వాంగ్మూలాల ఆధారంగా ఇది భారీ, వ్యవస్థీకృతమైన నకిలీ విరాళాల కుంభకోణమని చెప్పవచ్చు. ఈ కుంభకోణంలో భాగంగా దేశంలోనే అధిక పన్ను చెల్లింపులదారుల నుంచి చెక్స్, బ్యాంక్ ఛానల్స్ ద్వారా రాజకీయ విరాళాలు స్వీకరించారు.
ఈ విరాళాల ఆధారంగా పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80జీజీబీ ప్రకారం అక్రమమార్గంలో పన్ను మినహాయింపులు పొందారు.
ఆ తర్వాత, ఆ నిధులు దశలవారీగా రెండు నకిలీ కంపెనీలకు (మెస్సర్స్ కృష్ణ ఎంటర్‌ప్రైజెస్, మెస్సర్స్ జలరామ్ ఎంటర్‌ప్రైజెస్) బదిలీ అయ్యాయి. చివరిగా ఆ నిధుల నుంచి 5 నుంచి 7 కమీషన్ మినహాయించుకున్నారు. మిగతా సొమ్మును దాతలకు క్యాష్ రూపంలో ఇచ్చేశారు’’ అని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
క్షేత్ర స్థాయిలో ఎలాంటి కార్యకలాపాలు లేకపోయినా కేవలం నకిలీ ఎంట్రీలు, కమీషన్ల కోసమే పార్టీ ఏర్పాటు చేసినట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నీరజ్ క్షత్రియ, కోశాధికారి ధీరజ్ క్షత్రియ అంగీకరించారని ఎఫ్ఐఆర్‌లో తెలిపారు.
‘‘దేశవ్యాప్తంగా వివిధ పన్ను చెల్లింపుదారుల నుంచి చెక్స్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా విరాళాలు వచ్చాయి. దీని కోసం వారికి నకిలీ రసీదులు ఇచ్చారు. వీటి ఆధారంగా పన్ను చెల్లింపుదారులు తప్పుడు మార్గంలో 100 శాతం మినహాయింపును క్లెయిమ్ చేసుకోగలిగారు. ఇది పన్ను ఎగువేతకు వీలు కలిగింది.
గరీబ్ కల్యాణ్ పార్టీ చెల్లుబాటు అయ్యే వోచర్లు, బిల్లులు, ఖాతాలు నిర్వహించడం లేదని విచారణలో తేలింది’’ అని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
ఈ పార్టీ 2023-24 మధ్య 138 కోట్ల విలువైన విరాళాలు స్వీకరించింది. బీబీసీ వెళ్లినప్పుడు ఈ పార్టీ కార్యాలయం మూసి వేసి ఉంది.
ఆ పార్టీ అధ్యక్షుడు నీరజ్ కుమార్ క్షత్రియ ఇంటికి వెళ్లినా ఆయన లేరు.
ఇప్పుడు నీరజ్ కుమార్, ఆయన సోదరుడు ధీరజ్ కుమార్ సహా ఆరుగురిపై కేసు నమోదు అయ్యింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































