‘20 రూపాయల వాటర్ బాటిల్ కోసం మనిషిని ఇంత కిరాతకంగా చంపేస్తారా?’.. విజయవాడ మృతుడి భార్య ఆవేదన

ఫొటో సోర్స్, RAMYAKRISHNA
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
(ఈ కథనంలో కలచివేసే విషయాలున్నాయి)
రూ. 20 విలువ చేసే వాటర్ బాటిల్ దొంగతనానికి ప్రయత్నించారంటూ ఓ వ్యక్తిని నలుగురు యువకులు కరెంటు స్తంభానికి కట్టేసి తీవ్రంగా హింసించి చంపేశారని విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కిశోర్ ‘బీబీసీ’తో చెప్పారు.
అనంతరం మృతుని భార్య రమ్యకృష్ణతోనూ బీబీసీ మాట్లాడింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ పవన్ కిశోర్ బీబీసీకి తెలిపారు.
‘‘విజయవాడ పటమట డొంక రోడ్డులోని ఓ మద్యం షాపు దగ్గర ఉన్న పాన్ షాప్ నుంచి వాటర్ బాటిల్ దొంగిలించేందుకు అక్టోబర్ 18 అర్ధరాత్రి దాటాక 2.30 గంటల ప్రాంతంలో సాయి కుమార్ అనే వ్యక్తి ప్రయత్నించారు.
సాయికుమార్‌ది తెలంగాణ రాష్ట్రం నల్లగొండ.. కొన్నాళ్లుగా నల్లగొండ సమీపంలోని మోత్కూర్‌లో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్న సాయికుమార్ మెరుగైన ఉపాధి పనుల కోసం విశాఖ లేదా విజయవాడ వెళుతున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి వారం క్రితం బయలుదేరారు.
ఈ క్రమంలో 18వ తేదీ అర్ధరాత్రి దాటాక విజయవాడ పటమటలోని ఓ పాన్ షాప్ షట్టర్ ఎత్తి వాటర్ బాటిల్ తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ సమయంలో అక్కడికి పాల ప్యాకెట్లు సరఫరా చేసేందుకు వచ్చిన వ్యాన్ డ్రైవర్ గమనించి సాయికుమార్ని అడ్డుకున్నారు. ఆ పాన్ షాప్‌లో పనిచేస్తున్న రవిశంకర్‌కి ఫోన్ చేసి అక్కడికి రప్పించి వ్యాన్ డ్రైవర్ వెళ్లిపోయారు. రవిశంకర్ పక్కనే వైన్ షాపులో పనిచేస్తున్న అయ్యప్ప శంకర్‌కి ఫోన్ చేసి అక్కడికి పిలిచారు. వాళ్లిద్దరూ కలిసి సాయికుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు’’ అని సీఐ తెలిపారు.


ఫొటో సోర్స్, RAMYAKRISHNA
తాళ్లతో కరెంటు స్తంభానికి కట్టేసి..
‘‘వారిద్దరూ మరో ఇద్దరు యువకులు నవీన్, సాయి ప్రణీత్‌లను అక్కడికి పిలిచారు. నలుగురు కలిసి సాయి కుమార్‌పై దాడి చేశారు.
ఆ తర్వాత సమీపంలోని కరెంటు స్తంభానికి తాళ్లతో కట్టేసి కర్రలతో కొడుతూ దాదాపు రెండు గంటల పాటు హింసించడంతో సాయికుమార్ ఆ దెబ్బలు తాళలేక మృతి చెందారు’ అని సీఐ చెప్పారు.
తనకు భార్యాపిల్లలు ఉన్నారని, తనను వదిలేయాలని సాయికుమార్ఎంత ప్రాధేయపడిన వాళ్లు కనికరించలేదని.. సాయికుమార్ చనిపోవడంతో దాడి చేసిన నలుగురు స్తంభానికి కట్టేసి ఉన్న కట్లు విప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారని సీఐ పవన్ కిశోర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, RAMYAKRISHNA
ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో...
19వ తేదీ ఉదయం రోడ్డుపై మృతదేహాన్ని చూసిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఆ తర్వాత ఆ పాన్ షాప్ పక్కనే ఉన్న వైన్ షాపులోని సీసీ ఫుటేజ్ పరిశీలించగా సాయికుమార్ పై దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 22 తేదీ నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్టు సీఐ పవన్ కిశోర్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, RAMYAKRISHNA
‘అసలు నా భర్తకు దొంగతనం చేసే అలవాటే లేదు’
దొంగతనం చేసే అలవాటు తన భర్తకు లేదని సాయికుమార్ భార్య రమ్యకృష్ణ చెప్పారు.
‘‘జీవితంలో ఎప్పుడూ దొంగతనం చెయ్యని ఆయన ఒక మంచి నీళ్ల బాటిల్ దొంగతనం చేయడం ఏమిటి. అయినా 20 రూపాయల బాటిల్ కోసం మనిషిని ఇంత కిరాతకంగా చంపేస్తారా.. ఇదెక్కడి ఘోరం... ఎక్కడి దారుణం’’ అని ఆమె విలపించారు..
తెలంగాణ నల్లగొండలో ఉన్న ఆమెను కలిసి బీబీసీ మాట్లాడింది.

‘ముగ్గురు చిన్న పిల్లలతో నేనెలా బతకాలి..?’
''నా భర్త కష్టపడి సంపాదించి తెచ్చేదానిపైనే మేం ఆధారపడి ఉన్నాం.. మాకు ముగ్గురు పిల్లలు.. ఇద్దరు ఆడపిల్లలు.. ఓ బాబు. ముగ్గురూ చిన్న పిల్లలే.. పెద్ద పాప ఆరో తరగతి చదువుతోంది.. ఆయన తేవాలి మేం తినాలి. కనీసం మాకు సొంతిల్లు కూడా లేదు..
ఇప్పుడు ఆయనను బెజవాడలో నలుగురు యువకులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు అకారణంగా చంపేశారు.. అసలు మేమెలా బతకాలో కూడా మాకు అర్థం కావడం లేదు. మాకు సొంత ఇల్లు లేదు నాకు వేరే ఆదాయ మార్గమే లేదు... మరి నాకు న్యాయం ఎవరు చేస్తారో అర్థం కావడం లేదు'' అని ఆమె అన్నారు.

ఆ నలుగురికి కచ్చితంగా శిక్ష పడాలి..
''అన్యాయంగా నా భర్తను చంపేసిన ఆ నలుగురికి చట్టప్రకారం కఠినంగా శిక్ష పడాలి. నన్ను వదిలేయండి... నేను నా భార్య బిడ్డల వద్దకు వెళ్ళిపోతానని ఎంత ప్రాధేయపడినా కనీసం కనికరించక.. నా భర్త చనిపోయే వరకు కొట్టి పైశాచిక ఆనందం పొందిన ఆ నలుగురికీ శిక్ష పడే వరకు నేను వదిలిపెట్టను’’ అని ఆమె అన్నారు.
‘‘ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందునే వెంటనే అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కి పంపాం.. చట్ట ప్రకారం ఆ నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం’’ అని ఈ కేసు విచారణ చేస్తున్న పటమట సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కిశోర్ బీబీసీతో అన్నారు.
మరో వైపు నిందితులు రిమాండ్‌లో ఉన్నందున వాళ్లతో మాట్లాడటం సాధ్యపడలేదు. ఇప్పటివరకు వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువులు సైతం అందుబాటులోకి రాలేదు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























