ఈ రోబోలను అద్దెకు తీసుకోవచ్చు... మరి ఇవి ఏమేం పనులు చేస్తాయి?

ఫొటో సోర్స్, Diligent Robotics
- రచయిత, క్రిస్ మార్షల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
నాలుగడుగుల ఎత్తు, తెలుపు రంగు, ఒకటే చెయ్యి ఉండి, ఫ్రెండ్లీగా కనిపించే రోబో తన పనిలో నిమగ్నమై ఉండటం, ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో కనిపించే సాధారణ దృశ్యం.
డిలిజెంట్ రోబోటిక్స్ తయారు చేసిన ఈ రోబో పేరు మాక్సీ. నర్సులు దీనికి గుడ్ మార్నింగ్ చెప్పడం, హై ఫైవ్ ఇవ్వడం, కొన్నిసార్లు కౌగిలించుకోవడంలాంటివి చేస్తుంటారు.
ఆసుపత్రుల్లో వైద్య సామగ్రిని ఒకచోటు నుంచి మరోచోటుకు తరలించే మాక్సీ, తన గుండె ఆకారంలోని ఎల్ఈడీ కళ్లను వెలిగిస్తూ, బీప్ బీప్ శబ్దంతో పలకరిస్తుంది.
టెక్సస్ కేంద్రంగా పనిచేస్తున్న రోబోటిక్స్ సంస్థలో చక్రాలపై నడిచే ఈ రోబోలు సుమారు 100 దాకా సేవలందిస్తున్నాయని ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ టాడ్ బ్రగ్గర్ చెప్పారు
"మాక్సీ మా బృందంలో భాగమైనట్టే అనిపిస్తుందని చాలామంది అంటుంటారు" అని ఆయన అన్నారు.
అయితే ఆసుపత్రిలో మాక్సీని వినియోగించాలంటే దాన్ని పూర్తిగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అద్దెకు లేదా సబ్స్క్రిప్షన్ విధానంలో కూడా ఈ రోబోను వాడచ్చు.
రోబోటిక్స్ సంస్థలు దీన్ని ‘రోబోటిక్స్ యాజ్ ఎ సర్వీస్’ గా పిలుస్తాయి.
ఇందులో రోబోతోపాటు సేవలు, రోబో నిర్వహణ, అప్గ్రేడ్లు కూడా ఉంటాయి. అవసరమైతే ఎక్కడో దూరంగా రిమోట్ కంట్రోల్ రూమ్‌లో నుంచి ఒక ఇంజినీర్ రోబోపై నియంత్రణ తీసుకోగలరు.


ఫొటో సోర్స్, 1X
మాక్సీ విషయంలో ఇది ఆసుపత్రుల వ్యయాన్ని తగ్గిస్తుందని బ్రగ్గర్ చెప్పారు. "మొత్తం కొనుగోలు ధరను ఒకేసారి చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతకంటే ముఖ్యంగా ఈ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. రోబో సాఫ్ట్వేర్, సామర్థ్యాలను మేము నిరంతరం మెరుగుపరుస్తూనే ఉంటాం" అని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఒక రోజు నుంచి అనేక సంవత్సరాల వరకు రోబోలను అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. ఆసుపత్రుల్లో వైద్య సామగ్రి రవాణా నుంచి రోబో బార్ టెండర్లు, వ్యవసాయ క్షేత్రాల్లో కలుపు మొక్కలను తొలగించే అటానామస్ రోబోల వరకు అనేక అవసరాలకు ఇవి అందుబాటులోకి వస్తున్నాయి.
మనుషుల మాదిరిగా కనిపిస్తూ, మనుషుల్లా ప్రవర్తించేలా రూపొందించిన ఈ హ్యూమనాయిడ్ రోబోలు కూడా ఇప్పుడు అద్దెకు లభిస్తున్నాయి. ఇవి మనుషుల కోసం రూపొందించిన పరిసరాల్లో పనిచేయగలవు.
అయితే హ్యూమనాయిడ్ రోబోలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందు వల్ల ప్రస్తుతం వాటిని నిర్దిష్ట పనులకే అద్దెకు ఇస్తున్నారు. చాలాసార్లు అవి వినోద కార్యక్రమాలకే పరిమితమవుతున్నాయి. మోడల్‌ను బట్టి అవి నృత్యం చేయడం, పాటలు పాడడం లేదా వివాహాలు, కార్పొరేట్ కార్యక్రమాల్లో అతిథులకు సేవలందించడం వంటి పనులు చేస్తాయి.

ఫొటో సోర్స్, 1X
హ్యూమనాయిడ్ రోబోతో నృత్య ప్రదర్శన వంటివి చేయించడం తేలికైన విషయమేనని బీజింగ్‌కు చెందిన కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ ఈథన్ క్వీ చెప్పారు.
"ముందుగా నిజమైన నర్తకుడితో నృత్యం చేయించి దాన్ని వీడియోగా చిత్రీకరిస్తారు. ఆ వీడియో ఆధారంగా రోబోకు శిక్షణ ఇస్తారు. తర్వాత రోబోకు ఎలా నృత్యం చేయాలో తెలుస్తుంది. అయితే వాతావరణం లేదా వేదిక క్లిష్టంగా ఉంటే ఇంజినీర్ కూడా రోబోతో పాటు వెళ్తుంటారు" అని ఆయన తెలిపారు.
అయితే సోషల్ మీడియాలో, ముఖ్యంగా చైనాలో కనిపించే నృత్య ప్రదర్శనలకే హ్యూమనాయిడ్ రోబోల వినియోగం పరిమితం కాదు. ఇంటి పనులు చేసే రోబోలు కూడా సబ్స్క్రిప్షన్ విధానంలో త్వరలో అందుబాటులోకి రావచ్చని కంపెనీలు భావిస్తున్నాయి.
కాలిఫోర్నియాకు చెందిన 1ఎక్స్ సంస్థ ఇంటి పనులు చేసే తమ రోబో నియోను ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి తీసుకురానుంది. అమెరికాలోని వినియోగదారులు దీన్ని 20 వేల డాలర్లు ( సుమారు రూ. 19.25 లక్షలు ) చెల్లించి ముందస్తుగానే కొనుగోలు చేయచ్చు. లేదా నెలకు 499 డాలర్ల సబ్స్క్రిప్షన్ చెల్లించి వినియోగించవచ్చు.
"చాలామంది వినియోగదారులు నియోను నేరుగా కొనుగోలు చేస్తారు. అయితే సబ్స్క్రిప్షన్ విధానం ప్రారంభ వ్యయాన్ని గణనీయంగా తగ్గించి మరింతమందికి అందుబాటులోకి తీసుకువస్తుంది" అని ఆ సంస్థలో ప్రోడక్ట్ అండ్ డిజైన్ విభాగం వైస్ ప్రెసిడెంట్ డార్ స్లీపర్ చెప్పారు.
కొనుగోలుతో పోలిస్తే అద్దె విధానం ఆకర్షణీయంగా మారడానికి ప్రధాన కారణం రోబోటిక్స్ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుండటమే. ఇప్పుడు కొత్త హ్యూమనాయిడ్‌ను కొనుగోలు చేస్తే అది త్వరలోనే పాతబడిపోయే అవకాశం ఉంది.
"ప్రతి ఏడాది రోబోటిక్స్ సంస్థలు కొత్త హార్డ్‌వేర్ మోడల్‌ను విడుదల చేస్తాయి. మీరు రోబోను కొనుగోలు చేసి ఉంటే దానిని కొత్తదానితో మార్చుకోవడం సాధ్యం కాదు. కానీ అద్దెకు తీసుకుంటే ఎప్పుడైనా తాజా మోడల్‌ను వాడచ్చు" అని క్వీ తెలిపారు.
అద్దె విధానం వల్ల వినియోగదారులకు అధిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉండదు. సమస్యలు ఎదురైతే తయారీదారు లేదా అద్దెను కల్పంచే వేదికను సంప్రదించవచ్చు.
"వినియోగదారులకు రోబోలకు కోడ్ రాయడం తెలియదు. అందుకే ఈ విధానం సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది" అని క్వీ చెప్పారు.

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
రోబోలను అద్దెకు తీసుకునే డిమాండ్‌ను పెంచుతున్నవి కేవలం హ్యూమనాయిడ్ రోబోలు మాత్రమే కావు. చికాగోకు చెందిన ఫార్మిక్ సంస్థ దగ్గర ప్రస్తుతం 250కు పైగా ఇండస్ట్రియల్ రోబోలు ‘రోబో యాజ్ ఎ సర్వీస్’ విధానంలో పని చేస్తున్నాయి.
"అన్నీ ఇందులోనే ఉంటాయి. రోబో చేయి పనిచేయకుండా పోతే అది మా బాధ్యతే. మేమే వచ్చి కొత్తదాన్ని అందిస్తాం" అని ఫార్మిక్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ షాన్ ఫిట్జ్‌జెరాల్డ్ చెప్పారు.
ఫార్మిక్ అమలు చేస్తున్న నెలవారీ చెల్లింపు విధానం చిన్న కంపెనీలకు కూడా ఫ్యాక్టరీ రోబోలను వినియోగించే అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన అన్నారు. సంప్రదాయంగా అవి రోబోలను పూర్తిగా కొనుగోలు చేసే స్థోమత కలిగి ఉండేవి కావని చెప్పారు. ప్రస్తుతం ఫార్మిక్ పారిశ్రామిక అవసరాల కోసం వాడే హ్యూమనాయిడ్ రోబోలను కూడా పరీక్షిస్తోంది.
నెలవారీ చెల్లింపుతో పాటు కొత్త చెల్లింపు విధానాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇంటరాక్ట్ అనాలిసిస్ విశ్లేషకుడు మార్కో వాంగ్ ప్రకారం, కొన్ని సంస్థలు రోబో వల్ల ఎంత మానవ శ్రమ ఆదా అవుతుందో దానికి అనుగుణంగా అద్దె విలువను నిర్ణయించాలని కోరుతున్నాయి.
రోబో తయారీ సంస్థలకు అద్దె విధానం ఆదాయంతో పాటు రియల్ టైమ్‌లో తమ ఉత్పత్తులను పరీక్షించి ఉపయోగకరమైన సమాచారాన్ని సేకరించే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ముఖ్యంగా హ్యూమనాయిడ్ రోబోల విషయంలో ఇది ఎంతో కీలకమని వాంగ్ చెప్పారు.
"ఈ సాంకేతికత ఇంకా పూర్తిస్థాయికి చేరలేదు. ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది" అని ఆయన అన్నారు.
హ్యూమనాయిడ్ రోబోల రంగంలో ముందంజలో ఉన్న చైనాలో, అద్దె సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. అక్కడ కొన్ని సంస్థలు తమ రోబోలను హోటళ్లలో పనిచేయడానికి అద్దెకు ఇచ్చాయి. భవిష్యత్తులో ఇంటి వినియోగానికి అవి మంచి శిక్షణ వేదికగా ఉపయోగపడుతున్నాయి. మరికొన్ని సంస్థలు క్లీనింగ్ సర్వీసు యాప్‌ల ద్వారా వాటిని అద్దెకు అందిస్తున్నాయి.
చైనా సంస్థలు భాగస్వామ్య వ్యాపారాల ద్వారా విదేశాల్లో కూడా అద్దె సేవలను ప్రారంభించాయి. షాంఘైకు చెందిన అగిబాట్ సంస్థ తన హ్యూమనాయిడ్ రోబోలు బ్రిటన్‌తో పాటు 17 దేశాల్లో అద్దెకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
అయితే అద్దె సేవలు విస్తరిస్తున్నప్పటికీ, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా చైనాలో హ్యూమనాయిడ్ రోబోలను నేరుగా కొనుగోలు చేసే విధానమే ఎక్కువగా కొనసాగుతోందని షాంఘైకు చెందిన వాంగ్ అభిప్రాయపడ్డారు.
"చైనాలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి హ్యూమనాయిడ్ రోబోలకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. సబ్సిడీల కారణంగా కూడా అనేక కొనుగోళ్లు జరుగుతున్నాయి" అని ఆయన చెప్పారు.
చైనాతో పాటు ఇతర దేశాల్లో కూడా కొన్ని సంస్థలు ప్రతిష్ఠ కోసం, సాంకేతికతను అర్థం చేసుకోవడానికి లేదా వ్యాపారపరంగా అది ప్రయోజనకరమని భావించి రోబోలను నేరుగా కొనుగోలు చేయడానికి మొగ్గు చూపచ్చు.
అయితే రోబోలు మరింత అధునాతనంగా మారుతూ, మార్కెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో, మరికొంత మందికి అద్దె విధానమే సౌకర్యవంతమైన, అందుబాటు ధరలో లభించే పరిష్కారంగా మారచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































