‘పచ్చని గడ్డి రక్తంతో తడిసి ఎర్రగా మారింది’

రెహ్మత్ పాషా
ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియాలోని బోండై బీచ్‌ కాల్పుల ఘటనలో బాధితులను కాపాడిన రెహ్మత్ పాషా

(నోట్: కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలిచివేయొచ్చు.)

''కళ్ల ముందే కాల్పులు జరిగాయి. అక్కడున్న పచ్చని గడ్డి రక్తంతో తడిసి ఎర్రగా మారిపోయింది'' అంటూ బాధపడుతున్న స్వరంతో చెప్పారు రెహ్మత్ పాషా.

2025 డిసెంబరు 14న ఆస్ట్రేలియాలోని బోండై బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 15 మంది మరణించారు.

ఆ సమయంలో అక్కడే ఉన్నారు హైదరాబాద్‌కు చెందిన రెహ్మత్ పాషా.

ఆ కాల్పుల్లో గాయపడిన వారికి సాయం చేయడంలో రెహ్మత్ పాషా తన వంతుగా కృషి చేయడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు పర్మినెంట్ రెసిడెన్స్ (శాశ్వత నివాస) హోదా ఇచ్చింది. ఈ విషయాన్ని బీబీసీతో పంచుకున్నారు రెహ్మత్ పాషా.

"ఆస్ట్రేలియా హోం వ్యవహారాల శాఖ మంత్రి టోనీ బర్క్ ఏప్రిల్‌లో స్వయంగా ఫోన్ చేశారు. కాల్పుల ఘటన సందర్భంగా ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గాను పర్మినెంట్ రెసిడెన్స్ ఇస్తున్నట్లు చెప్పారు. అసలు నమ్మలేకపోయా. ఎంతో సంతోషం కలిగింది" అని బీబీసీతో చెప్పారు పాషా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

2022లో షెఫ్ కోర్సు చేసేందుకు వెళ్లి..

రెహ్మత్ పాషాది తెలంగాణలోని వికారాబాద్. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ప్రాంతానికి వచ్చి, అక్కడే నివాసం ఉంటున్నారు.

2022లో షెఫ్ కోర్సు చేసేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన పాషా.. అక్కడే పార్ట్‌ టైమ్ వర్క్ కింద క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవారు.

ఇటీవల ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా బీబీసీతో మాట్లాడారు.

"నా ఎడ్యుకేషన్ పూర్తయ్యాక ఏదో ఒక జాబ్ చేయాలని హైదరాబాద్ వచ్చా. చిన్న చిన్న బిజెనెస్‌లు, ఉద్యోగాలు చేశా. దాదాపు ఎనిమిది, తొమ్మిదేళ్లు చాలా ఇబ్బంది పడ్డా" అని వివరించారు.

2019లో మొదటిసారి ఆస్ట్రేలియా వెళ్లానని చెప్పారు పాషా. కోవిడ్-19 కంటే ముందే వచ్చి, మళ్లీ 2022లో ఆస్ట్రేలియా వెళ్లానని వివరించారు.

"ఇండియాకు వచ్చి రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన ఉండేది. ఈలోపు అక్కడే ఉండి ఉబర్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడిని" అని చెప్పారు.

ఆస్ట్రేలియాలోని బోండై బీచ్‌లో నిరుడు డిసెంబరు 14న యూదుల పండుగ హనుకా సమయంలో ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది గాయపడినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ కాల్పుల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడేందుకు సాయం అందించారు రెహ్మత్ పాషా.

పర్మినెంట్ రెసిడెన్స్ హోదా రావడంతో తాను, తన కుటుంబం ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవచ్చని ఆయన వివరించారు.

''కాల్పులు జరిగిన రోజు సాయంత్రం 6.30 సమయంలో క్యాబ్‌లో కస్టమర్‌ను దించేందుకు వెళ్లా. దించేసి, మరో కస్టమర్ కోసం ఎదురు చూస్తున్నా.

నేనున్న ప్రాంతానికి 500-600 మీటర్ల దూరంలో కొన్ని శబ్దాలు వినిపించాయి. హనుకా పండుగ కావడంతో బాణసంచా కావొచ్చని మొదట అనుకున్నా'' అని పాషా చెప్పారు.

రెహ్మత్ పాషా

ఫొటో సోర్స్, Rehmat Pasha

''నాలుగైదు గంటలు అక్కడే ఉన్నా''

కారు దిగి కొంత ముందుకు వెళ్లేసరికి బీచ్‌లో ఉన్నవారు వణికిపోతూ అరుస్తూ రావడం కనిపించిందని పాషా చెప్పారు.

''కాస్త ముందుకు వెళ్లి చూస్తే ఇద్దరు గన్ ఫైర్ చేస్తున్నారు. నా కళ్ల ముందే మనుషులు బుల్లెట్లు తగిలి కింద పడిపోతున్నారు. అక్కడి పచ్చని గడ్డి రక్తంతో తడిసి ఎర్రగా మారిపోయింది. గాయపడిన వారు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు'' అని గుర్తు చేసుకున్నారు.

''సుమారు 85 ఏళ్ల ఓ మహిళకు కాలికి బుల్లెట్ తగిలింది. తానేం పాపం చేశానంటూ ఆమె ఏడుస్తుండటం కనిపించింది. ఆమెను ఓదార్చి మిగిలిన వారికి సాయం చేసే ప్రయత్నం చేశాను'' అని చెప్పారు.

సుమారు 18-20 మందికి సాయం అందించడంతోపాటు ఆసుపత్రులకు తరలించడం, ప్రాథమిక చికిత్స చేయడంలో సాయపడ్డానని బీబీసీతో చెప్పారు పాషా.

''గాయపడిన వారిని స్ట్రెచర్‌పై వేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి, అంబులెన్స్‌లో ఎక్కించడానికి సాయం చేశాను. ఒక పోలీసుకు బుల్లెట్ తగిలింది. ఆయన్ను అక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సాయం చేశాను. పారామెడిక్స్ వచ్చారు. వాళ్లకు ఆక్సిజన్ మాస్కులు పట్టుకుని హెల్ప్ చేశాను. దాదాపు నాలుగైదు గంటలపాటు అక్కడే ఉన్నా'' అని చెప్పారాయన.

''టోనీ బర్క్ వ్యక్తిగతంగా ఫోన్ చేశారు''

పర్మినెంట్ రెసిడెన్స్ ఇస్తున్నట్లు ఆస్ట్రేలియా హోం వ్యవహారాలు, ఇమిగ్రేషన్, సిటిజన్‌షిప్ శాఖల మంత్రి టోనీ బర్క్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పినట్లు రెహ్మత్ పాషా బీబీసీతో చెప్పారు.

అలాగే, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇచ్చే బ్రేవరీ అవార్డు కోసం ఉబర్ ఆస్ట్రేలియా అండ్ న్యూజీలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్మా ఫాలీ తనను నామినేట్ చేసినట్లు తెలిపారు.

టోనీ బర్క్‌ను కలిసేందుకు ఆస్ట్రేలియా సిడ్నీలోని ఇండియన్ యూత్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ జావీద్ సాయపడ్డారని వివరించారు.

రెహ్మత్ పాషా చేసిన సాయం గురించి ఆ దేశ హోం మంత్రిత్వ శాఖకు సయ్యద్ అబ్దుల్ జావీద్ వివరాలు పంపించారు.

జావీద్ కూడా హైదరాబాద్‌కు చెందినవారు. ఆయన ఆస్ట్రేలియాలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నారు.

''రెహ్మత్ పాషా నా రెస్టారెంట్‌కు వచ్చినప్పుడు బోండై బీచ్ కాల్పుల ఘటనలో ఆయన చేసిన సేవల గురించి తెలిసింది. ప్రాణాలకు తెగించి కాపాడిన తీరు ఎంతో ప్రశంసనీయం. ఆస్ట్రేలియాలో ఇండియన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా భారతీయులతో నాకు మంచి సంబంధాలున్నాయి, ప్రత్యేకించి హైదరాబాద్ వారితో... ఎందుకంటే నేనూ హైదరాబాదీనే.

ఆస్ట్రేలియా పౌరసత్వం ఉండటంతో ఇక్కడి పెద్దవారితో సంబంధాలున్నాయి. ఈ విషయం గురించి మంత్రి టోనీ బర్క్‌తో చెప్పినప్పుడు... ఘటనలో పౌరుల ప్రాణాలను పాషా కాపాడటంపై ఆయన కూడా చాలా సంతోషించారు. పాషాకు పర్మినెంట్ రెసిడెన్సీ ఇచ్చారు'' అని సయ్యద్ జావీద్ బీబీసీతో చెప్పారు.

సయ్యద్ అబ్దుల్ జావీద్

ఫొటో సోర్స్, Syed Abdul Javeed

ఫొటో క్యాప్షన్, టోనీ బర్క్‌తో ఆస్ట్రేలియా సిడ్నీలోని ఇండియన్ యూత్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ జావీద్

ఆస్ట్రేలియాలో 9.16 లక్షల మంది భారతీయులు

ఆస్ట్రేలియా హోంమంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2024 జూన్ నాటికి ఆ దేశంలో 9,16,300 మంది భారతీయులు ఉంటున్నారు.

ఇది 2014 జూన్ 30 నాటితో పోల్చితే రెండింతలు. విదేశీయుల పరంగా చూస్తే, యూకే తర్వాత ఎక్కువగా భారతీయులే ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నట్లు అక్కడి హోంమంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి.

2021-22 నుంచి 2024-25 మధ్య 1,63,643 మంది భారతీయులు పర్మినెంట్ రెసిడెన్స్ (శాశ్వత నివాసం) హోదా దక్కించుకున్నారు.

బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, ఎంప్లాయర్ స్పాన్సర్డ్, స్కిల్డ్ ఇండిపెండెంట్, స్టేట్ నామినేట్ చేయడం, రీజనల్ కేటగిరీ, గ్లోబల్ టాలెంట్, పార్టనర్, ఇతర కేటగిరీల కింద ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీయులకు పర్మినెంట్ రెసిడెన్స్ హోదా ఇస్తుంది.

అలాగే 2024 డిసెంబరు నుంచి నేషనల్ ఇన్నోవేషన్ కేటగిరీలో కూడా శాశ్వత నివాసం కల్పిస్తోంది.

ఇక, టెంపరరీ మైగ్రేషన్ (తాత్కాలిక వలస) కింద ఏటా లక్షల మంది భారతీయులు ఆస్ట్రేలియాకు వలస వెళుతుంటారు.

బోండై బీచ్ ఘటన నిందితుల మూలాలు హైదరాబాద్‌లో..

బోండై బీచ్ ఘటనలో కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులను సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్‌గా ఆస్ట్రేలియా ప్రభుత్వం గతేడాది డిసెంబరులో ప్రకటించింది. వీరిద్దరూ తండ్రీకొడుకులు అని చెప్పింది.

ఘటన సమయంలో జరిగిన పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్రమ్ చనిపోగా, నవీద్‌పై 59 అభియోగాలు నమోదు చేశారు.

వీరి మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు అప్పట్లో తేలింది. సాజిద్ అక్రమ్ కొన్ని సంవత్సరాల కిందట ఆస్ట్రేలియాకు వలస వెళ్లినట్లు గతేడాది డిసెంబరులో తెలంగాణ పోలీసులు ప్రకటించారు.

రెహ్మత్ పాషా

''నిద్రలేని రాత్రులు గడిపా''

ఘటన జరిగిన సమయంలో గాయపడిన వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, తర్వాత అది తలచుకుంటే చేతులు, కాళ్లు వణికాయని రెహ్మత్ పాషా వివరించారు.

''కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మూలాలు హైదరాబాద్ నుంచి ఉండటం చాలా బాధగా అనిపించింది. ఎక్కడైనా సరే... మనుషులను చంపడం నేరం. కనీస మానవత్వాన్ని ఎవరైనా గుర్తించాలి'' అని రెహ్మత్ పాషా బీబీసీతో చెప్పారు.

''నాలుగైదు గంటల తర్వాత ఒంట్లో వణుకు మొదలైంది. మానసికంగా చాలా ఇబ్బంది పడ్డా. చాలా రోజులపాటు నిద్రలేని రాత్రులు గడిపా. ఇప్పుడిప్పుడే వాటి నుంచి కోలుకున్నా'' అని చెప్పారు.

అయితే, ఆస్ట్రేలియాలో స్థిరపడతారా.. లేదా భారత్‌లోనే ఉంటారా.. అని బీబీసీ ప్రశ్నించినప్పుడు, ''నా తల్లిదండ్రులు ఇక్కడే (హైదరాబాద్) లోనే ఉండమంటున్నారు. అక్కడ ఉండాలా.. ఇక్కడ ఉండాలా.. అనేది ఇంకా నిర్ణయించుకోలేదు'' అని అన్నారు రెహ్మత్ పాషా.

రెహ్మత్ పాషాకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.

(గమనిక: మానసిక సమస్యలతో బాధపడేవారు వైద్యులను సంప్రదించాలి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000 ను సంప్రదించవచ్చు)