అమరావతి పనుల్లో కూలీల కొరత ఉందా? ప్రభుత్వం ఏం చెబుతోంది?- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

అమరావతి
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనులు గతంకంటే వేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

కానీ, వేసవిలో అంటే ఏప్రిల్‌, మే నెలల్లో ఇక్కడ కూలీల కొరత మరింత ఎక్కువైందని రాజధాని ప్రాంత సీఐటీయూ నేతలు చెబుతున్నారు.

ప్రభుత్వం చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణ పనులకు 22 వేల నుంచి 23 వేల మంది కూలీలు అవసరమని అధికారులు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో 13వేల మంది కూలీలు పనుల్లో ఉన్నారని సీఐటీయూ రాజధాని డివిజన్‌ కన్వీనర్‌ రవి అంటున్నారు.

ఇదే విషయమై ఏడీసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ మూర్తి బీబీసీతో మాట్లాడారు. ఇప్పటికి కూడా దాదాపుగా 20వేలమంది వరకు కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఇక్కడి పనులకు స్థానిక కార్మికులు పెద్దసంఖ్యలో రావడం లేదనీ, వలస కార్మికులకు అవకాశం కల్పించాల్సి వస్తోందని మూర్తి చెప్పారు.

అసలు కూలీల కొరత పరిస్థితి ఎందుకు ఏర్పడింది? కారణం ఎవరు? ఇక్కడ పనిచేస్తున్న కూలీలు ఏం చెబుతున్నారు, అధికారులు ఏమంటున్నారు... బీబీసీ గ్రౌండ్‌ రిపోర్ట్‌

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమరావతి నిర్మాణ పనులు, ఆంధ్రప్రదేశ్, రాజధాని, వలసకూలీలు, బీహార్, జార్ఖండ్ కూలీలు, ఎండలు, కూలీల సౌకర్య లోపాలు, కూలీల చెల్లింపులలో జాప్యం
ఫొటో క్యాప్షన్, లక్ష్మీ

2015 అక్టోబర్‌ 22న అమరావతి రాజధాని నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారి శంకుస్థాపన చేశారు.

ఈ శంకుస్థాపన తర్వాత అప్పటికే ల్యాండ్‌ పూలింగ్‌లో సేకరించిన భూముల్లో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు నిర్మాణాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. శాశ్వత నిర్మాణాలను కూడా కొన్నింటిని మొదలుపెట్టింది.

2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన రావడంతో అమరావతి నిర్మాణాల్లో అనిశ్చితి మొదలైంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అమరావతి నిర్మాణాల్లో కదలిక వచ్చింది.

అమరావతి నిర్మాణ పనులు, ఆంధ్రప్రదేశ్, వలసకూలీలు

మొత్తం 95 ప్రాజెక్టులు.. 12 నిర్మాణ సంస్థలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 మే 2న రెండోసారి అమరావతి నిర్మాణ పనులకు వెలగపూడిలో శ్రీకారం చుట్టారు.

అప్పటి నుంచి నిర్మాణపనులను వేగవంతం చేసినట్టు చెబుతున్న ప్రభుత్వం, అమరావతి రాజధాని కోర్‌ క్యాపిటల్‌ను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. 2028 నాటికి కచ్చితంగా కోర్‌ క్యాపిటల్‌ పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇటీవలే బీబీసీతో అన్నారు.

రాజధాని, అమరావతి, ఆంధ్రప్రదేశ్

మొత్తంగా రాజధాని పరిధిలో రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏడీసీఎల్‌) కలిపి 95 ప్రాజెక్టులు మొదలుపెట్టాయి. ఈ ప్రాజెక్టులను 12 ప్రధాన నిర్మాణ సంస్థలు ఎన్‌సీసీ, ఎల్‌ అండ్‌ టీ, ఎంఈఐఎల్, ఎస్‌పీసీఎల్, కేపీసీ, కేఎంవీ, బీఎస్‌ఆర్, ఎంవీఆర్, ఆర్‌వీఆర్, పీవీఆర్, బీఎస్‌సీపీఎల్, సీఐఐపీ చేపట్టాయి. వీటి మొత్తం కాంట్రాక్టు విలువ 50,999 కోట్ల రూపాయలు. 2026 జూన్‌ 27 నాటికి మొత్తంగా 44.66 శాతం పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 18.03 శాతం పనులు మాత్రమే అయినట్టు సీఆర్‌డీఏ తన జూన్‌ నివేదికలో పేర్కొంది.

మేలో ముదిరిన ఎండలతోపాటు పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికలకు, అక్కడి నుంచి వచ్చిన చాలామంది వలస కూలీలు వెళ్లిపోయారు. దీంతో పనుల శాతం తగ్గిన పరిస్థితి ఉంది.

ఎండాకాలంలో ఇక్కడి వేసవి తీవ్రత తట్టుకోలేక, తట్టుకునే అనువైన పరిస్థితులు లేక చాలామంది వలస కూలీలు వెళ్లిపోయారని శ్రీకాకుళం జిల్లా కొమ్మువలస గ్రామం నుంచి వచ్చిన వలసకూలీ లక్ష్మి బీబీసీకి తెలిపారు,

‘‘మేం వలస కార్మికులం, పొట్ట జరక్క, అక్కడ పనులు లేక ఇక్కడ రాజధాని పనుల కోసం వచ్చాం. కానీ ఎండలకు తట్టుకోలేక, క్యాంపుల్లో రేకుల షెడ్లు సరిగ్గా లేక, బీపీ షుగర్‌ వచ్చి పడిపోవడంతో చాలామంది వెళ్లిపోయారు, రోడ్లు సరిగ్గా లేవు, కొన్ని లేబర్‌ షెడ్ల దగ్గర నీటి సౌకర్యం తగినంతగా లేదు'' అని ఆమె చెప్పుకొచ్చారు.

సీఐటీయూ రాజధాని డివిజన్‌ కన్వీనర్‌ రవి
ఫొటో క్యాప్షన్, సీఐటీయూ రాజధాని డివిజన్‌ కన్వీనర్‌ రవి

ప్రస్తుతం పని చేస్తోంది 13వేల కార్మికులే: సీఐటీయూ

''రాజధాని నిర్మాణ పనులు వేగవంతం కావాలంటే 23వేలమంది వరకు కార్మికులు కావాలని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు కూడా 20వేలమంది ఉన్నారని అంటోంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే 13వేలమంది కూడా లేరిక్కడ. మొన్నటి వరకు ఎండల వేడితో పాటు ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం, క్వార్టర్స్‌ సమస్య, మంచినీటి సమస్యలతో చాలామంది వెళ్లిపోయారు'' అని బీబీసీతో సీఐటీయూ రాజధాని డివిజన్‌ కన్వీనర్‌ రవి అన్నారు .

ఈ ఆరోపణలను బీబీసీ స్వయంగా ధ్రువీకరించడం లేదు.

ఇదే విషయమై ఏడీసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ మూర్తితో బీబీసీ మాట్లాడింది. ఇప్పటికి కూడా దాదాపుగా 20వేలమంది వరకు కార్మికులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.

రాజధాని, అమరావతి, ఆంధ్రప్రదేశ్

ఇదే విషయంపై రాజధాని నిర్మాణంలో కీలక పనులు చేజిక్కించుకున్న రెండు ప్రధాన నిర్మాణ సంస్థల ప్రతినిధులతో బీబీసీ మాట్లాడింది.

''కార్మికుల కొరత నిజమే. ప్రస్తుతం జరుగుతున్న పనులకు మాకు 4వేల మంది కావాలి. కానీ మూడు వేల మందే పని చేస్తున్నారు'' అని పేరు వెల్లడించొద్దనే షరతుపై ఓ నిర్మాణ సంస్థ జనరల్‌ మేనేజర్‌ బీబీసీతో చెప్పారు.

అయితే, తమకు మాత్రం కార్మికుల కొరత లేదని మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ మదమంచి శ్రీనివాసరావు చెప్పారు. నెల, నెలన్నర కిందట కొద్దిగా సమస్య వచ్చినా.. పనులపై ప్రభావం చూపేంత రాలేదన్నారు.

అమరావతి నిర్మాణ పనులు, ఆంధ్రప్రదేశ్, రాజధాని, వలసకూలీలు

ఫొటో సోర్స్, UGC

రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఏప్రిల్‌ 4న నిర్వహించిన సమావేశంలో కొన్ని కాంట్రాక్ట్‌ సంస్థలు వలస కూలీల కొరత అంశాన్ని సీఎం చంద్రబాబు దష్టికి తీసుకొచ్చాయి. స్థానిక కూలీలను మాట్లాడి, కార్మికుల కొరత లేకుండా చూడాలని అప్పుడు ఆయన ఆదేశించారు. అయితే, స్థానికులకు పనులకు ఎక్కువగా పిలవడం లేదని కార్మిక నాయకులు ఆరోపించారు.

‘‘స్థానిక కూలీలు స్కిల్డ్‌ లేబర్‌. రోజుకి రూ.800 నుంచి రూ.1000 వరకు వాళ్లకు కూలీ ఇవ్వాల్సి వస్తుంది. అదే పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్‌ నుంచి వచ్చిన కూలీలకైతే రోజుకి రూ. 500 ఇస్తే చాలు, స్కిల్‌ ఉంటే రూ. 700 వరకు ఇస్తారు, దీంతో స్థానిక కూలీలకు అవకాశం ఇవ్వడం లేదు.. ఇది చాలా దారుణం.. దీని వల్ల స్థానికులకు ఉపాధి పోతోంది’’ అని సీఐటీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు ఆరోపించారు

స్థానిక కార్మికులు పెద్దసంఖ్యలో రాకపోవడం వల్లనే వలస కార్మికులకు అవకాశం కల్పించాల్సి వస్తోందని ఏడీసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ మూర్తి చెప్పారు. జూన్‌ నెలాఖరులో కూడా కార్మికుల కొరత కొనసాగుతోందా అనే విషయంపై సీఆర్‌డీఏ అధికారులు స్పందించలేదు. సీఆర్‌డీఏ కమిషనర్‌ విజయరామరాజుతో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

నిర్మాణపనుల్లో గతంకంటే వేగం కనిపిస్తోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనులు మరింత వేగంగా జరగాల్సి ఉంది. అయితే ఆ మేరకు కార్మికులను నియమించుకోవడం, పనులు చేస్తున్న కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించే విషయంలో మాత్రం విమర్శలు ఎదురవుతున్నాయి.

అమరావతి నిర్మాణ పనులు, ఆంధ్రప్రదేశ్, రాజధాని, వలసకూలీలు
ఫొటో క్యాప్షన్, కార్మికులు మస్తాన్‌వలీ, చెంచయ్య

వలస కూలీలకూ డబ్బుల చెల్లింపుల సమస్య...

ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు నివసించేందుకు ఏర్పాటు చేసిన రేకుల షెడ్లు క్యాంపుల్లో కొన్నింటిలోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చాలా వాటిల్లో కనీస సదుపాయాలు లేని పరిస్థితి ఉంది. సరైన రోడ్లు లేవని, వర్షాలు పడితే మరింత ఇబ్బంది కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కార్మికులు అంటున్నారు.

''ఎండాకాలం ఎలాగోలా అయింది అప్పుడు బాగా వేడి ఉంది. వర్షం వచ్చినప్పుడు మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటోంది. నిజానికి బాగా వర్షాలు వచ్చినప్పుడు కనీసం నడుచుకుంటూ వెళ్లలేక పనులు ఆపేసే పరిస్థితి ఉంది'' అని ఝార్ఖండ్‌ నుంచి వచ్చిన ఓ కూలీ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

ఇక స్థానిక కూలీలు, భవన నిర్మాణకార్మికుల వాదన మరోలా ఉంది. కాంట్రాక్టర్లు కూలీలకు పూర్తిస్థాయిలో డబ్బులు ఇవ్వకుండా ఎగవేస్తున్నారని కొందరు కూలీలు బీబీసీకి చెప్పారు.

''ఫస్ట్‌ రెండు వారాలు బాగానే కూలి డబ్బులు ఇచ్చారండీ. తర్వాత డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు. అదేమంటే మాకు బిల్లులు ఆగిపోయాయని మధ్యలో ఉన్న దళారులు చెప్పారు. మొత్తంగా మా డబ్బులు ఎగ్గొట్టి వెళ్లిపోయారు. దీంతో మేం ఇప్పుడు రాజధాని పనులు వదిలేసి వ్యవసాయ పనులకు వెళుతున్నాం’’ అని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు చెంచయ్య బీబీసీతో అన్నారు.

''సచివాలయం సైడ్‌ వాల్స్‌ పనికి వెళ్లాం. వారానికోసారి పేమెంట్‌ తీసుకునే వాళ్లం.. . పదివేలు బిల్లు అయితే ఏడు వేలు ఇవ్వడం... ఐదు వేలు బిల్లు అయితే మూడు వేలు ఇవ్వడం..అలా చేసే వాళ్లు.. దీంతో విసుగుపుట్టి పోయింది.. అసలు ఆ పనులే వద్దనుకుని బయట చిన్నచిన్న పనులు వచ్చిన వరకే చేసుకుంటున్నాం'' అని వెంకటపాలెం గ్రామానికి చెందిన కూలీ మస్తాన్‌వలి అన్నారు.

అమరావతి నిర్మాణ పనులు, ఆంధ్రప్రదేశ్, రాజధాని, వలసకూలీలు, బీహార్, జార్ఖండ్ కూలీలు, ఎండలు, కూలీల సౌకర్య లోపాలు, కూలీల చెల్లింపులలో జాప్యం
ఫొటో క్యాప్షన్, వలస కూలీలు నివసించేందుకు ఏర్పాటు చేసిన రేకుల షెడ్లు

లేబర్‌ క్యాంపుల్లో సౌకర్యాల కొరత

మరోవైపు కొందరు వలస కూలీలు కూడా తమకి సబ్‌ కాంట్రాక్టర్లు డబ్బులు ఎగవేస్తున్నారని డబ్బు చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

‘‘దళారులు మా పేమెంట్‌లు ఆపుతున్నారు. మా ఆధార్‌ కార్డులు తీసుకుని పనులు చేయించుకుని, మా కార్డులపై బిల్లులు తీసుకుని వెళ్లిపోతున్నారు. మేం పదిరోజులు పనిచేస్తే 5 రోజులు డబ్బులిస్తే మేం ఎలా బతకాలి సర్‌? మేం ఊరుగాని ఊరొచ్చాం. మా పరిస్థితి ఇలా ఉంది. కూలీ ఆడితేనే కుండ ఆడుతుంది.. ఇక్కడ పది రూపాయల అప్పు ఇచ్చేవాళ్లు కూడా లేరు'' అని శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన వలస కూలీ లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు,

కొంతమంది సబ్‌ కాంట్రాక్టర్లు సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు ధర్నాలు కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయని సీఐటీయూ నేత రవి చెప్పారు.

అమరావతిలో కార్మికుల సమస్యలపై విషయమై ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

సబ్‌ కాంట్రాక్టర్లు డబ్బులు ఎగవేస్తున్నారనే కొందరు కార్మికుల ఆరోపణలపై ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ జనరల్‌ మేనేజర్‌ బీబీసీతో మాట్లాడారు.

''మేం చిన్నచిన్న పనులకు లేబర్‌ కాంట్రాక్టులు ఇస్తాం. అప్పుడు కార్మికులకు మాకు నేరుగా సంబంధం ఉండదు. ఆ లేబర్‌ కాంట్రాక్టర్లు మా వద్ద డబ్బులు తీసుకుని కార్మికులకు ఎగవేస్తుంటారని అంటుంటారు. వాటితో మాకు సంబంధం ఉండదు'' అని ఆ సంస్థ జనరల్‌ మేనేజర్‌ బీబీసీతో అన్నారు.

అమరావతి నిర్మాణ పనులు, ఆంధ్రప్రదేశ్, రాజధాని, వలసకూలీలు, బీహార్, జార్ఖండ్ కూలీలు, ఎండలు, కూలీల సౌకర్య లోపాలు, కూలీల చెల్లింపులలో జాప్యం

ఫొటో సోర్స్, UGC

రాజధాని నిర్మాణాలకు కూలీల కొరత, ఇక్కడ మౌలిక సౌకర్యాల లేమితో పాటు సబ్‌ కాంట్రాక్టర్లు జీతాలు ఎగవేస్తున్నారంటూ కార్మికులు చేస్తున్న ఆరోపణలు, స్థానిక కూలీల ఇబ్బందులు.. వంటి సమస్యలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో మాట్లాడేందుకు బీబీసీ యత్నించింది.

అయితే ఈ విషయాలన్నీ సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ అధికారులు చూస్తున్నారని, వారితోనే మాట్లాడాలని నారాయణ తన కార్యాలయం ద్వారా సమాచారం పంపారు.

ఇదే విషయమై ఏడీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీ పార్ధసారధితో బీబీసీ మాట్లాడగా, ఇప్పటికిప్పుడు తన వద్ద పక్కాగా సమాచారం లేదని, అధికారులతో మాట్లాడాలని సూచించారు.

రోడ్లు ఒక్కటే కాస్త ఇబ్బంది అని, మిగిలిన అన్ని సౌకర్యాలు కార్మికులకు కల్పిస్తున్నామని ఏడీసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ మూర్తి చెప్పారు.

రాజధాని కోర్‌ క్యాపిటల్‌ను 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎండలు తగ్గడం, ఎన్నికల కోసం బెంగాల్‌కు వెళ్లిన వాళ్లు తిరిగి వస్తుండటంతో కూలీల కొరత తగ్గే అవకాశం ఉందని ప్రస్తుతం ఇక్కడున్న కార్మికులు అంటున్నారు. నిర్మాణ పనుల్లో గతం కంటే వేగం కనిపిస్తోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనులు మరింత వేగంగా జరగాల్సి ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)