భారత్‌తో సామరస్యం కోరుతూనే చైనా వైపు మొగ్గు చూపుతున్న బంగ్లాదేశ్... కారణమేంటి?

బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ తన ఇటీవల బీజింగ్ పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బీజింగ్ పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ చర్చలు జరిపారు.
    • రచయిత, అన్బరసన్ ఎతిరాజన్
    • హోదా, గ్లోబల్ ఎఫైర్స్ కరస్పాండెంట్
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

పొరుగుదేశమైన భారత్‌తో సంబంధాలను సమతుల్యం చేసుకోవడానికి ప్రయ్నతిస్తూనే, బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు మరిన్ని చైనా పెట్టుబడులు, భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది.

గత నెలలో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ తన తొలి అధికారిక విదేశీ పర్యటనలో భాగంగా మలేసియా, చైనాలను సందర్శించారు. దీనిద్వారా ఢాకా విదేశాంగ విధానం ఏ దిశగా సాగనుందనే సంకేతాలు వెలువడ్డాయి.

ఆయన ఎంచుకున్న పర్యటన గమ్యస్థానాల ద్వారా బంగ్లాదేశ్ తన వ్యూహాత్మక ప్రాధాన్యాలను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందనే అంశాన్ని తేటతెల్లం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

రెహ్మాన్ తొలుత మలేసియాను సందర్శించినప్పటికీ, చైనా పర్యటనకే ఎక్కువ ప్రాధాన్యం ఉందని వారు భావిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆనవాయితీని కాదని..

చరిత్రాత్మకంగా కొత్తగా ఎన్నికైన దక్షిణాసియా నాయకుల తొలి విదేశీ పర్యటనకు భారత్‌నే ఎంచుకోవడం ఆనవాయితీ. అయితే పదవీచ్యుత బంగ్లాదేశ్ నేత షేక్ హసీనాతో దిల్లీ కొనసాగించిన సన్నిహిత సంబంధాల నేపథ్యంలో రెహ్మాన్ చైనా పర్యటనను దిల్లీకి పంపిన రాజకీయ సందేశంగా భారత్‌లో కొందరు చూస్తున్నారు.

అనేక ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు, తీస్తా నది అభివృద్ధి ప్రాజెక్టులో సహాయం కోసం బీజింగ్‌ను ఆశ్రయించడం, మోంగ్లా ఓడరేవు సమీపంలో స్పెషల్ ఎకనమిక్ జోన్ అభివృద్ధికి కుదిరిన ఒప్పందం ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించాయి.

బంగ్లాదేశ్‌లో ప్రభావం చూపడానికి భారత్, చైనాలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలను దిల్లీ నిశితంగా గమనిస్తోంది.

బంగ్లాదేశ్‌లో ప్రజా తిరుగుబాటు కారణంగా ఆగస్టు 2024లో ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తరువాత దిల్లీ, ఢాకా మధ్య సంబంధాలు స్తంభించిపోయాయి. షేక్ హసీనా దేశం వీడి, దిల్లీలో ఆశ్రయం పొందారు.

అనంతరం మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వ హయాంలో దౌత్య సంబంధాలలో ఉద్రిక్తత కొనసాగింది. భారత్ ఉన్నతస్థాయి పర్యటనలను పక్కనపెట్టింది.

అయితే, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ) ఫిబ్రవరిలో ఘన విజయం సాధించి, రెహ్మాన్ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఇరుపక్షాలు సంబంధాల పునరుద్ధరణకు చొరవ చూపాయి.

''ఇరుదేశాలమధ్య ఉద్రిక్తతలు కొంతమేర తగ్గాయి అని చెప్పడానికి సందేహమే అక్కరలేదు'' అని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ శరణ్ బీబీసీకి చెప్పారు.

''సరిహద్దు ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థాయికి తిరిగివస్తున్నాయి. భారత్ కూడా బంగ్లాదేశ్‌ పౌరులకు పర్యటక వీసాలు జారీ చేస్తోంది'' అని చెప్పారు.

బెంగాలీ మాట్లాడే ముస్లింలను ఎటువంటి ప్రక్రియను పాటించకుండా తమ దేశంలోకి బలవంతంగా పంపారని బంగ్లా అధికారులు చెబుతున్నారు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, బెంగాలీ మాట్లాడే ముస్లింలను ఎటువంటి ప్రక్రియను పాటించకుండా తమ దేశంలోకి బలవంతంగా పంపారని బంగ్లా అధికారులు చెబుతున్నారు

బస్సుల పునరుద్ధరణ

ఇండియా, బంగ్లాదేశ్ మధ్యన 18 నెలల తరువాత పాసింజర్ బస్సు సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ సర్వీసులు కోల్‌కతా-ఢాకా, ఢాకా -అగర్తల మధ్యన నడుస్తున్నాయి.

ఈ ఏడాది ఆరంభంలో మధ్యప్రాచ్యంలో యుద్ధం చెలరేగి ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడినప్పుడు, ఇరుదేశాల మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ ద్వారా వేల టన్నుల అత్యవసర ఇంధనాన్ని బంగ్లాదేశ్‌కు పంపించింది.

గత నెలలో ఢాకాలో భారత కొత్త హైకమిషనర్‌గా దినేశ్ త్రివేది బాధ్యతలు స్వీకరించారు. అయితే భారత్ ఆయనకు కేంద్ర మంత్రి హోదా కల్పించింది. ఈ అరుదైన నిర్ణయం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించాలనే ఉద్దేశాన్ని దిల్లీ చాటినట్టయింది.

తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొని, ఇరు దేశాలు పరస్పరం వాణిజ్య ఆంక్షలు విధించుకున్నప్పటికీ, గత ఏడాది ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 13 బిలియన్ పౌండ్ల (రూ.1.66 లక్షల కోట్లు) మేర నమోదైంది. ఇందులో ఎక్కువ ప్రయోజనం భారత్‌కే దక్కింది.

అయినప్పటికీ, ఢాకా, దిల్లీ సంబంధాల్లో ఆశించినంత స్థాయిలో సాన్నిహిత్యం ఇంకా ఏర్పడలేదు. ఇరు దేశాల సంబంధాలను చికాకు పెడుతున్న అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

షేక్ హసీనా, బంగ్లాదేశ్, భారత్, తారిక్ రెహ్మాన్, చైనా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, దేశంలో తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా భారత్‌లో ప్రవాసం ఉంటున్నారు.

షేక్ హసీనా వ్యవహారం..

షేక్ హసీనాకు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలతో బంగ్లాదేశ్‌లో భారత్ పై వ్యతిరేక భావన బలంగా నెలకొని ఉంది. అలాగే అక్రమ వలసదారులుగా భావించిన వారిని భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) బంగ్లాదేశ్‌లోకి పంపే ప్రయత్నాలు ఢాకాలో వివాదానికి, ఆగ్రహానికి దారితీశాయి.

ప్రధానంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలైన వేల మందిని భారత్ ఇటీవలి సంవత్సరాల్లో తమదేశంలోకి పంపించిందని బంగ్లాదేశ్ అధికారులు ఆరోపిస్తున్నారు. వీరిని స్వదేశానికి తిప్పి పంపే ప్రక్రియను సరిగ్గా పాటించలేదని ఆరోపించారు.

భారత్‌లోని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిందూత్వ రాజకీయ నాయకులు బంగ్లాదేశ్‌పై చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా ఢాకాకు మిశ్రమ సంకేతాలు పంపాయని బంగ్లాదేశ్ విశ్లేషకులు అంటున్నారు.

"ఈ పరిణామాలన్నీ బంగ్లాదేశ్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. ఆ ప్రభావం ఢాకా ఆలోచనా విధానంపైనా పడింది" అని బంగ్లాదేశ్ మాజీ దౌత్యవేత్త హుమాయూన్ కబీర్ చెప్పారు.

"ఈ అంశాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం సానుకూల పరిణామాలుగా చూడలేదు" అని ఆయన అన్నారు.

పశ్చిమ బెంగాల్‌కు, బంగ్లాదేశ్‌కు భాషా, సాంస్కృతిక, జాతిపరమైన అనుబంధాలు ఉన్నాయి.

తీస్తా నది నిర్వహణపై వివాదం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

తీస్తా నది నిర్వహణపై భారత్ ఆందోళన

తీస్తా నది నిర్వహణలో చైనా ఏదైనా పాత్ర పోషించడం భారత్‌కు అత్యంత సున్నితమైన భద్రతా అంశం.

భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రవహించే ఈ నదీ జలాలను పంచుకునే ఒప్పందంపై ఇరు దేశాల ప్రయత్నాలు ఎన్నో ఏళ్లుగా ముందుకు సాగడం లేదు. రెహ్మాన్ బీజింగ్ పర్యటన సందర్భంగా తీస్తా నది నిర్వహణకు సంబంధించిన అభివృద్ధి పనుల్లో సంయుక్త సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఇరు దేశాలు అంగీకరించినట్టు బంగ్లాదేశ్ ప్రకటించింది.

వ్యవసాయ అవసరాల కోసం నదీ ప్రవాహాన్ని పునరుద్ధరించాలంటే పూడికతీత, లోతు పెంపు, ఇతర పునరుద్ధరణ చర్యలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.

"మన సరిహద్దుకు సమీపంలో చైనా ఏ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయినా అది మనకు ఆందోళన కలిగించే విషయమే. అలాంటి పరిణామాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించం" అని శ్యామ్ శరణ్ అన్నారు.

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1962లో జరిగిన స్వల్పకాలిక యుద్ధంలో భారత్ పరాజయం పాలైంది. ఇటీవలి సరిహద్దు ఘర్షణల్లో ఇరు దేశాలకు ప్రాణనష్టం జరిగింది.

తీస్తా ప్రాజెక్టులో చైనా భాగస్వామ్యం పెరిగితే, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ లేదా 'చికెన్ నెక్' ప్రాంతానికి అది మరింత చేరువవుతుంది. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పున్న ఈ భూభాగమే భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతోంది.

గత ప్రభుత్వాలు కూడా తీస్తా ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని భారత్‌ను ఆహ్వానించాయని, అయితే నిర్ణయం తీసుకోవడంలో దిల్లీ చాలా ఆలస్యం చేసిందని బంగ్లాదేశ్ అధికారులు చెబుతున్నారు. ఇంత భారీ ప్రాజెక్టును అమలు చేసే సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక వనరులు చైనాకు ఉన్నాయని వారు వాదిస్తున్నారు.

ఈ విషయంలో బీజింగ్ కూడా భారత్ ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేసింది.

"చైనా, బంగ్లాదేశ్ సహకారం ఏ మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకుని సాగడం లేదు. మూడో దేశం ప్రభావానికి కూడా అది లోనుకాకూడదు" అని రెహ్మాన్ తాజా బీజింగ్ పర్యటన సందర్భంగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ విలేఖరులతో అన్నారు.

ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత్ ఎంతో కీలకమైన పొరుగుదేశం కావడంతో, ఢాకా దానిని విస్మరించే అవకాశం లేదు

ఫొటో సోర్స్, @bdbnp78

ఫొటో క్యాప్షన్, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత్ ఎంతో కీలకమైన పొరుగుదేశం కావడంతో, ఢాకా దానిని విస్మరించే అవకాశం లేదు

రెహ్మాన్ భారత్ పర్యటనకు వస్తారా?

ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు అతిపెద్ద రక్షణ సామగ్రి సరఫరాదారు చైనాయే. బంగ్లాదేశ్ దిగుమతి చేసుకునే ఆయుధాల్లో 70 శాతానికి పైగా చైనా నుంచే వస్తున్నాయి. అలాగే బీజింగ్‌కు ఢాకా 6 బిలియన్ డాలర్ల( సుమారు రూ. 57.2 వేల కోట్లు)కు పైగా రుణపడి ఉంది.

రెహ్మాన్ పర్యటన సందర్భంగా చైనా, మియన్మార్, బంగ్లాదేశ్ ఎకనమిక్ కారిడార్ అభివృద్ధికి కూడా చైనా ప్రతిపాదించింది. ఈ కారిడార్ చైనాలోని యునాన్ ప్రావిన్స్‌ను మియన్మార్, బంగ్లాదేశ్‌లతో అనుసంధానిస్తుంది.

దక్షిణాసియాను భారత్ చాలాకాలంగా తన ప్రభావ పరిధిగా భావిస్తుండగా, చైనా మాత్రం బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవుల్లో తన ఉనికిని క్రమంగా విస్తరించుకుంటూ వచ్చింది.

పదవీచ్యుత మాజీ ప్రధాని షేక్ హసీనా ఇప్పటికీ దిల్లీలో ఉండడం వల్ల బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో సంబంధాలను పునరుద్ధరించాలన్న భారత్ ప్రయత్నాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ఆమెను అప్పగించాలని ఢాకా ఇప్పటికే కోరింది.

విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలను అణచివేసే క్రమంలో వందలాది మంది మరణాలకు కారణమైన మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో ప్రత్యేక ట్రైబ్యునల్ గత ఏడాది షేక్ హసీనాను ఆమె గైర్హాజరీలోనే దోషిగా తేల్చి మరణదండన విధించింది. అయితే ఆమె ఈ ఆరోపణలను ఖండించారు.

"హసీనా దిల్లీలో ఉన్నంతకాలం రెహ్మాన్ భారత్ పర్యటన రాజకీయంగా కొంత కష్టతరమే కావచ్చు" అని శ్యామ్ శరణ్ అన్నారు.

అయితే ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత్ ఎంతో కీలకమైన పొరుగుదేశం కావడంతో, ఢాకా దానిని విస్మరించే అవకాశం లేదని, అందువల్ల రెహ్మాన్ దిల్లీని సందర్శించే అవకాశాలు ఇంకా ఉన్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బంగ్లాదేశ్‌తో స్థిరమైన సంబంధాలు తమ ఈశాన్య ప్రాంత భద్రతకు అత్యంత కీలకమని భారత్‌కూ తెలుసు. అక్కడ ఇప్పటికీ పలు జాతి వేర్పాటువాద సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

రెహ్మాన్‌కు మాత్రం ప్రాంతంలోని రెండు ప్రధాన శక్తులైన భారత్, చైనాలతో సంబంధాలను సమతుల్యం చేయడం అత్యంత సున్నితమైన దౌత్యపరమైన సవాలుగా మారనుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)