అయోధ్య: రామ మందిర ట్రస్ట్ నూతన తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్ ఎవరు?

రామమందిరం

ఫొటో సోర్స్, Press Information Bureau (PIB)/Anadolu via Getty Images

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

నియమావళి ప్రకారం ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామాలను ఆమోదించినట్లు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.

చంపత్ రాయ్ స్థానంలో ట్రస్ట్ సభ్యుడైన కృష్ణ మోహన్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

తదుపరి ప్రధాన కార్యదర్శిని నియమించేవరకు కృష్ణ మోహన్ ఈ పదవిలో కొనసాగుతారు. నియామకం అనంతరం ఆయన తన ప్రాధాన్యతల గురించి మాట్లాడారు.

విరాళాల దొంగతనం కేసులో దోషిగా తేలిన వారికి శిక్ష పడటమే తన ప్రాధాన్యత అని కృష్ణ మోహన్ అన్నారు.

ట్రస్టు నిర్వహణ కార్యకలాపాలలో లోపాలు ఉన్నాయని ఆయన అంగీకరించారు. లోపాలు ఎక్కడ ఉన్నా వాటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తానని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అయోధ్య, రామమందిరం, కృష్ణమోహన్, చంపత్ రాయ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, తదుపరి ప్రధాన కార్యదర్శి నియమితులయ్యే వరకు కృష్ణ మోహన్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతారు.

"ట్రస్ట్ గురించి సమాజంలో ఏర్పడిన వాతావరణం ట్రస్ట్ ప్రతిష్టను దెబ్బతీసింది.

ప్రజల్లో అపనమ్మకాన్ని సృష్టించింది.

ప్రతిష్ఠను పునరుద్ధరించడానికి నేను ప్రయత్నిస్తా" అని ఆయన అన్నారు.

అయోధ్య, రామమందిరం, కృష్ణమోహన్, చంపత్ రాయ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ప్రకటించారు

కృష్ణ మోహన్ ఎవరు?

కృష్ణ మోహన్ ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాకు చెందినవారు. తూర్పు యూపీలో ఆర్‌ఎస్‌ఎస్ ఏరియా సంఘచాలక్‌గా ఉన్నారని ఆంగ్ల వార్తాపత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది.

గతేడాది సెప్టెంబర్‌లో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడైన కామేశ్వర్ చౌపాల్ మరణానంతరం ఆయన సభ్యుడిగా నియమితులయ్యారు.

కామేశ్వర్ చౌపాల్ బిహార్‌ వాసి, దళిత వర్గానికి చెందిన వారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం చెబుతోంది.

దళిత వర్గానికి చెందిన కృష్ణ మోహన్ లఖ్‌నవూ యూనివర్సిటీ నుంచి జియాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికై మహారాష్ట్ర కేడర్‌లో చేరారు.

2024 జనవరిలో ఆయన తన భార్యతో కలిసి రామ మందిరపు మొదటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆతిథ్యమిచ్చిన దంపతులలో ఒకరిగా పాల్గొన్నారు.

1978లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చేరకముందు కృష్ణ మోహన్ కొన్ని సంవత్సరాల పాటు అణుశక్తి విభాగంలో శాస్త్రవేత్తగా కూడా పనిచేశారు.

మహారాష్ట్ర అటవీ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి 2012లో అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ ఆఫ్ ఫారెస్ట్‌గా పదవీ విరమణ చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌లో నగర సంఘచాలక్ జిల్లా సంఘచాలక్, అవధ్ ప్రాంత సంఘచాలక్‌తో సహా పలు బాధ్యతలు నిర్వహించారు.

"నన్ను ట్రస్టీగా నామినేట్ చేసినట్లు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెందిన చంపత్ రాయ్ నుంచి నాకు సమాచారం అందింది. ఇది నాకు ఊహించనిది. ఇదంతా శ్రీరాముని సంకల్పం మేరకే జరిగింది. నా కొత్త బాధ్యతను పూర్తి నిజాయితీ, చిత్తశుద్ధితో నిర్వర్తిస్తా" అని ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పారు.

అయోధ్య, రామమందిరం, కృష్ణమోహన్, చంపత్ రాయ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, విరాళాల దొంగతనం కేసులో చంపత్‌రాయ్‌ పాత్రపైనా విచారణ జరుగుతోంది.

చంపత్ రాయ్, అనిల్ మిశ్రా నిష్క్రమణ

అయోధ్యలోని రామ మందిరంలో కానుకల దొంగతనం జరిగిన తర్వాత, శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం తొలిసారిగా సమావేశమైంది.

ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామాలను ఆమోదించారు. ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి ఈ విషయం తెలిపారు.

ప్రత్యేక అధికారులను నియమించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని జూలై 22న ట్రస్ట్ మళ్లీ సమావేశమవుతుందని ట్రస్ట్ కోశాధికారి తెలిపారు.

జూలై 22న తిరిగి సమావేశం జరిగే నాటికి సిట్ నివేదిక కూడా అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.

రామ మందిరంలో భక్తులు సమర్పించిన కానుకలను దొంగిలించారని, దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడటంతో చంపత్ రాయ్ గత నెలలో తన పదవికి రాజీనామా చేశారు.

జూన్ 26 నుంచి చంపత్ రాయ్ రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ జూన్ 27న జారీ చేసిన ఒక లేఖ ద్వారా ట్రస్ట్ ఈ రాజీనామాను తెలియజేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)