ప్రభుత్వ ఉద్యోగుల కోసం డేటింగ్ సర్వీస్ ప్రవేశపెట్టిన సింగపూర్... ఎందుకో తెలుసా?

డేటింగ్ సేవలు
    • రచయిత, కెల్లీ ఎన్‌జీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఓ డేటింగ్ సర్వీస్‌ని ప్రవేశపెట్టింది సింగపూర్. ఆ దేశంలో సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో పడిపోవడంతో ఈ వారంలోనే 'ఫస్ట్‌డేట్' అనే మ్యాచ్‌మేకింగ్ సేవను తీసుకొచ్చింది.

ఫస్ట్‌డేట్ సర్వీస్ 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారికి మాత్రమే. "డేటింగ్ కోసం ఇదో సరికొత్త విధానం" అని ఫస్ట్‌డేట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఒకసారి ఒక డేట్ మాత్రమే కుదిరేలా అల్గారిథమ్ సహాయంతో ఫస్ట్‌డేట్ పనిచేస్తుంది.

నేషనల్ డిజిటల్ ఐడెంటిటీ సిస్టమ్ ద్వారా యూజర్స్ లాగిన్ అవ్వొచ్చు. అనంతరం అందులో వారి ఇష్టాయిష్టాలు, అలవాట్లు, విలువలకు సంబంధించి ఓ చిన్నపాటి సర్వే పాల్గొనాల్సి ఉంటుంది.

ఫస్ట్‌డేట్ లాంచ్ పట్ల సింగపూర్ పౌరుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దీనిని 'ప్రభుత్వ అజమాయిషీ'గా పలువురు పేర్కొన్నారు. అయితే మరికొందరు మాత్రం దీన్ని ఓసారి ప్రయత్నించాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ప్రోగ్రామ్ గేల్-షాప్లీ స్టేబుల్ మ్యారేజ్ అల్గారిథమ్ ఆథారంగా పనిచేస్తుందని ఫస్ట్‌డేట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

యూజర్ల అభిరుచుల ఆధారంగా ఈ మ్యాథమెటికల్ ఫ్రేమ్‌వర్క్ వారిని రెండు సమాన బృందాలుగా విభజిస్తుంది. ఈ అల్గారిథమ్‌ని కనుగొన్న దివంగత గణితశాస్త్రజ్ఞుడు లాయిడ్ షాప్లీ ఆర్థికశాస్త్రంలో 2012లో నోబెల్ మెమోరియల్ బహుమతిని అందుకున్నారు. గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్, మెడికల్ రెసిడెన్సీ మ్యాచింగ్, డేటింగ్ యాప్‌ సహా ఇతర అవసరాల కోసం దీన్ని వినియోగిస్తున్నారు.

"ఏ అప్లికేషన్ వాడినా ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తిని కలిస్తే వచ్చే అనుభవం పెద్దగా మారదనే అనుకుంటున్నా" అని సింగపూర్ రక్షణ శాఖలో పనిచేసే ఎలిజబెత్ అనే వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఫస్ట్ డేట్‌ని ట్రై చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఎలిజబెత్ చెప్పారు. "అయితే ఇందులో మనం మోసపోయే అవకాశం తక్కువగా ఉండటం చాలా మంచి విషయం. మనందరం ఓ భాగస్వామి కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులమే కదా?" అని ఎలిజబెత్ అన్నారు.

ఫస్ట్‌డేట్

'ప్రభుత్వ ఉద్యోగంలో లేని వారి పట్ల వివక్ష'

అయితే ప్రస్తుతం పైలట్ (ప్రయోగ) దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్, ప్రభుత్వ ఉద్యోగంలో లేని వారి పట్ల వివక్ష చూపుతోందని పలువురు సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు.

వయసుకి సంబంధించిన నిబంధన పట్ల మరి కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "ఇది కేవలం ఫర్టిలిటీ రేట్ పెంచడానికే చేస్తున్నారు తప్ప మాకు నిజంగా జీవితంలో ఓ తోడు అవసరం అని కాదు" అని విమర్శలు చేస్తున్నారు.

అయితే 35 ఏళ్లు పైబడిన వారిలో పిల్లల్ని కనే విషయంలో రిస్క్ ఎక్కువని, అందుకే ప్రభుత్వం వారిని మినహాయించిందని ఓ రెడిట్ యూజర్ పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఈ సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటయా అనే విషయంపై స్పష్టత లేదు. దీనిపై స్పందన కోసం ప్రాజెక్ట్‌ని అమలు చేస్తున్న ప్రభుత్వ బోర్డ్ GovTechని బీబీసీ సంప్రదించింది.

సింగపూర్‌లో జననాల రేటు ఆ దేశ చరిత్రలోనే అత్యల్ప స్థాయికి పడిపోయింది. గత 60 ఏళ్లలో తొలిసారిగా 2025లో 30వేల కన్నా తక్కువ జననాలు నమోదయ్యాయి.

మరోవైపు వృద్ధ జనాభా అధికంగా ఉన్న ఈ దేశంలో మరణాల రేటు మాత్రం క్రమంగా పెరుగుతోంది. 2025లో అది 26,500 ఉంది.

ఈ నేపథ్యంలోనే ఆగస్టులో ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ పలు కొత్త కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఎక్కువ మంది పిల్లల్ని కనేలా దంపతులను ప్రోత్సాహించడం కోసం కుటుంబాలకు 70వేల సింగపూర్ డాలర్ల (దాదాపు రూ.52లక్షల) ఆర్థిక సహకారం వంటి పథకాలను ప్రవేశపెట్టారు. ప్రతి చిన్నారికి 17 ఏళ్లు వచ్చే వరకు ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది.

1984 నుంచే ఇలాంటి పథకాలు...

ఇద్దరు వ్యక్తులను కలిపేందుకు సింగపూర్ ప్రభుత్వం ఫస్ట్‌డేట్ వంటి కార్యక్రమాలను రూపొందించడం ఇది మొదటిసారి కాదు.

సింగిల్‌గా ఉన్న గ్రాడ్యుయేట్లు జంటగా మారేలా ప్రోత్సాహించేందుకు 1984లో సోషల్ డెవలప్‌మెంట్ యూనిట్ (ఎస్‌డీయూ) పేరిట పలు సామాజిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.

ప్రత్యేకించి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ల కోసమే దీనిని రూపొందించడంతో ఈ పథకం కేవలం ఉన్నత వర్గాల వారికే అంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే పట్టభద్రులు కాని వారిలో భాగస్వామిని పొందడం అంత కష్టంగా ఉండటం లేదని అధికారులు తమ విధానాన్ని సమర్థించుకున్నారు. దీంతో, క్రమంగా ఎస్‌డీయూని ప్రభుత్వం నిలిపివేసింది.

పట్టభద్రులు కానివారిలో వివాహాలను ప్రోత్సాహించేందుకు ఆ మరుసటి ఏడాది ప్రభుత్వం మరో ఏజెన్సీని ఏర్పాటు చేసింది.

కేవలం సింగపూర్‌లోనే కాదు, ఇతర దేశాల్లోనూ...

ప్రభుత్వ ఆధీనంలో డేటింగ్ సేవలను అందించడం సింగపూర్‌కి మాత్రమే పరిమితం కాదు. జపాన్‌లో జననాల రేటు పడిపోతుండడంతో 2024 సెప్టెంబర్‌లో టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం ఓ ఏఐ ఆధారిత డేటింగ్ యాప్‌ని లాంచ్ చేసింది.

టోక్యో నగరంలో నివసించే సింగిల్స్ ఈ యాప్ సేవలను వినిగించవచ్చు. ఇప్పటివరకు ఈ వేదిక ద్వారా పరిచయమైన 265 జంటలు వివాహం చేసుకున్నట్లు ఈ ఏడాది జులైలో విడుదల చేసిన ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)