స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న వారికి ఏనుగు మాంసంతో భోజనం.. 23 ఏనుగుల వేటకు అనుమతి ఇచ్చిన బోట్స్‌వానా ప్రభుత్వంపై విమర్శలు

బోట్స్‌వానాలో 1,30,000 ఏనుగుల జనాభా ఉంది.
ఫొటో క్యాప్షన్, బోట్స్‌వానాలో 1,30,000 ఏనుగులు ఉన్నాయి.
    • రచయిత, వైక్లిఫ్ ముయా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

స్వాతంత్య్ర ఉత్సవాల కోసం 23 ఏనుగులను వేటాడేందుకు అనుమతులు ఇవ్వడంతో బోట్స్‌వానా ప్రభుత్వంపై జంతు హక్కు కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు.

బోట్స్‌వానా ఆఫ్రికా ఖండానికి దక్షిణాన ఉంది. ప్రపంచంలో అత్యధిక ఏనుగుల జనాభా ఈ దేశంలోనే ఉంది.

బోట్స్‌వానా సెప్టెంబర్ 30న (బుధవారం) తన 60వ స్వాతంత్య్ర ఉత్సవాలను నిర్వహించుకుంది. 1966లో ఆ దేశానికి బ్రిటన్ నుంచి విముక్తి లభించింది.

ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలకు అభినందనపూర్వకంగా 23 ఏనుగులు సహా ఇతర వన్య మృగాలను వేటాడేందుకు ఆ దేశ పర్యావరణ, పర్యాటక శాఖ లైసెన్సులు జారీ చేసిందని స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ నిర్ణయం జంతు సంరక్షణ చర్యలను నీరుగారుస్తుందని బోట్స్‌వానాలోని ఎలిఫెంట్ ప్రొటెక్షన్ సొసైటీ హెచ్చరించింది. ఏనుగులకు మరింత సంరక్షణ అవసరం అని ఆ సంస్థ చైర్మన్ ఓయిట్సే నవా అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆందోళనలు

"ఉత్సవాల కోసం ఏనుగులను వధించడానికి అనుమతించారంటే అక్రమ వేటలను ప్రోత్సాహించినట్లే. ప్రభుత్వమే దానికి ఆమోదం తెలుపుతుంటే ఏనుగులను వేటాడటం సమంజసమే అనే అభిప్రాయం ఏర్పడుతుంది" అని నవా చెప్పారు.

"తుపాకీ కాల్పుల వల్ల ఏనుగులు ఒకచోట నుంచి మరొక చోటుకి బలవంతంగా తరలిపోతున్నాయి. దీని వల్ల వాటి సామాజిక వ్యవస్థకు చాలా నష్టం వాటిల్లింది" అని నవా పేర్కొన్నారు.

బోట్స్‌వానాలో గేమ్ మీట్ (వన్య ప్రాణుల మాంసం) వల్ల ఇప్పటికే ఫుట్ అండ్ మౌత్ వ్యాధి ప్రబలింది. దీన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఉత్సవాలలో పాల్గొన్న మోన్ పట్టణానికి చెందిన చినాట్చే మోన్వెలా అనే వృద్ధుడు తమకు ఏనుగు మాంసానికి బదులుగా దున్న మాంసం పెట్టాల్సిందని అన్నారు.

"ఏనుగులకు సాంస్కృతిక, పర్యావరణ పరమైన ప్రాముఖ్యత ఉంది. బోట్స్‌వానాకు వన్య ప్రాణులు, పశుగణాన్ని సంరక్షించిన చరిత్ర ఉంది. స్వాతంత్య్ర ఉత్సవాల కోసం మాంసం కేటాయింపు సమయంలో ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాల్సింది" అని మోన్వెలా అన్నారు.

వన్యప్రాణులు సమృద్ధిగా ఉన్న సమూహాల్లో ఏనుగుల మాంసాన్ని తినడం చాలా సాధారణం. మరీ ముఖ్యంగా ప్రభుత్వ అనుమతులతో వేటాడగా వచ్చిన మాంసాన్ని తినేందుకు స్థానికులు ఉత్సాహం చూపిస్తారు. అయితే ఇది రోజూవారీగా తీసుకునే ఆహారం కాదు.

గేమ్ మీట్‌పై బోట్స్‌వానాలో కఠిన నియంత్రణ ఉంది. అక్కడి ప్రజలు అనుమతి ఉన్న వేట నుంచి వచ్చిన మాంసాన్ని మాత్రమే తమ దగ్గర పెట్టుకోవచ్చు.

దేశంలోని ఏనుగుల భారీ జనాభా నిర్వహణ విధానాలపై ఎప్పటి నుంచో ఉన్న తీవ్రమైన చర్చకు, ప్రభుత్వ తాజా నిర్ణయం మరోసారి ఆజ్యంపోసింది.

బోట్స్‌వానాలో 1,30,000 ఏనుగులు ఉన్నాయి.

అయితే అవి తమకు ఆస్తి, పంట సహా ప్రాణ నష్టం కలిగిస్తున్నాయని చాలాకాలంగా వాటితో ఇబ్బంది పడుతున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేట ద్వారా వచ్చే ఆదాయం సంరక్షణ చర్యలకు, స్థానిక అభివృద్ధికి ఉపయోగపడుతోందని ప్రభుత్వం అంటోంది.
ఫొటో క్యాప్షన్, బోట్స్‌వానా ప్రభుత్వం అన్ని రకాల వేటలను అనుమతించదు.

"సంరక్షణ చర్యల కోసం వేట ద్వారా వచ్చే ఆదాయం"

ఈ నేపథ్యంలోనే ఏనుగుల జనాభా నిర్వహణ, మానవ-వన్యప్రాణి సంఘర్షణకు పరిష్కారంగా నియంత్రిత వేట ఓ మార్గమని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అది స్థానిక సమూహాలకు ఆదాయ వనరుగానూ ఉంటోందని పేర్కొంది.

బోట్స్‌వానాలో ఇయాన్ ఖామా అధ్యక్షతన 2014లో ట్రోఫీ హంటింగ్‌ (భారీ ఫీజు చెల్లించి వన్యప్రాణులను వేటాడటం)పై నిషేధం విధించారు. ఐదేళ్ల తర్వాత అధ్యక్షుడు మోగ్వీట్సీ మసీసీ ఆ నిషేధాన్ని ఎత్తివేశారు.

2024లో మసీసీని ఓడించి అధికారంలోకి వచ్చిన డ్యూమా బోకో హయాంలోనూ వేట కొనసాగింది.

వేట ద్వారా వచ్చే ఆదాయం సంరక్షణ చర్యలకు, స్థానిక అభివృద్ధికి ఉపయోగపడుతోందని ప్రభుత్వం అంటోంది.

ఏనుగులను చట్టబద్ధంగా వేటాడేందుకు నిర్వహించే ప్రత్యేక కోటాల వేలం ద్వారా 15.6 మిలియన్ల పులాల ( దాదాపు రూ.10.6 కోట్లు) ఆదాయం లభించిందని పర్యావరణ, పర్యాటక మంత్రి వింటర్ మోలోట్సీ 2025లో పార్లమెంట్‌కి తెలిపారు.

అయితే ఈ స్థాయిలో కొనసాగుతున్న వేట ఏనుగుల సంఖ్యలో సుస్థిరతను దెబ్బతీయదా అని పరిరక్షణ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.

అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను బోట్స్‌వానా హంటింగ్ పాలసీని సమర్థిస్తున్నవారు తప్పుబడుతున్నారు. ప్రపంచంలోనే ఏనుగుల జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు వాటిల్లితున్న నష్టాలను వారు పరిగణలోకి తీసుకోవడం లేదని అంటున్నారు.

ఏనుగులు, ప్రజల ఆవాసాలు దాదాపుగా కలిసిపోయి ఉండటంతో, వాటి వల్ల పంట, మౌలిక వసతులకు ముప్పు వాటిల్లుతోందని పాలసీ మద్దతుదారులు చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)