‘బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా రొమ్ము తొలగించాల్సిన అవసరం లేదు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వి.శారద
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
బ్రెస్ట్ క్యాన్సర్ నిర్దరణ అయిందని తెలిసిన వెంటనే మహిళలకు, వారి కుటుంబసభ్యులకు కలిగే మొదటి భయం 'రొమ్ము మొత్తం తొలగించాల్సిందేనా' అని.
కానీ ప్రస్తుత వైద్యశాస్త్రం మాత్రం వేరే పరిష్కారాలు చూపుతోంది. రొమ్ము క్యాన్సర్ వచ్చిన ప్రతి మహిళకూ రొమ్మును పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు.
క్యాన్సర్ ఏ దశలో ఉంది, దాని పరిమాణం, రొమ్ములో ఏ భాగంలో ఉంది అనే విషయాలను బట్టి చాలామంది మహిళలకు రొమ్మును తొలగించకుండానే చికిత్స అందించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
భారత మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అని ప్రపంచ ఆరోగ్యం సంస్థకు చెందిన క్యాన్సర్ పరిశోధనావిభాగం ఐఏఆర్సీ విడుదల చేసిన గ్లోబోకాన్ 2024 చెబుతోంది.
భారత్‌లో ఒక్క 2024లోనే రెండులక్షల37వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మహిళల్లో మొత్తం క్యానర్సర్ కేసుల్లో ఇది 30శాతం.

రొమ్ము తొలగించకుండా చికిత్స ఎప్పుడు చేస్తారు?
రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించినట్టయితే చాలా మంది మహిళలకు రొమ్మును పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉండదని క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణురాలు డాక్టర్ సెల్వి రాధాకృష్ణన్ తెలిపారు.
"క్యాన్సర్‌ను మొదటి లేదా రెండో దశల్లో గుర్తిస్తే, వ్యాధి ఉన్న భాగాన్ని మాత్రమే తొలగించి, మిగిలిన రొమ్మును అలాగే ఉంచే 'బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ' చేయవచ్చు. కానీ ఈ విధానం అందరికీ ఒకేలా ఉండదు'' అని సెల్వి రాధాకృష్ణన్ తెలిపారు.
రొమ్ము పరిమాణం, క్యాన్సర్ కణితి పరిమాణం, కణితి ఉన్న ప్రదేశం, రొమ్ము కణజాలం స్వభావం వంటి అంశాలు చికిత్సలో కీలక పాత్ర పోషిస్తాయి. రొమ్ము పరిమాణాన్ని ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్‌వంటి రకాలుగా వర్గీకరిస్తారని డాక్టర్ సెల్వి రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
"ఉదాహరణకు చిన్న రొమ్ములో 2 లేదా 3 సెంటీమీటర్ల పరిమాణమే ఉన్న కణితి ఉన్నా అది ఎక్కువ భాగాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చు. అదే పరిమాణం కణితి పెద్ద రొమ్ములో ఉంటే దాన్ని తొలగించడం సులభం'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కణితి చనుమొనకు దగ్గరగా ఉంటే...
"రొమ్ము చనుమొనకు కణితి దగ్గరగా ఉందా లేక రొమ్ము బయటి భాగంలో ఉందా అనేది కూడా ముఖ్యం. ఒకవేళ కణితి చంకకు దగ్గరగా, రొమ్ము బయటి భాగంలో ఉంటే దానిని తొలగించడం, రొమ్మును అలాగే ఉంచడం కొంత సులభం అవుతుంది. అదే చనుమొన వెనక లేదా రొమ్ము మధ్యలో కణితి ఉంటే చికిత్స చేయడం కష్టంగా మారొచ్చు" అని సెల్వి రాధాకృష్ణన్ అంటున్నారు.
" కొంతమంది రోగుల్లో కణితి పరిమాణాన్ని తగ్గించడానికి శస్త్రచికిత్సకు ముందే కీమోథెరపీ చేస్తారు. దీని వల్ల రొమ్మును పూర్తిగా తొలగించకుండానే చికిత్స చేయగల అవకాశం పెరుగుతుంది" అని డాక్టర్ సెల్వి రాధాకృష్ణన్ చెప్పారు.
ఇప్పుడు రొమ్మును సంరక్షించే శస్త్రచికిత్సా విధానాన్నే ప్రపంచవ్యాప్తంగా ఆమోదిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స తర్వాత రేడియేషన్ థెరపీతోపాటు రొమ్మును రక్షించే శస్త్రచికిత్స చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు ఆరోగ్య సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి.
రొమ్ము క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్న రోగుల్లో రొమ్మును సంరక్షిస్తూ చేసే చికిత్స, రొమ్మును తొలగించే మాస్టెక్టమీ లాంటి చికిత్సల మధ్య ఎక్కువ కాలం జీవించే విషయంలో పెద్ద తేడా ఉండదని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొన్నాయి.
రోగి ఆరోగ్య పరిస్థితికి, క్యాన్సర్ స్వభావానికి తగినట్టుగా ఉంటే రొమ్మును కాపాడే చికిత్సను ఎంచుకోవచ్చు. వైద్యపరంగా కూడా ఇది ఆమోదించిన విధానమే.
కాబట్టి "రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్మును పూర్తిగా తొలగించాల్సిందే" అనే అభిప్రాయం ప్రస్తుతం సరైనది కాదు. క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తామనేదే ముఖ్యం. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ నుంచి బయటపడడంతోపాటు రొమ్మును కూడా కాపాడుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శస్త్రచికిత్స తర్వాత కూడా ఆకారం మారకుండా ఉండాలంటే...
"రొమ్మును కాపాడుకోవడం అంటే కేవలం క్యాన్సర్ కణితిని తొలగించడం మాత్రమే కాదు" అని రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన ప్లాస్టిక్ సర్జన్ నిపుణురాలు డాక్టర్ మంజులారావు చెప్పారు.
"క్యాన్సర్ కణితిని తొలగించిన తర్వాత ఏర్పడే ఖాళీని పునర్నిర్మాణ శస్త్రచికిత్స ద్వారా పూరించవచ్చు. దీని కోసం రొమ్ములో మిగిలిన కణజాలాన్నే ఉపయోగించవచ్చు లేదా పొట్ట వంటి శరీరంలోని ఇతర భాగాల నుంచి కణజాలాన్ని తీసుకొచ్చి రొమ్ములో కణితిని తొలగించిన చోట అమర్చవచ్చు" అని ఆమె వివరించారు.
ఈ చికిత్స ప్రారంభ దశలో ఉన్న రోగులకే కాకుండా కొంతమంది మూడో దశ క్యాన్సర్ రోగులకు కూడా ఉపయోగపడవచ్చని డాక్టర్ మంజులారావు చెప్పారు. క్యాన్సర్ కణితిని తొలగించే శస్త్రచికిత్స సమయంలోనే రొమ్మును తిరిగి పునర్‌నిర్మించే శస్త్ర చికిత్స కూడా చేయొచ్చని ఆమె తెలిపారు.
"దీని వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, రోగి శారీరక రూపంలో పెద్దగా మార్పు ఉండదు. ఇది మహిళల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది" అని డాక్టర్ మంజుల అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























