కర్ణాటక: సీఎం సిద్ధరామయ్య రాజీనామా, 'కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్'

ఫొటో సోర్స్, ANI
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు.
సీఎం సిద్ధరామయ్య రాజీనామా లేఖ అందజేశారని, అయితే గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఆయన నివాసానికి వెళ్లారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదిస్తారని గవర్నర్‌కు ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ తెలిపినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
దీనికిముందు కర్ణాటక మంత్రి హెచ్‌కె పాటిల్ పీటీఐతో మాట్లాడుతూ, తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గ సహచరులకు చెప్పారని అన్నారు.
'కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారు' అని మంత్రి పాటిల్ పీటీఐతో చెప్పారు.
"ఈ అంశంపై హైకమాండ్ స్థాయిలో చర్చ జరిగిందని, పదవికి రాజీనామా చేయాలని వారు సూచించారని, అందుకు సంతోషంగా అంగీకరించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. డీకె శివకుమార్‌ను తదుపరి ముఖ్యమంత్రిని చేయాలని అధిష్ఠానం ప్రతిపాదించిందని, దానికి కూడా అంగీకరించినట్లు సిద్దరామయ్య చెప్పారు" అని పాటిల్ తెలిపారు.

ఆయన పీటీఐతో మాట్లాడుతూ "ఇది ఏకగ్రీవ నిర్ణయమని, ఇందులో ఎలాంటి విభేదాలు, అసమ్మతి లేదా వివాదాలు లేవని సిద్ధరామయ్య మాకు చెప్పారు. డి.కె. శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారు. సిద్ధరామయ్య ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాజభవన్‌కు వెళ్తారు" అని తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేశారు. మే 20 నాటికి తన రెండో పదవీకాలంలో మూడేళ్లు కూడా పూర్తి చేసుకున్నారు.
"ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రులందరినీ ఉదయం అల్పాహారానికి పిలిచారు. రాజీనామా చేయడానికి ముందు మంత్రులందరికీ వారి సహకారానికి ధన్యవాదాలు తెలియజేయాలని ఆయన భావించారు. సిద్ధరామయ్యకు దిల్లీలో ఏదైనా పదవి ఇచ్చే ప్రతిపాదన ఉందో లేదో నాకు తెలియదు. ఆ నిర్ణయం అధిష్ఠానంపైనే ఆధారపడి ఉంటుంది" అని కర్ణాటక మంత్రి జి. పరమేశ్వర చెప్పారు.

ఫొటో సోర్స్, DK Shivakumar/Facebook
'ట్రబుల్ షూటర్' డీకే శివకుమార్..
కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రిగా చెబుతున్న దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్ అలియాస్ డీకే శివకుమార్‌కు రాజకీయవర్గాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరుంది.
డీకే శివకుమార్ 'ఒక్కలిగ' సామాజికవర్గానికి చెందిన వారు. కర్ణాటకలో 'లింగాయతుల' తరువాత బలమైన సామాజికవర్గం ఒక్కలిగులే. వ్యవసాయం వీరి ప్రధానవృత్తి.
1989 నుంచి ఇప్పటి వరకు ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాతనూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు, కనకపుర నుంచి నాలుగు సార్లు ఆయన గెలిచారు. 1999 ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీ నేత హెచ్డీ కుమారస్వామిని ఆయన ఓడించారు.
ఆయన అనేక మంత్రి పదవులు కూడా నిర్వహించారు. 2013-18 మధ్య సిద్ధరామయ్య ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత 2018-23 మధ్య జేడీ(ఎస్)-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు.
2020 నుంచి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.
1962లో కనకపురలో జన్మించిన డీకే శివకుమార్, కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ)లో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో 27 ఏళ్ల వయసులో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆయన పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేశారు.
కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, చిక్కుల్లో పడినప్పుడు డీకే శివకుమార్ ఆదుకుంటారనే పేరు ఉంది. 2002లో మహారాష్ట్రలోని విలాస్ రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం, డీకే శివకుమార్ సాయంతోనే అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేయగలిగారని చెబుతారు.
నాడు సుమారు 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి అవిశ్వాస తీర్మానంలో ఎన్నిక జరిగే రోజు వరకు రిసార్ట్స్‌లో ఉంచారు డీకే శివకుమార్.
ఇక 2017లో గుజరాత్ నుంచి అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావడంలోనూ డీకే శివకుమార్ పాత్ర ఉందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో బీజేపీ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు సుమారు 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు శివారులోని రిసార్టులో ఉంచారు. ఇదంతా డీకే శివకుమార్ పర్యవేక్షణలోనే జరిగినట్లు కథనాలు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీకి విధేయునిగా ఉంటారనే పేరు కూడా డీకే శివకుమార్‌కు ఉంది. తొలి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉంటూ వస్తున్నారు.

ఫొటో సోర్స్, DK Shivakumar/Facebook
మనీలాండరింగ్ కేసు
డీకే శివకుమార్ మీద అవినీతి ఆరోపణలు, మనీలాండరింగ్ కేసులున్నాయి.
ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో సీబీఐ విచారణ చేపట్టింది. రూ.34 కోట్ల పన్నులు ఎగవేసినట్లు డీకే శివకుమార్ మీద 2017లో ఆరోపణలు వచ్చాయి.
2019 సెప్టెంబరులో మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. సుమారు నెల తరువాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు.
కర్ణాటక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో రూ.1,400 కోట్ల ఆస్తులను డీకే శివకుమార్ ప్రకటించారు. 2018లో ఆయన ఆస్తుల విలువ రూ.840 కోట్లుగా ఉంది.
రియల్ ఎస్టేట్, షేర్ల్ మార్కెట్లో పెట్టుబడులు, లీజులు, వ్యవసాయం వంటి మార్గాల ద్వారా ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























