ఎవరెస్ట్ అధిరోహించి, కిందకు దిగొస్తూ చనిపోయిన హైదరాబాద్ వాసి, ఆయన దేహాన్ని 'శివుని నివాసంలోనే ఉండనీయండి' అంటోన్న కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images/Arun family
హైదరాబాద్‌కు చెందిన అరుణ్ కుమార్ తివారీ ఎవరెస్టును అధిరోహించి తిరిగి వస్తూ మరణించారు. అయితే, ఆయన మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకురాకుండా ఎవరెస్ట్‌పైనే ఉంచాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.
అరుణ్ కుమార్ ఎవరెస్టు ఎక్కడానికి ప్రయత్నించడం ఇది రెండోసారి. తొలి ప్రయత్నంలో విఫలమైన ఆయన రెండో ప్రయత్నంలో సఫలం అయ్యారు కానీ, తిరిగి వచ్చే క్రమంలో మరణించారు.
అరుణ్ కుమార్ తివారీ దశాబ్ద కాలంగా పర్వతారోహణ చేస్తున్నారు. ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్, అర్జెంటీనాలో ఎత్తైన శిఖరాన్నీ, అలాగే కాంచనగంగా శిఖరాన్ని ఆయన అధిరోహించారు. గతేడాది అరుణ్ ఎవరెస్టును 7,200 మీటర్ల వరకూ ఎక్కారనీ,ఆ తరువాత పరిస్థితి అనుకూలించక వెనక్కి వచ్చేశారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.
మే 21, గురువారం సాయంత్రం అరుణ్ కుమార్ విజయవంతంగా ఎవరెస్ట్ ఎక్కారనే సమాచారం కుటుంబ సభ్యులకు అందింది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం ఆయన ఇక లేరని యాత్ర నిర్వాహకులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
అక్కడి వాతావరణ పరిస్థితులు, అరుణ్ ఆరోగ్యం కంటే కూడా, అక్కడ రద్దీ, యాత్ర నిర్వహణా విధానాలు కూడా అరుణ్ మరణానికి కారణం అయ్యుండొచ్చనే అభిప్రాయం ఆయన బంధువుల్లో ఉంది.


ఫొటో సోర్స్, Arun family
'ఆ వాతావరణంలో ఆక్సిజన్ కష్టం'
''గురువారం సాయంత్రం ఆయన ఎవరెస్ట్ ఎక్కారని మేం చాలా సంతోషించాం. కానీ, ఈలోపే ఇలా జరిగింది'' అని అరుణ్ బావమరిది సుధీర్ ఉపాధ్యాయ చెప్పారు.
'' ఆ రోజు దాదాపు 200 మందికి పైగా పర్వతారోహకులు ఎక్కుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో జేవియర్ అనే వ్యక్తి పెట్టిన పోస్ట్‌ని చెక్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అరుణ్ పర్వతం ఎక్కడానికి కేవలం 2 గంటల ముందు జేవియర్ ఎక్కాడు. ఆయన వీడియో చూస్తే అక్కడ ఎంత గందరగోళం, పొడవైన క్యూలు ఉన్నాయో, డెత్ జోన్ దగ్గర హిల్లరీ స్టెప్ మీద ఎంత మంది ఎదురు చూస్తున్నారో.. ఇవన్నీ కనిపించాయి’’ అన్నారు సుధీర్.
‘‘అరుణ్ కంటే కేవలం రెండు గంటల ముందే ఆయన వెళ్లారు కాబట్టి, అరుణ్ ఎటువంటి పరిస్థితుల్లో వెళ్లారో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 200 మంది పర్వతారోహకులు వేచి ఉన్నప్పుడు, అక్కడ ప్రతి నిమిషం చాలా కష్టం. వాతావరణంలో ఆక్సిజన్ చాలా కష్టం, భూమిపై మీరు తీసుకునే ప్రతి నాలుగు శ్వాసలకు అక్కడ మీరు ఒక్క శ్వాస మాత్రమే తీసుకోగలరు'' అని వివరించారు.
'ఎవరినీ నిందించాలనుకోవడం లేదు'
అరుణ్ భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడేందుకు సుముఖంగా లేరు. ఆయన బావమరిది సుధీర్ బీబీసీతో మాట్లాడి వివరాలు అందించారు.
ఈ మరణానికి కారణాలు విశ్లేషిస్తూనే ‘‘తాము ఎవర్నీ నిందించదలచుకోలేదని'' సుధీర్ చెప్పారు.
సాధారణంగా ఎవరెస్ట్ ఎక్కేవారు, 15-16 గంటలు పర్వతాన్ని అధిరోహించాల్సి ఉంటుంది. తక్కువ ఆక్సిజన్‌తో, వీపుపై 40 కిలోల బ్యాగుతో, అలసిపోయి ఉంటారని సుధీర్ అంటున్నారు.
''బహుశా ఆ అలసటే ఆయన ప్రాణం తీసిందనుకుంటున్నాను. ఒకవేళ ఆ క్యూ, వెయిటింగ్ సమయం చాలా తక్కువగా ఉండి ఉంటే, అక్కడ వ్యవస్థ ఇంకాస్త మెరుగ్గా నిర్వహించి ఉంటే ఆయన ప్రాణాలతో తిరిగి వచ్చేవారేమో'' అన్నారు సుధీర్.
ఈ యాత్రలో ఆయనకు సహకరించిన షెర్పాతో అరుణ్ కుటుంబ సభ్యులు మాట్లాడారు.
''అరుణ్‌కు సహాయం చేయడానికి చాలా ప్రయత్నించామని, కానీ, ఆయన రక్తం వాంతులు చేసుకుని మరణించారని షెర్పా చెప్పారని’’ సుధీర్ తెలిపారు.
అరుణ్ కుమార్ తనతో ఇద్దరు షెర్పాలను తీసుకెళ్లారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు ఆయన కుటుంబం చెబుతోంది.
అరుణ్ కుమార్ తివారీకి పర్వతారోహణ అంటే చాలా ఇష్టమని ఆయన బంధువులు చెబుతున్నారు. చాలా మంది జీవితకాలంలో ఒక్కసారైనా ఎవరెస్ట్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారని వారు గుర్తు చేశారు. అందుకోసం అరుణ్ ఏడాది పాటు శిక్షణ పొందినట్టు వారు చెబుతున్నారు.
ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అరుణ్ కుమార్ తివారీ హైదరాబాద్‌లో ఒక ఐటీ కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్నారు. 53 ఏళ్ల అరుణ్ కుమార్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు ఒకరు స్కూల్లో, ఒకరు కాలేజీలో చదువుకుంటున్నారు.
''గతేడాది ఎవరెస్ట్ ఎక్కలేకపోవడంతో, దానికి కారణాలను విశ్లేషించుకుని, తప్పులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని, తన ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెంచుకుని, మరోసారి ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్లారు’’ అని సుధీర్ గుర్తు చేసుకున్నారు.
‘‘అరుణ్ పర్వతారోహణలో బాగా శిక్షణ పొందారు. ఎంతో నైపుణ్యం కలిగిన పర్వతారోహకుడు. ఆయన ఆరోగ్యంగా కూడా ఉన్నారు. ప్రీ డయాబెటిక్ ఉందనే అనుమానం ఉంది. అంతకుమించి ఊపిరితిత్తులు కానీ, మరే విధమైన ఆరోగ్య సమస్యలు కానీ ఆయనకు లేవు'' అని సుధీర్ ఉపాధ్యాయ బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
హిమాలయాల్లోనే అరుణ్ చివరి ప్రస్థానం
మృతదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం విరమించుకోవాలని ఆ కుటుంబం నిర్ణయించుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎవరెస్ట్ శిఖరంపై చనిపోయిన వారి శరీరాన్ని కిందకు తీసుకు రావడం తేలికైన పని కాదు. దానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు భరించలేక మృతదేహాన్ని అక్కడ వదిలేసే వారూ ఉంటారు. కానీ, అరుణ్ కుటుంబం ఇతర కారణాలతో ఆ శరీరాన్ని కిందకు తీసుకురాకూడదని నిర్ణయించుకుంది.
అరుణ్‌కి పర్వతాలంటే చాలా ఇష్టం. ఆయన చివరి శ్వాస విడిచిన పర్వతాల్లోనే ఆయన శరీరాన్ని వదిలేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
సుధీర్ ఉపాధ్యాయ మాట్లాడుతూ, ''హిల్లరీ స్టెప్ చాలా చిన్న, ఇరుకైన మార్గం. అక్కడి నుంచి తీసుకురావడం చాలా ఇబ్బంది. పైగా అది శిఖరానికి 60 మీటర్ల దిగువన మాత్రమే ఉంది. మౌంట్ ఎవరెస్ట్ జీవితకాలంలో ఇప్పటివరకు ఏ ఒక్క యాత్రలోనూ ఎవరినీ అక్కడి నుంచి తీసుకురాలేదనీ, ఆ డెత్ జోన్లో ఇంకా దాదాపు 270 మందికి పైగా అలాగే విశ్రాంతి తీసుకుంటున్నారనీ చెబుతున్నారు’’ అని చెప్పారు.
‘‘ఒకవేళ మేం ఈయన మృతదేహాన్ని తీసుకురావాలంటే, ఎనిమిది మంది షెర్పాల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే. క్లైంబింగ్ విండో ముగిసే సమయంలో ఆయన మృతదేహాన్ని వెనక్కి తెచ్చే క్రమంలో ఎవరైనా షెర్పాను కోల్పోతే, అది మాకు మరింత అపరాధ భావాన్ని కలిగిస్తుంది'' అన్నారు.
షెర్పాలు నేపాల్‌కి చెందిన ఒక తెగ ప్రజలు. వారు ఎవరెస్ట్ ఎక్కేవారికి సహాయకులుగా, ఎవరెస్ట్ నుంచి మృతదేహాలను తీసుకురావడంలో సాయపడుతుంటారు.
''హిమాలయాన్ని దైవభూమిగా భావిస్తారు. హిమాలయం శివుడి నివాసం. ఎవరైనా శివుని నివాసంలో మరణిస్తే, వారు కైలాసానికి వెళ్తారు. అందుకే అరుణ్ మృతదేహాన్ని కిందకు తీసుకురాకుండా అక్కడే వదిలేస్తున్నాం'' అన్నారు సుధీర్ ఉపాధ్యాయ.
''మైనస్ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వల్ల మృతదేహం రాయిలా మారుతుంది. మృతదేహాన్ని తీసుకువచ్చే సమయంలో ఏ చిన్న దెబ్బ తగిలినా ఎముకలు, ఇతర శరీర భాగాలు ముక్కలై. ఆయన శరీరం ఛిద్రమైపోతుంది’’ అన్నారు సుధీర్.
‘‘ఆయనకు పర్వతాలంటే ఇష్టం, ఆయన సంతోషకరమైన ప్రదేశంలోనే ఉన్నారు. ఇవన్నీ పరిగణించి, ఆయన మృతదేహాన్ని అక్కడే ఉంచాలని నిర్ణయించుకున్నాం'' అని సుధీర్ ఉపాధ్యాయ బీబీసీకి చెప్పారు.
అరుణ్ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ కలసే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
'‘మా నాన్న రాజులా బతికారు. ఛిద్రమైన స్థితిలో ఆయన శరీరాన్ని చూడలేం'' అని పిల్లలు అన్నారని సుధీర్ ఉపాధ్యాయ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























