దిల్లీ: సత్యనికేతన్ మార్కెట్‌లో కూలిన ఐదంతస్తుల భవనం, ఆరుగురి మృతి. రాత్రంతా ఏం జరిగింది?

ఫొటో సోర్స్, ani
దిల్లీలోని సత్యనికేతన్ మార్కెట్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
మోతీ బాగ్-2 లోని శివ మందిర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
10 మందిని ట్రామా సెంటర్‌కు తీసుకురాగా వారిలో ఐదుగురు అప్పటికే మరణించారని తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి తర్వాత చనిపోయారని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటివరకు 9 మంది పిల్లలను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు దిల్లీ అదనపు డీసీపీ అభిమన్యు పోస్వాల్ తెలిపారు .
"ప్రాణాలతో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం చాలా ముఖ్యం. అందువల్ల, ఈ ఆపరేషన్‌కు కొంత సమయం పడుతుంది" అని ఎన్‌డిఆర్‌ఎఫ్ ఐజి ఎన్ఎస్ బుందేలా చెప్పారు.

ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో భవనం కూలినట్లు దిల్లీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందిందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
సమాచారం అందిన వెంటనే ఫైర్ బ్రిగేడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించాయని ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం తెలిపింది.
ఘటనా స్థలానికి ఐదు ఫైర్ టెండర్లు, పోలీసు బృందాలను పంపినట్లు అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు చెప్పారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఆ హాస్టల్‌లో తన స్నేహితులు చాలామంది ఉంటున్నారని, ప్రస్తుతం వారితో మాట్లాడలేకపోతున్నానని ఒక విద్యార్థి 'ఐఎన్‌ఎస్' వార్తా సంస్థకు తెలిపారు.

ఫొటో సోర్స్, ani
రాత్రంతా శిధిలాల తొలగింపు
స్థానిక ప్రజలు కూడా తొలి సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. అందుబాటులో ఉన్న పనిముట్లతో శిథిలాలను తొలగించడానికి ప్రయత్నించారు.
శిథిలాల నుంచి 11 మందిని బయటకు తీశారని దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదివారం సాయంత్రం తెలిపారు.
ఈ సహాయ చర్యల్లో సంబంధిత ఏజెన్సీలన్నీ పాలుపంచుకుంటున్నాయని ఆమె చెప్పారు. శిథిలాల కింద పూడిపోయిన వారి కోసం వెతకడానికి ఎన్‌డిఆర్‌ఎఫ్ జాగిలాల సహాయం తీసుకుంటున్నారు.
సహాయక చర్యల సమయంలో, శిథిలాల కింద చిక్కుకున్న కొంతమంది చేసిన ఫోన్ కాల్స్ గురించిన సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది.
శిథిలాల కింద చిక్కుకున్న ప్రజల నుంచి ఫోన్లు వస్తున్నాయని, సహాయక బృందం వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఒక పోలీసు అధికారి కూడా చెప్పారు.

ఫొటో సోర్స్, ani
ఆదివారం సాయంత్రం వరకు ఏం జరిగింది?
ఆదివారం మధ్యాహ్నం దిల్లీలోని సత్య నికేతన్ మార్కెట్ ప్రాంతంలో ఐదు అంతస్తుల పీజీ(పేయింగ్ గెస్ట్స్) భవనం కూలిపోయింది. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని భావిస్తున్నారు.
"భవన యజమాని గురించి సమాచారం సేకరిస్తున్నాం. మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఆయనను త్వరలో అరెస్ట్ చేస్తాం" దిల్లీ అదనపు డీసీపీ అభిమన్యు పోస్వాల్ చెప్పారు
"అది 40-50 ఏళ్ల నాటి భవనమని స్థానిక విచారణలో తేలింది. అందులో బేస్‌మెంట్, ఐదు పై అంతస్తులు ఉన్నాయి. దానిని పీజీ హాస్టల్‌గా వాడుతున్నారు. ఘటన జరిగిన సమయంలో బేస్‌మెంట్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి" అని దిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సంతాపం వ్యక్తం చేసి, సహాయక, రెస్క్యూ ఆపరేషన్లలో సాధ్యమైనంత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, ఎంపీ పప్పు యాదవ్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నాయకులు స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
ప్రత్యక్ష సాక్షులేం చెప్పారంటే..
భవనం కూలిపోయిన సమయంలో ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించింది.
పేలుడు వంటి శబ్దం వినబడగానే ప్రజలు బయటకు పరుగులు తీశారని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన విద్యార్థి ఒకరు ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
"హఠాత్తుగా భూకంపం వచ్చినట్లు శబ్దం వచ్చింది. మేం వెంటనే బయటకు పరిగెత్తాం. అంతటా దట్టమైన పొగ, ధూళి అలుముకున్నాయి. భవనం మొత్తం కుప్పకూలిపోయింది" అని ఆయన చెప్పారు.
"శిథిలాల లోపలి నుంచి ఇప్పటికీ కేకలు వినిపిస్తున్నాయి. 'మమ్మల్ని కాపాడండి, కాపాడండి!' అంటూ పిల్లలు అరుస్తున్నారు. లోపల కనీసం 25-30 మంది పిల్లలు ఉండవచ్చు. పక్కనే బాయ్స్, గర్ల్స్ పీజీలు ఉన్నాయి. నలుగురైదుగురిని రక్షించారు. వారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, శ్వాస తీసుకుంటున్నారు" అని ఆ విద్యార్థి చెప్పారు.
ఈ భవనం బేస్‌మెంట్‌లో మరమ్మతులు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు
"ఈ భవనాలను 100 ఏళ్ల లీజుకు ఇచ్చారు. తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి వారు బేస్‌మెంట్‌లను నిర్మిస్తున్నారు. పైన భవనాన్ని బలంగా నిర్మించారు కానీ కింది పిల్లర్లు బలహీనంగా ఉన్నాయి. దీనివల్లే భవనం కూలిపోయింది" అని ఆ విద్యార్థి అన్నారు.
"బేస్‌మెంట్‌లో కొంతమంది కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారు. భవనం ముందు పండ్లు తదితర వస్తువులు అమ్ముకునే వీధి వ్యాపారులు కూడా శిథిలాల కింద చిక్కుకున్నారు" అని ఆ విద్యార్థి తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
"బాధ్యులపై చర్యలు తీసుకోవాలి"
కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
దిల్లీ యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థులు ఈ భవన శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన వ్యక్తం చేసింది.
"దిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లో భవనం కుప్పకూలిన వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డీయూ విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం వస్తోంది" అని ఎన్‌ఎస్‌యూఐ తన ఎక్స్ ఖాతాలో మెసేజ్ పోస్ట్ చేసింది.

ఫొటో సోర్స్, ANI
అభిజీత్ దీప్కే ఏమన్నారంటే..
ఈ ఘటన జరిగిన వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన ఒక వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు.
"శిథిలాల కింద విద్యార్థులు చిక్కుకున్నారు. స్థానిక ప్రజలు తమ చేతులతోనే వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులెవరూ కంటికి కనిపించడం లేదు. ప్రాణాలు కాపాడటానికి ప్రతి నిమిషం ఎంతో విలువైనదైనప్పుడు, యంత్రాంగం ఎక్కడ ఉంది? ఇదంతా ఇంకెంత కాలం సాగుతుంది?" అని ఆయన ఆ వీడియోలో ప్రశ్నించారు.
మరొక పోస్ట్‌లో అభిజీత్ "నిన్ననే ప్రధాని డీయూని సందర్శించి రాజకీయ ప్రసంగం చేశారు, 'మెంటల్ నక్సల్స్' అనే పదాన్ని కూడా వాడారు, కానీ మన విద్యా వ్యవస్థ దుస్థితి గురించి తక్కువ మాట్లాడారు. ఈ రోజు సౌత్ క్యాంపస్‌లో ఒక హాస్టల్ భవనం కూలిపోయింది. విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నారని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఇంకా తెలియదు" అని పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























