‘‘హరహర మహదేవ్ అని మోదీ ఎందుకు అనరు?’’ అన్న సీఎం రేవంత్ కామెంట్స్ పై రాజకీయ వివాదం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఖగేష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
రాముడు ధనవంతుల దేవుడని, శివుడు పేదల దేవుడనీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతోపాటు రాజకీయ వేదికలపై కూడా విపరీతమైన చర్చ నడుస్తోంది.
రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
హిందువుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని వారు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల నేతలు, వారి అనుచరులు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. గతంలో వివిధ సందర్భాల్లో ఆయా నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పోస్టులు పెట్టుకుంటున్నారు.

చర్చ ఎలా మొదలైంది?
న్యూదిల్లీలోని ప్రతిదిన్ మీడియా నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన 'ది కాంక్లేవ్ 2026'లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘సర్’ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడంతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుందో ప్రస్తావించారు. అందులో భాగంగానే రాముడు, శివుడుపై కామెంట్స్ చేశారు.
దక్షిణాదిలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందని, ఉత్తరాదిలో మాత్రం ఎందుకు దారుణమైన ఓటమి ఎదురవుతోందని ఆయన్ను ఈ కార్యక్రమం ప్రజెంటర్ ప్రశ్నించారు.
'మేం ద్రావిడులం, వాళ్లు ఆర్యులు'
ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ రేవంత్ రెడ్డి... ‘‘ఇది చాలా సింపుల్, మేం ద్రావిడులు, వాళ్లు ఆర్యులు, మేం శివుడి భక్తులం, వారు రామ భక్తులు. రాముడిని బీజేపీ వాళ్లు చోరీ చేశారు. హరహర మహాదేవ్ అని చెప్పకుండా జైశ్రీరామ్ అని అంటారు. బీజేపీ శ్రేణులు ఎవరైనా హరహర మహాదేవ్ అని అనడం ఎప్పుడైనా విన్నారా, వాళ్లు జై శ్రీరామే అంటారు. శివుడు పేదల దేవుడు. ధనవంతుల దేవుడు రాముడు. అందుకే బీజేపీ ధనవంతుల పార్టీ’’ అని అన్నారు.
‘‘హరహర మహదేవ్ అని మోదీ ఎందుకు అనరు’’ అని రేవంత్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. మతాల మధ్య గీతలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దేవుళ్ల మధ్య విభజన గీతలు గీస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఆయన దక్షిణాదిలో ఉన్న ఆలయాలు ప్రస్తావించారు. ‘‘ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు శ్రీరాముడికి, శివుడికి మధ్య రాజకీయ విభజన గీతలు గీస్తున్నారు’’ అని అన్నారు.
వేములవాడలో దక్షిణ కాశీ, భద్రాచలంలో దక్షిణ అయోధ్య అని పిలిచే ఆలయాలున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి... శ్రీరాముడిని, శివుడిని ఉత్తర-దక్షిణ ప్రాంతాలుగా విభజించడం ఎంత తప్పో తెలిసుండాలి’’ అని సంజయ్ అన్నారు.
వారణాసి నుంచి పోటీ చేశారని గుర్తు చేసిన బండి సంజయ్, హరహర మహాదేవ్ అంటూ నినదించిన మోదీ వీడియోను కూడా పోస్టు చేసి, ‘చూడండి’ అంటూ రేవంత్ రెడ్డికి సూచించారు.
‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారణాసి ఆధ్యాత్మిక హృదయంలో ఎవరున్నారు? కాశీ విశ్వనాథుడు, అంటే సాక్షాత్తు శివుడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వేములవాడలోని రాజరాజేశ్వర స్వామిని సందర్శించిన మొదటి ప్రధాన మంత్రి మోదీయే’’ అని బండి సంజయ్ అన్నారు.
'హిందువులను విభజించే ఆలోచన'
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకూడా స్పందించారు. ‘‘అత్యంత దారుణం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హిందూ దేవుళ్లను విభజించడం మొదలుపెట్టింది’’ అని ఆయన ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.
భారతీయ శాస్త్రవేత్తలు చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్నప్పుడు ల్యాండింగ్ ప్రదేశానికి ‘శివశక్తి పాయింట్’ అని ప్రధాని పేరు పెట్టారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. హిందూ సమాజాన్ని ఉత్తర-దక్షిణ ప్రాంతాలుగా విభజించే కుట్రలో కాంగ్రెస్ భాగమైందని ఆయన ఆరోపించారు.
శ్రీరాముడు, శివుని గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది విమర్శలు చేశారు. " హిందూ సమాజాన్ని ఉత్తర-దక్షిణ ప్రాంతాలుగా విభజించే కుట్రలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి భాగస్వామ్యం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నాయని, ఉత్తరాది రాష్ట్రాలు తక్కువ చెల్లిస్తున్నాయని కర్ణాటక ఆర్థిక మంత్రి డి.కె. సురేశ్ ఆరోపించారు. ఉత్తర భారతదేశం లేకపోతే దక్షిణాది మరింత అభివృద్ధి చెందేదని చిదంబరం గతంలో వ్యాఖ్యానించారు’’ అని త్రివేది అన్నారు.
‘‘ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 'మేము ద్రావిడులం, వారు ఆర్యులు' అని అంటున్నారు. భాష, ఆ తర్వాత కులం, ఆపై లింగం ఆధారంగా ప్రజలను విభజించాలని చూస్తున్నారు, రాహుల్ గాంధీ 'హర్ హర్ మహాదేవ్' అని జపించడం ఒక్క వీడియోలో కూడా కనిపించదు’’ అని సుధాంశు త్రివేది విమర్శించారు.

ఫొటో సోర్స్, Mahesh Goud Bomma/FB
మేం ఇద్దర్నీ ప్రార్థిస్తాం: పీసీసీ చీఫ్
రాముడిని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ ఆరోపించారు. ఇద్దరు దేవుళ్లు తమకు సమానమేనని, ఇద్దర్నీ ప్రార్థిస్తామని ఆయన అన్నారు.
‘‘సాధారణంగా చూస్తే శివుడు పేదలకు, రాముడు ధనవంతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ మేం ఇద్దరు దేవుళ్లను ప్రార్థిస్తాం. కానీ దురదృష్టవశాత్తు రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. ఇది మంచిది కాదు" అని ఆయన అన్నారు.
బీజేపీ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ స్పందించారు. "దేవుడి పేరుతో విభజించి రాజకీయ లబ్ధి పొందింది బీజేపీనే. సాక్షాత్తు శ్రీరాముడి పేరుతో విరాళాలు సేకరించి కాజేసింది కూడా బీజేపీనే. దేవుడి విరాళాలు దొంగిలించిన వారికి మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎక్కడుంది? కేవలం అధికారం కోసం దేవుడిని కూడా వాడుకునేంత దిగజారుడు స్థాయికి బీజేపీ పడిపోయిందని నిరూపించడమే మా ముఖ్యమంత్రి ఉద్దేశం." అని ఆయన వివరించారు.
‘ఇదో పేపర్ కాంట్రవర్సీ’
రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పేపర్ కాంట్రవర్సీగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. రాజకీయాల కోసం చేస్తున్న ఇలాంటి వివాదాలను నిజమైన హిందువులు పట్టించుకోరని ఆయన అన్నారు.
‘‘ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయాలా చేయకూడదా అనే విషయాన్ని రేవంత్ రెడ్డే ఆలోచించుకోవాలి. బీజేపీ కూడా ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడంపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజమైన హిందువు ఈ రెండువర్గాల వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోకపోవచ్చు, ఎవరో ఒకరిద్దరు ఆనందపడొచ్చు. ఇది కేవలం పేపర్ కాంట్రవర్సీ మాత్రమే’’ అని డాక్టర్ పుల్లారావు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























