హైదరాబాద్‌: ‘ఆ వాటర్ ట్యాంక్ నా జీవితాన్నే మార్చేసింది’

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 8 నిమిషాలు

"ఈ వాటర్ ట్యాంకు నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నన్ను గ్రాడ్యుయేట్‌ను చేసింది. నాలుగు డబ్బులు సంపాదించుకునేలా చేసింది. పది నుంచి పన్నెండేళ్లు అన్నం పెట్టింది. నలుగురితో ఎలా మాట్లాడాలో, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నేర్పించింది. నా లైఫ్‌లో ఈ వాటర్ ట్యాంక్ లేకపోయి ఉంటే నేను లేను." అన్నారు వెన్నెల.

తన జీవితానికి ఆలంబనగా నిలిచిన వాటర్ ట్యాంక్ ‌గురించి మాతో భావోద్వేగంతో మాట్లాడారు వెన్నెల.

తల్లిదండ్రులు పెళ్లి చేసి అత్తారింటికి పంపేయాలనుకున్నప్పుడు ఆమె తన చదువును ఈ వాటర్ ట్యాంకులోనే కొనసాగించారు.

వాటర్ ట్యాంకులో చదువు ఏంటని ఆశ్చర్యపోతున్నారా!

ఆ కథ తెలియాలంటే హైదరాబాద్‌లోని మియాపూర్ మాతృశ్రీ నగర్‌లోని వాటర్ ట్యాంక్ స్కూలు గురించి తెలుసుకోవాలి. ఈ వాటర్ ట్యాంక్ కాలనీ వెల్ఫేర్ సొసైటీకి చెందినది.

వాటర్ ట్యాంక్ వద్దకు పిల్లలు ఎందుకు వస్తారంటే..

రోజూ సాయంత్రం 5.30 గంటలు అయ్యేసరికి వాటర్ ట్యాంక్ ముందు వ్యాన్ వచ్చి ఆగుతుంది.

అందులోంచి కొందరు పిల్లలు దిగి వాటర్ ట్యాంక్ అంతస్తుల్లోకి వెళ్లి చదువుకుంటారు.

కాసేపటి తర్వాత, మరికొందరు పిల్లలు కూడా అక్కడికి వచ్చి రాత్రయ్యేవరకు చదువుకుంటారు.

వీరందరినీ పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ (పీఎస్ఎస్ ట్రస్ట్) ఇలా ఒకచోటకు చేర్చి ఉచితంగా చదివిస్తోంది.

తండ్రి సెక్యూరిటీ గార్డు.. కుమార్తె రీసర్చ్ ఇంజనీర్

ట్రస్ట్ సాయంతో చదువుకున్న వారిలో లింగంపల్లికి చెందిన వెన్నెల ఒకరు.

ఆమె తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. తల్లి టీ బండి నడిపేవారు.

"నేను డిప్లొమా చివరి ఏడాది చదువుతున్నప్పుడు నాకు పెళ్లి చేయాలని అమ్మా నాన్న నిర్ణయించారు. నాకు పెళ్లి ఇష్టం లేదు, చదువుకుంటానని చెప్పినా వినలేదు. చాలా రోజులపాటు ఏడుస్తూనే ఉన్నాను. ఆ సమయంలో శ్రీనివాస్ సర్‌కు ఫోన్ చేస్తే, వచ్చి మా అమ్మానాన్నలను ఒప్పించి చదువు కొనసాగించేలా చూశారు" అని బీబీసీతో చెప్పారు వెన్నెల.

డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు ఫీజులు, పుస్తకాలు సహా అన్ని ఆర్థిక అవసరాలకూ ట్రస్ట్ ఆసరాగా నిలిచిందని వెన్నెల చెప్పారు

ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని హ్యుందాయ్ ట్రాన్సిస్ అనే కంపెనీలో రీసర్చ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

"అమ్మానాన్నలు ఇప్పుడు నన్ను చూసి ఎంతో గర్వపడుతుంటారు. ఏదో చిన్న పనులు చేసుకుని బతికే వాళ్లకు.. తమ కూతురు ఈ రోజు అద్దాల మేడలో కూర్చుని పనిచేసేలా చేసింది ట్రస్ట్. ఈ వాటర్ ట్యాంక్ నా జీవితాన్ని మలిచింది" అని వెన్నెల వివరించారు.

అలా వాటర్ ట్యాంకుకు మారింది..

పేద పిల్లల విద్యావసరాలు తీర్చే ఉద్దేశంతో పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్టు పాఠశాల (ఉచిత కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కమ్ ట్యూషన్ సెంటర్)ను 2003 ఆగస్టు 15న తన తండ్రి పేరుతో ఏర్పాటు చేశారు పోతుకూచి శ్రీనివాస్.

''నేను ఒకసారి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాను. అక్కడ పిల్లలను చూశాక పాఠశాలలోనే కాదు, తర్వాత కూడా చదువు అవసరమని అనిపించింది. పిల్లలు ఎలాంటి చెడు వ్యసనాల జోలికీ పోకుండా ఉండాలంటే పాఠశాల అయిపోయిన తర్వాత కూడా చదువుపై ధ్యాస ఉండాలి అనుకుని ఏర్పాటు చేసిందే ఈ ట్రస్టు'' అని శ్రీనివాస్ చెప్పారు.

మొదట్లో చిన్న షెడ్డులో ట్యూషన్ తరగతులు నిర్వహించేవారు.

2008లో మాతృశ్రీ నగర్‌లో ఉండే వాటర్ ట్యాంకుకు మారారు. అప్పటికే వాటర్ ట్యాంకు కింద గదులు నిరుపయోగంగా ఉండటంతో కాలనీవాసుల సహకారంతో పిల్లలకు చదువు చెప్పేందుకు దీన్ని తీసుకున్నామని ఆయన వివరించారు.

ట్రస్టు తరఫున తొమ్మిదో తరగతి నుంచి మొదలు పెట్టి డిప్లొమా, బీటెక్ పూర్తయ్యేవరకు ట్యూషన్, కెరీర్ గైడెన్స్‌నుఅందిస్తుంటారు.

ప్రతి రోజూ సాయంత్రం.. సెలవు దినాల్లో రోజంతా..

వాటర్ ట్యాంకు మూడు అంతస్తుల్లో ఉంటుంది. మొదటి రెండు అంతస్తుల్లో గదులు ఉన్నాయి. అక్కడే పిల్లలకు తరగతులు నిర్వహిస్తున్నారు.

మొదటి అంతస్తులో కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది.

ఇక్కడికి వచ్చే పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని ట్రస్టు నిర్వహణలో పాలుపంచుకుంటున్న శ్రీధర్ వివరించారు.

ప్రతి రోజూ స్కూల్ అయిపోయాక పిల్లలందరూ వాటర్ ట్యాంకు వద్దకు వచ్చి చదువుకుంటుంటారు. సెలవు రోజుల్లో మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి చదువుకుంటుంటారు.

ఆడపిల్లలు వచ్చీ, వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా వ్యాను ఏర్పాటు చేసింది ట్రస్టు.

''పిల్లలు సాయంత్రం స్కూల్ అవ్వగానే ఇక్కడికే వస్తారు. గతంలో ట్యూటర్లు ఉండి చదువు చెప్పేవారు. ఇప్పుడు ఇక్కడున్న సీనియర్లు చెబుతున్నారు. జూనియర్ల సందేహాలు తీరుస్తూ వారే పాఠాలు చెబుతున్నారు'' అని పోతుకూచి శ్రీనివాస్ వివరించారు.

ఆకలిగా ఉంటే చదువుపై దృష్టి పెట్టలేరు, అందుకే ఇక్కడ ఒక పూట భోజనం కూడా పెడుతుంటామని ఆయన వివరించారు.

మరోవైపు, వాటర్ ట్యాంకు అయినప్పటికీ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని శ్రీనివాస్ చెబుతున్నారు.

''సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటర్ ట్యాంకు మెట్లకు రెయిలింగ్ ఉంది. ఆడపిల్లలు ఇంటికి చేరే వరకు మాదే బాధ్యత'' అని చెప్పారు.

చదువు.. వంట.. శుభ్రత..

తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి ఇక్కడకు వస్తున్నారు బీటెక్ సెకండియర్ చదువుతున్న రామకృష్ణ.

నేను వాటర్ ట్యాంకు వద్దకు వెళ్లినప్పుడు ఆయనే వంట చేస్తున్నారు.

ఓవైపు ఈసెట్‌కు ప్రిపేర్ అవుతూనే, మరోవైపు గరిటె పట్టుకుని వంట చేస్తూ కనిపించారు.

''మా పనులు మేమే చేసుకుంటాం. దానివల్ల చిన్న వయసులోనే పనులు చక్కదిద్దుకోవడం, నిర్వహణపైన అవగాహన వస్తుంది. బీటెక్, డిప్లొమా చేసే పిల్లలు ఎవరికి తగ్గట్టు వారు పనులు విభజించుకుని చేస్తుంటాం'' అని చెప్పారు రామకృష్ణ.

''మా వద్దకు వచ్చే పిల్లలు చదువుకోవడమే కాదు. అన్ని పనులూ వారే చేసుకుంటారు. వంట వండటం, శుభ్రం చేసుకోవడం, ట్రస్టు జమా ఖర్చులు చూడటం... ఇవన్నీ పిల్లలే చేస్తారు'' అని శ్రీధర్ వివరించారు.

ఉద్యోగం వచ్చే వరకు అండగా..

తొమ్మిది, పది తరగతుల స్థాయిలో ట్యూషన్ చెబుతుండగా, డిప్లొమా, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజులు చెల్లించడం నుంచి అన్ని రకాల ఆర్థిక అవసరాలనూ ట్రస్టే తీరుస్తోంది.

దాతలు, సీఎస్ఆర్ కింద కంపెనీలు ఇచ్చే నిధులతోపాటు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు ఆర్థిక సాయం అందిస్తున్నారు.

ట్రస్టు సహకారంతో 2026 ఏప్రిల్ నాటికి 1531 మంది పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారని పోతుకూచి శ్రీనివాస్ చెప్పారు. సుమారు 1200 మందికిపైగా డిప్లొమా పూర్తి చేయగా, వారిలో దాదాపు 900 మంది ఉద్యోగాలు సాధించారని.. 225 మంది ఇంజినీరింగ్ పూర్తి చేయగా, 213 మంది ఉద్యోగాలు పొందారని శ్రీనివాస్ వివరించారు.

''కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ కార్యక్రమాన్ని ఆపదలుచుకోలేదు. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవడంతో పిల్లల చదువుకు ఎలాంటి అడ్డంకీ లేకుండా కొనసాగుతోంది'' అని శ్రీనివాస్ తెలిపారు.

చేయూతతో చదువు - కొలువు వచ్చాక చేయూత

ట్రస్ట్ సహకారంతో చదువు పూర్తి చేసుకుని వివిధ ఉద్యోగాల్లో స్థిరపడిన యువతీ యువకులు ఆ తర్వాత తమ వంతుగా ట్రస్టుకు చేయూత అందిస్తున్నారు.

''కొందరు ఏడాదికి కొంత మొత్తం, మరికొందరు నెలనెలా కొంత మొత్తాన్ని ఇస్తుంటారు. మాలాగే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లలకు ఈ సాయం ఆసరాగా నిలుస్తుందని మా ఉద్దేశం'' అని సాయిరాం చెప్పారు.

తొమ్మిదో తరగతి నుంచి ఇంజినీరింగ్ పూర్తయ్యే వరకు ట్రస్టు సహకారంతో చదువుకున్న సాయిరాం ప్రస్తుతం యూబీఎస్ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఖాళీ సమయాల్లో వాటర్ ట్యాంకు వద్ద ఉంటూ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు.

''ఆర్థికంగా సాయం చేయడమే కాదు, చాలామంది సాయంత్రం లేదా ఖాళీ సమయాల్లో వచ్చి జూనియర్ విద్యార్థులకు పాఠాలు చెబుతుంటారు. ఇలా ఇక్కడ చదువుకున్నవారు తిరిగి ట్రస్టుకు ఏదో రకంగా సాయం అందిస్తుంటారు'' అని సాయిరాం చెప్పారు.

సాయంగా డబ్బు ఇవ్వాలంటూ తాము ఎవరినీ ఒత్తిడి చేయబోమని, ఇక్కడి సేవలు నచ్చి విరాళాలు ఇస్తేనే తీసుకుంటున్నామని పోతుకూచి శ్రీనివాస్ వివరించారు.

వాటర్ ట్యాంకు వద్దనే కాకుండా మరో 8 ప్రాంతాల్లోని విద్యార్థులకూ తాము సాయం చేస్తున్నామని చెప్పారు పోతుకూచి శ్రీనివాస్.

''శిక్షా సేతు కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో స్కూల్ స్థాయిలో 23 సెంటర్లు ఏర్పాటు చేశాం. బడి అవ్వగానే అక్కడే ఉండి పిల్లలు చదువుకుంటారు. ఇందుకు విద్యా వలంటీరును నియమించాం'' అని చెప్పారు.

తొమ్మిది, పది తరగతులకు చెందిన సుమారు వెయ్యి మంది పిల్లలు ఇలా చదువుకుంటున్నారని చెప్పారు శ్రీనివాస్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)