జౌహార్ యూనివర్శిటీ భవనాల కూల్చివేతపై తాత్కాలిక స్టే, విద్యార్థులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Tariq Khan/BBC
- రచయిత, ప్రేరణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లోని మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్శిటీకి పెద్ద ఊరట లభించింది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని 38 భవనాలను కూల్చివేయాలన్న ప్రతిపాదనపై తాత్కాలిక స్టే విధించారు.
రాంపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ కూడా అయిన మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ ఈ నిషేధాన్ని విధించారు.
స్థానిక జర్నలిస్ట్ ముజస్సిమ్ ఖాన్ బీబీసీతో ఈ విషయాన్ని ధృవీకరించారు. రాంపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉత్తర్వుకు వ్యతిరేకంగా యూనివర్శిటీ యాజమాన్యం అప్పీల్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా తాత్కాలిక స్టే విధించాలని కమిషనర్ నిర్ణయించారు.
ఈ నిర్ణయం గురించి తనకు కూడా సమాచారం అందిందని రాంపూర్ జిల్లా కలెక్టర్ అజయ్ ద్వివేది బీబీసీకి తెలిపారు.
ఆర్డీఏ ఉత్తర్వుకు వ్యతిరేకంగా యూనివర్శిటీ యాజమాన్యం అప్పీల్ చేసిందని, ఆర్డీఏ చైర్మన్‌గా ఉన్న డివిజనల్ కమిషనర్‌కు ఈ విషయంలో అధికార పరిధి ఉన్నందున, స్టే విధించడం చట్టపరమైన ప్రక్రియలో భాగమని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, Tariq Khan/BBC
‘ఆందోళనతో రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు’
విశ్వవిద్యాలయానికి చెందిన 38 భవనాలను కూల్చివేసే కార్యక్రమం ఈ ఉత్తర్వు తర్వాత తాత్కాలికంగా నిలిచిపోయింది. ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్‌కు చెందిన ఇక్రా తల్లిదండ్రులు తమ కుమార్తెను చదివించడానికి మొదట ఇష్టపడలేదు. ఆమె ఎంతో కష్టపడి తల్లిదండ్రులను ఒప్పించారు. అనేక కాలేజీలు, యూనివర్సిటీల గురించి తెలుసుకున్న తర్వాత కుటుంబసభ్యులు చివరకు ఆమెను జౌహర్ విశ్వవిద్యాలయంలో చేర్పించారు.
"ఈ విశ్వవిద్యాలయంలో అంతా సురక్షితంగా ఉంటుందని వారు భావించారు. అందుకే నేనిక్కడ చేరాను. ఇక్కడకు రావడంతో నేను చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు నాకు ఎప్పుడూ భయంగానే ఉంటోంది. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. తర్వాత ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఒకవేళ ఈ విశ్వవిద్యాలయాన్ని కూల్చివేస్తే మా కుటుంబ సభ్యులు నన్ను చదువు మాన్పించి, పెళ్లి చేస్తారేమోనని భయంగా ఉంది" అని ఇక్రా చెప్పారు.
ఇలా భయంతో జీవిస్తోంది ఇక్రా ఒక్కరే కాదు. జౌహర్ విశ్వవిద్యాలయంలో పారామెడికల్ విద్యార్థినులు ఫరా, దిశ, న్యాయశాస్త్ర విద్యార్థిని లాబ్యాతో పాటు ఇతర విద్యార్థినిలు కూడా యూనివర్శిటీని కూల్చివేస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందోనని ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు.

ఫొటో సోర్స్, Tariq Khan/BBC
విద్యార్థుల నిరసన
యూనివర్సిటీకి చెందిన 40 భవనాలలో 38 భవనాలను కూల్చివేస్తామని అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన రోజు నుంచి జౌహర్ యూనివర్శిటీ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం ఇక్కడ 3వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సుమారు 100 మంది బోధనా సిబ్బంది, అంతే సంఖ్యలో బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. విద్యార్థులే కాదు... ఉద్యోగుల్లో కూడా ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ ఉద్యోగాలను కోల్పోతామేమోనని సిబ్బంది భయపడుతున్నారు.
"సిబ్బంది అంతా అశాంతితో, ఆందోళనతో ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. ఒకవేళ యూనివర్శిటీకి ఏమన్నా జరిగితే చాలాకాలం పాటు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళన చెందుతున్నారు" అని యూనివర్శిటి అసిస్టెంట్ పర్చేజ్ ఆఫీసర్ మసూద్-ఉల్-హసన్ చెప్పారు.
అసిస్టెంట్ లైబ్రేరియన్ సనా కూడా తనకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని చెప్పారు.
"మేమందరం ఆందోళన చెందుతున్నాం. సిబ్బంది అందరూ శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. యూనివర్శిటీ గార్డులు, తోటమాలి, ఉపాధ్యాయులు అందరూ అనిశ్చితిలో ఉన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుందనే ఆశ ఉంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
కూల్చివేయాలనే నిర్ణయం ఎందుకు?
జౌహర్ యూనివర్శిటీలోని 40 భవనాల్లో 38 భవనాలు అప్రూవ్డ్ ప్లాన్ లేకుండా నిర్మించారని రాంపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ జూలై 15న పేర్కొంది.
''యూనివర్శిటీ యంత్రాంగం రాబోయే 15 రోజులలోగా ఈ భవనాలను కూల్చివేయాలని లేకపోతే నిర్దేశించిన గడువు తర్వాత అథారిటీయే వాటిని కూల్చివేస్తుంది'' అని హెచ్చరించింది.
ఇది యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయమని, సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతులు పొందిన తర్వాతే ఈ భవనాల్లో వివిధ వృత్తివిద్యా కోర్సులను అందిస్తున్నామని యూనివర్శిటీ యాజమాన్యం చెబుతోంది.
"చట్టపరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాతే ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది. ఇది యూజీసీ గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వ చట్టం పరిధిలో ఉంది. ఆ తర్వాత దీనికి మైనారిటీ విశ్వవిద్యాలయ హోదా మంజూరయింది. అప్పటి నుంచి ఇక్కడ విద్యా కార్యక్రమాలు, ఇతర అకడమిక్ కార్యకలాపాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి" అని యూనివర్శిటీ వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ జహీరుద్దీన్ బీబీసీతో చెప్పారు.
"ఇక్కడ పారామెడికల్, ఫార్మసీ, నర్సింగ్, న్యాయశాస్త్రం వంటి అనేక వృత్తి విద్యా కోర్సులు బోధిస్తారు. ఈ కోర్సులన్నింటికీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నర్సింగ్ కౌన్సిల్ వంటి వాటి నియంత్రణ సంస్థలు ఉన్నాయి. గుర్తింపు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈ సంస్థలు క్యాంపస్‌ను తనిఖీ చేస్తాయి.
భవనాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా? తరగతి గదులు, లేబొరేటరీలు ఎలా ఉన్నాయి? విద్యార్థులకు ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాలను వారు పరిశీలిస్తారు. ఈ ప్రమాణాలన్నింటినీ నెరవేర్చిన తర్వాతే గుర్తింపు మంజూరు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేరుగా భవనాలను కూల్చివేయమని ఆదేశాలు ఎలా ఇవ్వగలరో మాకు అర్థం కావడం లేదు?'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Facebook/Jauhar University
'రాజకీయ కక్ష సాధింపు' ఆరోపణలు
దాదాపు రెండు దశాబ్దాల క్రితం అప్పటి రాంపూర్ ఎమ్మెల్యే అయిన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్ రాంపూర్‌లో మహమ్మద్ జౌహర్ అలీ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. పలు సందర్భాల్లో ఆయన ఈ యూనివర్శిటీని తన కలల ప్రాజెక్టుగా అభివర్ణించారు.
ఇప్పుడు ఈ కూల్చివేత ఉత్తర్వును ఆజం ఖాన్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తున్నారు సమాజ్‌వాదీ పార్టీ నాయకులు.
సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేల బృందం రాంపూర్ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.
" బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిని విడిచిపెడితే జౌహర్ యూనివర్శిటీ నిర్మాణ ప్రణాళికను ఒక్కరోజులోనే ఆమోదించవచ్చు. విద్యార్థులకు, వారి కుటుంబాలకు బీజేపీ అన్యాయం చేస్తోంది'' అని పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ 'ఎక్స్'లో రాశారు.

ఫొటో సోర్స్, Tariq Khan/BBC
ఆజం ఖాన్ భార్య ఏం చెప్పారు?
విశ్వవిద్యాలయం స్థాపించిన గ్రామం 2023 వరకు రాంపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌డీఏ) పరిధిలో లేదని మాజీ ఎంపీ, ఆజం ఖాన్ భార్య తజీన్ ఫాతిమా అంటున్నారు.
"మేం ఎలాంటి తప్పు చేయలేదు. మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై వ్యాఖ్యానించే హక్కు రాంపూర్ డెవలప్‌మెంట్ అథారిటీకి లేదు. యూనివర్శిటీ ఉన్న సింగన్‌ఖేడా గ్రామం 2006లో యూనివర్శిటీకి శంకుస్థాపన జరిగినప్పుడు ఆర్‌డీఏ పరిధిలోనే లేదు" అని ఆమె చెప్పారు.
2005లో ఆర్డీఏ తొలి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు సింగన్‌ఖేడా జాబితాలో లేదు. 2024లో రెండో నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు మాత్రమే ఈ గ్రామం ఆర్డీఏ అధికార పరిధిలోకి వచ్చింది. ఆర్డీఏనే లేనప్పుడు నిర్మాణ ప్రణాళికను ఎవరితో ఆమోదింపజేసుకోవాలి'' అని ఆమె ప్రశ్నించారు.
అయితే ఈ వాదనలతో అధికార యంత్రాంగం ఏకీభవించడం లేదు. రెండు భవనాల ప్రణాళికలకు జిల్లా పంచాయతీ ఆమోదం పొందినట్టే, మిగిలిన భవనాల ప్రణాళికలకు ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నిస్తోంది.
"వారికి నియమ నిబంధనల గురించి పూర్తి అవగాహన ఉందన్నది స్పష్టం. అయినప్పటికీ 38 భవనాల నిర్మాణ ప్రణాళికలకు అనుమతి తీసుకోలేదు. అందుకే ఆర్డీఏ కూల్చివేత ఉత్తర్వులను జారీ చేసింది'' అని రాంపూర్ జిల్లా కలెక్టర్ అజయ్ ద్వివేది తెలిపారు.

ఫొటో సోర్స్, Tariq Khan/BBC
‘కూల్చివేయడానికి బదులు జరిమానా విధించొచ్చు కదా’
కూల్చివేతకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
నిర్మాణ సమయంలో నిబంధనలు ఉల్లంఘన జరిగి ఉంటే చట్ట ప్రకారం జరిమానా విధించడమో లేదా ఇతర చర్యలు తీసుకోవడమో చేయవచ్చని, కానీ యూనివర్శిటీని కూల్చివేయడం వేలమంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు.
ప్రభుత్వం కావాలంటే జరిమానా విధించాలని విద్యార్థులు కూడా కోరుతున్నారని నిరసన చేస్తున్న విద్యార్థుల్లో ఒకరైన సాకిబ్ అంటున్నారు.
'' యూనివర్శిటీ యాజమాన్యం జరిమానా చెల్లించలేకపోతే, విద్యార్థులమైన మేమంతా కలిసి ఆ మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. మా పూర్వ విద్యార్థులు, ఇతరులు విరాళాలు సేకరించి ఈ విశ్వవిద్యాలయాన్ని కాపాడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేం దీనిని కూల్చనివ్వబోం'' అని ఆయన స్పష్టంచేశారు.
కూల్చివేత ఉత్తర్వులకు వ్యతిరేకంగా యూనివర్శిటీ యాజమాన్యం రాంపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌కు న్యాయపరమైన అప్పీలు దాఖలు చేసింది. ఈ కేసు ఆగస్టు 28న విచారణకు రానుంది.
దీనిపై మొరాదాబాద్ డివిజన్ కమిషనర్, రాంపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ కుమార్ సింగ్‌ను సంప్రదించడానికి ప్రయత్నించాంగానీ స్పందించడానికి ఆయన నిరాకరించారు.

ఫొటో సోర్స్, Aunjaneya Kumar Singh/Facebook
ఆంజనేయ కుమార్ సింగ్ - ఆజం ఖాన్
అంజనేయ కుమార్ సింగ్ రాంపూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడే 2019లో ఆజం ఖాన్, జౌహర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన అనేక అంశాల్లో చర్యలు తీసుకున్నారు. పలు కేసులు కూడా నమోదయ్యాయి.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓ వివాదాస్పద ప్రసంగంలో ఆంజనేయ సింగ్‌ను ఆజం ఖాన్ "తన్‌ఖైయా(జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి)" అని సంబోధించారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ అధికారి చేత తన బూట్లు శుభ్రం చేయిస్తానని కూడా ఆయన అన్నట్టు మీడియాలో వచ్చింది. ఈ ప్రసంగం అనంతరం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో పాటు, ఇతర సెక్షన్లను ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు నమోదైంది.
ఈ కేసులో 2026 మేలో రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆజం ఖాన్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షపై అప్పీల్ చేసుకోగా 2026 జూలైలో సెషన్స్ కోర్టు ఆయన అప్పీల్‌ను కొట్టివేసి, దిగువ కోర్టు తీర్పును సమర్థించింది.

ఫొటో సోర్స్, Mujassim Khan
యూనివర్శిటీపై పలు కేసులు
ఇదే సమయంలో జౌహర్ యూనివర్శిటీపై కూడా అనేక కేసులు నమోదయ్యాయి.
యూనివర్శిటీ విస్తరణ కోసం ఎనిమీ ప్రాపర్టీ (భారతదేశంలో 1962, 1965 యుద్ధాల సమయంలో పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాలకు వెళ్లిపోయిన లేదా అక్కడి పౌరులుగా మారిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ అంటారు) ఆక్రమించుకోవడం, రాంపూర్‌లోని చారిత్రక రజా లైబ్రరీ నుంచి పుస్తకాలను దొంగిలించి యూనివర్శిటీ లైబ్రరీలో ఉంచడం, యూనివర్శిటీ ప్రాంగణంలో కృత్రిమ సరస్సు నిర్మాణం కోసం ప్రభుత్వ, రైతు భూములను ఆక్రమించడం, యూనివర్శిటీ విస్తరణ కోసం రైతుల భూములను ఆక్రమించుకోవడం వంటి ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో కొన్నింటిపై కోర్టు స్టే విధించగా, మరికొన్నింటిపై విచారణ ఇంకా కొనసాగుతోంది.
ఆజం ఖాన్ ఆక్రమించినట్లు చెబుతున్న కొన్ని భూములకు చెందిన కొందరు రైతులతో మాట్లాడి, తాజా ఉత్తర్వుపై వారి వైఖరిని తెలుసుకున్నాం.

ఫొటో సోర్స్, Tariq Khan/BBC
‘ఆక్రమణల ఆరోపణలున్నాయని యూనివర్శిటీని కూల్చకూడదు’
"ఆక్రమణ ఆరోపణలు, కేసులు చాలా ఉన్నాయి. భూమి ఇచ్చిన వ్యక్తులెవరైనా తమ భూమికి ఎక్కువ ధర రావాలని ఆశిస్తారు. కానీ అలా జరగలేదు. చాలామంది భూములను తీసుకున్నారు కానీ తగినంత పరిహారం ఇవ్వలేదు" అని యాసిన్ అనే రైతు అన్నారు.
''కానీ ఇప్పుడు విశ్వవిద్యాలయాన్ని కూల్చివేయాలనడం అందరినీ బాధిస్తుంది. ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చాలామంది ఉచితంగా చదువుకుంటున్నారు. ఈ యూనివర్శిటీ లేకపోతే అలీగఢ్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఎన్నో ఇబ్బందులను పడాల్సివచ్చేది. కానీ ఇక్కడ తమ ప్రాంతంలోనే చదువుకునే అవకాశం లభిస్తోంది'' అని ఆయన చెప్పారు.
"రైతులు మాత్రమే కాదు. భారత్‌లోని చదువుకున్నవాళ్లెవరూ ఈ యూనివర్శిటీని కూల్చివేయాలని కోరుకోరు. విద్యాలయాలను నిర్మించాలిగానీ కూల్చకూడదు" అని మరో రైతు దానిశ్ అన్నారు.
2014లో యూనివర్శిటీని తనిఖీ చేసిన యూజీసీ నిపుణుల కమిటీ కూడా రాష్ట్రంలోని ఇతర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే ఈ యూనివర్శిటీ ఫీజులు తక్కువగా ఉన్నాయని, ఇది కేవలం లాభాల కోసమే నడుస్తున్న సంస్థగా కనిపించడం లేదని తన నివేదికలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Tariq Khan/BBC
‘ఫీజులపై ఆందోళన వద్దు’
అక్షీర్ 80శాతం వైకల్యం ఉన్న ఎల్ఎల్ఎం విద్యార్థి. విశ్వవిద్యాలయం తనకు 80శాతం ఫీజు మినహాయింపు ఇచ్చిందని, దానితో తాను కేవలం రూ. 24,000 కే కోర్సును పూర్తి చేస్తున్నానని చెప్పారు.
తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఫీజులు చెల్లించలేకపోయానని మొహమ్మద్ ఇమ్రాన్ చెప్పారు. నిబంధనల ప్రకారం పరీక్షలకు ముందే ఫీజులన్నీ చెల్లించాల్సి ఉన్నా, ఫీజుల గురించి ఆందోళన చెందకుండా పరీక్షలపై దృష్టి పెట్టాలని యూనివర్శిటీ యాజమాన్యం చెప్పిందని ఆయనన్నారు.
ఫీజు మినహాయింపుకు మించి యూనివర్శిటీ తనకు సాయం చేసిందని ల్యాబా అనే విద్యార్థిని చెప్పారు. తన తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ఫీజులు చెల్లించలేకపోయానని ఆమె అన్నారు. యూనివర్శిటీ తన ఫీజును మాఫీ చేయడంతో ఎలాంటి ఆందోళన లేకుండా తన చదువుపై దృష్టి పెట్టగలిగానని చెప్పారు.

ఫొటో సోర్స్, Tariq Khan/BBC
విద్యార్థుల కోసం కౌన్సెలింగ్ కేంద్రాలు
కూల్చివేత ప్రక్రియల మధ్యే విద్యార్థుల కోసం అధికార యంత్రాంగం కౌన్సెలింగ్ సదుపాయం కల్పించింది. ఇకపై విద్యార్థులు తమ చదువులను ఎక్కడ, ఎప్పుడు, ఎలా కొనసాగించవచ్చో వివరించారు.
అయితే ఈ స్థాయి సౌకర్యాలు, వృత్తి విద్యా కోర్సులు అందించే మరో యూనివర్శిటీ దగ్గరలో లేదని విద్యార్థులు, యూనివర్శిటీ యాజమాన్యం చెబుతున్నారు. చుట్టుపక్కల ఎక్కువగా డిగ్రీ కాలేజీలే ఉన్నాయని వారు అంటున్నారు.
యూనివర్శిటీ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఈ కౌన్సెలింగ్ కేంద్రాన్ని కూడా ప్రస్తుతం ఇక్కడి నుంచి తొలగించారు.
అక్షరాస్యత పరంగా రాంపూర్ ఉత్తర ప్రదేశ్‌లోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటి.
మూడు, నాలుగు రోజులుగా ఇక్కడ తిరుగుతూ, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో, అంటే ఈ నిర్ణయం వల్ల ప్రభావితమైన వారు, ప్రభావితం కాని వారు, ఆజం ఖాన్ మద్దతుదారులు లేదా వ్యతిరేకులు... ఇలా అందరితో మాట్లాడాం. ఒక విద్యా సంస్థను కూల్చివేయాలన్న నిర్ణయం ఏమాత్రం సరైనది కాదని, అధికార యంత్రాంగం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలనే అభిప్రాయమే అందరిలో కనిపిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం భవన నిర్మాణ అనుమతుల సమస్య కాదని వారు అంటున్నారు. వేలమంది విద్యార్థుల భవిష్యత్తుకు, వందలమంది ఉద్యోగుల జీవనోపాధికి, తమ పిల్లలు ఇక్కడ చదువుకోవడంపై ఆ కుటుంబాలు పెట్టుకున్న ఆశలకు సంబంధించిన సమస్య ఇది.
ఎంతో కష్టపడి తమ కుటుంబాలను చదువుకోవడానికి ఒప్పించిన అమ్మాయిల సమస్య కూడా. కానీ ఇప్పుడు వారు తమ చదువు అర్ధాంతరంగా ఆగిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























