పాకిస్తాన్‌లో భారత జాతీయ జెండాను, జైహింద్ నినాదాన్ని పోస్టు చేసిన ఇద్దరు వ్యక్తులను ఏం చేశారు?

భారత జెండా, పాకిస్తాన్, సోషల్ మీడియా, నేరం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బిలాల్ అహ్మద్
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న పాకిస్తాన్‌లోని మోహ్మండ్ జిల్లాలో భారత జాతీయ జెండా ఫోటోలను, జైహింద్ నినాదాన్ని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసినందుకు పాకిస్తాన్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

నిందితులపై పాకిస్తాన్ శిక్షా స్మృతిలోని 123ఏ, 153ఏ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్టు బీబీసీ ఉర్దూకు లభించిన ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. ఈసెక్షన్లు దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడం, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంబంధించినవి.

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న కోజ్ గండావో, కటార్‌కాలే ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ సోషల్ మీడియా పేజీల్లో భారత జెండా చిత్రాన్ని, 'జై హింద్' అనే నినాదాన్ని పోస్ట్ చేశారని, ఆ తర్వాత పోలీసులు వారిని అరెస్టు చేశారని మోహ్మండ్ జిల్లాలోని గల్నై ప్రాంత స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) మురద్ ఖాన్ బీబీసీ ఉర్దూతో చెప్పారు.

ఆగస్టు 15న అరెస్ట్ చేసిన వీరిద్దరిని కోర్టులో హాజరుపరచగా కోర్టు వాళ్లను జ్యుడీషియల్ కస్టడీకి పంపిందని ఆయన తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత జెండా, పాకిస్తాన్, సోషల్ మీడియా, నేరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ కేసుల్లో నేరుగా చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు లేదని నిందితుల తరఫు లాయర్లు వాదించారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?

"భారత స్వాతంత్య్ర సందర్భంగా తన ఫేస్‌బుక్ ఖాతాలో 'జై హింద్' అని రాయడంతో పాటు భారత జెండా, ఇతర ఇమేజ్‌లను షేర్ చేశారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు" అని, కోజ్ గండావోలో అరెస్టయిన నిందితునిపై మోపిన ఎఫ్‌ఐఆర్‌లో ఉంది.

నిందితుని చర్య తన దేశమైన పాకిస్తాన్‌కు ద్రోహం చేయడం, ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టడంతో సమానమని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.

రెండో నిందితునిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో కూడా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో భారత జెండా ఫోటోను షేర్ చేశారని, 'జై హింద్' అనే నినాదాన్ని రాశారని ఉంది.

అయితే ఈ కేసుల్లో పెట్టిన సెక్షన్లు వాటికి వర్తించవని న్యాయనిపుణులు చెబుతున్నారు.

పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 123ఏ,153ఏ కింద పోలీసులు కేసులు నమోదు చేశారని సీనియర్ న్యాయవాది షబ్బీర్ హుస్సేన్ గగియానీ బీబీసీతో చెప్పారు.

"ఎవరైనా పాకిస్తాన్ ఏర్పాటును తప్పుపట్టినా, పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదా పాకిస్తాన్‌కు హాని చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించినా అప్పుడు 123ఏ సెక్షన్ వర్తిస్తుంది" అని ఆయన అన్నారు.

"మత, రాజకీయ వర్గాలు లేదా ఇతర సమూహాల మధ్య ద్వేషాన్ని ప్రోత్సహించేలా ఎవరైనా మాట్లాడినప్పుడు లేదా ప్రసంగం చేసినప్పుడు 153ఏ సెక్షన్ వర్తిస్తుంది" అని షబ్బీర్ హుస్సేన్ గగియానీ తెలిపారు.

ఈ రెండు ఎఫ్‌ఐఆర్‌లు తప్పుగా నమోదు చేసినవేనని, వాటికి ఎలాంటి ఆధారం లేదని, వాటిని కొట్టివేయచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత జెండా, పాకిస్తాన్, సోషల్ మీడియా, నేరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

కోర్టులో ఏం జరిగింది?

తన క్లయింట్ బెయిల్ పిటిషన్‌ను అదనపు జిల్లా కోర్టు తిరస్కరించిందని నిందితులలో ఒకరి న్యాయవాది అయిన ముసావర్ బీబీసీతో చెప్పారు. ఇలాంటి కేసులోనే అరెస్టయిన మరో వ్యక్తిని జ్యుడీషియల్ కస్టడీకి పంపిందని తెలిపారు.

సోషల్ మీడియాలో పోస్టులు, షేర్‌లు చేసినందుకు నేరుగా చర్యలు తీసుకునే అధికారం పోలీసుల పరిధిలోది కాదని కేసు విచారణ సమయంలో నిందితుని తరఫు లాయర్ వాదించారు.

ఇలాంటి కేసులు పీఈసీఏ చట్టం కింద నమోదు చేయాలని, ప్రాథమిక దర్యాప్తును జాతీయ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిర్వహించాలని అన్నారు.

ఈ కేసుల్లో పోలీసులు నేరుగా చర్యలు తీసుకున్నారని, పెట్టిన సెక్షన్లు కూడా ఈ కేసులకు వర్తించవని ఆయన వాదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ కేసులో పెట్టిన సెక్షన్లు నాన్ బెయిలబుల్ అని అందువల్ల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నామని కోర్టు తీర్పునిచ్చింది.

ఇప్పుడు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తానని నిందితుని తరఫు న్యాయవాది తెలిపారు.

సోషల్ మీడియా ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశం తన క్లయింట్‌కు లేదని, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌కు శుభాకాంక్షలు చెప్పాలని మాత్రమే భావించారని లాయర్ అన్నారు.

నిందితుని స్నేహితుడు ఒకరు దీనిపై బీబీసీ ఉర్దూతో మాట్లాడారు.

తన స్నేహితుడు ఇటీవలే పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడని ఆయన చెప్పారు.

''ఆయన దేశభక్తి గల పౌరుడు. మన రాజకీయ నాయకులు కూడా ఇతర దేశాలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతారు. వారిపై ఎప్పుడైనా కేసులు పెట్టారా? అలాంటప్పుడు ఒక సాధారణ పౌరుడిపై ఎందుకు కేసు పెట్టాలి?'' అని ఆయన ప్రశ్నించారు.

పాకిస్తాన్ ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఫిబ్రవరిలో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో కూడా నలుగురు విద్యార్థులు ఒక యువజన కార్యక్రమంలో భారత జాతీయ గీతం పాడినందుకు యూనివర్శిటీ నుంచి బహిష్కరించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)