కొలను నుంచి బయటకు వస్తే ఒళ్లంతా మంటలే.. 16 ఏళ్ల బాలుడికి ఏమిటీ వింత అనారోగ్యం?

ఫొటో సోర్స్, ANI
నీటి కొలను నుంచి బయటకు వస్తే ఒళ్లంతా మంటలతో అల్లాడిపోయే 16 ఏళ్ల బాలుడికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ చికిత్స ఇప్పించేందుకు ముందుకొచ్చారు.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌కు చెందిన ఆ బాలుడికి ప్రత్యేకమైన వైద్య పరీక్షలు చేయించేందుకు విమానంలో ముంబయికి తరలించినట్లు ఏఎన్‌ఐ వార్తా కథనం పేర్కొంది.
బెల్డంగ ప్రాంతానికి చెందిన ఇక్బాల్ అనే టీనేజర్ కొద్ది రోజులుగా కొలనులోనే జీవిస్తున్న వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ‘‘నీటి నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే తనకు ఒళ్లంతా మంటలుగా ఉంటుందని, ఏదో అతీత శక్తి ఆవహించి నన్ను నీటిలోనే ఉండమని చెబుతున్నట్లు అనిపిస్తోంది" అని ఆ బాలుడు చెప్పినట్టు ఏఎన్ఐ రిపోర్టు చేసింది.
గంటల కొద్దీ నీటిలోనే గడుపుతున్న బాలుడు అక్కడే తినుబండారాలు తింటున్నట్టుగా కనిపిస్తోన్న ఓ వీడియో ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
ఈ విషయం అనంత్ అంబానీ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన వైద్య బృందాన్ని బాలుడి వద్దకు పంపించి ప్రాథమిక పరీక్షలు చేయించారు. అనంతరం ప్రత్యేక చికిత్స కోసం బాలుడిని విమానంలో ముంబయికి తరలించి సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించినట్టు ఏఎన్ఐ కథనం తెలిపింది.

రాత్రీపగలు నీటిలోనే
ఇక్బాల్ పరిస్థితి చూసి కలత చెందినట్లు స్థానికులు తెలిపారు. అతడు ఎప్పుడూ ఏదో కొలనులో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తేలుతూ కనిపించేవాడని, కొన్నిసార్లు వేర్వేరు కుంటలకు మారుతూ ఉండేవాడని చెప్పారు.
'బాలుడికి స్థానికులు ఆహారం అందించేవారు. నీటిలోనే ఉంటూనే అతను తినేవాడు. చిన్నప్పటి నుంచి బాలుడి గురించి తెలిసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. "తన తోబుట్టువులతో పోలిస్తే అతడు అకస్మాత్తుగా బరువు పెరగడం మొదలుపెట్టాడు. ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్టుంది" అన్నారు. ఎక్కువసేపు నీటిలోనే ఉండటంతో బాలుడు జలుబు, దగ్గు బారిన పడుతూ ఉండేవాడని తెలిపారు'' అని ఎన్డీటీవీ కథనం పేర్కొంది.
బాలుడిని గతంలో ఆసుపత్రిలో చేర్పించినా ఎలాంటి పురోగతి లేదని అతడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం పాటు చికిత్స ఇప్పించే ఆర్థిక స్తోమత లేదని, తమకు సహాయం కావాలని కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘నిరంతరం నీటిలో ఉన్నా సమస్యే..’
అయితే ఇలా దీర్ఘ కాలం పాటు నీటిలో ఉన్నా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల స్కిన్ మెసెరేషన్ ఏర్పడుతుందని చెప్పారు. అంటే చర్మం నానిపోయి, మెత్తబడి, బలహీనమై విచ్ఛిన్నమవుతుంది. క్రమంగా చర్మంలో పగుళ్లు ఏర్పడి, ఇరిటేషన్, ఇన్‌ఫెక్షన్ల బారినపడే ప్రమాదముందని తెలిపారు.
చర్మం నిరంతరం తేమగా ఉంటే ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల బారినపడే ప్రమాదం ఉందని మరో డెర్మటాలజిస్ట్ అన్నారు.
ఇక్బాల్ వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలని, అతను ఎక్కువసేపు కొలనులో ఉండకూడదని సూచించారు.
ఒకవేళ బాలుడికి ఏవైనా నమ్మకాలు, భయాలు ఉంటే సైకాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచించినట్టుగా ఏఎన్ఐ కథనం తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































