గర్భం దాల్చి పిల్లలను పెట్టే మగ సీహార్స్, పిల్లలను నోట్లో దాచిపెట్టే మగ బ్యాంగై కార్డినల్‌ఫిష్.. 2026లో ఆకట్టుకున్న 10 సముద్ర ‘చిత్రాలు’

ఓషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026, సముద్రపు జీవులు
    • రచయిత, ఇసాబెల్ గెరెట్సెన్, మార్తా హెన్రిక్స్, కేథరిన్ లాథమ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఓషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్- 2026 పోటీల్లో.. ఆసక్తిగా చూస్తున్న సీల్స్, సముద్రపు గుర్రాలు, అరుదైన లోతైన సముద్ర జీవుల అద్భుతమైన చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.

(హెచ్చరిక: ఈ కథనంలో ఉన్న ఒక చిత్రం కొంతమంది పాఠకులను కలచివేయవచ్చు)

ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో తీసిన గొప్ప చిత్రాలతో ప్రతి ఏటా ఓషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీలు నిర్వహిస్తారు.

పైన ఉన్న చిత్రంలో, ఫాక్‌లాండ్ దీవుల్లోని సీ లయన్ ఐలాండ్‌లో తొలిసారిగా సముద్రంలోకి అడుగుపెడుతున్న ఒక సదరన్ ఎలిఫెంట్ సీల్ పిల్లను ఫోటోగ్రాఫర్ మాథ్యూ స్మిత్ తన కెమెరాలో బంధించారు.

సముద్రాల అందాలను, అవి ఎదుర్కొంటున్న సవాళ్లను కళ్లకు కట్టే మరో తొమ్మిది అద్భుతమైన చిత్రాలు ఇక్కడ చూడండి.

ఓషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026, సముద్రపు జీవులు
ఫొటో క్యాప్షన్, ఒక మగ సీహార్స్, ఇంకో సీహార్స్ పిల్ల

జూలియన్ అంటోన్ తీసిన పైచిత్రం ఈ పోటీలో విజేతగా నిలిచింది.

ఒక మగ సీహార్స్, దానికి ఎదురుగా ఉన్న చిన్న పిల్ల సీహార్స్‌ను ఇందులో చూడొచ్చు. సీహార్స్‌లలో మగవే గర్భం దాల్చి, పిల్లలకు జన్మనిచ్చి పెంచుతాయి.

ఫ్రెంచ్ పాలినేషియాలోని మూర్యా దీవుల్లో ఈ చిత్రం తీశారు.

ఓషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026, సముద్రపు జీవులు
ఫొటో క్యాప్షన్, భారీ 'సీ బాస్' చేప కంటిలో నివసిస్తున్న సూక్ష్మజీవులు (క్రస్టేషియన్లు).

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా తీరంలో స్టీఫెన్ లోపెజ్ ఈ చిత్రాన్ని కెమెరాలో బంధించారు.

ఇందులో ఒక పెద్ద బ్లాక్ సీ బాస్ చేప కంటిలో కోపెపాడ్స్ అనే సూక్ష్మ పరాన్నజీవులు నివసిస్తున్నాయి.

50 ఏళ్ల క్రితం దాదాపు అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ చేపల సంఖ్య ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది.

ఓషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026, సముద్రపు జీవులు
ఫొటో క్యాప్షన్, లిజార్డ్ ఫిష్‌ను మింగేస్తున్న ఒక స్కార్పియన్‌ఫిష్.

ఫిలిప్పీన్స్‌లో ఆండ్రియా మిచెలుట్టి తీసిన ఈ ఫొటోలో, లిజార్డ్ ఫిష్‌ను ఒక ఎర్రటి స్కార్పియన్‌ఫిష్ పట్టుకోవడం చూడొచ్చు.

పగడపు దిబ్బల్లో జీవన పోరాటాన్ని, ఈ చేప వేటాడే తీరును ఇది కళ్లకు కడుతోంది.

ఓషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026, సముద్రపు జీవులు
ఫొటో క్యాప్షన్, మెక్సికో వార్షిక సార్డిన్ రన్ (సార్డిన్ చేపల వేట) సమయంలో ఎదురైన ఒక ఊహించని దృశ్యం.

మెక్సికోలో 2025లో చేపల వేట సమయంలో, ఫోటోగ్రాఫర్ అనితా వెర్డే ఒక చిన్న కారు సైజులో ఉన్న భారీ సన్‌ఫిష్‌ను కెమెరాలో బంధించారు.

"నీటి అడుగున ఉదయిస్తున్న పెద్ద చంద్రుడిలా అది మెరుస్తూ మా వైపు వచ్చింది. ఆ చేపను అలా చూస్తూ ఉండిపోవాల్సిందే, అంత అద్భుతంగా ఉంది" అని ఆమె బీబీసీకి చెప్పారు.

ఓషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026, సముద్రపు జీవులు
ఫొటో క్యాప్షన్, సాల్ప్‌ల గుంపు మధ్య ఈదుతున్న సముద్రపు రిబ్బన్‌ఫిష్.

జపాన్‌లోని ఒసేజాకి తీరంలో చలికాలంలో మిట్సునా కవాయ్ ఈ చిత్రాన్ని తీశారు.

దాదాపు 900 మీటర్ల లోతులో జీవించే రిబ్బన్‌ఫిష్ పిల్లలు సజీవంగా కనిపించడం చాలా అరుదు.

ఇలాంటివి కేవలం కొన్ని సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి. ఇవి పెద్దయ్యాక 1.8 మీటర్ల వరకు పెరుగుతాయి.

ఓషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026, సముద్రపు జీవులు
ఫొటో క్యాప్షన్, సముద్రగర్భంపైన ఒక క్రమంలో ఈదుకుంటూ వెళ్తున్న మచ్చల ఈగల్ రే చేపలు.

హవాయిలో ఇసుకతో నిండిన సముద్రగర్భంపై ఐదు ఈగల్ రే చేపలు కలిసి ఈదుతున్న దృశ్యాన్ని జాన్ కోవిట్జ్ తన కెమెరాలో బంధించారు.

ఇసుక కింద దాగి ఉన్న ఆహారాన్ని వెతికేందుకు ఇవి తరచూ ఇలా గుంపులుగా ప్రయాణిస్తాయి.

ఓషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026, సముద్రపు జీవులు
ఫొటో క్యాప్షన్, ఒక మగ బ్యాంగై కార్డినల్‌ఫిష్.

ఇండోనేసియాలో సులిమాన్ అలాతికి తీసిన ఈ అద్భుతమైన చిత్రంలో, ఒక మగ బ్యాంగై కార్డినల్‌ఫిష్ కొత్తగా పొదిగిన తన పిల్లలను 10 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా తన నోట్లోనే దాచుకోవడం చూడొచ్చు.

ఇతర చేపల బారిన పడకుండా పిల్లలను రక్షించుకునేందుకు ఇవి ఈ పద్ధతిని పాటిస్తాయి

ఓషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026, సముద్రపు జీవులు
ఫొటో క్యాప్షన్, తేనెతుట్టె లాంటి హ్యాచరీలో వేలాది ఇతర పిల్లలతో కలిసి ఉన్న ఒక చిన్నారి లాబ్‌స్టర్.

ఫ్రాన్సెస్కా పేజ్ తీసిన ఈ చిత్రంలో, యూకేలో ఉన్న నేషనల్ లాబ్‌స్టర్ హ్యాచరీలో పెంచుతున్న వేలాది చిన్నారి లాబ్‌స్టర్లను చూడొచ్చు.

సహజ సిద్ధంగా సముద్రంలో అయితే 20,000 పిల్లల్లో కేవలం ఒక్కటి మాత్రమే పెద్దదవుతుంది. కానీ, ఇలాంటి హ్యాచరీలో పెంచితే అవి బతికే అవకాశాలు 1,000 రెట్లు ఎక్కువగా ఉంటాయి.

పైలట్ వేల్‌, డెన్మార్క్, ఓషన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026, సముద్రపు జీవులు
ఫొటో క్యాప్షన్, ఫారో దీవుల బీచ్‌లో ఒక పైలట్ వేల్‌ను చంపుతున్న దృశ్యం

డెన్మార్క్‌ పరిధిలోని ఫారో దీవుల్లో ఒక వేటగాడు పైలట్ వేల్‌ను చంపుతున్న దృశ్యాన్ని కార్స్టన్ మిచెల్స్ బంధించారు. అక్కడి సంప్రదాయంలో భాగంగా, వేల్స్ గుంపును బీచ్‌లకు తరలించి ఇలా వధిస్తారు.

చిన్నస్థాయిలో జరిగే ఈ తిమింగలాల వేట కూడా సముద్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)