అమెరికా - చైనా - భారత్: బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం మొగ్గు ఎటువైపు?

- రచయిత, తఫ్సీర్ బాబు
- హోదా, బీబీసీ బంగ్లా ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
బంగ్లాదేశ్‌లో తారిఖ్ రెహమాన్ నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధికారంలోకి వచ్చి సుమారు ఒకటిన్నర నెలలు కావొస్తోంది.
ఇదే సమయంలో, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొంది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరి బంగ్లాదేశ్ కూడా ఇంధన సరఫరాను కాపాడుకోవడానికి శ్రమిస్తోంది.
ఈ క్రమంలో, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రికి విదేశీ వ్యవహారాల సలహాదారు హుమాయున్ కబీర్ ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాలలో పర్యటించారు. ఆయా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యుద్ధ పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్న బంగ్లాదేశీ కార్మికుల యోగక్షేమాలను తెలుసుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.
ఈ వారం బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రి భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు.
దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలకు సంబంధించి అమెరికా విదేశాంగ సహాయ మంత్రి ఎస్ పాల్ కపూర్ ఇప్పటికే బంగ్లాదేశ్‌లో పర్యటించారు. మొత్తమ్మీద, విదేశీ సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు, మరోవైపు ఇరాన్ యుద్ధంతో బంగ్లాదేశ్ ఒక క్లిష్ట దశను ఎదుర్కొంటోంది.


ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ ఎటువైపు?
అవామీ లీగ్ 16 ఏళ్ల పాలనలో, బంగ్లాదేశ్ ప్రధానంగా భారత్‌కు సన్నిహిత దేశంగా ఉంది. హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వ హయాంలో ఇరుదేశాల సంబంధాలు వేగంగా క్షీణించాయి. అయితే, అదే సమయంలో అమెరికాతో బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఇప్పుడు బీఎన్‌పీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, ఈ కొత్త ప్రభుత్వ విదేశాంగ విధానం ఏ దేశం వైపు మొగ్గు చూపుతోంది, భారత్, చైనా లేదా అమెరికా? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం.
అయితే, ప్రభుత్వ విదేశాంగ విధానం ఏదో ఒక నిర్దిష్ట దేశంపై ఆధారపడి లేదని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి షమా ఒబైద్ ఇస్లాం బీబీసీ బంగ్లాతో అన్నారు.
"బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడటమే కొత్త ప్రభుత్వ ప్రాధాన్యం. అన్ని దేశాలతో మెరుగైన సంబంధాలను కొనసాగించడమే మా విధానం. బంగ్లాదేశ్ ప్రయోజనాలను కాపాడుకుంటూనే మా ద్వైపాక్షిక, బహుళపక్ష సంబంధాలు నిర్ణయమవుతాయి. మా విదేశాంగ విధానంలో బంగ్లాదేశ్ ప్రయోజనాలకే అగ్రపీఠం. ఇది ఏ ఒక్క నిర్దిష్ట దేశాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినది కాదు" అన్నారు.
అమెరికా అనుకూల విధానం
విదేశాంగ విధానం విషయంలో అన్ని దేశాలతో మెరుగైన సంబంధాలు ఉంటాయని బంగ్లాదేశ్ చెబుతున్నప్పటికీ, ఇరాన్ యుద్ధం ఆ దేశానికి మొదటి పెద్ద పరీక్ష కానుంది.
బంగ్లాదేశ్ తన మొదటి ప్రకటనలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను విమర్శించింది. ఇది మధ్యప్రాచ్యంలోని పలు దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని ప్రకటన పేర్కొంది.
అయితే, ఇరాన్‌పై అమెరికా దాడిని ప్రస్తావించకపోవడంతో విమర్శలు వచ్చాయి. దీంతో, బంగ్లాదేశ్ మరో ప్రకటనను విడుదల చేసింది. అయితే, ఈ రెండో ప్రకటనపై ఇరాన్ నుంచి ప్రతికూల స్పందన వచ్చింది.
గత బుధవారం బంగ్లాదేశ్‌లో ఇరాన్ రాయబారి జలీల్ రహీమీ జహాన్ బాదీ మాట్లాడుతూ, ఇరాన్ విషయంలో బంగ్లాదేశ్ ప్రకటన మరింత స్పష్టంగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌పై దాడికి పాల్పడిన శక్తులను బంగ్లాదేశ్ ఖండిస్తుందని తెహ్రాన్ ఆశించిందని తెలిపారు.
ఇరాన్ యుద్ధంపై వెలువడిన ప్రకటనలతో పాటు, తాత్కాలిక ప్రభుత్వ హయాంలో అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో.. విదేశాంగ విధానంలో అమెరికా వైపు బంగ్లాదేశ్ మొగ్గు చూపుతోందా? వంటి ప్రశ్నలను పలువురు లేవనెత్తుతున్నారు. అయితే, తారిఖ్ ప్రభుత్వం వీటిని తోసిపుచ్చింది.
బంగ్లాదేశ్ తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందని విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ ఇప్పటికే పలు మీడియా సమావేశాల్లో పునరుద్ఘాటించారు.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
బంగ్లాదేశ్ విదేశాంగ విధానం ఏదైనా ఒక నిర్దిష్ట దేశం వైపు మొగ్గు చూపిందని చెప్పడం తొందరపాటే అవుతుందని అమెరికాలో బంగ్లాదేశ్ రాయబారిగా పనిచేసిన ఎం.హుమాయున్ కబీర్ అభిప్రాయపడ్డారు.
"మొదటి ప్రకటనలో మనం గల్ఫ్ ప్రాంతంపైనే ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఇరాన్‌పై జరిగిన దాడి గురించి అందులో ప్రస్తావించలేదు. కానీ, మరుసటి రోజు ప్రభుత్వం విడుదల చేసిన మరో ప్రకటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మృతికి సంతాపం వ్యక్తం చేసింది. అంటే ప్రభుత్వం తన ప్రకటనను బ్యాలెన్స్ చేసుకుంది. ఇది కొత్త ప్రభుత్వం, కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వారికి మరికొంత సమయం ఇవ్వాలి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పొరుగుదేశాలతో బంధం
కేవలం అమెరికానే కాదు.. గతంలో భారత్, చైనా, రష్యాల ప్రయోజనాల విషయంలోనూ బంగ్లాదేశ్ సందిగ్ధతను ఎదుర్కొంది. కొన్నిసందర్భాల్లో ఈ దేశాల పాత్ర బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపింది.
ప్రభుత్వం ఈ విషయంలో సమతుల్యత పాటిస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఒక దేశానికి చెందిన ప్రాజెక్ట్ మరొక దేశం అసంతృప్తికి కారణం కావడం తరచుగా చూస్తున్నాం. భారత్, చైనా విషయానికి వస్తే తీస్తా ప్రాజెక్టును ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
ఢాకా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ డాక్టర్ లైలుఫర్ యాస్మిన్ అభిప్రాయం ప్రకారం, చైనా - భారత్ సంబంధాల విషయంలో తీస్తా ప్రాజెక్టు బంగ్లాదేశ్‌కు ఒక 'లిట్మస్ టెస్ట్' లాంటిది. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడం బంగ్లాదేశ్‌కు అంత సులభం కాదు.
అందుకే తీస్తా ప్రాజెక్టుపై ఏళ్ల తరబడి చర్చలు జరుగుతున్నా, ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. అవామీ లీగ్ మాదిరిగానే, తాత్కాలిక ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయింది.
అయితే, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్చల ద్వారా అన్నిపక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తే, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి వీలవుతుందని డాక్టర్ యాస్మిన్ అభిప్రాయపడ్డారు.
"చాలా విషయాల్లో ప్రయోజనాల మధ్య ఘర్షణ ఉంటుంది. కానీ, ఏదైనా అంశంపై బంగ్లాదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే విమర్శలు తగ్గుతాయి. అలా జరగని పక్షంలో, ఏదైనా ప్రాజెక్టును ఒక నిర్దిష్ట దేశానికి అప్పగించడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే అనుమానాలు తలెత్తుతాయి. ఇది విదేశాంగ విధానాన్ని పార్టీ - ఆధారితంగా మార్చేస్తుంది. దీనివల్లే ఒకసారి చైనా అనుకూలం అని, మరోసారి భారత్ లేదా అమెరికా అనుకూలమని ఆరోపణలు వస్తుంటాయి. దీన్నుంచి బయటపడాలి" అని యాస్మిన్ అన్నారు.
ఇదిలా ఉండగా, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బంగ్లాదేశ్ అదనపు డీజిల్ కోసం భారత్‌ను అభ్యర్థించింది, అలాగే అమెరికాతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తారిఖ్ రెహమాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పంపిన లేఖను పరిశీలిస్తే.. అమెరికా ఈ సంబంధాన్ని తన 'ఇండో-పసిఫిక్' వ్యూహంతో జోడించాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఆ లేఖలో స్పష్టంగా 'ఇండో-పసిఫిక్' గురించి ప్రస్తావించారు.
అయితే, ఈ విషయంలో చైనా ఆందోళన చెందుతోంది.
దీంతో, అమెరికా ప్రయోజనాలను కాపాడే క్రమంలో చైనా పెట్టుబడులకు ఎలాంటి ఆటంకం కలగకుండా బంగ్లాదేశ్ జాగ్రత్తపడాలని యాస్మిన్ సూచించారు. ఎందుకంటే, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు చైనా పెట్టుబడులు, నిధుల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ విషయంపై అమెరికాలో బంగ్లాదేశ్ మాజీ రాయబారి ఎం.హుమాయున్ కబీర్ స్పందిస్తూ.. గతంలో ఏదో ఒక దేశం వైపు మొగ్గు చూపడంతో బంగ్లాదేశ్ భారీ మూల్యాన్ని చెల్లించుకుందని, అటువంటి తప్పును మళ్లీ పునరావృతం చేయలేమని చెప్పారు.
"భద్రతను దృష్టిలో ఉంచుకుని మేం భారత్‌తో కలిసి పనిచేయాలి. భారత్ కూడా మాతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, రెండు దేశాల మధ్య సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. ఇది కాకుండా, బంగ్లాదేశ్ సుమారు 50 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తోందని గుర్తుంచుకోవాలి. కానీ, వీటికి అవసరమైన ముడి సరుకు చైనా, భారత్ నుంచి వస్తుంది" అని ఆయన అన్నారు.
"అన్ని ప్రయోజనాలు ఒక గొలుసుకట్టులా ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఒకరిని విస్మరించి మరొకరితో సంబంధాలను కొనసాగించలేం. ఏదైనా ఒక దేశం పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తే సంక్లిష్టతలు తలెత్తుతాయి" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'అసంతృప్తి ముఖ్యం కాదు'
వివిధ దేశాలతో పరస్పర ప్రయోజనాల విషయంలో బంగ్లాదేశ్ భవిష్యత్తు విధానం ఎలా ఉండబోతోంది?
ఈ ప్రశ్నకు షమా ఒబైద్ స్పందిస్తూ.. "బంగ్లాదేశ్ ప్రయోజనాలకు ఏది మంచిదో అదే చేస్తాం. ఈ విషయంలో ఎవరు అసంతృప్తికి గురవుతారనేది ముఖ్యం కాదు" అని స్పష్టం చేశారు.
"భారత్, బంగ్లాదేశ్ మధ్య తీస్తా ప్రాజెక్టుతో పాటు నీటి పంపకాలు, వాణిజ్య లోటు, సరిహద్దు సమస్యలున్నాయి. పరస్పర చర్చల ద్వారానే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటాం. అదేవిధంగా చైనా, అమెరికాతో కూడా సమానమైన విధాన ప్రాతిపదికన సంబంధాలు ఉంటాయి. ఏ విధానం వల్ల ఎవరు అసంతృప్తి చెందుతారనే దానికంటే, బంగ్లాదేశ్ ప్రజలు దేనివల్ల సంతోషిస్తారు, వారి ప్రయోజనాలకు ఏది మేలు చేస్తుందనేదే ముఖ్యం. బంగ్లాదేశ్ ప్రయోజనాలను నిర్ధరించుకున్న తర్వాతే, ఏ దేశానికి ఏ అంశంపై ఆసక్తి ఉందో మేం పరిశీలిస్తాం. మొదట మా దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో మేం నిర్ణయించుకోవాలి" అన్నారు షమా ఒబైద్.
దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత అని, బంగ్లాదేశ్ తన విదేశాంగ విధానం ద్వారా స్పష్టం చేసింది. అయితే, ఇక్కడ సమస్య ఏమిటంటే..
శక్తిమంతమైన దేశాలు కూడా ముందుగా తమ ప్రయోజనాలనే కాపాడుకోవాలని భావిస్తాయి. దీనికోసం అవి రకరకాలుగా ఒత్తిడి తీసుకువస్తాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడమే ఇప్పుడు బంగ్లాదేశ్ విదేశాంగ విధానానికి అతిపెద్ద సవాల్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































