పశ్చిమ బెంగాల్: ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల మంది తొలగింపు ఎందుకు వివాదమైంది?

బెంగాల్, సర్, నిరసన

ఫొటో సోర్స్, Samir Jana/Hindustan Times via Getty Images

    • రచయిత, మొయురీ సోమ్
    • హోదా, కోల్‌కతా
  • చదివే సమయం: 6 నిమిషాలు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) తర్వాత.. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల మంది ఓటర్లను తొలగించారు. అక్టోబర్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఉన్న మొత్తం 7.66 కోట్ల ఓటర్లలో ఇది దాదాపు 12 శాతం.

ఓటర్ల జాబితా నుంచి తొలగించిన దాదాపు 91 లక్షల ఓటర్లలో.. ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల జాబితా ప్రచురించినప్పుడు రద్దు చేసిన 63 లక్షల మందికిపైగా వ్యక్తులు కూడా ఉన్నారు.

ఈ ఓటర్లను "గైర్హాజరు, వేరే చోటుకి వెళ్లిన, మరణించిన లేదా నకిలీ" ఓటర్లుగా గుర్తించారు.

అదనంగా 60.06 లక్షల మంది ఓటర్లను "పరిశీలనలో ఉన్న''(ఎడ్జుడికేషన్) ఓటర్ల కింద ఉంచారు.

పేరులో అక్షరదోషాలు, లింగ నమోదులో తప్పిదాలు, తల్లిదండ్రులు లేదా తాతముత్తాలతో పోలిస్తే వయసులో అసాధారణమైన వ్యత్యాసం వంటి తార్కిక దోషాలు (లాజికల్ డిస్క్రిపెన్సీస్) ఉన్న ఓటర్లు ఈ కేటగిరీలో ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా 'పరిశీలనలో ఉన్న' ప్రతి ఒక్క ఓటర్ అర్హతను ధ్రువీకరించే బాధ్యతను సుమారు 700 మంది న్యాయ అధికారులకు అప్పజెప్పారు.

ఈ 60 లక్షల మంది ఓటర్లలో.. 27 లక్షల మందికి పైగా ఓటర్లు (45 శాతం) అర్హులు కాదని ఎన్నికల సంఘం సోమవారం పేర్కొంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది.

వాస్తవానికి, ఏప్రిల్ 23న పోలింగ్ జరగనున్న 152 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం సోమవారమే ఖరారు చేసింది.

ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనున్న మిగిలిన 142 సీట్ల జాబితాను ఏప్రిల్ 9న ఖరారు చేయనుంది.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఇప్పటికే ఎస్ఐఆర్ ఒక కీలకమైన ఎన్నికల అంశంగా మారింది.

ఈ సమయంలో 90 లక్షల మంది ఓటర్లను తొలగించడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లైంది.

ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్లు, బెంగాల్

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR/AFP via Getty Images

ఎస్ఐఆర్ వివాదంలో పశ్చిమ బెంగాల్ ఎందుకు కేంద్రబిందువైంది?

ఎస్ఐఆర్ ప్రక్రియ మొదట, గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేపట్టారు.

ఆ తర్వాత దీనిని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తూ వెళ్లారు.

నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో.. 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియను చేపట్టారు.

అయితే, దీనిపై పశ్చిమ బెంగాల్‌లో జరిగినంత వివాదం మరే రాష్ట్రంలోనూ జరగలేదు.

ఒకవైపు, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. బంగ్లాదేశ్, మియన్మార్ వంటి పొరుగు దేశాల నుంచి వచ్చి రాష్ట్ర ఓటర్ల జాబితాలోకి ఎక్కిన లక్షల మంది "విదేశీ చొరబాటుదారులను" ఏరివేయడానికి ఈ ప్రక్రియ అవసరమని పదేపదే చెబుతోంది.

అదే సమయంలో, మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి గట్టి మద్దతుగా నిలిచే ముస్లిం ఓటర్లను తొలగించడమే ఈ ప్రక్రియ లక్ష్యంగా చేసుకుందని అధికారిక తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.

మమతా బెనర్జీ, బీజేపీ నేత అర్జున్ సింగ్ తమ వాదనలను మంగళవారం కూడా పునరుద్ఘాటించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న విభేదాలే ఎస్ఐఆర్ ఒక వివాదాస్పద అంశంగా మారడానికి కీలక కారణమని కోల్‌కతాకు చెందిన రాజకీయ విశ్లేషకులు సుభమోయ్ మైత్రా బీబీసీతో అన్నారు.

ఈ విషయం కోర్టులకు చేరడంతో.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య "విశ్వాసం లేకపోవడం", "కొనసాగుతున్న ఈ వివాదాన్ని" భారత ప్రధాన న్యాయమూర్తి స్వయంగా పరిశీలించి, ఈ ప్రక్రియను పూర్తి చేసే బాధ్యతను న్యాయాధికారులకు బదిలీ చేశారు.

బెంగాల్, ముస్లిం ఓటర్లు, సర్ ప్రక్రియ, మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images

బెంగాల్ ఎస్ఐఆర్‌లో వివాదాస్పద అంశాలున్నాయా?

దీనికి సంక్షిప్తంగా సమాధానమేంటంటే.. అవును, కాదు.

ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను ప్రచురించినప్పుడు, పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల్లో తొలగించిన ఓటర్లు సుమారు 8 శాతంగా ఉన్నారు.

ఈ విడత పోలింగ్‌కు వెళ్తున్న మరో అతిపెద్ద రాష్ట్రం తమిళనాడులో కూడా 74 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఈ సంఖ్య కూడా పశ్చిమ బెంగాల్‌‌తో పోల్చదగినదే.

ఓటర్ల జాబితా నుంచి ''విదేశీయులను'' తొలగించారా? అనే దానిపై కూడా ఎలాంటి ప్రత్యేక డేటాను ఎన్నికల సంఘం విడుదల చేయలేదు.

కానీ, వివాదానికి కారణం హెడ్‌లైన్లలో కనిపించే సంఖ్యలో కాదు, ఆ నివేదికల్లోని వివరాల్లో ఉంది.

మొదటగా, లక్షలాది మంది ఓటర్లను 'పరిశీలనలో' ఉంచిన ''తార్కిక దోషాల(లాజికల్ డిస్క్రిపెన్సీస్)' కేటగిరీని ఎస్‌ఐఆర్‌కు సంబంధించి జారీ చేసిన తొలి ఉత్తర్వుల్లో ఎన్నికల సంఘం ఎక్కడా పేర్కొనలేదని రాజకీయ పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు.

పశ్చిమ బెంగాల్‌కు ముందు ఏ రాష్ట్రంలోనూ దీన్ని అమల్లోకి తీసుకురాలేదని చెప్పారు.

ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రారంభ మార్గదర్శకాల ప్రకారం.. ఎస్ఐఆర్ చివరిసారి నిర్వహించినప్పుడు, అంటే 2002 నాటి రాష్ట్ర ఓటర్ల జాబితాలో ఉన్న ఓటరు తమను తాము లేదా తమ తల్లిదండ్రుల గుర్తింపు ద్వారా నిర్ధరించగలిగితే ఆ ఓటరును అర్హుడిగా గుర్తిస్తామని తెలిపింది.

అయితే, ఆ తర్వాత ''పోల్చుకోదగిన'' ఓటర్ల జాబితాలో పలు ''తార్కిక దోషాలు'' ఉన్నాయని ఎన్నికల సంఘం ఎత్తిచూపింది.

''పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కేవలం బిహార్‌తోనే కాదు.. దేశంలో ఇతర ప్రాంతాల్లో జరిగిన ఏ ఎస్ఐఆర్‌తో పోల్చినా భిన్నమైనది'' అని రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్ బీబీసీతో అన్నారు.

''బెంగాల్ ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య పెద్ద సంఖ్యలో పెరిగిపోయిందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్రం వెలుపల నుంచి పెద్ద సంఖ్యలో అధికారులను నియమించింది. బెంగాల్‌లో ప్రత్యేకత ఏంటంటే.. ఈ 60 లక్షల మంది ఓటర్ల కోసం ప్రత్యేక పరిశీలన'' అని తెలిపారు.

అంతేకాక, కోల్‌కతాకు చెందిన థింక్ ట్యాంక్ సబర్ ఇన్‌స్టిట్యూట్ చేసిన విశ్లేషణలో.. మాల్డా, ముర్షీదాబాద్ వంటి ముస్లింలు అత్యధికంగా ఉండే జిల్లాల్లో ఓటర్ల తొలగింపు అసమానంగా అధికంగా ఉందని తేలింది.

ఎడ్జుకేషన్ కింద ఉంచిన తర్వాత సోమవారం ఓటర్లను అనర్హులుగా ప్రకటించిన జాబితాలో ముర్షీదాబాద్ టాప్‌లో ఉంది. ఆ తర్వాత నార్త్ 24 పరగణాలు, మాల్డా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

ఎస్ఐఆర్ ప్రక్రియ ముస్లింలోని తమ మద్దతుదారులను అన్యాయంగా లక్ష్యంగా చేసుకుందని తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణకు ప్రస్తుతం ఎన్నికల సంఘం విడుదల చేసిన ఈ జాబితా మరింత అగ్గిరాజేసింది.

గత నెలలో కోల్‌కతాలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కొన్ని కమ్యూనిటీలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారనే భావనపై ఎన్నికల ప్రధాన అధికారిని బీబీసీ ప్రశ్నించింది.

దీనిపై స్పందించిన జ్ఞానేష్ కుమార్, ''సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. మేం అనుబంధ జాబితాలను విడుదల చేస్తాం. ఆమోదిత జాబితాలు కూడా వెబ్‌సైట్‌లో, దశల వారీగా అందుబాటులోకి వస్తాయి'' అని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 2న జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత షమిక్ భట్టాచార్య, తమ పార్టీకి ''భారతీయ ముస్లింల'' పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే '''పశ్చిమ బెంగాల్, పశ్చిమ బంగ్లాదేశ్‌గా మారకుండా'' చూసుకోవడంపై మాత్రం తాము దృఢంగా ఉన్నామని అన్నారు.

ముర్షీదాబాద్ జిల్లా, ఓటర్లు, ఎస్ఐఆర్, బెంగాల్

ఫొటో సోర్స్, Subham Dutta

తొలగించిన ఓటర్లకున్న మార్గాలేంటి?

సోమవారం ''అనర్హులు''గా పేర్కొన్న ఓటర్లను సాంకేతికంగా ఓటర్ల జాబితా నుంచి ఇంకా తొలగించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ఓటర్ల అర్హతపై నిర్ణయం తీసుకునేందుకు వారి అప్పీళ్లను, అభ్యంతరాలను వినేందుకు 19 మంది అప్పీలేట్ ట్రిబ్యునల్స్‌ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

పోలింగ్‌కు సరిగ్గా నెల ముందు మార్చి చివరిలోనే ఈ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేసింది.

రాబోయే ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను ఖరారు చేయడానికి కొన్ని గంటల ముందు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఓటర్లు తమ అప్పీళ్లను రిజిస్టర్ చేసేందుకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసుల ముందు బారులుదీరారు.

అయితే, రాబోయే ఎన్నికల ఓటర్ల జాబితా ఏప్రిల్ 9 నాటికి ఖరారు కానున్నందున, 91 లక్షల మంది ఓటర్లు తమ అర్హతను నిరూపించుకుని, ఓటు వేసేందుకు దాదాపుగా ఎలాంటి అవకాశం లేదు.

అయినప్పటికీ తమ అర్హతను నిరూపించుకుంటే, తదుపరి ఎన్నికల్లో ఓటు వేయడానికి వారికి అనుమతి లభిస్తుంది.

తొలగింపునకు గురైన ఓటర్లు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోలేరు. ఎందుకంటే, మార్చి 31తోనే ఈ డెడ్‌లైన్ ముగిసింది.

అనర్హులుగా ప్రకటించిన ఓటర్లలో కోపం, నిరాశ వ్యక్తమవుతున్నాయి.

''2002లోని ఓటర్ల జాబితాలో నా పేరులో అక్షర దోషం వల్ల పరిశీలనలో ఉంచారు'' అని కోల్‌కతాలోని అలియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సైఫుల్లా బీబీసీకి తెలిపారు.

''సవరించిన నా పేరుతో ఎన్నో ఏళ్లుగా ఓటు వేశాను. ఇక్కడ నేనేమీ తప్పు చేయలేదు. మా అమ్మ, సోదరుడికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అమ్మ ఏడుస్తుంటే, ఏం చేయాలో తెలీలేదు'' అని చెప్పారు.

సోమవారం ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఈ ప్రక్రియ రాజ్యాంగ ఉల్లంఘనగా ఓ ఓటరు అభివర్ణించారు.

''నా పేరు తొలగించారు'' అని తెలిపారు. ''ట్రిబ్యునల్‌కు నేను అప్పీల్ చేయను. నా కేసును నేను హైకోర్టులో, సుప్రీంకోర్టులో పోరాడతాను. రాబోయే ఈ ఎన్నికల్లో కూడా 'తొలగించిన ఓటర్ల' జాబితాలో నా పేరు ఉన్నా నేను న్యాయం కోసం పోరాడతాను'' అని తెలిపారు.

''అనర్హులను తొలగించే ప్రక్రియలో భాగంగా ఎన్నికల జాబితా నుంచి చాలా మంది అర్హులైన ఓటర్లను తొలగించే అవకాశం ఉంది'' అని రాజకీయ విశ్లేషకులు సుభమోయ్ మైత్రా తెలిపారు.

ఈ ప్రక్రియలో సమాజంలో పేద, బలహీనమైన వర్గాలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డాయని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)