తుకారాం ముండే: పోలియో సోకిన సోదరుడిని భుజాలపై మోసుకుని స్కూలుకు వెళ్లేవారు.. 21 ఏళ్లలో 25సార్లు ట్రాన్స్‌ఫర్.. ఎవరీ ఐఏఎస్ ఆఫీసర్

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
- రచయిత, నితిన్ సుల్తానే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
"మీరొక అలవాటు మార్చుకోవాలనుకుంటే ముందు పాత అలవాటును వదిలి పెట్టి కొత్త అలవాటు చేసుకోవాలి. ఇది చాలా గందరగోళంగా ఉంటుంది. వ్యతిరేకత, ఘర్షణ ఉంటాయి"
తుకారాం ముండే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇది. ఈ వ్యాఖ్యలకు ఆయన వర్కింగ్ స్టైల్ సరిగ్గా సరిపోతుంది.
బహుశా అందుకే కావచ్చు. ఆయన 21 ఏళ్ల సర్వీస్‌లో 25 ట్రాన్స్‌ఫర్లు ఉన్నాయి. ప్రతి ట్రాన్స్‌ఫర్ మార్పు తీసుకురావడానికి లభించే కొత్త అవకాశం అనేది ఆయన అభిప్రాయం.
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, కల్తీ, రసాయనాలు కలిపిన, నకిలీ, చట్టవిరుద్ధమైన రంగులను ఉపయోగించే ఆహార ఉత్పత్తిదారులు, వ్యాపారులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
ఆయన చర్యలు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ చర్చనీయంగా మారాయి. నాసిరకం చీజ్‌పై ఆయన తీసుకున్న చర్య, అనలాగ్ చీజ్‌పై ఏడాది నిషేధం విధించడంతో ఆయన వార్తల్లో నిలిచారు.

కల్తీ ఆహారం విషయంలో ఆయన కఠిన చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఆయన ఇంతకు ముందు పని చేసిన డిపార్ట్‌మెంట్లలోనూ ఇలాగే వ్యవహరించారు. ఆయనకు తరచుగా బదిలీలు కావడానికి ఇదే కారణం అనే చర్చ ఉంది.
గవర్నమెంట్ ఉద్యోగంలో ట్రాన్స్‌ఫర్లు భాగమని, వాటి గురించి ఆలోచించనని, తన పని తాను చేస్తుంటానని ఆయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
బీడ్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ప్రారంభమైన ఆయన ప్రయాణం ప్రస్తుతం మహారాష్ట్రలోని పాపులర్ అధికారులలో ఒకరిగా నిలిపింది.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
తుకారాం ముండే ఎవరు?
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ కమిషనర్‌గా పని చేస్తున్నారు.
మహారాష్ట్రలో అత్యంత చర్చనీయంగా మారిన అధికారులలో ఒకరు. ఆయన పనితీరు తరచుగా మీడియాలో హెడ్‌లైన్స్‌లో కనిపిస్తోంది.
బీడ్‌లోని టాడ్సోన్నా గ్రామానికి చెందిన ముండేది వ్యవసాయ కుటుంబం. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమిస్తూ ఆయన సివిల్స్ రాసి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు కొన్ని సందర్భాల్లో ఆయనతో కలిసి పని చేసే సహచరులు కూడా ఆయన పనితీరుపై ఫిర్యాదు చేస్తుంటారు.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
పని ఒత్తిడి గురించి ఫిర్యాదులు
తుకారాం ముండే పనితీరుపై ఉద్యోగులు చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొత్త చోట బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన మొదట ఉద్యోగుల క్రమశిక్షణపై దృష్టి పెడతారు. విధి నిర్వహణలో సమయపాలనకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.
ఆయన ఎఫ్‌డీఏ కమిషనర్ అయిన తర్వాత ఛత్రపతి శంభాజీనగర్‌లోని కొంతమంది ఉద్యోగులు ఆయనపై ఫిర్యాదు చేశారు.
తమను రెండు షిఫ్టులలో పనిచేయమని బలవంతం చేస్తున్నారని శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా పనిచేయమని ఆదేశిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. కొన్ని పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆ భారం కూడా తమపై పడుతోందని వారు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా పని చేయాలని ఎవరినీ బలవంతం చేయలేదని తుకారాం ఏబీపీ మాఝాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. గతంలో జరగని పనులను నిబంధనలకు అనుగుణంగా తిరిగి ప్రారంభించారు.
ల్యాబ్‌లలో ఇప్పటికే షిఫ్ట్ విధానం ఉందని ఎవరినీ రోజుకు ఎనిమిది గంటలకు మించి పని చేయించరని ఆయన చెప్పారు.
"వారానికి 48 గంటలకు మించి పని చేయడానికి అనుమతి లేదు. కానీ అందరూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పని చేయాలనుకుంటే అది సాధ్యం కాదు" అని తుకారాం ముండే అన్నారు.

ఫొటో సోర్స్, facebook/ShriTukaramMundhe
పని చేయనందుకు 660 మంది ఉద్యోగులకు నోటీసులు
సోలాపూర్‌లో మొదటి పోస్టింగ్
ఇండియన్ అడ్మినిష్ట్రేటివ్ సర్వీస్‌లో శిక్షణ తర్వాత ఆయనకు సోలాపూర్‌లో సహాయ అసిస్టెంట్ కలెక్టర్‌గా జాయిన్ అయ్యారు.
అక్కడ ఆయన తీసుకున్న మొదటి నిర్ణయమే వివాదాన్ని రేకెత్తించింది ఆ తర్వాత ఆక్రమణల తొలగింపు ప్రచారంపై పెద్ద వివాదం చెలరేగింది.
సోలాపూర్‌లో ఆయన అసిస్టెంట్ కలెక్టర్, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వంటి పదవుల్లో పని చేశారు.
నాగ్‌పూర్‌లో తొలి టర్మ్
2008లో ఆయన నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
ఉపాధ్యాయులు సమయానికి స్కూలుకు రావడాన్ని తప్పనిసరి చేశారు. యూనిఫామ్ కోడ్‌ను అమలు చేశారు.
టీచర్లు ఉదయం 10 గంటలకు స్కూలుకు రాకపోతే ఐదు నిమిషాల తర్వాత పాఠశాల తలుపులు మూసేస్తామని ప్రకటించారు.
ఈ నిర్ణయంపై టీచర్లు నిరసన చేపట్టారు. అయినప్పటికీ ఆయన పదవీకాలంలో జిల్లా మండలి ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందింది.
ఆ తర్వాత వాషిమ్ జిల్లా మండలి సీఈవోగా ఉన్నప్పుడు ఆయన విలేజ్ సర్వెంట్ యూనియన్ లీడర్ ఒకరిని సస్పెండ్ చేశారు. ఈ వివాదం ముదిరి ఆ నాయకుడు తుకారాం ముండేపై పేపర్ వెయిట్ విసిరేంత వరకు వెళ్లింది.

ఫొటో సోర్స్, NMC FACEBOOK
పుణే మహానగర్ పరివాహన్ మహా మండల్ లిమిటెడ్ సీఈఓ
పుణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్‌లో ఆయనకు పోస్టింగ్ వచ్చింది. అక్కడ కూడా ఆయనపై అనేక వివాదాలు తలెత్తాయి.
పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయనపై విమర్శలు, ప్రశంసలు వచ్చాయి.
ఒక సందర్భంలో ఆయన 660 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీస్ జారీ చేయడం వివాదాస్పదంగా మారింది.
నాగ్‌పూర్‌లో పోస్టింగ్
మహా వికాస్ అఘాడి ప్రభుత్వ హయాంలో ఆయన నాగ్‌పూర్ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ప్రారంభం నుంచే నాగ్‌పూర్ మేయర్ సందీప్ జోషి, తుకారాం ముండే మధ్య విభేదాలు తలెత్తాయి.
కరోనా కాలంలో ఆయన పనితీరుపై చర్చ జరిగింది.
అతను ఎవరి మాటలలు లెక్క చేసేవారు కాదని స్థానిక ప్రతినిధులు ఆరోపించారు. అన్ని నిర్ణయాలను సంబంధిత వ్యక్తులకు తెలియజేశామని ముండే చెప్పారు.
వికలాంగుల సంక్షేమ శాఖలో ఆయన పనితీరుపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అక్కడ ఆయన 9 నెలలే పని చేశారు. ఆ తర్వాత ఎఫ్‌డిఎ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యారు.
నవీ ముంబైలో అవిశ్వాస తీర్మానం
నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్నప్పుడు అధికార పార్టీ ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ తీర్మానం మెజారిటీతో ఆమోదం పొందింది.
దీని తరువాత, ప్రజలు ఆయనకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు.

ఫొటో సోర్స్, facebook/ShriTukaramMundhe
మనం చేసే పని వల్ల ప్రజలు ప్రయోజనం పొందాలి
తుకారాం ముండే బదిలీ అనంతరం బీబీసీ కొందరు మాజీ అధికారులతో మాట్లాడింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పోస్టులోనైనా కనీసం రెండు సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉండాలని మాజీ పరిపాలనా అధికారి ఖోబ్రగడే అన్నారు.
అధికారులు ప్రచారానికి దూరంగా నిశ్శబ్దంగా తమ పని చేసుకోవాలని ఆయన సూచించారు. అదే సమయంలో అధికారులు మంచి పనులు చేస్తుంటే ప్రభుత్వం వారికి అండగా నిలవాలన్నారు.
ఒక అధికారిని కేవలం వివాదాల ఆధారంగానే అంచనా వేయకూడదని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి మహేష్ ఝగ్డే చెప్పారు.
అధికారి తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూరిందో కూడా చూడాలని ఆయన అన్నారు.
తుకారాం ముండే వేగంగా పనిచేసే అధికారి అని రాజకీయ విశ్లేషకుడు రవి కిరణ్ దేశ్‌ముఖ్ చెప్పారు.
"ఆయన పనితీరు ప్రభుత్వాలకు తరచుగా నచ్చదు. ఆయన వెళ్ళిన ప్రతిచోటా మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఇది విభేదాలకు, బదిలీలకు దారితీస్తుంది" అని రవికిరణ్ దేశ్‌ముఖ్ అన్నారు.
తుకారాం ముండే పనితీరు ప్రజాభిప్రాయం కంటే చట్టంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఆయన చేసే ప్రతి పనిలోనూ నియమాలకు, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తారని సీనియర్ జర్నలిస్ట్ రాజా మానే చెప్పారు.
తాను నిబంధనలకు అనుగుణంగా పని చేస్తానని.. ప్రజాభిప్రాయం కంటే నిజాయితీతో పన చేయడం ముఖ్యమని ముండే అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రచారం కోసం పనిచేశారని తనపై వచ్చిన ఆరోపణల మీద స్పందిస్తు అధికారులకు ప్రచారం అవసరం లేదని చెప్పారు.

ఫొటో సోర్స్, @MahaDGIPR
పోరాడితేనే విజయం
తుకారాం ముండే జీవితం గురించి షఫీ పఠాన్ తుకారాం అనే పుస్తకంలో రాశారు
తుకారాం ముండే జన్మించిన బీడ్ జిల్లా కరవు పీడిత ప్రాంతం.
వ్యవసాయ సంక్షోభం, ఇతర కారణాల వల్ల అక్కడి అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. అందులో ఆయన కుటుంబం కూడా ఉంది.
కష్టపడటం, పోరాడటం తుకారం ముండేకి చిన్నతనం నుంచే అలవాటైంది. చదువుకోవడంతో పాటు ఆయన పొలాల్లో పని చేశారు.
మూడో తరగతిలోనే పొలం దున్నడం వంటి పనులు చేశారని తుకారాం పుస్తకంలో రాశారు.
అతని అన్నయ్య అశోక్ ముండే అధికారి అయ్యాడు. అన్నయ్య నుంచి తుకారాం స్ఫూర్తి పొందారు.
ఆయన మరో సోదరుడైన బాబాసాహెబ్‌కు పోలియో సోకింది. తుకారాం ఆయన్ని భుజాలపై మోసుకుని పాఠశాలకు తీసుకువెళ్లి జాగ్రత్తగా చూసుకునేవారు.
తుకారాం ముండే చదువుకోవడానికి ఔరంగాబాద్ వెళతానంటే ఆయన తండ్రి వ్యతిరేకించారు. అయితే తుకారం అన్న అశోక్ ఆయన్ని తనతో పాటు తీసుకెళ్లారు.
తుకారం ఔరంగాబాద్‌లోనే స్కూల్, కాలేజ్ విద్య పూర్తి చేశారుయ
అనంతరం పుణె, ముంబై, దిల్లీలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ పరీక్షలకు శిక్షణ తీసుకున్నారు.
ఎన్నో కష్టాల తర్వాత 2005లో ఆయన యూపీఎస్సీలో ఆలిండియా 20వ ర్యాంక్ సాధించారు.
"స్వలాభం కోసమే అనుకుంటే మీరు పబ్లిక్ సర్వీస్‌లోకి రావద్దు. ప్రజల కోసం, నైతిక విలువలతో పని చేయాలనుకుంటేనే ఇందులోకి రండి" భవిష్యత్‌లో పబ్లిక్ సర్వీస్‌లోకి రావాలనుకుంటున్న విద్యార్ధులకు తుకారాం ముండే ఇచ్చిన సలహా ఇది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































