‘సోదరుడి కుమారుడి చేతిలో హత్యకు గురైన’ సౌదీ అరేబియా రాజు షా ఫైసల్ కథ

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 7 నిమిషాలు

అమెరికా విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి హెన్రీ కిసింజర్ రాసిన తన ఆత్మకథ 'ఇయర్స్ ఆఫ్ రెన్యూవల్'లో.. '' షా ఫైసల్ అత్యంత తెలివైన రాజకీయ నాయకుల్లో ఒకరు. భూస్వామ్య వ్యవస్థను ఒక సాధనంగా ఉపయోగించి, తన దేశాన్ని ఎన్నో సంక్షోభాల నుంచి గట్టెక్కించారు. ఆయనంటే నాకు ఎంతో గౌరవం, అభిమానం'' అని పేర్కొన్నారు.

ఫైసల్ హత్యకు గురి కావడానికి సరిగ్గా వారం ముందు.. రియాద్‌లోని తన ప్యాలస్‌లో ఆయనతో కలిసి కిసింజర్ పుదీనా టీ తాగారు.

69 ఏళ్ల వయసులో కింగ్ ఫైసల్ హత్యకు గురైనప్పుడు, సౌదీ అరేబియాలోని చమురు సంపదతో ఆయన ప్రపంచంలో అత్యంత సంపన్నులలో ఒకరిగా ఉండటమే కాకుండా.. అరబ్ దేశాలలో సంప్రదాయవాదానికి అత్యంత బలమైన గొంతుకగా కూడా ఉన్నారు.

షా ఫైసల్ జీవిత చరిత్ర 'కింగ్ ఫైసల్ : ఏ లైఫ్'లో జేమ్స్ ఎడ్మండ్స్ పేర్కొన్న వివరాల్లో.. ''సంపద, అధికారం ఉన్నప్పటికీ.. ఫైసల్ చాలా నిరాడంబరమైన జీవితాన్ని ఇష్టపడేవారు. ఖురాన్ బోధనలను అనుసరించి, ఒక సంప్రదాయ అరబ్ గిరిజనుడిలా ఆయన జీవించారు'' అని పేర్కొన్నారు.

''ఆయన పొగ తాగేవారు కాదు, మద్యం తాగలేదు. రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు చేసేవారు. ప్రజల గురించే ఎప్పుడూ ఆలోచించేవారు. ఆధునిక కాలంలోనూ ప్రతి వారం ఆయన ప్రజలతో సమావేశాలు నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగించారు'' అని రాశారు.

24 ఏళ్ల వయసులోనే విదేశాంగ మంత్రి

షా ఫైసల్‌ది దయ, కఠినత్వంతో కలగలిసిన వ్యక్తిత్వం.

''మీకోసం ఎంతో చేసిన వారిని ఎందుకు పొగడరు? అని కింగ్ ఫైసల్ సహాయకుడు ఒకసారి అడిగారు'' అని 'ఫైసల్: సౌదీ అరేబియా రాజు' అనే పుస్తకంలో జెరాల్డ్ డి గోరీ రాశారు.

"ఇది వారి విధి" అని షా సూటిగా సమాధానమిచ్చారు.

''అరబ్ విలువలకు షా ఫైసల్ ఎల్లవేళలా కట్టుబడి ఉన్నారు'' అని గోరి పేర్కొన్నారు. ''బయట ప్రభావాలు తన దేశాన్ని పాడుచేయకుండా ఆయన తన శాయశక్తులా ప్రయత్నించారు'' అని రాశారు.

సౌదీ కుటుంబం 150 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించింది. కానీ, 1891లో బలమైన తెగల ద్వారా సౌదీ కుటుంబం అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 1901లో ఇబ్న్ సౌద్‌గా పేరొందిన ఫైసల్ తండ్రి వేరే దేశం పారిపోయి, అక్కడ్నుంచి తిరిగి అధికారం పొందేందుకు ప్రయత్నించడం ప్రారంభించారు.

చివరికి, 45 వేలమంది బెడూయిన్ గిరిజనులు జోర్డాన్ రాజు ముత్తాత షరీఫ్ హుస్సేన్‌ను ఓడించి, మక్కాను స్వాధీనం చేసుకున్నారు. ఇబ్న్ సౌద్‌కు 36 మంది కొడుకులు. అయినా.. ఆయనెప్పుడూ ఫైసల్‌కే అనుకూలంగా ఉండేవారు.

ఇందుకు కారణం ఫైసల్‌కు ఎల్లప్పుడూ ఒక రకమైన పోరాట స్ఫూర్తి, తన తండ్రి ఆదేశాలను పాటించాలనే తపన ఉండటమే.

ఇబ్న్ సౌద్ ఒకసారి తన కుమారుడైన ఫైసల్ గురించి చెబుతూ.. "నాకు ఫైసల్ లాంటి మరో ముగ్గురు కుమారులు ఉంటే బాగుండేది" అని అన్నారు.

సౌద్ పలుసార్లు దౌత్య పనులపై ఫైసల్‌ను విదేశాలకు పంపారు. ఆ తర్వాత 24 ఏళ్ల వయసులోనే ఆయన్ను విదేశాంగ మంత్రిగా నియమించారు.

భక్తి ఎక్కువ, చమత్కారి కూడా..

చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఫైసల్ ఎలాంటి అధికారిక విద్యను పొందలేదు. కానీ, ఆయనకు ఖురాన్‌లోని ప్రతి పదం కంఠోపాఠం. అలాగే, తుపాకీ, కత్తిని ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకున్నారు.

''ఫైసల్ ఎంతో భక్తిపరుడు. ఆయన ఆరోగ్యం అంత బాగుండేది కాదు. ఆయన కడుపులో అల్సర్లతో బాధపడేవారు. అందుకే, రాత్రిపూట నిద్రపోవడం కష్టంగా ఉండేది. ఆయన చాలా సౌమ్యుడు. ఎవరిపైనా అరిచేవారు కాదు, తప్పుగా ఏమీ అనేవారు కాదు. ఆయనకు ఏదైనా నచ్చకపోతే.. ఏమీ అనకుండా ముఖం పక్కకు తిప్పేసేవారు'' అని జెఫ్రీ రాబిన్‌సన్ తన పుస్తకంలో రాశారు.

బయటికి కఠినంగా కనిపించినా.. వ్యక్తిగత జీవితంలో చాలా చమత్కారి.

''ఇంగ్లీష్ మాట్లాడలేకపోయినా.. తన అనువాదకుడు ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటే, సరిచేసేంత ఇంగ్లిష్ ఆయనకు వచ్చేది. ప్రపంచమంతా ఆయన ప్రయాణించినప్పటికీ.. సొంత దేశంలోనే అత్యంత సౌకర్యవంతంగా భావించేవారు'' రాబిన్‌సన్ రాశారు.

1964లో సౌదీ అరేబియా రాజు అయ్యారు

ఇబ్న్ సౌద్ 1953లో మరణించారు. ఆయన కుమారుడు సౌద్, సౌదీ అరేబియా రాజు అయ్యారు. ఫైసల్ క్రౌన్ ప్రిన్స్‌గా (యువరాజుగా) నియమితులయ్యారు.

సౌద్ రాజు దుబారా ఖర్చులు విపరీతంగా పెట్టారు. ఫలితంగా, 1964 నాటికి దేశం భారీ మొత్తంలో విదేశీ రుణాన్ని మూటకట్టుకుంది.

అప్పుడు సౌదీ రాజ కుటుంబం ఆయన్ను దేశం నుంచి బలవంతంగా బయటికి పంపించింది. ఫైసల్ కొత్త రాజుగా నియమితులయ్యారు. సౌద్ మొదట బేరూత్‌కు, ఆ తర్వాత కైరోకు, ఆపై ఏథెన్స్‌కు వెళ్లి అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.

ఫైసల్ తన సోదరుడి అప్పులన్నింటినీ త్వరగా చెల్లించి.. సౌదీ అరేబియాలోని అమెరికా చమురు కార్యకలాపాల నుంచి వచ్చిన రాయల్టీలతో తన పౌరుల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపర్చారు.

''సౌదీ పౌరులు ఫైసల్ అధికారంలో ఉచితంగా వైద్య సంరక్షణను, విద్యను పొందారు. ఆయన ఎనిమిది మంది కొడుకులను అమెరికా, బ్రిటన్‌లోని కాలేజీల్లో చదువుకునేందుకు పంపించారు. చదువులు పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత కొడుకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు'' అని జేమ్స్ ఎడ్మండ్స్ రాశారు.

సంప్రదాయవాద పండితుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ బానిసత్వ విధానాన్ని రద్దు చేశారు కింగ్ ఫైసల్.

"బాలికల కోసం స్కూళ్లు తెరిచారు, దేశంలో టీవీని ప్రవేశపెట్టారు" అని ఎడ్మండ్స్ రాశారు.

"కానీ, అదే సమయంలో షరియా చట్టం ప్రకారం ఆయన దేశాన్ని పాలించారు. వ్యభిచారం, మద్యపానంపై కఠినమైన శిక్షలు విధించారు. బహిరంగంగా మరణశిక్షలు అమలు చేయడం కొనసాగించారు" అని ఎడ్మండ్స్ పేర్కొన్నారు.

ఈజిప్ట్‌కు చెందిన నాసెర్ నుంచి పోటీ

ఈజిప్ట్, ఇరాక్, లిబియాలలో రాచరిక వ్యవస్థలు కూలదోసినప్పుడు, అరబ్ ప్రపంచ రాజకీయ నాయకత్వంపై కింగ్ ఫైసల్ పెట్టుకున్న ఆశలకు ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాసెర్ నుంచి పెద్ద సవాలు ఎదురైంది.

''మిలటరీ తిరుగుబాటులో యెమెన్‌కు చెందిన ఇమామ్ బదర్‌ను పదవి నుంచి దించేశారు. కొత్త పాలనకు మద్దతుగా ఈజిప్ట్ నుంచి బలగాలను పంపించారు నాసెర్. యెమెన్‌లో రాచరిక అనుకూల శక్తులను ఫైసల్ ప్రోత్సహించారు. చివరికి, ఇమామ్ బదర్ తన అధికారాన్ని ఉపసహరించుకున్నారు. తిరుగుబాటుదారులు గెలిచారు. కానీ, నాసెర్ భారీ మొత్తంలో సైన్యాన్ని కోల్పోయారు. ఈ యుద్ధం వల్ల ఈజిప్ట్ దివాళా తీయాల్సిన పరిస్థితి నెలకొంది'' అని గెరాల్డ్ డె గోరీ రాశారు.

కానీ, 1967 నాటి ఆరు రోజుల అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత, ఈజిప్ట్, ఇతర సరిహద్దు దేశాలకు సహాయాన్ని కొనసాగించాలని ఖార్టూమ్ సమావేశంలో నిర్ణయించడంతో ఫైసల్ పాత్ర పూర్తిగా మారిపోయింది.

ఇజ్రాయెల్‌తో పోరాడుతున్న అరబ్ దేశాలకు భారీ ఆర్థిక సహాయం అందించేందుకు షా ఫైసల్ చొరవ తీసుకున్నారు.

ఇజ్రాయెల్ పట్ల ఆయనకు ద్వేషం పెరిగింది. తీవ్రవాదాన్ని బహిరంగంగా వ్యతిరేకించినప్పటికీ, ఆయన యాసెర్ అరాఫత్‌కు, పాలస్తీనా విమోచన సంస్థకు పూర్తి మద్దతు ఇచ్చారు.

1973 యోమ్ కిప్పూర్ యుద్ధం తర్వాత, అమెరికాకు చమురు ఎగుమతులను కింగ్ ఫైసల్ రద్దు చేశారు. చమురును ఒక ఆయుధంగా వాడారు. తర్వాత.. ఇతర అరబ్ దేశాలు కూడా చమురును అమెరికాకు పంపడం ఆపేశాయి.

1973లో ఇజ్రాయెల్‌పై ఈజిప్ట్ దాడి గురించి కింగ్ ఫైసల్‌కు తెలుసు. 1973 ఆగస్టులో సౌదీ అరేబియాను అన్వర్ సదాత్ సందర్శించినప్పుడు, రాజుతో సుదీర్ఘంగా ఏకాంతంగా మాట్లాడారు.

జెఫ్రీ రాబిన్‌సన్ తన పుస్తకం 'యెమెనీ, ది ఇన్‌సైడ్ స్టోరీ'లో రాసిన వివరాల్లో.. ''ఆ పర్యటనలో తనతో పాటు ఉన్న సౌదీ అరేబియా ప్లానింగ్ మినిస్టర్ హిషామ్ నజెక్‌తో అన్వర్ సదాత్ మాట్లాడుతూ.. 'ఫైసల్‌ను కలిసిన తర్వాత, భుజాల మీద నుంచి ఒక భారం దిగిపోయినట్లు ఎప్పుడూ అనిపిస్తుంది' అన్నారు'' అని పేర్కొన్నారు.

1974లో టైమ్ మ్యాగజీన్ ఫైసల్‌ను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌'గా ప్రకటించింది.

''ఫైసల్ వ్యక్తిగత జీవితం తన సొంత ప్రజల కంటే కూడా చాలా సాధారణంగా ఉండేది. ఆయనెప్పుడూ విలాసాలను ఇష్టపడలేదు. రాజు అయిన తర్వాత కూడా, జెడ్డాలోని తన సోదరుడి హమ్రా ప్యాలస్ తనకు చాలా లగ్జరీగా ఉందని అన్నారు. అతిథుల కోసం దాన్ని వాడాలని ఆదేశించారు'' అని 1975 జనవరి 6 నాటి ఇష్యూలో టైమ్ మ్యాగజీన్ రాసింది.

''ఫైసల్ ఆహారం చాలా చప్పగా ఉండేది. ఆయనకు అల్సర్ల వల్ల అనేక ఆపరేషన్లు జరగడంతో, ఆహారంలో ఎక్కువగా అన్నమే తినేవారు. రోజుకు 16 గంటలు పనిచేసే వారు. అందువల్ల వ్యక్తిగత జీవితానికి సమయం ఉండేది కాదు'' అని పేర్కొంది.

సోదరుడి కుమారుడు మూడు సార్లు కాల్పులు జరిపాడు

1975 మార్చి 25న కువైట్ చమురు మంత్రి అబ్దుల్ ముతలేబ్ కజిమీ, రియాద్‌లో ఉన్నారు. ఉదయం 10:30 గంటలకు కింగ్ ఫైసల్‌ను కలవడానికి ఆయనను, ఆయన పరివారాన్ని తీసుకెళ్లే బాధ్యతను సౌదీ అరేబియా చమురు శాఖ మంత్రి అహ్మద్ జాకీ యమానీకి అప్పజెప్పారు. సరిగ్గా ఉదయం 10:25 గంటలకు కింగ్ ఫైసల్ తన బాడీగార్డులు ఒకరితో కలిసి గదిలోకి వచ్చారు.

కువైట్ చమురు మంత్రి కజిమీని రాయల్ చీఫ్ ఆఫ్ ప్రొటోకాల్ వద్ద వదిలిపెట్టి, కింగ్ ఫైసల్‌తో ఏకాంతంగా మాట్లాడటానికి వెళ్లారు యమానీ. సరిగ్గా అప్పుడే, గది తలుపు తెరుచుకుంది. కువైట్ అతిథిని చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ ఆ గదిలోకి తీసుకు వచ్చారు.

కజిమీని షా ఫైసల్ ఆహ్వానించారు. అప్పుడే, షా ఫైసల్ సోదరుడి కుమారుడు ఫైసల్ ఇబ్న్ ముసైద్ ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు.

జెఫ్రీ రాబిన్‌సన్ 'యెమెనీ, ది ఇన్‌సైడ్ స్టోరీ' అనే పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ''షా, కజిమీ వద్దకు రెండు అడుగుల దూరంలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ తర్వాత తన దుస్తుల్లోంచి .38 బోర్ పిస్టల్ తీశారు. షా ఫైసల్‌పై కాల్పులు జరపడం ప్రారంభించారు'' అని రాశారు.

''సరిగ్గా ఉదయం 10:32 గంటలు. ఆయన మూడుసార్లు కాల్పులు జరిపారు. షా ఫైసల్ కింద పడిపోయారు. షా బాడీగార్డు కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారు. ఆయన చేయి షా ఫైసల్ మణికట్టుపై ఉండటంతో, ఆయన పిస్టల్ పైకప్పు వైపు గురిపెట్టి ఉంది. ఆయన పిస్టల్ నుంచి మరో తూటా పేలి, అది పైకప్పుకు తగిలింది'' అని పేర్కొన్నారు.

మరింత మంది బాడీగార్డులు ఆయన వద్దకు వచ్చి, హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ షా ఫైసల్ చుట్టుముట్టారు. ఆయన కార్పెట్‌పై పడిపోయి ఉన్నారు. ఆయన తల నుంచి రక్తం కారుతుంది. వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి, షా ఫైసల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొంత సమయం తర్వాత, షా ఫైసల్ కన్నుమూశారని రియాద్ రేడియో ప్రకటించింది.

తొలుత రిపోర్టులు హంతకుడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని రాశాయి.

కింగ్ ఫైసల్ మరణించిన తర్వాత.. క్రౌన్ ప్రిన్స్ ఖలీద్ సౌదీ అరేబియాకు కొత్త రాజు అయ్యారు. ఇంటీరియల్ మంత్రిగా ఉన్న ఫహద్ కొత్త యువరాజుగా నియమితులయ్యారు.

కొత్త రాజు స్వయంగా ముసైద్‌ను విచారించారు. రాజు మరణాంతరం న్యూయార్క్ టైమ్స్.. ముసైద్ స్నేహితుడిని ఉటంకిస్తూ.. ‘‘సౌదీ అరేబియా పురోగతికి తన కుటుంబం అడ్డంకిగా ఉందని ముసైద్ తరచూ చెప్పేవారు. సౌదీ రాజ కుటుంబం కేవలం అమెరికా చమురు ప్రయోజనాల కోసమే ఆసక్తి చూపుతోందని నాతో చాలాసార్లు అన్నారు’’ అని రాసింది.

ఆ తర్వాత వేల మంది ప్రజల సమక్షంలో ముసైద్‌కు మరణ శిక్ష విధించారు.

కింగ్ ఫైసల్ తమ్ముడు, రియాద్ గవర్నర్ అయిన ప్రిన్స్ సల్మాన్ సమక్షంలో ఉరిశిక్షను అమలు చేశారు. రాజకుటుంబంలో ఈ ఉరిశిక్షను ప్రత్యక్షంగా చూసింది ఈయన ఒక్కరే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)