దిశా సాలియన్: ‘‘డ్రగ్స్ తీసుకునే కొంతమంది పవర్‌ఫుల్ వ్యక్తుల గురించి తెలుసు కాబట్టే ఆమెను అత్యాచారం చేసి చంపేశారు’’ అంటున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ తండ్రి, ఇంకా ఆయన ఏం చెప్పారు?

దిశా సాలియన్, సీబీఐ, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి, బాంబే హైకోర్టు
ఫొటో క్యాప్షన్, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్‌గా దిశా సాలియన్ పని చేశారు.
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

అది 2020 జూన్ 4. భారత్‌లో కోవిడ్-19 ఉధృతి తీవ్రంగా ఉన్న రోజులవి.

పోలీస్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి తాను చేయబోయే ప్రయాణం సురక్షితమేనా అని తెలుసుకోవాలని దిశా సాలియన్ తన తండ్రిని కోరారు. దిశ ఒక సెలబ్రిటీ మేనేజర్.

ఒక యాడ్ షూటింగ్‌ కోసం బయలుదేరిన ఆమె, తాను నటించబోయే ఆ యాడ్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు.

ఆ యాడ్‌లో నటించేందుకు ఇచ్చిన అడ్వాన్స్ రెమ్యునరేషన్‌ చెక్కు ఫోటోను తన తల్లిదండ్రులకు చూపించారు.

రెండు రోజుల్లో తిరిగి వస్తానని ఇంటి నుంచి బయలుదేరుతూ తన తల్లిదండ్రులకు చెప్పారామె. సాలియన్ దంపతులు తమ 28 ఏళ్ల కూతురును సజీవంగా చూడటం అదే చివరిసారి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జూన్ 8, 9 మధ్య రాత్రి.. సతీశ్ సాలియన్‌ను పోలీసులు ఒక ఆసుపత్రికి పిలిపించారు.

అక్కడే ఆయనకు తన ఏకైక కుమార్తె మరణించిందనే విషయం తెలిసింది. ముంబైలోని ఒక భవనం 12వ అంతస్తు నుండి ఆమె కింద పడిపోయారని పోలీసులు తెలిపారు.

ఆసుపత్రిలో ఉన్న దిశా స్నేహితులు ఆమె మద్యం సేవించిందని ప్రమాదవశాత్తూ కింద పడిపోయిందని చెప్పారు. ఆ తర్వాత ఆమె మరణం ఆత్మహత్యేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు అంతటితో అయిపోయింది.

Skip ఎక్కువమంది చదివినవి and continue reading
ఎక్కువమంది చదివినవి

End of ఎక్కువమంది చదివినవి

దిశా సాలియన్, సీబీఐ, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి, బాంబే హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిశా సాలియన్ మరణంపై దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది.

పోలీసుల తీరుపై హైకోర్టు అసంతృప్తి

కానీ ఈ నెల ప్రారంభంలో బాంబే హైకోర్టు ఈ కేసును తిరిగి తెరిచింది. దిశా మరణంపై మళ్లీ దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.

ఆత్మహత్య లేదా ప్రమాదం కారణంగా తన కుమార్తె చనిపోలేదనీ, ఆమెను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారని మొదటి నుంచి వాదిస్తున్న సతీశ్ సాలియన్ గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ ఉత్తర్వు ఇచ్చింది.

కొంతమంది సీనియర్ పోలీసు అధికారులు ఆధారాలను నాశనం చేశారని ఆయన ఆరోపించారు. ఈ నేరంలో పాలుపంచుకున్న కొందరు మంత్రులు, రాజకీయ నాయకులను రక్షించడానికి ఆత్మహత్య అనే తప్పుడు కథనాన్ని సృష్టించారని ఆయన చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

సెప్టెంబర్ 2 నాటి ఉత్తర్వుల్లో న్యాయమూర్తులు సారంగ్ వి.కొత్వాల్, రంజిత్‌సిన్హా రాజా భోంస్లే పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు.

ఆరేళ్లకు పైగా రెండు దశల్లో సాగిన వారి దర్యాప్తులో "ఎన్నో స్పష్టమైన వ్యత్యాసాలు" ఉన్నాయని పేర్కొన్నారు.

ఇక్కడ తాము "మినీ ట్రయల్" నిర్వహించడం లేదని స్పష్టం చేస్తూనే "పోలీసుల దర్యాప్తు సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలను లేవనెత్తుతోంది" అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

పోలీసు పేపర్‌వర్క్‌లో తీవ్రమైన జాప్యం జరిగిందని మృతదేహం పడిన ప్రదేశంలో రక్తం కనపడలేదని, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో పేర్కొన్న గాయాలు పైనుంచి పడటం వల్ల తగిలిన వాటిలా లేవని న్యాయమూర్తులు ఆక్షేపించారు.

"దీనిని అంగీకరించడం మాకు కష్టంగా ఉంది" అని కోర్టు పేర్కొంది.

పోలీసులు దీనిని కేవలం అనుమానాస్పద లేదా అసహజ మరణంగా మాత్రమే దర్యాప్తు చేశారని ఒక నేరం జరిగినట్లు సమాచారం వచ్చినప్పుడు సిద్ధం చేయాల్సిన ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

దిశా సాలియన్, సీబీఐ, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి, బాంబే హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిశా తండ్రి సతీశ్ సాలియన్ (మధ్యలో) తన కూతురికి న్యాయం చేయాలని ఆరేళ్లుగా పోరాడుతున్నారు.

"గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు"

సతీశ్ సాలియన్ చేసిన ఆరోపణలు ప్రస్తుతానికి కేవలం ఆరోపణలు మాత్రమే అయినప్పటికీ సీబీఐ తాజా దర్యాప్తుకు అవి ప్రాతిపదికగా మారాయి.

ఆయన ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా గతవారం సీబీఐ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్‌తో పాటు ఈ కేసులో కోర్టు ఉత్తర్వులను బీబీసీ పరిశీలించింది.

సతీశ్ సాలియన్ కోర్టుకు చెప్పినదాని ప్రకారం, మరణానికి ముందు దిశా సాలియన్ 'క్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్' అనే సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు రిప్రజెంటిటివ్‌గా వ్యవహరించారు.

"కొందరు శక్తివంతులైన వ్యక్తుల అభ్యంతకర కార్యకలాపాల గురించి ఆమెకు తెలిసింది. ఆమె ఆ సమాచారాన్ని రాజ్‌పుత్‌తో పంచుకున్నారు. ఆయన దానిని అమాయకంగా ఇతరులకు చెప్పారు. చివరకు ఆ సమాచారం ఆ శక్తివంతులైన వ్యక్తులకే చేరింది. దీంతో ఆమె నోరు నొక్కడానికి ఆమెను హత్య చేశారు" అని అందులో పేర్కొన్నారు.

రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె మరణానికి సంతాపం తెలిపారు. "ఇది విషాదకరమైన వార్త. దిశా కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. మీ ఆత్మకు శాంతి చేకూరాలి" అని ఆయన రాశారు.

ప్రారంభ రోజుల్లో దిశా మరణం పెద్దగా ఎవరి దృష్టిని ఆకర్షించలేదు.

కానీ ఆమె చనిపోయిన వారం రోజుల లోపే రాజ్‌పుత్ కూడా తన ఇంట్లో మరణించి కనిపించారు.

ఆయనకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని దానికి చికిత్స పొందుతున్నారని చెబుతూ పోలీసులు ఆయన మరణాన్ని కూడా ఆత్మహత్యగా తేల్చారు.

కానీ కొన్ని వారాల తర్వాత, రాజ్‌పుత్ తండ్రి ఆరోపణల ఆధారంగా ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. తన కుమారుడికి ఎలాంటి మానసిక ఆరోగ్య సమస్యలు లేవని సుశాంత్ తండ్రి స్పష్టం చేశారు.

తీవ్ర నిరసనల అనంతరం, సుశాంత్ కేసును కూడా సీబీఐకి అప్పగించారు. అయితే గత ఏడాది సీబీఐ ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ, ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఇందులో రియా చక్రవర్తికి లేదా ఆమె కుటుంబానికి ఎలాంటి పాత్రా లేదని పేర్కొంది.

దిశా, రాజ్‌పుత్ మరణాలకు సంబంధం ఉందని సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో సతీశ్ సాలియన్ ఆరోపించారు.

ఒక మాజీ మంత్రి మరికొందరికి సంబంధించిన "డ్రగ్స్ రవాణా, చిన్నారులపై లైంగిక వేధింపులు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన పక్కా ఆధారాలు, ఆక్షేపణీయ సమాచారాన్ని" తన కుమార్తె రాజ్‌పుత్‌తో పంచుకున్నారని దీనిని బహిర్గతం చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకున్నారని ఆయన పేర్కొన్నారు.

"దీనిని నిరోధించడానికి, సంబంధిత వ్యక్తులను రక్షించడానికి ఒక పథకం ప్రకారం నేరపూరిత కుట్ర పన్నారు. బాధితురాలిపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఆధారాలను తొలగించారు లేదా మార్చారు. నేరాలను కప్పిపుచ్చడానికి నిందితులను రక్షించడానికి ఆత్మహత్య అనే తప్పుడు కథనాన్ని సృష్టించారు" అని సతీశ్ సాలియన్ ఆరోపించారు.

దిశా సాలియన్, సీబీఐ, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి, బాంబే హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిశా సాలియన్ మరణించిన వారం రోజుల లోపే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఇంట్లో చనిపోయి కనిపించారు.

"ఆమె చాలా తెలివైనది"

ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడం అంటే "ఎవరినో దోషిగా తేల్చినట్లు కాదు" అని దర్యాప్తు అధికారికి తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితుడిగా పరిగణించరాదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయినప్పటికీ, ఈ ఎఫ్ఐఆర్‌లో రాష్ట్రంలోని కొందరు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, బాలీవుడ్ నటుల పేర్లు ఉండటంతో, రాజకీయ అధికార దుర్వినియోగం, ఖండనలు, రాజకీయ కక్షసాధింపు ఆరోపణల నడుమ ఈ కేసు మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా నిలిచింది.

తన కుమార్తెకు న్యాయం చేయడం కోసం ఆరేళ్లుగా పోరాడుతున్న సతీశ్ సాలియన్, కోర్టు తాజా దర్యాప్తుకు ఆదేశించిన తర్వాత తనకు "ప్రశాంతత" లభించిందని చెప్పారు.

దిశా గురించి చెప్తూ "ఆమె చాలా తెలివైనది. బాగా చదివేది. ఆమెకు మంచి మనసు ఉంది. అందరికీ సహాయం చేసేది. ఆమె మా ఏకైక సంతానం, మమ్మల్ని ఎంతో ప్రేమించేది" అని ఆయన బీబీసీతో అన్నారు. ఆమె ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక తన భార్య డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని సతీశ్ సాలియన్ చెప్పారు.

"నా కుమార్తెను బాధించిన వారికి ఉరిశిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. ఆమెను బాధ పెట్టిన వాళ్లు కూడా అంతే బాధాకరమైన మరణాన్ని అనుభవించాలి. నా దృష్టిలో దిశాకు లభించే అసలైన న్యాయం అదే" అని ఆయన అన్నారు.

(ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)