డ్రోన్లతో వైద్యసేవలు: "ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు" ఏజెన్సీ ప్రాంతాలలో డ్రోన్లతో వచ్చిన మార్పేంటి?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
ఐదునెలల గర్భిణి నవమి అలసటగా ఉన్నా చిరునవ్వు నవ్వారు. ‘‘నడిచే బాధ తప్పింది’’ అంటున్నప్పుడు ఆమె మొహంలో ఓ వెలుగు కనిపించింది.
‘ఇంటి నుంచి తడకకు వెళ్లలాంటే కాలినడక తప్ప మరో దారి లేదు. అక్కడకు వెళ్లాక మళ్లీ బస్సుకోసమో, ఆటోకోసమో ఎదురుచూడాలి. బస్సు దొరికినా, సీటు దొరుకుతుందనే గ్యారంటీ ఉండదు. ఎంత అలసట అయినా బస్సులోనే నిలబడి ప్రయాణించాల్సి వచ్చేది... ఇప్పుడు ఆ బాధ తప్పినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు నవమి.
‘‘రక్తపరీక్ష కోసం అరకు లేదా పాడేరు వెళ్లాలి. అరకు వ్యాలీకి ఆటోలో వెళ్లి, అక్కడ బస్సు కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ప్రయాణం ఒక ఎత్తు అయితే, వైద్యపరీక్షలకు చేయాల్సిన నిరీక్షణ మరో ఎత్తు. ఇవ్వన్నీ చేసి ఇంటికి తిరుగుముఖం పట్టేసరికి చీకటి పడిపోతుంది’
కానీ ‘‘ఇప్పుడు ఆ బాధ తప్పింది’’ అన్నారు నవమి.
మరో గర్భిణి సావిత్రి కూడా ‘‘ ఉన్న ఊళ్లోనే వైద్యపరీక్షలకు దారి దొరికింది’’ అన్నారు.

ఈ మహిళలకే కాదు, అల్లూరి సీతారామారాజు ఏజెన్సీ ఏరియా నుంచి దూరప్రాంతాలలోని ఆస్పత్రులకు వెళ్లి, వైద్యపరీక్షలు చేయించుకోవాల్సిన వారందరి మాట.
వారందరి ‘బాధ తప్పిపోవడానికి ’ కారణం ఏమిటి?
ఉన్న ఊరి నుంచి కదలకుండా వారు వైద్యపరీక్షలు ఎలా చేయించుకుంటున్నారు? ఈ ‘దూరాభారం’ ఎలా తగ్గింది? ఒక్క రోజులోనే వైద్య పరీక్షల ఫలితాలు పేషెంట్లకు ఎలా చేరుతున్నాయో బీబీసీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ల్యాబ్‌కు వెళ్లకుండానే..
ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలకు దూరం, రవాణా ప్రధాన సమస్యలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సేకరించిన నమూనాను ల్యాబ్ ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే రోడ్డు మార్గంలో గంటల సమయం పట్టొచ్చు.
ఇప్పుడు స్థానిక పీహెచ్‌సీలో రక్త నమూనా ఇస్తే చాలు. మెడికల్ డ్రోన్ ఆ నమూనాను పాడేరుకు తీసుకు వెళుతోంది.
పీహెచ్‌సీల్లో సేకరించిన రక్త నమూనాలు, ఇతర శాంపిల్స్‌ను డ్రోన్ ద్వారా హబ్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి ల్యాబ్‌కు పంపిస్తున్నారు.
పరీక్షలు పూర్తయిన తర్వాత రిపోర్టులను మళ్లీ డ్రోన్ ద్వారా పీహెచ్‌సీలకు పంపిస్తున్నారు.
ఈ సేవల కోసం పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు మెడికల్ డ్రోన్లతో హెల్త్ కేర్ డ్రోన్ హబ్ ఏర్పాటు చేసింది.
రెడ్ వింగ్ సంస్థ టెక్నికల్ సపోర్టు అందిస్తోంది. డ్రోన్ సేవలు పూర్తిగా ఉచితం.
పీహెచ్‌సీ నుంచి వచ్చిన శాంపిల్‌ను డ్రోన్ హబ్ వద్ద 'రన్నర్లు' తీసుకుని సమీపంలోని ల్యాబ్‌కు చేరుస్తారు. అక్కడ పరీక్షలు పూర్తయిన తరువాత వాటి ఫలితాలను మళ్లీ హబ్‌కు తీసుకొస్తారు. అక్కడి నుంచి డ్రోన్ ద్వారా పీహెచ్‌సీకి పంపిస్తారు.
ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, లబ్ధిదారులు ఏమంటున్నారో తెలుసుకోవడానికి డ్రోన్ హబ్, పీహెచ్‌సీలతో పాటు కొన్ని గిరిజన గ్రామాలకు బీబీసీ వెళ్లింది.

కొండలు దాటాల్సిన అవసరం లేకుండా..
ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్న వైద్య పరీక్ష కోసం కూడా రోగులు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
నవమికి గత గర్భధారణలో ఎదురైన ఇబ్బందులు ఇప్పటికీ గుర్తున్నాయి.
"ఆటోలు, బస్సులు లేకపోవడం వల్ల ఇంటి నుంచి నడుచుకుంటూ తడక వచ్చి.. వాటి కోసం ఎదురు చూసి ..మళ్లీ అరకు వ్యాలీ వెళ్లాలి. ఒకవేళ బస్సులో సీటు ఖాళీ లేకపోతే నుంచునే వెళ్లాలి. ఒక వేళ అరకు ఆస్పత్రి వాళ్లు పాడేరుకు వెళ్లమంటే అక్కడ వెళ్లాలి. మళ్లీ రిపోర్ట్ కోసం రేపు రా అంటే..మళ్లీ వెళ్లాలి" అని నవమి గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు నవమి తన గ్రామంలోని పీహెసీలోనే శాంపిల్ ఇస్తున్నారు. ఆ శాంపిల్ డ్రోన్‌లో పాడేరు చేరుతోంది.
అరకు మండలంలోని గన్నెల పీహెచ్‌సీ నుంచి పాడేరు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు ద్వారా ప్రయాణిస్తే సుమారు రెండు గంటల సమయం పట్టేది.
ఇప్పుడు డ్రోన్ల ద్వారా శాంపిల్ అరగంటలో పాడేరు చేరుతుందని డ్రోన్ పైలెట్ ఉదయ్ కమల్ తెలిపారు.

గంటల ప్రయాణం.. నిమిషాల్లో..
మెడికల్ డ్రోన్లతో శాంపిల్స్ వేగంగా ల్యాబ్‌లకు చేరుతుండటంతో రోగ నిర్థరణ, చికిత్స త్వరగా జరుగుతోందని గన్నెల పీహెచ్‌సీ వైద్యులు చెబుతున్నారు.
"డ్రోన్ ద్వారా పీహెచ్‌సీకి వచ్చిన రిపోర్టులను ముందుగా మా ఫోన్లకు పంపుతున్నారు. మా గ్రామంలో ఇలాంటిది చూస్తానని అనుకోలేదు. చాలా ఆనందంగా అనిపిస్తోంది" అని నవమి బీబీసీతో అన్నారు.
"పేషెంట్‌కు డ్రోన్ వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుంది. ఇంతకు ముందు టెస్టులు కావాలంటే వాళ్లే రిపోర్ట్స్ తీసుకు వచ్చి చూపిస్తే తప్ప డయాగ్నోసిస్ చేయలేక పోయేవాళ్లం. ఇప్పుడు డ్రోన్ సహాయంతో రిపోర్ట్స్ త్వరగా రావడంతో డయాగ్నోసిస్, ట్రీట్‌మెంట్ త్వరగా ప్రారంభించగలుగుతున్నాం." అని గన్నెల పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె. గౌరీ ప్రియాంక బీబీసీకి తెలిపారు.
గర్భధారణ సమయంలో అవసరమయ్యే కొన్ని పరీక్షలకు స్థానికంగానే నమూనాలు సేకరించి బయట ల్యాబ్‌లకు పంపించే అవకాశం ఉండటంతో గర్భిణులకు ప్రయోజనం ఉంటుందని డాక్టర్ గౌరీ ప్రియాంక చెప్పారు.

116 గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం..
అరకు వ్యాలీకి 16 కిలోమీటర్ల దూరంలో గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.
ఈ పీహెచ్‌సీపై 116 గిరిజన గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. కొన్ని గ్రామాల నుంచి ఇక్కడికి రావాలంటే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది.
గతంలో గిరి శిఖర గ్రామాలకు వెళ్లి ఆరోగ్య సిబ్బంది రక్త నమూనాలను తీసుకొచ్చేవారని గన్నెల పీహెచ్‌సీ ఏఎన్ఎం సంతోషి చెబుతున్నారు.
"గిరి శిఖర గ్రామాలకు కూడా మేం కాలినడకనే వెళ్లి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసుకుని వాటిని ల్యాబ్స్‌కు ఇవ్వాలి. ఇప్పుడు శాంపిల్స్ కలెక్ట్ చేసి.. పీహెచ్‌సీకి తెస్తున్నాం. అక్కడ నుంచి డ్రోన్ ద్వారా ల్యాబ్‌కు పంపుతున్నాం. దీని వల్ల మాకు శ్రమ తగ్గింది" అని ఏఎన్ఎం సంతోషి బీబీసీకి చెప్పారు.

శాంపిల్ నుంచి పేలోడ్ వరకు..
డ్రోన్‌లో శాంపిళ్లను ప్రత్యేకంగా ప్యాక్ చేసి పంపిస్తారు. దీనిని పేలోడ్ అంటారు.
డ్రోన్ నుంచి వచ్చిన పేలోడ్ బాక్స్‌ను రన్నర్లు తీసుకుని మెడికల్ కోఆర్డినేటర్‌కు అందిస్తారు. బాక్స్‌లో రక్త నమూనాలు, ఇతర పేషెంట్లు ఇచ్చిన శాంపిళ్లు ఉంటాయి.
అవి చెడిపోకుండా కూలింగ్ సిస్టమ్, డ్యామేజ్ కాకుండా కుషనింగ్ సిస్టమ్‌తో ప్యాక్ చేస్తారు.
"మెడికల్ డ్రోన్స్ నుంచి వచ్చిన పేలోడ్ బాక్స్‌లో బ్లడ్ శాంపిల్స్, ఇతర శాంపిల్స్ ఉంటాయి. వీటి వివరాలన్నీ ఆ బాక్సుపై రాసి ఉంటాయి. అదే విధంగా పరీక్షలు అనంతరం ఆ శాంపిల్స్ రిపోర్టును కూడా డ్రోన్ ద్వారానే పీహెచ్‌సీకి పంపుతారు. అలాగే రిపోర్టును, దాని వివరాలను ముందుగా పేషెంట్స్ సెల్ ఫోన్లకు వాట్సప్ చేస్తారు" అని మెడికల్ కోఆర్డినేటర్ పురుషోత్తం నాయుడు బీబీసీకి చెప్పారు.

ప్రకృతి విపత్తుల సమయంలో..
మెడికల్ డ్రోన్లు కేవలం రక్త నమూనాలను తరలించడానికే పరిమితం కాదు. ప్రకృతి విపత్తులు, కొండచరియలు, తుపాన్ల సమయంలో అత్యవసర మందులు, వ్యాక్సిన్లు, ఇతర వైద్య సామాగ్రిని కూడా అవసరమైన ప్రాంతాలకు పంపించే అవకాశం ఉందని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీనివాసరావు చెప్పారు.
"ఇక్కడ ప్రకృతి విపత్తులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొండచరియలు విరిగిపడటం లాంటివి. తుపాన్లు వచ్చినప్పుడు రెండు, మూడు రోజులు వాటి ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో అత్యవరం అయితే ఈ డ్రోన్లు ప్రభావిత ప్రాంతాల్లో రోగులు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్లి శాంపిల్‌ను కలెక్ట్ చేస్తాయి. ల్యాబ్ కి తెస్తాయి. పరీక్షలు అనంతరం రిపోర్ట్ ను అందచేస్తాయి. పేషెంట్ కు అత్యవసర పరిస్థితి తలెత్తక ముందే వైద్యులుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం వస్తుంది" అని డాక్టర్ కె. శ్రీనివాసరావు చెప్పారు.

2 వేలకుపైగా ఫ్లైట్ ట్రిప్పులు..
డ్రోన్ హబ్ ప్రాజెక్టు బృందం చెప్పిన వివరాల ప్రకారం...ఇప్పటి వరకు దాదాపు 2 వేల ఫ్లైట్ ట్రిప్పుల్లో డ్రోన్లు 70 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి. సుమారు 80 వేల వైద్య పరికరాలు, రిపోర్టులు, మందులను దాదాపు 25 వేల మంది పేషెంట్లకు అందించాయి.
సాంకేతిక సమస్యలు, తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎదురైతే డ్రోన్ ఆపరేషన్లను నిలిపివేయాల్సి వస్తుంది.
ఇందుకోసం ప్రత్యామ్నాయ సాంకేతిక బృందాలు కూడా ఉన్నాయని ప్రాజెక్టు ప్రోగ్రామ్ మేనేజర్ అభిజిత్ తెలిపారు.
"సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వీటిని మాన్యువల్‌గా కూడా ఆపరేట్ చేసే అవకాశం ఉంది. ఆ టెక్నికల్ సపోర్ట్ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది" అని అభిజిత్ తెలిపారు.

రాత్రివేళల్లో సేవలు లేవు..
మెడికల్ డ్రోన్ సేవలకు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రాత్రివేళల్లో సేవలు అందుబాటులో లేవు.
ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో ఆపరేషన్లు నిలిపివేయాల్సి రావచ్చు.
"పీహెచ్‌సీలకు వచ్చే వారికి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం. కాకపోతే డ్రోన్ సర్వీసులు రాత్రి వేళ కూడా ఉండే బాగుంటుందని అనుకుంటున్నాం" అని గన్నెల పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె. గౌరీ ప్రియాంక బీబీసీతో అన్నారు.
ఫ్లయింగ్ నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆపరేషన్లు జరుగుతున్నాయని సీనియర్ ఫ్లయింగ్ ఆపరేటర్ మెహన్ కుమార్ తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో డీజీసీఏ అనుమతులతో రాత్రివేళల్లో కూడా ఎగరేయవచ్చని చెప్పారు. డ్రోన్లు 2 కిలోల వరకు బరువును మోసుకెళ్తున్నాయని, అవసరమైతే నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తీసుకెళ్లగలవని తెలిపారు.
పాడేరు నుంచి విశాఖపట్నంలోని కేజీహెచ్ వరకు డ్రోన్ సేవలను విస్తరించే ప్రణాళిక కూడా ఉందని మెహన్ కుమార్ తెలిపారు. అయితే కేజీహెచ్ పరిధి రెడ్ జోన్ కావడంతో అనుమతులు అవసరమని చెప్పారు.

దేశవ్యాప్తంగా పరిమిత వినియోగమే..
దేశవ్యాప్తంగా మెడికల్ డ్రోన్లకు ఒకే నేషనల్ నెట్‌వర్క్ లేదని మెహన్ కుమార్ చెప్పారు. దేశంలో మొత్తం ఎన్ని మెడికల్ డ్రోన్లు ఉన్నాయి, వాటి అవసరం ఎంత అనే విషయాలపై ప్రత్యేక జాతీయ గణాంకాలు లేవని తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో పరిమితంగానైనా మెడికల్ డ్రోన్ల వినియోగం ఉందని చెప్పారు.
"మెడికల్ కార్గో డ్రోన్స్ దేశ వ్యాప్తంగా ఉన్న అవసరంలో కేవలం 5 శాతం వరకు ఉంచవచ్చు. వీటిపై ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయి గణాంకాలు లేవు." అని మెహన్ కుమార్ చెప్పారు.
సీనియర్ డ్రోన్ పైలట్ ఆపరేటర్ మెహన్ కుమార్ చెప్పిన ఈ విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించడం లేదు.
'గ్రామాలకు కొత్త అనుభవం'
మెడికల్ డ్రోన్ సేవలు ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామస్థులకు ఇప్పటికీ కొత్త అనుభవంగానే ఉన్నాయి. ఆకాశంలో డ్రోన్ కనిపిస్తే విమానం చూసినట్టుగా ఆసక్తిగా చూస్తున్నారు.
"వైద్య అవసరాల కోసం డ్రోన్స్, తిరుగుతున్నాయని మాకు ముందు తెలియలేదు. దాంతో మా ఊర్లో విమానాలు తిరుగుతున్నాయేంటి అనుకున్నాం . రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలకు ఈ డ్రోన్లు ఉపయోగిస్తున్నారని ఆ తర్వాత తెలిసింది ." అని తడక గ్రామస్థుడు మంగళ బీబీసీతో అన్నారు.

సావిత్రికి ప్రయాస తగ్గింది.
నవమిలాగే గన్నెల గ్రామానికి చెందిన మరో గర్బిణి సావిత్రి కూడా గతంలో రక్త పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది.
పాడేరుతో పాటు వైజాగ్, ఎస్.కోట వెళ్లాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె చెబుతున్నారు.
"ఇంతకు ముందు దూరం వెళ్లాలి. పాడేరు లేకపోతే వైజాగ్, ఎస్ కోట వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా ఊరి పీహెచ్సీలోనే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాం." అని గన్నెల గ్రామానికి చెందిన సావిత్రి బీబీసీతో అన్నారు.
మెడికల్ డ్రోన్లతో ఏజెన్సీలోని ప్రతి వైద్య సమస్య పరిష్కారమైందని చెప్పలేం. రాత్రివేళ సేవలు, తీవ్ర వాతావరణం వంటి పరిమితులు ఇంకా ఉన్నాయి. అయితే నవమి, సావిత్రిలాంటి రోగులకు కనీసం రక్త పరీక్ష కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం కొంత తగ్గింది. నవమి మొదటి గర్భధారణలో నడిచి, బస్సుల్లో ప్రయాణించి, పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.
ఇప్పుడు ఆమె గ్రామంలోని పీహెచ్‌సీలో శాంపిల్ ఇస్తే డ్రోన్ దానిని పాడేరు తీసుకెళుతోంది.
"మొదటి ప్రెగ్నెన్సీలో చాలా ఇబ్బంది పడ్డాం. నడవడానికి, , టెస్టులు చేయించుకుని రావడానికి చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు డ్రోన్ ద్వారా ఇంట్లోనే అన్నీ సౌకర్యాలు ఉన్నట్లుగా పనులు జరిగిపోతున్నాయి" అని నవమి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































