You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టైటానిక్ నుంచి ప్రాణాలతో బయటపడిన మహిళ లైఫ్ జాకెట్ ఎంత ధర పలికిందంటే..
- రచయిత, క్లారా బుల్లాక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 3 నిమిషాలు
టైటానిక్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బతికి బయటపడిన ఓ ప్రయాణికురాలి లైఫ్ జాకెట్ వేలంలో 670,000 యూరోలు (దాదాపు 8 కోట్ల 40 లక్షల రూపాయలు) భారీ ధరకు అమ్ముడైంది.
టైటానిక్ మునిగిపోయిన 114 ఏళ్ల తర్వాత, వేలానికి వచ్చిన ఏకైక లైఫ్ జాకెట్ ఇది. విల్ట్‌షైర్‌లోని డెవిజెస్‌కు చెందిన హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ సంస్థ ఈ జాకెట్‌ను వేలం వేసింది.
1912లో జరిగిన ఆ విషాదకర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన సుమారు 700 మందిలో ఫస్ట్ క్లాస్ ప్రయాణికురాలు లారా మేబెల్ ఫ్రాంకాటెలీ ఒకరు. ఆమె లైఫ్‌బోట్‌లోకి ఎక్కేముందు దీనిని ధరించారు.
తాను 'అమితానందం'గా ఉన్నట్లు వేలం నిర్వాహకులు ఆండ్రూ ఆల్డ్రిడ్జ్ అన్నారు.
"ఇది టైటానిక్ ఘటనకు, అందులోని ప్రయాణికులు, సిబ్బంది గురించి నేటికీ ఉన్న ఆసక్తి, అభిరుచికి నిదర్శనం" అన్నారాయన.
ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి చెందిన, గత 114 ఏళ్లలో వేలానికి వచ్చిన ఏకైక లైఫ్ జాకెట్ ఇదేనని ఆండ్రూ ఆల్డ్రిడ్జ్ గతంలో చెప్పారు.
ఫ్రాంకాటెలీతో పాటు ప్రాణాలతో బయటపడిన కొందరు తోటి ప్రయాణికులు ఈ లైఫ్ జాకెట్‌పై సంతకాలు చేశారు. ఈ జాకెట్‌కు 12 జేబులు ఉన్నాయి. ఇది 250,000 యూరోల నుంచి 350,000 యూరోల (సుమారు రూ.2.6 కోట్ల నుంచి రూ.3.7 కోట్లు) వరకూ పలుకుతుందని అంచనా వేశారు. అనూహ్యంగా అంతకుమించిన భారీ ధర పలికింది.
అలాగే, టైటానిక్ లైఫ్‌బోట్లలో ఒకదానికి సంబంధించిన సీటు కుషన్ అదే వేలంలో 390,000 యూరోలకు (దాదాపు 4.8 కోట్ల రూపాయలు) అమ్ముడైంది.
1912లో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ మంచుకొండను ఢీకొట్టిన ప్రమాదంలో మునిగిపోయిన లండన్ టీ దిగుమతిదారు రిచర్డ్ విలియం స్మిత్ స్నేహితుడు మొదట ఈ కుషన్‌ను కొనుగోలు చేశారు.
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో తోటి టీ దిగుమతిదారు టీజీ మాథ్యూస్‌ను కలిసేందుకు వెళ్తూ స్మిత్ ఈ ప్రమాదంలో చనిపోయారు. టైటానిక్ మృతులు 1500 మందిలో ఈయన కూడా ఒకరు. అయితే, ఈయన మృతదేహం లభించలేదు.
టైటానిక్ మ్యూజియం అట్రాక్షన్ దీనిని కొనుగోలు చేసిందని, ఈ సీటును ప్రదర్శనకు ఉంచనున్నారని వేలం నిర్వాహకులు తెలిపారు.
సౌతాంప్టన్‌లో ఏప్రిల్ 14న, ఆర్ఎంఎస్ టైటానిక్ విషాదం 114వ వార్షికోత్సవ స్మారక కార్యక్రమం సందర్భంగా ఈ వేలం జరిగింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)