You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హార్ముజ్ జలసంధిలో భారత జెండాతో ఉన్న రెండు నౌకలపై కాల్పులు, ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు
- రచయిత, డేనియల్ పలంబో
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 3 నిమిషాలు
హార్ముజ్ జలసంధిలో భారత జెండాతో ఉన్న రెండు నౌకలపై కాల్పులు జరిగిన ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనగా, భారత ప్రభుత్వం ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది.
శనివారం హార్ముజ్ జలసంధిలో భారత జెండా ఉన్న రెండు నౌకలు బలవంతంగా తమ మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.
బీబీసీ పర్షియన్, ట్యాంకర్ల రాకపోకలను పర్యవేక్షించే 'ట్యాంకర్‌ట్రాకర్స్' వెబ్‌సైట్ ప్రకారం, 'కాల్పులు' జరిగాయి.
హార్ముజ్ జలసంధికి పశ్చిమ దిశలో ప్రయాణిస్తున్న రెండు భారతీయ నౌకలను వెనక్కి వెళ్లాల్సిందిగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ నావికాదళం ఆదేశించిందని 'ఛానల్ 16 ఆడియో రికార్డింగ్'ను ఉటంకిస్తూ ట్యాంకర్‌ట్రాకర్స్ తెలిపింది.
బీబీసీ వెరిఫై తెలిపిన వివరాల ప్రకారం, జలసంధిని మళ్లీ తెరుస్తున్న సమయంలో భారత జెండా ఉన్న రెండు నౌకలు - కార్గో షిప్ జగ్ అర్నవ్, చమురు ట్యాంకర్ సన్మార్ హెరాల్డ్‌లను తమ నిర్ణీత మార్గం నుంచి తప్పుకోవాలని ఐఆర్‌జీసీ ఆదేశించింది.
మెరైన్ ట్రాకింగ్ డేటా ప్రకారం, ఈ నౌకలు లారక్ ద్వీపాన్ని దాటిన తర్వాత వేగం తగ్గించి, యూ-టర్న్ తీసుకుని వెనక్కి మళ్లాయి.
సన్మార్ హెరాల్డ్ డేటా ప్రకారం అది చమురుతో పూర్తిగా నిండి ఉంది. తాజా ట్రాకింగ్ డేటా ఆధారంగా ఈ చమురు ఇరాక్ నుంచి వస్తున్నట్లు సమాచారం.
భారత విదేశాంగ శాఖ ఈ ఘటనకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.
"శనివారం సాయంత్రం న్యూదిల్లీలో భారత విదేశాంగ కార్యదర్శిని కలవాల్సిందిగా ఇరాన్ రాయబారికి సమన్లు అందించారు. ఈ భేటీలో, భారతీయ నౌకలపై జరిగిన కాల్పులపై విదేశాంగ కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య నౌకలు, నావికుల భద్రతకు భారత్ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
భారత్‌కు వచ్చే పలు నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా గతంలో ఇరాన్ సహాయం చేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత్ పేర్కొన్న ఈ అంశాలను ఇరాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రాయబారికి విదేశాంగ కార్యదర్శి సూచించారు. అదేవిధంగా, భారత్ వైపు వచ్చే నౌకల సురక్షిత ప్రయాణ ప్రక్రియను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరారు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
భారత్ పేర్కొన్న అంశాలను ఇరాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆ దేశ రాయబారి హామీ ఇచ్చారు.
మళ్లీ పెరిగిన ఉద్రిక్తత
అంతకుముందు, హార్ముజ్ జలసంధిలో ఒక ట్యాంకర్‌పై ఐఆర్‌జీసీ కాల్పులు జరిపినట్లు యుకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) రిపోర్ట్ చేసింది. ఒమన్‌కు ఈశాన్యంగా 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. అయితే, ట్యాంకర్, అందులోని సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది.
అంతేకాకుండా, హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కనీసం రెండు వాణిజ్య నౌకలపై కాల్పులు జరిగినట్లు మూడు వర్గాలు రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపాయి. జలసంధి మూసివేతపై ఇరాన్ మీడియాలోనూ వార్తలు రావడంతో, అనేక నౌకలు ఈ సముద్ర మార్గాన్ని వదిలి తమ దారిని మార్చుకున్నాయి.
ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, హార్ముజ్ జలసంధిపై తాము తిరిగి నియంత్రణ సాధిస్తున్నట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ఈ జలసంధి "తన పాత స్థితికి" చేరుకుంటుందని, సాయుధ బలగాలు ఈ ప్రాంతాన్ని నియంత్రిస్తాయని ఐఆర్‌జీసీ ప్రకటనను ఉటంకిస్తూ అక్కడి మీడియా పేర్కొంది.
ఐఆర్‌జీసీకి అనుబంధంగా ఉన్న ఫార్స్ న్యూస్ ఏజెన్సీ, ఇరాన్ స్టూడెంట్స్ న్యూస్ ఏజెన్సీ, ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్ఐబీ ఈ వార్తను వెల్లడించాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)