తీపి ఎక్కడుందో చీమలకు ఎలా తెలిసిపోతుంది?
- రచయిత, కే. శుభగుణం
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు

ఫొటో సోర్స్, Getty Images
కిచెన్‌లో టీ చేసేటప్పుడు స్టవ్ కిందకి కొన్ని చక్కెర పలుకులు పడిపోతుంటాయి. అలాగే, ఏదైనా శుభ సందర్భంలో కానీ, పండగ రోజుల్లో కానీ పాయసం చేసుకునేటప్పుడు, కొంత పక్కకు చిందే అవకాశం ఉంటుంది. మీరు ఆస్వాదిస్తున్న లడ్డు కొద్దిగా విరిగి డైనింగ్ టేబుల్ కింద పడుతుంటుంది.
ఇలా కొంత కిందకి పడిన ఆహారం విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కొంచమే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ, అలా కింద పడిపోయిన పంచదార పలుకులను, స్వీట్ ముక్కలను తినేందుకు కొన్ని చీమలు తలుపు కింద నుంచి, తడిగా ఉన్న గోడల మూలల నుంచి వస్తుంటాయి.
అవి తమ యాంటెన్నాలను ఉపయోగించి మీ ఇంటి ఉపరితలాన్ని తాకి, మనుషులు గుర్తించలేని వాసనలను, రసాయన సంకేతాలను గ్రహించి, మీరు పారేసిన మిగిలిపోయిన ఆహారాన్ని కచ్చితంగా కనుగొంటుంటాయి.
మరుసటి రోజు ఉదయం, మనలో చాలామంది తియ్యగా ఉండే ఆ మిగిలిపోయిన ఆహారం మీద చీమలు గుంపులు గుంపులుగా చేరి ఉండటాన్ని చూసే ఉంటారు. ఒక పొడవాటి, సన్నని వరుసలో వాటి వైపు వెళ్తుంటాయి.
ఈ తియ్యని ఆహారపు పలుకులున్న ప్రదేశాన్ని చీమలు కచ్చితంగా గుర్తించి, ఎలా రాగలవు? ఇంట్లో ఇంతకుముందు ఎక్కడా చూడని చక్కెర పలుకుల వద్దకు అవి ఒక్కసారిగా గుంపుగా ఎలా వస్తాయి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

చీమలు చక్కెరను ఎలా కనుగొంటాయి?
ఇంటికి చాలా దూరంలో ఉండే ఒక చీమ, మీ కిచెన్ మొత్తాన్ని వాసనతోనే పసిగట్టేసింది అన్నది దీనికి సమాధానం కాదు.
దీని వెనుక ఉన్న నేపథ్యం చాలా విచిత్రమైనది, ఆసక్తికరమైనది.
చీమల శరీరంలో పురాతన కాలం నుంచి ఆహార వెతుకులాటకు సంబంధించి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది.
ఈ వెతుకులాటకు సంబంధించిన వ్యవస్థలు (సెర్చ్ ఇంజిన్లు) రసాయన సంకేతాలు, జ్ఞాపకశక్తి, గ్రూప్‌గా కలిసి నిర్ణయం తీసుకోవడం వంటి పనులతో ఒక నెట్వర్క్లా పనిచేస్తుంటుంది.
చైనా, జపాన్‌లకు చెందిన ముగ్గురు రీసెర్చర్లతో పాటు 2016లో పటియాలాలోని పంజాబ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్ హిమేంద్ర భారతి.. భారత్‌లో ఉన్న చీమల జాతుల జాబితాను సిద్ధం చేశారు.
వారి జాబితా ప్రకారం... భారత్‌లో మొత్తంగా 828 రకాల చీమల జాతులు, వాటి ఉపజాతులు ఉన్నట్లు తెలిసింది.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో 2024లో నిర్వహించిన ఒక అధ్యయనంలో , నివాస ప్రాంతాలు సహా వివిధ ఆవాసాలలో 34 జాతుల చీమలు ఉన్నట్లు రికార్డు చేశారు.
వంటగదిలోకి ప్రవేశించే చీమలు ఒకే నిర్దిష్ట జాతికి చెందినవి కావు. ఈ చీమల జాతులన్నీ దాదాపుగా ఒకే విధమైన జీవనశైలిని కలిగి ఉన్నాయని నిపుణులు గుర్తించారు.
చీమలు తమ ఆహారాన్ని వెతుక్కునే ప్రక్రియలో వివిధ దశలు ఉంటాయి. తొలి దశలో భాగంగా ఆహారం ఎక్కడుందో అన్వేషించడమే వీటి పని.
సమయంతో పని లేకుండా గోడలు, పగుళ్లు, కిటికీలు, పైపుల మధ్య ఖాళీలు, నేల అంచుల గుండా కొన్ని చీమలు కదులుతుంటాయి. తమ ప్రాంతంలో, చుట్టుపక్కలా ప్రతిదాన్నీ అన్వేషించడమే వీటి పని.
ఈ పనిలో వీటి వద్ద నుండే ప్రధాన పరికరం ఏంటంటే.. వాటి శరీరాలపై ఉండే యాంటెన్నా. సాధారణంగా మైక్రోబయోలజీ వరల్డ్‌లో చీమలు ఒక ప్రత్యేకమైన రసాయన విశ్వంలో నివసిస్తుంటాయని వర్ణించారు.
2018 నవంబర్‌లో జర్నల్ జెనోమ్ రీసెర్చ్‌లో ప్రచురితమైన షాన్ కే. మెకెంజీ నేతృత్వంలోని జెనటిక్ స్టడీలో, ''వాసనను పసిగట్టే జన్యు పదార్థాలు చీమల జన్యువులలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి'' అని గుర్తించారు.
జర్నల్ పీఎల్ఓఎస్ జెనటిక్స్లో ప్రచురితమైన వాండర్బిల్ట్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్ల 2012 అధ్యయనంలో.. ''అనేక ఇతర కీటక జాతుల కంటే నాలుగు నుంచి ఐదింతలు ఎక్కువగా చీమలలో వాసనను పసిగట్టే గ్రాహకాలు ఉంటాయి'' అని తెలిసింది.
సులభంగా చెప్పాలంటే, ఒక చీమకు వంటగది అనేది ఖాళీ ప్రదేశం కాదు, దాని కళ్లకు మాత్రమే కనిపిస్తూ మన కళ్లకు కనిపించని లెక్కలేనన్ని రసాయన సంకేతాలతో నిండిన ప్రదేశం అది.

పాకం, బెల్లం ముక్కలు, పాల మిఠాయిలు, ఒలికిన టీ, చెంచాలపై ఉండే నెయ్యి మరకలు, సింక్ చుట్టూ ఉండే తేమను చీమలు కనుగొన్నప్పుడే, వంటగదిలో వాటి అన్వేషణలు చాలా వరకు మొదలవుతాయి.
2021లో, డాక్టర్ వసీం జలీల్ నేతృత్వంలో ఫైర్ యాంట్స్పై జరిగిన ఒక అధ్యయన ఫలితాలు 'నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్' అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనంలో.. చీమలు తీపి పదార్థాలను తినే ప్రవర్తన, వాటి యాంటెన్నాలపై రుచిని గ్రహించే భాగాలు, ముందు కాళ్ల మధ్యనున్న సంబంధాన్ని వెల్లడించారు.
రుచిని గ్రహించే ఈ భాగాలు ఉపరితలాన్ని తాకడం ద్వారా చక్కెర పలుకులు ఎక్కడున్నాయో కనుగొనేందుకు సాయపడతాయని రీసెర్చ్ పేపర్లో వివరించింది.
అందుకే, ఏదో ఒక మూలలో జారిపడ్డ చిన్నచిన్న ఈ పంచరాల పలుకులు, టీ లేదా స్వీట్ డ్రింకుల నుంచి జారి పడ్డ మరకలు కూడా చీమలు ఆహార అన్వేషణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
రుచిని గ్రహించే ఈ కోరకాలను సహజసిద్ధమైన ఆహారపు వెతుకులాటకు సహకరించే ఇంజిన్లుగా నిపుణులు వర్ణిస్తున్నారు.
ఎందుకంటే, మనం పైన చూసినట్లుగా తక్కువ మొత్తంలో ఆహారం కోసం వెతికే ఈ చీమలు, తమ సెర్చ్ ఇంజిన్లను ఉపయోగించి వాటిని కనుగొన్న తర్వాత కేవలం వదిలేసిన ఈ ఆహారాన్ని మాత్రమే తిని వెళ్లవు.

గూగుల్ మ్యాప్‌లాగా పనిచేసే రసాయన మార్గాలు
"చీమల ఫెరోమోన్లు ఆహారానికి వెళ్లే దారులను గుర్తించగలవు" అని అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన వ్యవసాయ పరిశోధన సేవా విభాగం సేకరించిన సమాచారంలో తెలిసింది.
అంటే, ఆహారాన్ని కనుగొన్న ఈ చీమలు, తన గూటికి తిరిగి వెళ్లేటప్పుడు మార్గనిర్దేశం కోసం రసాయన జాడలను వదిలి వెళ్తాయి.
ఫిజియోలాజికల్ ఎంటమాలజీ అనే జర్నల్‌లో 2009లో ప్రచురితమైన ఇ. డేవిడ్ మోర్గాన్ అధ్యయనం ఈ ప్రక్రియను వివరించింది.
"ఆహారం కోసం వెతుకుతున్న చీమకు ఆహారం దొరికినప్పుడు, అది తన గూటికి తిరిగి వెళ్లే దారిలో ఫెరోమోన్ల జాడను వదిలి వెళుతుంది. ఆ తర్వాత, అదే మార్గంలో తాను వదిలివెళ్లిన ఫెరోమోన్లను గూగుల్ మ్యాప్‌లా ఉపయోగించుకుంటూ.. తన కాలనీలోని ఇతర చీమలకు ఆహారం వద్దకు మార్గనిర్దేశం చేస్తుంది" అని తెలిపింది.
ఈ విధంగా, కొన్ని నిమిషాల వ్యవధిలోనే.. ఒకే ఒక చీమ లేదా చాలా చిన్న చీమల గ్రూప్ ఒక ఆహార వనరును కనుగొంటుంది. అవి వదిలే రసాయన మార్గం ద్వారా.. ఇతర చీమలను ఆకర్షించి, ఆ ఆహారాన్ని పొందేలా చేస్తుంది.

చీమల యాంటెన్నాలు ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ యాంటెన్నాలను కోల్పోయిన చీమలు బ్రతకడం కష్టం అని గోవాలోని అరణ్య పర్యావరణ పరిశోధనా కేంద్రానికి చెందిన కీటక శాస్త్రవేత్త డాక్టర్ బ్రోనోయ్ బైథ్యా చెప్పారు.
''చీమలు సంభాషణ భాష కూడా వాటి రసాయన సంకేతాలపైనే ఆధారపడి ఉంటుంది. వాటి శరీరాల నుంచి ఫెరోమోన్లు అని పిలిచే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఈ స్పర్శ ద్వారానే చీమలు తమ పరిసరాల గురించి తెలుసుకుంటాయి, ఆహారం కోసం వెతుకుతాయి, ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి, తమ కాలనీలోని తోటి చీమలను గుర్తిస్తాయి" అని ఆయన వివరించారు.
ఉదాహరణకు, ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు, ఒక చీమ తాను ఒంటరిగా తీసుకెళ్లలేని ఒక పెద్ద ఆహారపు కుప్పను కనుగొంటుంది. అప్పుడు, అది తన ఫెరోమోన్లతో ఆ ప్రదేశాన్ని గుర్తుగా ఉంచుతుంది. అంటే, అది అక్కడి నుంచి తన గూటి వరకు ఫెరోమోన్లను వదులుతూనే ఉంటుంది.
ఆ తర్వాత, అది తన రసాయన జాడను జీపీఎస్ లాగా ఉపయోగించి, గూటిలోని ఇతర చీమలకు ఆహారం ఉన్న వైపు మార్గనిర్దేశం చేస్తుంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























