తమిళనాడు: సూట్‌కేసులో తలలేని మొండెం, మూడు రోజుల తరువాత దొరికిన తల.. పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు?

తమిళనాడు, హత్య, వివాహేతర సంబంధం, ప్లాస్టిక్ కవర్లు

ఫొటో సోర్స్, Handout

    • రచయిత, విజయానంద్ అర్ముగం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

హెచ్చరిక: ఈ కథనంలో కలవరపరిచే విషయాలున్నాయి.

సాధారణంగా తలలేని మృతదేహం దొరికినప్పుడు ఆ కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతుంది. తమిళనాడులో ఇలాంటిదే జరిగింది.

పెరంబూర్ రైల్వే స్టేషన్‌లోని నాలుగో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై జూన్ 5వ తేదీన తలలేని మొండెం కనిపించింది. మూడు రోజుల తర్వాత చెంగల్పట్టు సరస్సు దగ్గర తల లభించింది.

ఈ కేసులో అస్సాంకు చెందిన మహిళ, ఆమెకు సహకరించిన స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులను పట్టుకోవడంలో ఆస్పత్రుల్లో ఉపయోగించే ఎరుపు, పసుపు రంగుల ప్లాస్టిక్ కవర్లు, సీసీటీవీ ఫుటేజ్ కీలక పాత్ర పోషించాయని పులియంతోప్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ముత్తుకుమార్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'140 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన'

పెరంబూర్ రైల్వే స్టేషన్‌లోని నాలుగో నెంబర్ ప్లాట్‌ఫాంపై ఒక నీలి రంగు సూట్‌కేస్ అనుమానాస్పదంగా కనిపిస్తోందని ఓ ప్రయాణికుడు సమాచారమందించారు. ''సూట్‌కేసులో సుమారు 35 ఏళ్ల వయసున్నట్టు భావిస్తున్నఓ వ్యక్తి తలలేని మృతదేహం ఉంది. కాళ్లు చేతులు వేరైన శరీర భాగం మాత్రమే ఉంది. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లు, ఒక వస్త్రంలో చుట్టి ఉంచారు'' అని పోలీసులు చెబుతున్నారు.

తొలుత అనుమానాస్పద మృతిగా నమోదుచేసిన ఈ కేసును తరువాత హత్యకేసుగా మార్చారు.

ఈ కేసును ఛేదించేందుకు పులియంతోప్ ఏసీపీ ముత్తుకుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు.

పెరంబూర్ రైల్వే స్టేషన్‌లో నిఘా కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో ఐదో తేదీ ఉదయం స్టేషన్‌కు వచ్చిన వాహనాలను, క్యాబ్ బుకింగ్ యాప్‌లను తనిఖీ చేసినట్టు పోలీసులు ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.

యాప్ ద్వారా బుక్ చేసుకుని పెరంబూర్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఒక ఆటోపై పోలీసులు నిఘా పెట్టారు. దీని ద్వారా అనుమానితులు ఉన్న చోటును గుర్తించినట్టు చెప్పారు.

"పెరంబూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలోని సుమారు 140 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, అనుమానితులను గుర్తించాం" అని ముత్తుకుమార్ చెప్పారు.

తమిళనాడు, హత్య, వివాహేతర సంబంధం, ప్లాస్టిక్ కవర్లు

ఫొటో సోర్స్, Handout

కీలక ఆధారంగా కవర్లు

మృతదేహాన్ని తరలించడానికి ఉపయోగించిన ఎరుపు, పసుపు రంగు ప్లాస్టిక్ కవర్లు ఈ కేసులో కీలక ఆధారాలని ముత్తుకుమార్ బీబీసీతో చెప్పారు.

‘‘మృతదేహాన్ని పారేసేందుకు ఈ కవర్లను ఉపయోగించారు. వీటిని రోగుల కోసం ఉపయోగిస్తారు. ఎర్ర ప్లాస్టిక్ కవర్‌ను సిరంజీలు, ఇతర వస్తువులు పెట్టడానికి ఉపయోగిస్తారు" అని డీసీపీ ముత్తుకుమార్ అన్నారు.

ఈ ప్లాస్టిక్ కవర్లు తారామణిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందినవని పోలీసుల విచారణలో వెల్లడయింది.

''ఆస్పత్రిలో ఎరుపు, పసుపు రంగు ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్న సిబ్బంది వివరాలు, అలాగే అన్ని విభాగాల ఉద్యోగుల వివరాలు ధ్రువీకరించుకున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్యాన్సర్ రోగులకు గదులు, ప్రయాణం, వసతి ఏర్పాటు చేసే మధ్యవర్తిగా రహీమా ఖాతూన్ పనిచేస్తున్నట్టు గుర్తించాం. అందువల్లే ప్లాస్టిక్ కవర్లను రహీమా ఖాతూన్ రోగుల దగ్గర తీసుకుని ఉండొచ్చని భావించాం'' అని పోలీసులు జారీచేసిన ప్రకటన తెలిపింది.

"మృతదేహాన్ని ఉంచిన పెట్టెలో లభించిన దుస్తులలో కీలక ఆధారం దొరికింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ముత్తుకుమార్ వివరించారు.

మృతుడు అస్సాంకు చెందిన 35 ఏళ్ల అమీర్ అలీ అని, ఆయన తేనాంపేటలో నివసిస్తూ నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.

అమీర్ అలీ భార్య రహీమా ఖాతూన్, ఆమె స్నేహితుడు అస్సాంకు చెందిన అష్రఫ్ అలీలను ఈ హత్యకేసులో పోలీసులు అరెస్టు చేశారు.

తమిళనాడు, హత్య, వివాహేతర సంబంధం, ప్లాస్టిక్ కవర్లు

ఫొటో సోర్స్, Handout

ఫొటో క్యాప్షన్, అష్రఫ్ అలీ

హత్యకు కారణమేంటి?

" రహీమా ఖాతూన్‌కు అస్సాంలో గతంలోనే వివాహమైంది. ఆమెకు ఒక బిడ్డ ఉంది. భర్తతో విడిపోయిన తర్వాత రహీమా ఖాతూన్ చెన్నైకు వచ్చారు. చెన్నైలో ఆమెకు అమీర్ అలీతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ కలిసి జీవిస్తున్నారు" అని పులియన్‌తోప్ డీసీపీ ముత్తుకుమార్ తెలిపారు.

అమీర్ అలీకి ఇతర మహిళలతో కూడా వివాహేతర సంబంధాలు ఉండటంతో రహీమా ఖాతూన్ తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలిసిందని పోలీసులు చెప్పారు.

"అమీర్ అలీ ఇటీవల అస్సాం వెళ్లారు. అక్కడ మరో యువతిని పెళ్లిచేసుకోడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ యువతితో అమీర్ అలీ దిగిన ఫోటోలను రహీమా ఖాతూన్ చూశారు. ఆమె దీని గురించి ప్రశ్నించగా అమీర్ అలీ ఆమెను కొట్టి దూషించారు'' అని డిప్యూటీ కమిషనర్ ముత్తుకుమార్ బీబీసీకి తెలిపారు.

‘‘తనను కొట్టి దూషించిన విషయాన్ని రహీమాఖాతూన్‌ అష్రఫ్ అలీకి చెప్పారు. అష్రఫ్ ది కూడా అస్సాం. ఆయన అప్పుడప్పుడు చెన్నైకు వస్తుంటారు. ఆయనను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశాం’’ అని ముత్తుకుమార్ చెప్పారు.

తమిళనాడు, హత్య, వివాహేతర సంబంధం, ప్లాస్టిక్ కవర్లు

ఫొటో సోర్స్, Handout

ఫొటో క్యాప్షన్, ప్లాస్టిక్ సంచిలో మృతదేహాన్ని ఉంచారు.

హత్య ఎలా జరిగింది?

రహీమా ఖాతూన్ జూన్ 2న అమీర్ అలీకి పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. తర్వాతి రోజు ఉదయం అమీర్ నిద్రలో ఉన్న సమయంలో పదునైన ఆయుధంతో గొంతు కోశారని పోలీసులు తెలిపారు.

తల, కాళ్లు, చేతులు వేరుచేసి మిగిలిన శరీరభాగాన్ని సూట్ కేసులో పెట్టి జూన్ 5న పెరంబూర్ రైల్వే స్టేషన్‌లో ఉంచామని, తర్వాతిరోజు తల భాగం తీసుకుని చెంగల్పట్టు వెళ్లి అక్కడి బురదలో పాతిపెట్టామని, మిగిలిన శరీర భాగాలను తేనాంపేట ప్రాంతంలోని మురుగు కాల్వలో పడేశామని నిందితులు చెప్పినట్టు పోలీసులు వివరించారు.

సోమవారం చెంగల్పట్టు రెవెన్యూ శాఖ సమక్షంలో తలను స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

"విచారణ సమయంలో నిందితులు మృతదేహం గురించి సమాచారం అందించారు. అయితే హత్యకు ఎంచుకున్న పద్ధతి, ఎందుకు హత్యచేశారనేదాని గురించి పదేపదే ప్రశ్నించినప్పటికీ, ఎలాంటి సమాధానం లభించలేదు" అని ముత్తుకుమార్ అన్నారు.

హత్య, సాక్ష్యాలను దాచిపెట్టారనే అభియోగాలపై రహీమా ఖాతూన్, అష్రఫ్ అలీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

"అమీర్ అలీ కుటుంబానికి సమాచారం అందించాం. కానీ వాళ్లింకా చెన్నైకి రాలేదు" అని డిప్యూటీ కమిషనర్ ముత్తుకుమార్ అన్నారు.

"మూడు రోజులుగా రహీమా వ్యవహారశైలి అనుమానాలను రేకెత్తించిందని, వాళ్లింటి నుంచి దుర్వాసన వస్తోందేంటని స్థానికులు ప్రశ్నిస్తే ఎలుక చచ్చిందని రహీమా ఖాతూన్ చెప్పారు'' అని పోలీసులు తెలిపారు. హత్యపై నిందితులు ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదని అన్నారు.

" రహీమాకు గానీ, అష్రఫ్ అలీకి గానీ గతంలో ఎలాంటి నేర చరిత్రా లేదు. కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు వారిపై మరేవైనా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయేమో పరిశీలించాలని అస్సాం పోలీసులను కోరాం" అని ముత్తుకుమార్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)