దిల్లీ వీధుల్లోకి వచ్చిన యువత మోదీ సర్కారుకు సమస్యలు పెంచుతుందా?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ప్రవీణ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
సెంట్రల్ దిల్లీ ఆందోళనలతో హోరెత్తుతోంది. కనాట్ ప్లేస్, జన్‌పథ్, జంతర్ మంతర్ ఇలా ఎక్కడ చూసినా వేల సంఖ్యలో యువతీ యువకులు కనిపిస్తున్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, వారికి మద్దతుగా వచ్చిన అనేకమంది విద్యార్థుల ఆందోళన సోమవారం నాటి ‘చలో పార్లమెంట్’ మార్చ్ నినాదంతో తీవ్రరూపం దాల్చింది.
బుధవారం ఉదయం వర్షం కురుస్తున్నప్పటికీ నిరసనకారులు జంతర్ మంతర్ దగ్గరే ఉండి ఆందోళనలు కొనసాగించారు. వర్షానికి తడవకుండా టార్పాలిన్ పట్టాలను ఉపయోగించుకుంటూ ఆందోళనలు చేస్తున్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఉద్యమం జంతర్ మంతర్ వద్ద గత నెల రోజులుగా ఆందోళనలకు కొనసాగింపుగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ పార్టీల నేతలు మంగళవారం నాడు ప్రధాని నివాసం ముందు ఆందోళనలకు దిగారు.
అయితే, ఎన్డీయే ప్రభుత్వం మాత్రం ఈ ఆందోళనలను రాజకీయ ప్రేరేపితమైనవిగా, విద్యార్ధులను రాజకీయ పక్షాలు రెచ్చగొట్టిన ఫలితంగా ఏర్పడిన వాటిగా అభివర్ణిస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
మోదీ ప్రభుత్వానికి ప్రమాద ఘంటికా?
కొద్దిరోజుల్లోనే సోషల్ మీడియాలో కోట్లమంది అనుచరులను సంపాదించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉంది అనే ప్రశ్నతోపాటు, అది ప్రభుత్వాన్ని స్పందింపజేయగలదా అన్న అనుమానాలు కూడా వినిపించాయి.
అయితే, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ నెల 20 (సోమవారం) నుంచి కనిపిస్తూనే ఉన్నాయి. కాలేజీ విద్యార్థులు, పరీక్షలకు సిద్ధమవుతున్న స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఎక్కువ కాలం మౌనంగా ఉండలేదని నిరూపించారు.
గత నెల రోజులుగా యువత ఈ ఉద్యమాన్ని కవర్ చేస్తున్న స్వతంత్ర జర్నలిస్ట్ స్మితా శర్మ.. సమస్య కేవలం విద్యా వ్యవస్థతోనే కాదని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి ఇతర సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వం విస్మరించకూడదని విద్యార్థులు ఒక సందేశం ఇచ్చారని భావిస్తున్నారు.
ఇంత పెద్ద సంఖ్యలో యువత వీధుల్లోకి వస్తోందని ఎవరూ ఊహించకపోవడమే సోమవారం నాటి నిరసనలో అతిపెద్ద విషయమని స్మితా శర్మ అన్నారు.

"యువత కేంద్ర ప్రభుత్వ భ్రమల్ని తొలగించింది"
జంతర్ మంతర్ దగ్గర నిరసనను నాయకత్వం లేని ఉద్యమంగా చూస్తున్నారు స్మితా శర్మ.
''ఇంటర్నెట్ డౌన్ అయింది. కాక్రోచ్ జనతా పార్టీ నేతలు వారి అభిప్రాయాలు పంచుకోలేకపోయారు. మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. ఈ సందేశాన్ని చెప్పడం కష్టమైంది. ఈ ఉద్యమం విద్య కోసం. కానీ, ఈ నిరసన ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగానికి, ఓట్ల చోరీకి కూడా పాకింది. 12వ తరగతి విద్యార్థుల నుంచి కాలేజీ స్టూడెంట్ల వరకు ప్రతి ఒక్కరూ దీని గురించి చర్చించారు. ఇది తనంతట తానుగా చాలా ప్రత్యేకమైన విషయం'' అని స్మితా శర్మ అన్నారు.
ఈ ఉద్యమం వల్ల భవిష్యత్‌లో ప్రభుత్వానికి సవాలు ఏమేర పెరగనుందనే ప్రశ్న కూడా తలెత్తింది.
''ఈ నిరసన నుంచి ప్రభుత్వం ఎలాంటి సందేశాన్ని తీసుకోకపోతే.. అదొక పెద్ద తప్పిదం అవుతుంది. ఎందుకంటే పార్లమెంటుకు పాదయాత్ర చేయాలని తాము ఎంతగానో ఆరాటపడుతున్నామని యువత స్పష్టం చేసింది. ఒకవేళ వారిని పార్లమెంటుకు పాదయాత్ర చేయకుండా సీజేపీ ఆపినా కూడా, జంతర్ మంతర్ వద్ద ఉన్న వేలాది మంది ప్రజలు పార్లమెంటుకు పాదయాత్ర చేసేవారు" అని స్మిత అభిప్రాయపడ్డారు.
''వారిని కర్రలతో కొట్టారు. అయినప్పటికీ, వారిని ఎదుర్కొన్నారు. ప్రభుత్వానికి ఇదొక సీరియస్ మెసేజ్. ప్రజలలో నెలకొని ఉన్న ఈ తీవ్రమైన ఆందోళనను పట్టించుకోకపోతే, అది ఈ రోజు ఒక బెలూన్లా పేలిపోతుంది, రాబోయే రోజుల్లో మళ్లీ పేలిపోయే అవకాశం ఉంది'' అని చెప్పారు.
స్మితా శర్మ అభిప్రాయాలతో ఏకీభవించారు సీనియర్ జర్నలిస్ట్ హేమంత్ ఆత్రి. ఈ నిరసన రాబోయే రోజుల్లో మోదీ ప్రభుత్వానికి తీవ్రమైన ఇబ్బంది కలిగించనుందని ఆత్రి అభిప్రాయపడ్డారు.
''ఈ నిరసన సాధించిన విజయం ఏంటంటే.. ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం ఈ దేశ ప్రజలను తేలికగా తీసుకుందనే భ్రమను పటాపంచలు చేయడమే. ప్రజలు నిశ్శబ్దంగా వచ్చి వెళ్ళిపోలేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, దాని మూలాలు దృఢంగా ఉన్నాయని వారు చూపించారు. ప్రభుత్వం దానిని బలహీనపరచలేదు" అని చెప్పారు.
''ప్రభుత్వానికి ఇవి ప్రమాద ఘంటికలు. ఎక్కువ కాలం ప్రజలను వారు విస్మరించలేరు. ప్రభుత్వం తన చర్యలకు జవాబుదారీగా ఉండాలి. లేకపోతే ప్రజలు వీధుల్లోకి రావడం మరచిపోరు. దీని ప్రభావం దీర్ఘకాలంలో కనిపిస్తుంది. మన ప్రజాస్వామ్యం మనకు దానంగా ఇవ్వలేదు. మనం దానిని సంపాదించుకున్నాం. దిల్లీ వీధుల్లో కనిపించింది మన ప్రజాస్వామ్య శక్తే'' అని హేమంత్ ఆత్రి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'యువత కేవలం వారికోసమే పోరాడటం లేదు'
యువత పెద్ద ఎత్తున నిరసన చేసినప్పటికీ.. కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదు. దీంతో, వీధుల్లోకి యువత చేసిన ఈ నిరసన వల్ల ఏమి సాధించారన్నది ప్రశ్నార్థకంగానే మిగిలింది.
ఈ ఉద్యమాన్ని పర్యవేక్షిస్తున్న జర్నలిస్టులు, నిపుణుల నుంచి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు మేం ప్రయత్నించాం.
''నేడు జంతర్ మంతర్ వద్ద నేను చూసిన కొత్తతరం నా విశ్వాసాన్ని పెంచింది. ఈ యువత కేవలం వారికోసమే పోరాడటం లేదు. విద్యా వ్యవస్థ కోసం, ఉపాధిని అందించే ఆర్థిక వ్యవస్థ కోసం, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే రాజకీయాల కోసం పోరాడుతున్నారు'' అని జంతర్ మంతర్ వద్ద ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ అన్నారు.
అయితే, ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల వైఖరిని విమర్శించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































