గూగుల్ డేటా సెంటర్‌ను మూడు ప్రాజెక్టులుగా ఎందుకు చూపించారు? పర్యావరణ అనుమతులు అంత వేగంగా ఎలా వచ్చాయి?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
దాదాపు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడి.. 601 ఎకరాల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా గూగుల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
అయితే, ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల గురించి రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
కేంద్ర స్థాయిలో పరిశీలించాల్సిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర స్థాయిలో అనుమతులు పొందే బీ2 కేటగిరీలోకి ఎందుకు తీసుకొచ్చారు?
ఒకే డేటా సెంటర్‌ను మూడు ప్రాజెక్టులుగా ఎందుకు చూపించారు?
వివాదమంతా ఇప్పుడు ఈ ప్రశ్నల చుట్టూనే.

ఈ ప్రాజెక్టును సాధారణంగా 'గూగుల్ డేటా సెంటర్' గా పిలుస్తున్నప్పటికీ, ఇందులో మూడు ప్రధాన భాగస్వాములు ఉన్నారు.
గూగుల్ తన భారత అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సాంకేతిక భాగస్వామిగా ఉంది. డేటా సెంటర్‌లో ఉండే క్లౌడ్, ఏఐ కంప్యూటింగ్, సర్వర్లు, సాంకేతిక నిర్వహణ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా బాధ్యత.
డేటా సెంటర్ క్యాంపస్ నిర్మాణం, విద్యుత్, భవనాలు, మౌలిక వసతులను అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఇన్‌ఫ్రాఅభివృద్ధి చేస్తోంది.
నెట్‌వర్క్ కనెక్టివిటీ,కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ వంటి టెలికాం మౌలిక వసతులను ఎయిర్‌టెల్ అనుబంధ సంస్థ నెక్స్ట్రా అందిస్తోంది.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూములు, అనుమతులు, రహదారులు, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోంది.

మూడు ప్రాంతాలు... ఒకే డేటా సెంటర్?
బీబీసీ బృందం విశాఖ జిల్లాలోని తర్లువాడ, అడవివరం, అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి ప్రాంతాల్లో పర్యటించింది.
గూగుల్-అదానీ భాగస్వామ్యంలోని ఏఐ డేటా సెంటర్ హబ్ కోసం ఈ మూడు ప్రాంతాల్లో కలిపి 601.4 ఎకరాలు కేటాయించారు.
తర్లువాడ - 266.6 ఎకరాలు
అడవివరం - 160 ఎకరాలు
రాంబిల్లి - 174.8 ఎకరాలు
ఈ మూడు ప్రాంతాల్లో ప్రస్తుతం భూమి చదును, మట్టి తరలింపు వంటి పనులు కొనసాగుతున్నాయి.
అయితే, పర్యావరణవేత్తల వాదన ప్రకారం ఇవి మూడూ వేర్వేరు ప్రాజెక్టులు కావు. ఒకే డేటా సెంటర్ ప్రాజెక్టులోని మూడు యూనిట్లు.
"ఒక ప్రాజెక్టును మూడు ముక్కలు చేశారు. మూడు ప్రాజెక్టులు కాదు... బేసికల్‌గా ఇది ఒకటే.. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు" అని పర్యావరణ ఉద్యమకారుడు, గతంలో జనసేన పార్టీలో పనిచేసి, రాజీనామా చేసిన బొలిశెట్టి సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

అసలు వివాదం 'కేటగిరీ' మార్పే
ఈ ప్రాజెక్టుపై పర్యావరణవేత్తల ప్రధాన అభ్యంతరం... పర్యావరణ అనుమతుల ప్రక్రియ గురించే.
రిజర్వ్ ఫారెస్టులకు సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించే కేటగిరీ-ఏ పరిధిలోకి రావాలని వారు వాదిస్తున్నారు.
అయితే, దీనిని బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టుగా చూపించి కేటగిరీ-బీ2 కింద రాష్ట్ర స్థాయిలోనే అనుమతులు పొందారని ఆరోపిస్తున్నారు.
ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఈఐఏ) నోటిఫికేషన్-2006లోని షెడ్యూల్‌లో 8 (ఏ) విభాగం కింద 'బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టు'గా దీన్ని వర్గీకరించారు.
ఈ కేటగిరీలో 20 వేల నుంచి 1.5 లక్షల చదరపు మీటర్ల బిల్డ్ అప్ ఏరియా ఉన్న భవన నిర్మాణ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయిలో పర్యావరణ అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
అయితే, రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడితో మూడు ప్రాంతాల్లో విస్తరించిన ఈ డేటా సెంటర్‌ను సాధారణ భవన నిర్మాణ ప్రాజెక్టుగా పరిగణించడం సరైనదేనా? లేక సమగ్రంగా పరిశీలించాల్సిన భారీ పారిశ్రామిక ప్రాజెక్టుగా చూడాలా? అన్నదే ప్రస్తుతం పర్యావరణవేత్తలు లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న.
20,000 నుంచి 1,50,000 చదరపు మీటర్లలోపు నిర్మాణ విస్తీర్ణం ఉంటే అది భవన నిర్మాణ ప్రాజెక్టు అనే లాజిక్‌ను ఉపయోగించి తర్లువాడ, రాంబిల్లి, అడవివరం యూనిట్ల బిల్ట్ అప్ ఏరియాలను కూడా 1.5 లక్షల చ.మీ. కంటే తక్కువగా చూపారని, మొత్తం ఒకే ప్రాజెక్టును మూడు భాగాలుగా విభజించి పర్యావరణ అనుమతులు పొందారని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.

కేటగిరీ-ఏ, బీ1, బీ2 అంటే ఏమిటి?
కేటగిరీ-ఏ - కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) స్థాయిలో పరిశీలన.
(భారీ పరిశ్రమలు, పెద్ద పోర్టులు, విమానాశ్రయాలు, భారీ కెమికల్ ప్లాంట్లు, పర్యావరణపరంగా సున్నిత ప్రాంతాల దగ్గర ఉన్న పెద్ద ప్రాజెక్టులను ఈ కేటగిరీలో చేరుస్తుంటారు.)
కేటగిరీ-బీ1 - రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ (SEIAA) పరిశీలన.
అవసరమైతే ఈఐఏ నివేదిక, ప్రజాభిప్రాయ సేకరణ. (చిన్న పరిశ్రమలు, మధ్యస్థాయి నిర్మాణాలు, చిన్న మౌలిక వసతుల ప్రాజెక్టులు ఈ కేటగిరీలోకి వస్తుంటాయి.)
కేటగిరీ-బీ2 - రాష్ట్ర స్థాయిలోనే పరిశీలన, సాధారణంగా పూర్తి ఈఐఏ అధ్యయనం. ప్రాజెక్ట్ స్వభావాన్ని బట్టి ప్రజా విచారణ అవసరం ఉండదు. (గిడ్డంగులు, భవన నిర్మాణ ప్రాజెక్టులు, చిన్న తయారీ యూనిట్లు ఈ కేటగిరీలోకి వస్తుంటాయి.)
2006 పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ ప్రకారం... కేటగిరీ-బీలో ఉన్న ఏ ప్రాజెక్టు అయినా, ఈ కింద పేర్కొన్న ప్రాంతాల సరిహద్దు నుంచి 10 కి.మీ. పరిధిలో మొత్తం లేదా కొంత భాగం ఉన్నట్లయితే, దాన్ని కేటగిరీ-ఏగా పరిగణించాలి. అవి...
- వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం నోటిఫైడ్ ప్రొటెక్టెడ్ ఏరియాలు
- కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించిన తీవ్ర కాలుష్య ప్రాంతాలు
- నోటిఫైడ్ ఎకో-సెన్సిటివ్ ప్రాంతాలు
- అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ సరిహద్దులు
నిబంధనల ప్రకారం డేటా సెంటర్ ప్రాజెక్టును తప్పనిసరిగా కేటగిరీ-ఏ ప్రాజెక్టుగా పరిగణించి, కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపాల్సి ఉంది.

బీ2 కేటగిరీలోకి ఎలా వచ్చింది?
ఈ ప్రశ్నకు, 1,50,000 అనే సంఖ్యకు సంబంధం ఉంది. ఎందుకంటే...ఈ వివాదంలో ఎక్కువగా ప్రస్తావనకు వస్తున్న సంఖ్య 1,50,000 చదరపు మీటర్లే.
తర్లువాడ యూనిట్ బిల్ట్-అప్ ఏరియా 1,48,922 చ.మీ.
అడవివరం యూనిట్ బిల్ట్-అప్ ఏరియా 1,22,858 చ.మీ.
రాంబిల్లి యూనిట్ బిల్ట్-అప్ ఏరియా 1,48,475 చ.మీ.
మూడు చోట్లా నిర్మాణ విస్తీర్ణం 1.5 లక్షల చదరపు మీటర్ల కంటే తక్కువగానే ఉంది.
పర్యావరణవేత్తల వాదన ప్రకారం.. ఒకే డేటా సెంటర్ ప్రాజెక్టును మూడు బిల్డ్ అప్ ఏరియా యూనిట్లుగా చూపిస్తూ, ప్రతి యూనిట్ బిల్డ్ అప్ ఏరియా 1.5 లక్షల చ.మీ లోపే ఉండేలా రూపొందించారు. దీంతో ప్రతి యూనిట్‌ను విడివిడిగా పరిశీలించే పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు.
"ఈ ప్రాజెక్టు విశాఖ రూపురేఖల్ని మార్చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం ఎందుకు ప్రజలకు అందుబాటులో పెట్టడం లేదనేదే మా ప్రధాన అభ్యంతరం" అని హెచ్‌ఆర్‌ఎఫ్ ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణ అన్నారు.
ప్రభుత్వం లేదా ప్రాజెక్టు సంస్థలు మాత్రం ఈ ఆరోపణలపై ఎక్కడా స్పందించడం లేదు.
దీనిపై ఏపీ పర్యావరణ, అటవీ శాఖకు జూన్ 29న సమాచారం కోరుతూ బీబీసీ ఈ-మెయిల్ పంపింది. కానీ ఇప్పటి వరకు ఈ శాఖ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

9 రోజుల్లోనే అనుమతులు
ఈ వివాదంలో మరో అంశం పర్యావరణ అనుమతులు సత్వరమే లభించడం.
హెచ్‌ఆర్‌ఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం... తర్లువాడ, రాంబిల్లి యూనిట్లకు 2026 ఏప్రిల్ 9న దరఖాస్తులు దాఖలు చేయగా, ఏప్రిల్ 18 నాటికి పర్యావరణ అనుమతులు లభించాయి.
ఈ పర్యావరణ అనుమతులు స్టేట్ ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఎస్‌ఈఏసీ) పరిశీలన ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే.. అంటే దాదాపు తొమ్మిది రోజుల్లో మంజూరయ్యాయని మానవ హక్కుల వేదిక ఆరోపిస్తోంది.
వందల ఎకరాల భూసేకరణ, వేల కోట్ల పెట్టుబడి ఉన్న ప్రాజెక్టుకు కేవలం తొమ్మిది రోజుల్లో అనుమతులు ఎలా వచ్చాయన్నది తమ ప్రధాన ప్రశ్న అని హెచ్‌ఆర్‌ఎఫ్ ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణ అన్నారు.
"తహశీల్దార్ కార్యాలయాల్లో డెత్ సర్టిఫికెట్‌కు కూడా కనీసం పదిహేను రోజులు పడుతుంది. కానీ, ఇంత భారీ పెట్టుబడి, వందల ఎకరాల భూసేకరణ ఉన్న ప్రాజెక్టుకు 9 రోజుల్లో ఎంతో కీలకమైన పర్యావరణ అనుమతులు ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్?" అని వీఎస్ కృష్ణ ప్రశ్నించారు.
ఇంత వేగంగా అనుమతులు ఇవ్వడం పర్యావరణ నిబంధనల స్ఫూర్తికి విరుద్ధమని హెచ్ఆర్ఎఫ్ ఆరోపిస్తోంది.

బీ2 కేటగిరీగా క్లియరెన్స్ ఇవ్వొచ్చా?
బీ2 కేటగిరీలో అనుమతులు ఇవ్వడం నిబంధనలకు అనుగుణమేనా? అనే ప్రశ్నపై మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అభిప్రాయం కోరింది బీబీసీ.
"రిజర్వ్ ఫారెస్టులు ఉన్న ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలి. కానీ, దీనిని బీ కేటగిరీలో పెట్టి చాలా వేగంగా అనుమతులు ఇచ్చారు. తర్లువాడ, రాంబిల్లి... రెండింటిలోనూ రిజర్వ్ ఫారెస్ట్ అంశాన్ని పట్టించుకోలేదు" అని ఆయన అన్నారు.
అయితే, విశాఖ ఐటీ సెజ్‌లోని ఓ కంపెనీ యజమాని ఓ.నరేష్ కుమార్ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు నిజంగా కంబాలకొండ ఎకో సెన్సిటివ్ జోన్ లేదా కేంద్ర పర్యావరణ నిబంధనల్లో పేర్కొన్న పరిమితుల్లోకి వస్తే కేటగిరీ- ఏ వర్తిస్తుందని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం బీ కేటగిరీలో అనుమతులు ఇవ్వొచ్చని చెప్పారు.
తుది నిర్ణయం ప్రాజెక్టు స్థానం, నిబంధనల వర్తింపుపై ఆధారపడుతుందని వివరించారు.

ఫొటో సోర్స్, SEIAA, Andhra Pradesh
అయితే, పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు పర్యావరణ చట్టాలను సరళతరం చేస్తున్నారని పర్యావరణవేత్త కె. బాబురావు బీబీసీతో ఆరోపించారు.
"అడ్డదారుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు గత కొన్నేళ్లుగా పర్యావరణ చట్టాలను సరళతరం చేస్తున్నారు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలను కూడా సాధారణ ప్రాంతాలుగా చూపిస్తూ పర్యావరణ అనుమతులు పొందుతున్నారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు’’ అని చెప్పారు.
‘‘పర్యావరణపరంగా సున్నితమైన తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ కేటగిరీ-ఏ పరిశ్రమ అయినప్పటికీ, దానిని బీ2 కేటగిరీగా చూపేందుకు డేటా సెంటర్‌ను గోదాముగా (వేర్‌హౌస్‌గా) పరిగణిస్తున్నారు. అధికారులు, ప్రభుత్వ శాఖలు పర్యావరణ అంశాలను పక్కనపెట్టి డేటా సెంటర్‌కు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది" అని అన్నారు.

ప్రభుత్వం, గూగుల్‌ను ఏం అడిగాం?
ఈ కథనంలో ప్రస్తావనకు వచ్చిన అభ్యంతరాలు, అనుమానాలపై ప్రభుత్వ వైఖరి తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.
2026 జూన్ 29న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని ఐటీ, పరిశ్రమలు, రెవెన్యూ, అటవీ, పర్యావరణ, జలవనరుల శాఖలకు ఈ-మెయిల్ ద్వారా ప్రశ్నలు పంపింది.
ఈ ప్రాజెక్టును ఏ కేటగిరీలో పరిగణించారు? ఎందుకు?
మూడు ప్రాంతాలను వేర్వేరు ప్రాజెక్టులుగా ఎందుకు చూపించారు?
పర్యావరణ అనుమతుల ప్రక్రియ ఎలా జరిగింది?
ఈ అంశాలతో పాటు భూసేకరణ, నీటి వినియోగం, విద్యుత్, ఉద్యోగాలపై వివరణ కోరింది.
అలాగే, 2026 జూన్ 24న గూగుల్ సంస్థకు కూడా ఇదే అంశాలపై ప్రశ్నలు పంపించి, వివరణ కోరింది.

సమాధానాల కోసం...
ఒకే డేటా సెంటర్‌ను మూడు ప్రాజెక్టులుగా ఎందుకు చూపించారు?
కేటగిరీ-బీ2లో అనుమతులు ఇవ్వడానికి ప్రాతిపదిక ఏమిటి?
రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉన్నప్పటికీ కేంద్ర స్థాయి పర్యావరణ పరిశీలన అవసరం లేదని ప్రభుత్వం ఎందుకు భావించింది?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థలను బీబీసీ సంప్రదించింది.
అయితే, ఈ కథనం ప్రచురించే సమయానికి వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. వారి నుంచి వివరణ రాగానే ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































