బీజింగ్: బహుళ అంతస్థుల భవనంలోకి దూసుకుపోయిన విమానం, అసలేం జరిగిందో చెప్పని చైనా

- రచయిత, కెల్లీ ఎన్‌జీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
బీజింగ్‌లోని అత్యంత ఎత్తైన ఆకాశహార్మ్యాన్ని ఓ చిన్న విమానం ఢీకొని నాలుగు రోజులు గడిచాయి. విమానంలో పైలట్ మాత్రమే ఉన్నారు. ఈ ఘటనలో ఆయన మరణించారు. మరో 13 మందికి గాయాలయ్యాయి.
అయితే ఇదంతా ఎలా, ఎందుకు జరిగిందనే విషయం అస్పష్టంగానే ఉంది.
కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న జోంగ్‌నాన్ హైకుకు కేవలం కొన్నికిలోమీటర్ల దూరంలోనే జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటిదాకా వెల్లడించిన అధికారిక సమాచారం కేవలం 60 పదాలున్న ఓ ప్రకటన మాత్రమే.
ప్రాథమిక వివరాలతో కూడిన ఆ ప్రకటన ప్రభుత్వ మీడియా బీజింగ్ డైలీ ప్రచురించింది.


ఫొటో సోర్స్, Getty Images
శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో 109 అంతస్తుల సీఐటీఐసీ టవర్‌లో దెబ్బతిన్న భాగాలకు మరమ్మతులు చేశారు. ఘటనకు సంబంధించిన ఉత్కంఠ భరిత దృశ్యాలను ఇంటర్‌నెట్ నుంచి తొలగించారు.
తేలికపాటి విమానాల కార్యకలాపాలను నిలిపివేయాలని తమకు ఆదేశాలు వచ్చాయని కనీసం మూడు విమానయాన సంస్థలు బీబీసీకి తెలిపాయి. కానీ అంతకుమించిన సమాచారం వెల్లడించడానికి నిరాకరించాయి. ఈ విషయంపై మాట్లాడొద్దని తమకు ఆదేశాలు అందాయని చెప్పాయి.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో, ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన గగనతల నియంత్రణ ఉన్న నగరాల్లో ఒకటైన బీజింగ్‌లోకి ఆ విమానం ఎలా ప్రవేశించిందనే అంశంపై ఊహాగానాలు పెరుగుతున్నాయి.
ఇలాంటి సెన్సార్‌షిప్ చైనాలో కొత్తేమీ కాదు. పార్టీని, దేశనాయకులను, ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా అరుదు. పైగా ప్రభుత్వాన్ని విమర్శించేలా అనిపించే, రాజకీయ ప్రేరణ ఉన్న లేదా సున్నితమైన అంశాలకు సంబంధించిన చర్చలు వెంటనే అదృశ్యమవుతాయి.
అయితే ఈసారి సెన్సార్ ఆంక్షలు సాధారణ లక్ష్యాలను దాటిపోయాయి. శుక్రవారం జరిగిన ఘటనతో సంబంధం లేని భవన ఫొటోలు, మీమ్స్ కూడా చైనా సామాజిక మాధ్యమ వేదికల నుంచి తొలగించారు.
చైనీస్ వైన్ పాత్ర ఆకృతిలో నిర్మించిన ఈ భవనం స్థానికంగా ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. పరీక్షల్లో విజయాలు, ఉద్యోగాలు వంటి శుభఫలితాలు కోరుకునే యువత దీన్ని అదృష్టానికి సూచికగా చూస్తారు. అక్కడికి వెళ్లడం లేదా దాని చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుని చిన్న ప్రార్థన చేయడం సాధారణం.
ఈసారి సెన్సార్ వ్యవస్థ అత్యంత వేగంగా, సమగ్రంగా పనిచేయడానికి కారణం బీజింగ్ నాయకత్వాని కూడా ఇప్పటికీ అసలు ఏం జరిగిందో పూర్తిగా అర్థం కాలేదనే అవకాశముందని ఐ ఆన్ డిజిటల్ చైనా న్యూస్‌లెటర్ నిర్వాహకుడు మాన్యా కోట్సే అభిప్రాయపడ్డారు.
"ఇది చాలా అసాధారణమైన ఘటన" అని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు "పార్టీ ప్రచారం చేస్తున్న కీలక అజెండాలకు" కూడా ముప్పుగా మారిందని ఆమె అన్నారు.
ఘటన అనంతరం తేలికపాటి విమానాల కార్యకలాపాలను నిలిపివేసినట్లు బీబీసీకి ధృవీకరించిన విమానయాన సంస్థలు కూడా అంతకంటే ఎక్కువగా మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు.
"ఈ విషయంపై మాట్లాడొద్దని మాకు చెప్పారు. దయచేసి దీని గురించి ఇంకెవరినైనా అడగండి" అని బీజింగ్‌లోని ఒక ఫ్లైట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న ఓ మహిళ తెలిపారు.
చెంగ్డూలోని మరో సంస్థ కూడా ఈ ఆదేశాలు ఏ అథారిటీ నుంచి వచ్చాయో చెప్పడానికి నిరాకరించి వెంటనే ఫోన్ కాల్ ముగించింది.
బీజింగ్ రాజకీయ కేంద్రం తియానన్మెన్ స్క్వేర్, జోంగ్‌నాన్‌హై పరిసరాల్లో సుమారు 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని శాశ్వతంగా నో ఫ్లై జోన్‌గా ప్రకటించింది. దేశంలోని అత్యున్నత నాయకులు నివసించే జోంగ్‌నాన్‌హై అత్యంత కట్టుదిట్టమైన భద్రత ప్రాంతం.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఘటనను "భారీ భద్రతా వైఫల్యం"గా అభివర్ణించిన చైనా విశ్లేషకుడు బిల్ బిషప్ ఎక్స్‌లో స్పందిస్తూ, "ఇంకొన్ని సెకన్లు గనక ఆ విమానం ప్రయాణించి ఉంటే జోంగ్‌నాన్‌హైను ఢీకొని ఉండేది. అలా జరిగి ఉంటే బీజింగ్ భద్రతా వ్యవస్థకు అది భారీ దెబ్బ" అని వ్యాఖ్యానించారు.
భద్రతా కారణాలను చూపుతూ బీజింగ్ ఇటీవల డ్రోన్లపై కూడా మరింత కఠిన నిబంధనలు అమలు చేసింది. ఇప్పుడు రాజధానిలోకి డ్రోన్లను తీసుకురావాలన్నా, బయటకు తీసుకెళ్లాలన్నా ముందుగా వాటిని నమోదు చేయాల్సి ఉంటుంది.
"చాలా డ్రోన్ల కంటే పెద్దదైన ఒక చిన్న విమానం నగరం మీదుగా ప్రయాణించి జోంగ్‌నాన్‌హైకు చాలా సమీపం వరకు చేరుకోవడం రాజకీయంగా ఇబ్బందికరమైన విషయమే కాకుండా తీవ్రమైన భద్రతా వైఫల్యాన్ని కూడా సూచిస్తోంది" అని చికాగో కౌన్సిల్ ఆన్ గ్లోబల్ అఫైర్స్ పరిశోధన విభాగ ఉపాధ్యక్షుడు రేమండ్ కువో అన్నారు.
ఇది పైలట్ పొరపాటు వల్ల జరిగి ఉండొచ్చని, లేదా యాంత్రిక లోపం కారణమై ఉండొచ్చని అన్నారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా కూడా జరిగి ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
విమాన ప్రయాణాల సమాచార సేవ ఫ్లైట్‌రాడార్24 ప్రకారం ఈ విమానం చైనా సంస్థ సన్‌వర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారు చేసిన అరోరా ఎస్‌ఏ60ఎల్ మోడల్. దీని పొడవు 6.9 మీటర్లు, రెక్కల విస్తీర్ణం 8.6 మీటర్లు ఉంటుంది. పర్యాటక ప్రయాణాలు, వినోదాత్మక విమానయాన అవసరాల కోసం దీన్ని రూపొందించారు.
చైనా వెలుపల ఈ ఘటన కొందరికి 2001 సెప్టెంబర్ 11 గుర్తుకు తెచ్చింది. "9/11 ఘటనలో మొదటి టవర్‌ను విమానం ఢీకొట్టినప్పుడు నాకు సరిగ్గా ఇలాంటి వార్తా హెచ్చరికే వచ్చింది" అని ఒక రెడ్డిట్ యూజర్ వ్యాఖ్యానించారు.
దీనికి మరింత దగ్గరగా ఉన్న ఘటన 1987 మేలో ప్రచ్ఛన్న యుద్ధం చివరి దశలో జరిగిందని కార్నెగీ చైనాలో నాన్ రెసిడెంట్ పరిశోధకుడు చాంగ్ జా ఇయాన్ అన్నారు. అప్పట్లో జర్మనీకి చెందిన ఔత్సాహిక పైలట్ మథియాస్ రస్ట్ తన చిన్న విమానాన్ని మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో ల్యాండ్ చేసారు.
"ఆయన విమాన ప్రయాణం, ల్యాండింగ్ సోవియట్ వైమానిక రక్షణ వ్యవస్థలో ఉన్న తీవ్రమైన లోపాలను బయటపెట్టింది. ఆ ఘటన తర్వాత వైమానిక రక్షణ, భద్రత బాధ్యతలు నిర్వహించిన పలువురు ఉన్నతాధికారులను పదవుల నుంచి తొలగించారు" అని చాంగ్ తెలిపారు.
అదే విధంగా బీజింగ్ విమాన ప్రమాదం నేపథ్యంలో కూడా కొందరు అధికారులు తమ పదవులు కోల్పోయే అవకాశం ఉందని ఆయన అన్నారు.
"ఒక చిన్న విమానం సీఐటీఐసీ టవర్‌ను ఢీకొట్టగలిగితే, ఒక డ్రోన్ లేదా క్షిపణి కూడా ఢీకొట్టగలదని అర్థం. బీజింగ్ భద్రత బాధ్యతలు నిర్వహిస్తున్న భద్రతా వ్యవస్థలకు ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి" అని ఆయన వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























